Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 18

   

     బయట ఇంటి వాతావరణాన్ని చూసి కిరణ్మయి, "ఏమిటి ఇలాంటి లాయర్ దగ్గరకు తీసుకొచ్చాడు" అనుకుంది కానీ, ఒకసారి లాయర్ ని చూడగానే ఆమెకెందుకో ధైర్యం కలిగింది.
   
    "కూర్చోండి, మీరేనా మిసెస్ రాయన్న?" అని అడిగాడు. ఆమె తలూపింది.
   
    "నేను డబ్బుకోసమో, పేరు కోసమో కేసులు టేకప్ చేసే లాయర్ని కాదు. అతడు నిజంగా ఈ హత్య చేసివుంటే మాత్రం నేను మీకేవిధంగానూ సాయం చెయ్యలేను-"
   
    ఇప్పుడర్ధమయింది కిరణ్మయికి, ఈ లాయర్ దగ్గిర అంతగా రష్ ఎందుకు లేదో! ఇతడు నిజమైన 'న్యాయ'వాది.
   
    కిరణ్మయిని అక్కడికి తీసుకొచ్చిన స్నేహితుడు భయం భయంగా ఆమెవైపు చూశాడు. అయితే కిరణ్మయి అతడి అంచనాకి విరుద్దంగా 'సరే' అన్నట్లు తలూపి- '"ఆయన ఈ హత్య చేసివుంటే తప్పుడు సాక్ష్యాల్తో బయటికి తీసుకురమ్మనమని నేను కోరను లాయర్ గారూ. ఏ కారణాలవల్ల ఆయన ఈ పని చేశారో యదార్ధం తెలుసుకుని దాన్నిబట్టి శిక్ష తగ్గించే ఏర్పాటు చేయండి చాలు. కానీ నాకు ఎందుకో ఈయన ఈ హత్య చేయలేదని అనిపిస్తోంది. దానికి కారణాలు అడిగితే నేనేమీ చెప్పలేను" అంది కిరణ్మయి.
   
    వెంకటరత్నం ఆమెవైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో "మనకి దగ్గిరవాదు తప్పు చేయడని మనకు అనిపిస్తుంది" అన్న అర్ధం ఉంది. ఆ నవ్వుని అర్ధం చేసుకున్నట్లు - కిరణ్మయి కొనసాగించింది.
   
    "మా వివాహమై పూర్తిగా మూడురోజులు కూడా కాలేదు. ఆయన నిజాయితీని నేను సర్టిఫై చేయడం లేదు. కాని ఈ వార్త తెలియగానే ఆయన ప్రవర్తించిన విధానాన్ని బట్టి నాకలా అనిపించింది. నేను సైకాలజీ స్టూడెంట్ ని. మీరు తర్కం అడిగితే నేను సమాధానం చెప్పలేనుగాని, నా అభిప్రాయం తప్పయితే ఇంతకాలం నేను చదివిన చదువూ, అర్ధంచేసుకున్న మానసిక శాస్త్రం నిరర్ధకమని మాత్రం చెప్పగలను. ఆ ఉద్దేశ్యంతోనే మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. ఏదో లాయర్ గా, వున్న ఆదారాలతో ఆయనకి శిక్ష తక్కువయ్యేలా మాత్రమే చూడకుండా మరింత లోతుగా ఈ కేసు వివరాలు పరిశీలించమని....."
   
    అప్పుడు చూశాడు వెంకటరత్నం ఆమెవైపు పరిశీలనగా! ఆమె తలవంచుకుని కూర్చుని వుంది. ఒక కొత్త పెళ్ళికూతురికి పెళ్ళయిన మూడు రోజుల్లోపులో జరిగిన ఈ సంఘటన ఇంకెవరికైనా జరిగివుంటే, కుప్పకూలిపోయి వుండేది. ఆమె మొహంలో బాధ ఉంది! కాని ఆ బాధ వెనక సమస్యను పరిష్కరించాలనే పట్టుదల వుంది!! జరిగిన దానికి చింతిస్తూ కూర్చోవడంవల్ల సమస్యలు పరిష్కారం కావనే ఆలోచన ఉంది!!!
   
    వెంకటరత్నం దగ్గరకు రకరకాల క్లయింట్సు వచ్చారు. చాలా మంది మొదటి సంభాషణలోనే వెనక్కు వెళ్ళిపోయారు. మరికొంతమంది మధ్యలో వదిలేసుకున్నారు. అతడి వాదనలని అర్ధం చేసుకునే ఓపికగానీ, నిజాయితీగానీ ఎవరికీ లేవు. ఈమె అలాకాదు అనిపించిందతడికి.
   
    అతడు తలూపుతూ "కేసు వివరాలు చెప్పండి" అన్నాడు.
   
    ఆమె పేలవంగా నవ్వి "వివరాలు మాకూ తెలియవు లాయరుగారూ. అర్ధరాత్రి పన్నెండింటికి హఠాత్తుగా వచ్చి పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళారు. ఎవరో ఒక హాస్టలు అమ్మాయిని మర్డరు చేసినట్టు చెప్పారు. అంతవరకు మాత్రమే మాకు తెలుసు" అంది.
   
    వెంకటరత్నం రాయన్న స్నేహితుడివైపు చూసి "మీకేమైనా వివరాలు తెలుసా?" అని అడిగాడు.
   
    "నేనూ, రాయన్నా ఒకేచోట పనిచేస్తున్నాం. నాకుకూడా క్రికెట్ లో ఉత్సాహం వుంది."
   
    "ఈ అపురూపలక్ష్మి అనే అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా?"

    "చాలామంది ఆటోగ్రాఫుల కోసం వచ్చేవారు. అంతకన్నా ఎక్కువ తెలీదు."

    వెంకటరత్నం బలంగా విశ్వసించి "నేనీరోజు రాయన్నని కలుసుకుంటాను" అన్నాడు.

    క్రికెట్ బోర్డునుంచి వచ్చిన టెలిగ్రాం కాగితాన్ని కిరణ్మయి అతడికి చూపిస్తూ "ఆయన కొచ్చిందిది. వెంటనే వెళ్ళకపోతే టీమ్ లో  ఆయన స్థానం పోతుంది" అంది.
   
    వెంకటరత్నం ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు. దూరపు భవిష్యత్తులో భర్తకేసు గురించి ఆలోచించకుండా, దగ్గిరలోవున్న సమస్యను గురించి ఈమె ఆలోచిస్తూంది. చాలా తక్కువమందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడో జరగబోయేదాన్ని ఊహించుకుని కలతపడటంకన్నా వెంటనే వున్న సమస్య గురించి ఆలోచించటం, ఆమెను చూసిన వెంటనే కలిగిన అభిప్రాయానికి, ఆమె ప్రవర్తన బలం చేకూరుస్తున్నందుకు అతడు సంతోషించాడు.
   
    "ఈ మ్యాచ్ కి ఇతను ఎప్పుడు వెళ్ళాలి?"
   
    "రేపు సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయల్దేరాలి" అన్నాడు రాయన్న స్నేహితుడు.
   
    "ఈ రోజే బెయిల్ కి ప్రయత్నిద్దాం" అన్నాడు వెంకటరత్నం లేస్తూ.
   
                                                                    *    *    *
   
    "ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయన్నకి బెయిల్ దొరక్కూడదు" అన్నాడు విజయకుమార్.
   
    రాఘవరెడ్డి పచార్లు చేస్తున్నాడు. చేస్తూ ఆలోచిస్తున్నాడు.
   
    "బెయిల్ దొరక్కుండా చేయడం మన చేతుల్లో లేదు. వాళ్ళు మంచి లాయర్ని పెట్టుకుంటే, ఎట్లాంటి పరిస్థితిలోనయినా బెయిల్ దొరకడం కష్టం కాదు" అన్నాడు.
   
    "బెయిల్ దొరికినా ఒక హంతకుడు దేశాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాడు?" ఆవేశంగా అన్నాడు వెంకట్రాజు, నిజానికి అతడి పేరు  వెంకట్రాజే. మోడరన్ గా లేదని, విజయ కుమార్ అని మార్చుకున్నాడు.
   
    ప్రొద్దున్న పేపరు చదువుతూ అతడీ వార్తని చూశాడు. రాయన్న అరెస్ట్ అన్న వార్త చదివాక సంభ్రమాశ్చర్యాలతో వూగిపోయాడు. పెదాల మీద చిరునవ్వు ఉదయించింది. ఆ వార్తనే ఒకటికి పదిసార్లు చదివాడు.
   
    ఒకే రంగంలో, తన ప్రత్యర్ధి అనుకున్నవాడు ప్రమాదంలో ఇరుక్కుని తనకి పోటీ తగ్గుతుందనుకుంటే, దానికి మనసులో ఒక్కపిసరైనా సంతోషం లేకుండా మనస్ఫూర్తిగా బాధపడాలంటే ఇవతలివాడికి గొప్ప  స్పోర్ట్సు మెన్ షిప్ కావాలి. అటువంటివేమీ విజయకుమార్ కి లేవు. వెంటనే రాఘవరెడ్డికి ఫోన్ చేసి పిలిపించాడు. అతడు కూడా ఆ వార్త అప్పుడే చూశాడు.
   
    "ఎవరీ అపురూపలక్ష్మి?" రాఘవరెడ్డి అడిగాడు. "నీకు తెలుసా?"
   
    "ఒక పిచ్చిది. ఆటోగ్రాఫులంటూ మా వెంటపడేది. గురుడు కాస్త గ్రంధం నడిపినట్లున్నాడు. ఇతగాడికి పెళ్ళి కుదిరిందని తెలియగానే బహుశా నిలదీసి వుంటుంది. మనవాడు అడ్డు తొలలించుకున్నాడు" అన్నాడు విజయకుమార్ ఒక వాస్తవానికి తన వూహ జోడించి.... భవిష్యత్తులో తయారవబోయే ఒక కథకి పునాది వేస్తూ.
   
    "మొత్తం మీద నీ కిలా లాభించింది."
   
    "అవును ప్రొద్దున్న పేపరు చూసేవరకూ ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతామా అని చాలా టెన్షన్ లో పడ్డాను. మొత్తంమీద అది చచ్చిసాయపడింది."
   
    "సర్లే నువ్వింకా ఎగ్జయిట్ అవకు. పత్రికల వాళ్ళెవరైనా చూశారంటే 'రాయన్న అరెస్ట్ పై విజయకుమార్ సంతోషం' అని హెడ్డింగ్ పెట్టి వ్రాస్తారు" అన్నాడు రాఘవరెడ్డి నవ్వుతూ.
   
    "ఆ సంగతి తర్వాతగానీ, ముందువెళ్ళి ఆ సెలక్షన్ బోర్డుతో మాట్లాడండి. ఒక హంతకుడికి దేశం తరపున ఆడే స్థానం ఎలా కల్పిస్తారు? రేప్రొద్దున్న ఆ వార్త నేషనల్ న్యూస్ లో రాకముందే మీరు తగిన చర్య తీసుకోకపోతే, అంత కళ్ళు మూసుకుని ఎలా సెలెక్ట్ చేశారు అని అందరూ మిమ్మల్నే అంటారు."
   
    రాఘవరెడ్డి నవ్వుతూ "నేనేం మాట్లాడాలో అన్యాపదేశంగా నాకే చెపుతున్నావే. కాని ఇంతకుముందు ఇలాంటి పరిస్థితిలోనే ఓ ప్రముఖ క్రికెటర్ సిద్దూని విదేశాలకు కూడా పంపాం. గుర్తుందా? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ రోజే బాంబే వెళతాను" అని లేచి మళ్ళీ ఆగాడు. విజయకుమార్ కి అర్ధం అయింది. లోపల్నుంచి ఓ నోట్ల కట్ట తెచ్చి యిచ్చాడు. అది తీసుకుని రెడ్డి వెళ్ళిపోయాడు.
   
    ఆ క్షణం వాళ్ళిద్దర్నీ ఆ పరిస్థితిలో చూచినవాళ్ళెవరూ రెడ్డి సెలక్టర్ అనీ, విజయకుమార్ క్రీడాకారుడనీ అనుకోరు. పరిస్థితి అలావుంది కాబట్టి మన దేశ విస్తీర్ణంలో పదోవంతు కూడా లేని కొరియాకి అన్ని పతకాలు వస్తే మనకి నాలుగైదుకన్నా ఎక్కువ రాలేదు. మన దేశంలో నాల్గోవంతు కూడా లేని దేశాలన్నీ ఫుట్ బాల్ లో ప్రపంచాధిపత్యంకోసం పోటీ చేస్తూంటే మనకి పాల్గొనే అర్హతకూడా రాక, కలకత్తా మైదానాల్లో ప్రతాపం చూపిస్తున్నాం. ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదైన (ఒకే ఉష్ణోగ్రత, శీతోష్ణస్థితి వున్న) శ్రీలంక క్రికెట్ లో మన దేశాన్ని ఓడించినా ఆశ్చర్యపోనవసరంలేదు.
   
    రాఘవరెడ్డి వెళ్ళిపోయాక విజయకుమార్ కేం చెయ్యాలో తోచలేదు. రచయిత (త్రు)ల్లోగానీ, రాజకీయ నాయకుల్లోగానీ, వ్యాపారస్థుల్లోగానీ ఒక లక్షణం వుంది. తమకు తెలిసిన విషయం పదిమందికి చెపుతేగానీ మనసు వూరుకోదు. ఇప్పుడు అతడి పరిస్థితి కూడా అలాగే వుంది. రాజారావుకి ఫోన్ చేశాడు.

 Previous Page Next Page