"అందుకోలేనివి అంటే..." పొడిపొడిగా ఉన్నాయి త్రిభువనేశ్వరి మాటలు.
"ఫర్ ఎగ్జాంపుల్ - పెళ్ళి- మీకైతే, నాకైతే ప్రేమనుకోండి" సిగ్గు పడకుండా అంది మధూలి.
పెళ్ళి ఆ మాట వినగానే త్రిభువనేశ్వరి గుండె ఉలిక్కిపడింది. ఏదో ఒక అందమైన జ్ఞాపకం.
దూరంగా జరుగుతున్న జాతరను చూడడానికి వెళుతున్నప్పుడు రెండు చిట్టి చేతుల ఆత్మీయ స్పర్శ-
గౌను వేసుకొని ఏటి ఒడ్డున, చేలగట్ల వెంబడి పరుగెట్టిన జ్ఞాపకాలు మామిడితోటలో-
రహస్యంగా మామిడికాయలు ఏరుకొన్న మధురమైన క్షణాలు-
పెళ్ళి-
ఒక్క క్షణం- త్రిభువనేశ్వరి కళ్ళు మూసుకొంది. కనురెప్పల మధ్య తడి- టప్ మని కొట్టుకున్న మెత్తని సవ్వడి.
ఆ కనుగోళాల్లో మెరిసిన పసుపు పూసిన రెండు కొండపల్లి బొమ్మలు.
"నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా" టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఆ ప్రశ్న. వేసింది సి.ఎమ్. త్రిభువనేశ్వరి.
"నేనా- నేను లవ్ చెయ్యడమేంటి మేడమ్ నెవ్వర్- నన్ను లవ్ చెయ్యడానికి బోల్డుమంది లైన్ లో ఉన్నారు. కొంచెం షోగ్గా, పైలా పచ్చీసుగా ఉంటానుగా- అదన్న మాట కధ" ఎడంచేత్తో షర్ట్ పైబటన్ ని పట్టుకుంటూ అంది మధూలి.
"నువ్వు షర్ట్ పై బటన్ ని ఎప్పుడూ పెట్టుకోవా-" అందమైన మధూలి మెడ, మెడ కింద అందాలవైపు చూస్తోంది త్రిభువనేశ్వరి.
"ఏం మేడమ్ మీరు కూడా అలాగ చూస్తున్నారు! మొదట్నించీ షర్ట్ పై బటన్ ని పెట్టుకోవడం నా కలవాటు లేదు మేడమ్ బటన్ పెట్టుకాకపోతే ఏవౌతుంది?"
తిరిగి మధూలి ఎదురు ప్రశ్న వేస్తుందాని ఊహించలేదు సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
"నీకింకా పసితనం పోలేదు మిస్ మధూలీ- ఐ లైక్ యువర్ ఎడోలసెన్స్-"
ఆ మాటలకు మధూలి పెదవుల మీదకు చిరునవ్వొచ్చింది.
"ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అనరబుల్ చీఫ్ మినిస్టర్- ఎడోల సెన్స్ కి, ఏజ్ కి సంబంధం లేదు- ఎడోలసెన్స్ కి, నాలెడ్జ్ కీ సంబంధం లేదు. మిమ్మల్ని మీరు గొప్ప గంభీరమైన వ్యక్తిగా చెప్పుకోడానికి- ఐ లైక్ యువర్ ఎడోలసెన్స్ అని మీరు నన్ను సర్టిఫై చేశారు కదూ" ఆ మాటకు ఖంగుతింది త్రిభువనేశ్వరీదేవి.
"నా ఉద్దేశ్యం అది కాదు మధూలీ-"
"ఓసారి- ఓ గొప్ప వ్యక్తి- పార్లమెంట్ లో ఒక ఉపన్యాసం చేసారు. గంటన్నరసేపు సాగిన ఆ ఉపన్యాసానికి పార్లమెంటు సభ్యులందరూ ముగ్ధులై పోయారట. ఆ గొప్ప నాయకుడు తన ఉపన్యాసం ముగించి కూర్చున్నాక, ప్రతిపక్ష సభ్యుడొకరు లేచి "అయ్యా తమరు ఇంతవరకూ చేసిన ఈ గొప్ప ఉపన్యాసాన్ని రాసి తమకిచ్చినదెవరండీ" అని అడిగాట్ట.
అందుకా మహానాయకుడు కంగు తిని షేక్ స్పియర్ మొహం పెట్టాడు...
కానీ నతలోనే తేరుకుని నా ప్రెస్ పి.ఏ. అండీ అని అసలు నిజాన్ని స్పష్టంగా చెప్పేసాట్ట-
అంత నిజాయితీగల ఆ మహా లీడర్ ఎవరు మేడమ్ - చెప్పండి-"
సడన్ గా మధూలి ఇలాంటి ప్రశ్నను ఎందుకేసిందో అర్ధం కాలేదు త్రిభువనేశ్వరికి.
వెంటనే మధూలి మనస్తత్వాన్ని పసికట్టేసింది సి.ఎం.
"నువ్వు నన్ను అల్లరిపెట్టడానికి ఈ ప్రశ్న వేసావు కదూ- నేను సిన్సియర్ గా జవాబు చెప్పనా-" ముందుకు వంగుతూ అంది సి.ఎం.
"చెప్పండి" బుంగమూతి పెట్టింది మధూలి.
"నాకు తెలీదు" టక్కున చెప్పింది సి.ఎం. త్రిభువనేశ్వరి.
"చూసారా సి.ఎం.గారూ- మీకున్న నాలెడ్జికి, నాకున్న ఎడోలసెన్స్ కి ఏం సంబంధం లేదు? బీయింగ్ పొలిటికల్ లీడర్- మీకీ విషయం తెలియాలి కదూ! తెలీనంత మాత్రాన మీ నాలెడ్జిని నేను తక్కువగా అంచనా వెయ్యకూడదు కదూ!"
"అయ్యాబాబోయ్- మధూలీ- నువ్వింత అల్లరిపిల్లవని-నేననుకోలేదు- నువ్వు ఇలాంటి పేచీలు పెడతావన్న మాట- చూడు తల్లీ- ఇంతకీ- ఆ లీడర్ ఎవరు" ఆసక్తిగా అడిగిందావిడ.
"ఇంకెవరు- మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ-"
మధూలి కేరక్టర్ ని అబ్జర్వ్ చేస్తోంది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి. మధూలి విలక్షణ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోందామె.
"నన్ను ఇంటర్వ్యూ చేస్తానన్నావ్ అయిపోయిందా" టాపిక్ మార్చింది సి.ఎమ్.
"ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదని మొదటే చెప్పాను కదా మేడమ్-"
"నీతో ఎప్పుడైనా సరదాగా ఓ రోజంతా గడపాలని ఉంది మిస్ మధూలీ..."
"అయామ్ రెడీ. చెప్పండి.... మీరే సి.ఎమ్. అని ఎవరూ గుర్తు పట్టకుండా మిమ్మల్ని తయారుచేసి... ఇదే హైద్రాబాద్ లో మిమ్మల్ని నా లూనా మీద తిప్పమంటారా...?" ఆ ఊహే సరదాగా వుంది మధూలికి.
"అలా... తిప్పగలవా.... నన్ను?"
"ఏం అదేం బ్రహ్మ విద్యనుకున్నారా?" ఛాలెంజింగ్ గా అంది మధూలి.
"నువ్వలా చెయ్యగలవా?"
"నాతో పెట్టుకోకండి మేడమ్....నేనసలే మంచిదాన్ని కాదు...నాక్కోపం వస్తే బూతులొచ్చేస్తాయ్ మరి..."
"నీ నోటంట బూతులా?!"
"ఏం... ఆడవాళ్ళ నోటంట బూతులు రాకూడదా?" షర్ట్ చేతుల్ని వెనక్కి మడతబెట్టుకొంటూ అంది మధూలి.
"రావచ్చులే కానీ.... నీలాంటి అందమైన అమ్మాయి నోటంట నేన్నమ్మను.."
"మేడమ్! డోంట్ ఇరిటేట్ మీ... మీరు నాతో రహస్యంగా వచ్చే రోజున అప్పుడు చూద్దురుగాని నా ప్రతాపం ఓ.కే ఇరవై నాలుగ్గంటల సేపు మిమ్మల్ని సిటీ రోడ్లమీద ఉంచుతాను. మీరు నాకు ఏమిస్తారో చెప్పండి."
ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరీదేవి.
"ఓ.కే. నువ్వేం కోరుకుంటే అదిస్తాను."
"ఏం కోరుకుంటే అది... అంటే ఫర్ ఎగ్జాంపుల్.... మీరో అందమైన అబ్బాయిని ఇష్టపడ్డారనుకోండి ... ఆ సదరు అబ్బాయిని నేను త్యాగం చేసెయ్యమన్నాననుకోండి...చేసేస్తారా...?"
"ఫో అల్లరిపిల్లా..." సిగ్గుపడింది త్రిభువనేశ్వరీదేవి. అలా తను సిగ్గుపడటమే ఆశ్చర్యంగా వుందామెకు.
"చూసారా సి.ఎమ్. గారూ! మీరు సిగ్గుపడిన క్షణాల్ని నేనే చూడగలిగాను. అది కాదు సిస్టర్! మీరూ..." ఆ మాటనేసి గబుక్కున నాలిక కరుచుకుంది మధూలి.
"నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను కదూ!" మళ్ళీ అడిగింది మధూలి.
"లేదు మధూలీ! ఐ లైక్ యువర్ బోల్డ్ నెస్..." అంటూ చేతి వాచీ చూసుకుంది త్రిభువనేశ్వరి.
"వాచీ చూసుకుంటున్నారంటే నన్ను వెళ్ళిపోమనే గదా అర్ధం! వెళ్ళి పోతాన్లెండి. చివరగా ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు సరిగ్గా, కరెక్టు ఆన్సర్ చెప్పాలి....చెపుతారా?"
మరో అల్లరి ప్రశ్న వేస్తుంది కామోసు. ఆ ప్రశ్న ఎలాంటిదై వుంటుందో ఊహిస్తూ-