"ప్రొహిబిషన్ విధిస్తాం..."
"ఎప్పుడు మేడమ్..."
"మీకే తెలుస్తుందిగా... కొన్ని గంటలలోపు ప్రభుత్వం.... తన నిర్ణయాన్ని ప్రకటించొచ్చు... లేదా... కొన్ని రోజుల్లోపల ప్రకటించొచ్చు..." హేమాద్రి శర్మవేపు చూస్తూ అంది సి.ఎమ్.
అలా చెప్పినందుకు హేమాద్రిశర్మ సంతోషించాడు.
"నిషేధం విధిస్తే ఆ లోటును ఎలా భర్తీ చేస్తారు మేడమ్..."
"ప్రొహిబిషన్ సెల్ లాంటిది ఏర్పాటు చేస్తారా మేడమ్..."
"దానికెదురుగా సారా కాంట్రాక్టర్లు కోర్టుకెళ్తే."
ప్రశ్నలు వేసిన రిపోర్టర్లందరి వేపూ సూటిగా చూసి-
"ప్రొహిబిషన్ మీద నెక్స్టు ప్రెస్ మీట్ లో మాట్లాడతాను మళ్ళీ కలుద్దాం" లేచి నిలబడింది సి.ఎమ్.
అంత అకస్మాత్తుగా ప్రెస్ మీట్ ను సి.ఎం. ఎందుకు ముగించిందో అర్ధం కాలేదు ఎవరికీ.
గబగబా ముందుకి నడుస్తూ చటుక్కున ఆగిపోయింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
వరండాకు ఆ చివర-
కళ్ళద్దాల్ని సవరించుకుంటూ భుజానికి వేలాడుతున్న హేండ్ బేగుతో...బాగీషర్టు, ఫేంట్...
పరుగు పరుగున వస్తూ రిపోర్టరు మధూలి...
సి.ఎమ్.కు ఇరవై అడుగుల దూరంలో ఉన్న సి.ఎమ్. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ రిపోర్టరు మదూలిని అడ్డగించబోయాడు.
"నేను రిపోర్టరుని ప్రెస్ మీట్ కయ్యా బాబూ..."
ఆ ఆఫీసరుని తప్పించుకుని ముందుకు పరుగెత్తింది.
ఆమె వెనుక సెక్యూరిటీ ఆఫీసర్... ఆ హడావుడి చూసి ఏం జరుగుతోందో తెలీక స్పెషల్ కమెండోలు మధూలి వెనక పరుగెత్తడం ప్రారంభించారు.
ఆ సన్నివేశాన్ని చూడగానే-
త్రిభువనేశ్వరికి నవ్వొచ్చింది.
మధూలి రూపం కంపించగానే ఆమె ముఖంలో నవ్వు వెల్లివిరిసింది.
ఆయాసంతో రొప్పుతూ-
"మేడమ్! ప్రెస్ మీట్ అయిపోయిందా మేడమ్? దార్లో నా లూనా ట్రబులిచ్చింది మేడమ్."
ముఖంమీద చిరుచెమట, ఫాలభాగంమీద పడుతున్న జుత్తు, విప్పారిన కళ్ళు.
"మీక్కావల్సిన ఇన్ ఫర్ మేషన్ ని.... ఇన్ ఫర్ మేషన్ డిపార్టు మెంట్ నుంచి తీసుకోండి..." ప్రెస్ పి.ఎ. ప్రసాదరావు ఏదో చెప్పబోయాడు.
"మీరేనా ప్రెస్ పి.ఎ. ప్రసాదరావు! మార్నింగ్! మా పేపర్ ఆఫీస్ కి ఫోన్ చేసి సి.ఎమ్. అపరచండికలా కేకలేస్తున్నారని ఆ ఆస్తుల వార్త ఎందుకు రాశారని అడిగింది మీరేనా?" గాభరాగా అడిగింది మధూలి.
అప్పుడుగానీ ఆ వచ్చిన అమ్మాయి ఎవరైందీ అర్ధం కాలేదు ప్రసాదరావుకి. సి.ఎం.ఎదుర్గానే మధూలి అడిగేసరికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచక కంగారుపడ్డాడు ప్రసాదరావు.
"కెన్ యూ స్పేర్ మీ ఫ్యూమినిట్స్ మేడమ్...."చకచకా గోళీకాయల్లా కళ్ళు తిప్పుతూ అడుగుతున్న మధూలివేపు ముచ్చటగా చూసింది సి.ఎమ్. త్రిభువనేశ్వరి.
సి.ఎమ్.వేపు చూస్తున్నారందరూ.
"హేమాద్రిశర్మగారూ.... ఒక ఫిఫ్టీన్ మినిట్స్" సి.ఎమ్ మాటకు మధూలి ముఖం వికసించింది.
చీఫ్ సెక్రట్రీగారితో...ఏదో చెప్పబోయి ఆగిపోయాడు హేమాద్రిశర్మ.
"ఓన్ లీ ఫిఫ్టీస్ మినిట్స్.... కమాన్ మిస్ మధూలీ...." ముందుకు నడుస్తూ అంది త్రిభువనేశ్వరి.
ప్రసాదరావు ముఖం చిన్నబోయింది.
* * * * *
ఆఫీసు ఛాంబారుకి ఆనుకుని ఉన్న సి.ఎమ్. రెస్ట్ రూమ్- అక్కడున్న బెడ్ మీద ఓరగా పిల్లోకి ఆనుకుని రిలాక్స్ డ్ గా కూర్చుంది సి.ఎమ్.
"మీ ఆఫీసు బెడ్ రూమ్ లోకి నేను ఫస్టు వచ్చినట్టున్నాను కదు మేడమ్ ఈ బెడ్ రూమ్ ఇంత డీసెంటుగా ఉంటే...మీ రెసిడెన్స్ ఎలా వుంటుందో" పరిసరాల్ని చూస్తూ అంది మధూలి.
న్యూస్ ప్రింటు ప్యాడ్ ను, పెన్నును తీసుకుంటున్న మధూలి వేపు ఓరకంట చూసింది త్రిభువనేశ్వరి.
"ఇంటర్వ్యూ చేస్తావా..."
"ఇంటర్వ్యూ అంటే.... ఇంటర్వ్యూ కాదు మేడమ్! ఇలా మీతో ఏకాంతంగా కలుసుకోవాలని నాకు చాలాకాలం నుంచి ఓ కోరిక మేడమ్. ఇన్నాళ్ళకు..."
"వాటీజ్ యువర్ ఏజ్....ప్రొఫెషన్ లోకి ఎన్నాళ్ళయింది వచ్చి" సి.ఎమ్ అడిగింది.
"సి.ఎమ్.గారు.... నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా....ఏజ్ కి ప్రొఫెషన్ కి సంబంధం లేదుకదా మేడమ్. మీరు చూడండి...బయట రోడ్డు మీద మీరు ఒంటరిగా వెళ్ళండి. ఆర్డినరీ కామన్ యూనివర్శిటీ స్టూడెంట్ లా ఉంటారు. అదే మీరు సెక్యూరిటీ కారులో వెళితేనే తెలుస్తుంది. మీరు చీఫ్ మినిస్టర్ అని-అంతేకదా మేడమ్ ఫేస్ వాల్యూ... లాగా ప్లేస్ వ్యాల్యూ ఇంపార్టెంట్ కదా మేడమ్" గడగడా మనసులోని మాటని చెప్పేసింది మధూలి.
"నేను.... యూనివర్శిటీ స్టూడెంట్ లా ఉంటానా..." నవ్వుతూ అడిగింది సి.ఎమ్.
"ఎస్ మేడమ్... ఆ బెనారస్ శారీలో కాకుండా.... ఆర్డినరీ కుర్తా, పైజామా వేసుకొని చూడండి. ఆ టైంలో నన్నోసారి మీరు పిల్చి చూడండి. మీరెలా ఉన్నారో నేను చెప్తాను."
"నన్ను కుర్తా, పైజామా వేసుకోమంటావా" పెద్దగా నవ్వుతూ అంది త్రిభువనేశ్వరీదేవి.
"ఏం మేడమ్... మీ డేటాఫ్ బర్త్ ఎప్పుడు మేడమ్?"
"ఎందుకు..."
"ఎందుకంటే....మీరు కోప్పడనంటే చెప్తా."
"చెప్పు ఫర్వాలేదు."
"మీ బర్త్ డే నాడు నేనే ఒక కుర్తా, పైజామా ప్రెజెంట్ చేద్దామని..."
"నువ్వు... నాకు... కుర్తా, పైజామా ప్రెజెంట్ చేస్తావా" నవ్వింది త్రిభువనేశ్వరి.
"ఏం చెయ్యకూడదా.... చెప్పండి. నన్ను రిపోర్టర్ లా అనుకోకండి మేడమ్. ఒక సిస్టర్ లా అనుకోండి. ఎప్పుడూ.... పవరూ, పాలిటిక్స్ పైలెట్ వ్యాన్, పోలీసులు, హడావుడి ఏం లైఫ్ మేడమ్ మీది- ప్రజల గురించి ఆలోచించడం తప్ప, మీరు మీ గురించి ఎప్పుడయినా ఆలోచించుకుంటారా? సిన్సియర్ గా చెప్పండి మేడం.... అబద్దం ఆడొద్దు" చిన్నపిల్లలా అడిగింది మధూలి.
అవును నిజం! తను తన గురించి ఎప్పుడు ఆలోచించింది? ఆలోచించుకునే సమయం ఏది?
త్రిభువనేశ్వరి పెదవుల మీద ఆకస్మాత్తుగా నవ్వు మాయమయి పోయింది.
అవును తనది సున్నాలాంటి ఒంటరితనం.
ద బిగ్ జీరో.
ఏదో అవ్యక్తమైన బాధ సి.ఎమ్ కళ్ళల్లో కదలాడింది.
"నాతో మీరు ప్రెండ్ షిప్ చెయ్యండి మేడమ్. మీకో ప్రపంచం చూపిస్తాను. లైఫ్- జిందగీ- జీవితాన్ని ప్రేమించడం ఒక ఆర్ట్ మేడమ్. మనిషి ఒక ఆర్టిస్టులా బ్రతగ్గలగాలి. పర్టిక్యులర్ వయసులో మనం అందుకోలేనివి అందుకోలేకపోతే అందుకోవాలన్న వయసులో అవి అందకుండా దూరంగా వెళ్ళిపోతాయి మేడమ్."