Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 17

  

      "స్కూటర్ మీదా?"
   
    "అవును. స్కూటర్ మీదే, దార్లో చెప్పాను కూడా."
   
    "ఏమని?"
   
    "ఇలాటి స్నేహాలు వదిలెయ్యమని. బుద్దిగా చదువుకొమ్మని."
   
    "ఇప్పుడు మీరేం చెప్పినా సాక్ష్యమివ్వటానికి లక్ష్మి ఎలాగూ లేదు."
   
    "మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఆ అమ్మాయిని చూస్తే నా కెందుకో చాలా ఆత్మీయంగా అనిపించేది. అనవసరంగా ఒక మంచి అమ్మాయి ఈ వాతావరణంలో పాడయిపోతుందే అని బాధగా కూడా వుండేది. ఆ మాటే అన్నాను. తనకి చిత్రలేఖనం బాగావచ్చు. అది ప్రాక్టీసు చేసుకోరాదా అన్నాను కూడా."
   
    "లక్ష్మి ఏమంది దానికి?"
   
    "జవాబు చెప్పలేదు."
   
    "ఒకమ్మాయిని హోటల్ కి తీసుకెళ్ళి, అక్కడ మీరు రెండు పెగ్గులు తాగి, అట్నుంచి లాడ్జింగుకి వెళ్ళి, తిరిగి వెళ్తున్నప్పుడు, 'అమ్మా నువ్వు చెడిపోకు' అని చెపుదామనుకున్నారు. భలే..... చాలా బావుంది కథ."
   
    "కథ కాద్సార్. నిజమే చెపుతున్నాను. నా కొకవైపు ఇదంతా థ్రిల్లింగ్ గా అనిపించేది. మరొకవైపు బాధగా కూడా అనిపించేది. అంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు."
   
    "మనం పాడయిపోయినా ఫర్వాలేదు. ఇవతలివాళ్ళు పాడవకూడదు - అన్నట్టు."
   
    "నేను సరిగ్గా చెప్పలేను....."
   
    "చెప్పలేరు. ఎందుకంటే, నిజం చెప్పటంలేదు కాబట్టి. సరే- ఇది చెప్పండి. మీరు కాకుండా అపురూపలక్ష్మికి ఇంకా మొగ స్నేహితులున్నారా?"
   
    "లేదు. లేదు. నాతోఇనే కాస్త క్లోజ్ గా వుండేది."
   
    "ఈ వూరు రాకముందు?"
   
    "రాకముందా?.....అసలు వాళ్ళింట్లో ఎంత కట్టుదిట్టాల్లో పెంచారంటే అబ్బాయిల్తో మాట్లాడటం అసలీ వూరొచ్చాకే మొదటిసారట."
   
    "ఈ వూర్లో మీరు తప్ప తనతో క్లోజ్ గా ఎవరూ లేరంటారు."
   
    "లేరు."
   
    "మీకు తెలియకుండా వున్నారేమో?"
   
    "ఉంటే తెలియకుండా ఆగదు. ఏదో విధంగా పక్క స్నేహితురాళ్ళు కనీసం నోరు జారినట్టుగానైనా చెప్పేస్తారు."
   
    ఇన్ స్పెక్టర్ దగ్గరకొచ్చి బల్లమీద కాలు ఆన్చి కూర్చున్నాడు. రాయన్న మొహానికి దగ్గిరగా వుంది అతడి బూటు. ఇంతసేపు ఇన్ని ప్రశ్నలు వేశాక, అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు- అన్నాడు. "మిస్టర్ రాయన్నా ఈ హత్య మీరు చేశారని ఒకసారి చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను. ఇంకొంచెం సేపట్లో మీతోనే చెప్పిస్తాను- నా దగ్గర తిరుగులేని సాక్ష్యాలున్నాయి. ఒక్కొక్కటే మీ ముందు పెడుతున్నాను. ఏదో ఒక దాని దగ్గిర మీరు పూర్తిగా నిజం వప్పేసుకుంటారు. ముందే వప్పుకుంటే మనిద్దరికీ ఈ శ్రమ తప్పుతుంది. చెప్పండి. ఎందుకు చేశారీ హత్య?"
   
    "నేను చేయలేదు."
   
    ఇన్ స్పెక్టర్ లాఠీతో కుర్చీని కొట్టాడు. అతికష్టంమీద తమాయించుకున్నాడు.
   
    "మీరా రోజు హోటల్ లో రూమ్ తీసుకున్నారని మాకు ఇంత తొందరగా ఎలా తెలిసిందనుకున్నారు? -లక్ష్మి తాలూకు స్నేహితురాండ్రనందర్నీ ప్రశ్నలడిగాం అందులో రమణికూడా వుంది. ఆ అమ్మాయే చెప్పింది - మీరు ఒక రాత్రంతా హోటల్ లో వున్నారని."
   
    "అబద్దం! అబద్దం!! అబద్దం!!!"
   
    "అబద్దం చెప్పవలసిన అవసరం ఆ అమ్మాయి కేమీ లేదు రాయన్నా! అసలు ఆ అమ్మాయి ఆ సంగతి చెప్పకపోతే మాకీ హోటల్ సంగతే తెలిసేది కాదుకదా. వెంటనే రాజారావుని కాంటాక్ట్ చేశాం. ముందు అతను తనకేం తెలీదన్నాడు. అరెస్ట్ చేస్తామని బెదిరించేసరికి వప్పుకున్నాడు-లక్ష్మితో గడపడానికి రూమ్ కావాలన్నారనీ - తనకి తెలిసిన హోటల్ లో రూమ్ ఇప్పించాననీ...."
   
    ".....కానీ"
   
    "ఆగండి. మీరు చెప్పబోయేది నాకు తెలుసు. రాజారావు దగ్గిరే మా పరిశోధన ఆగలేదు. హోటల్ లో ఎంక్వయిరీ చేశాం. ఆటోలో మీరూ లక్ష్మి దిగిన సంగతి హోటల్ రిసెప్షనిస్టు ధృవపర్చాడు. మీరు రాజారావు పేరు చెబితే అతడు నమ్మక, రాజారావుకి ఫోన్ చేశాడు. రాజారావు చెప్పాకే మీకు రూమ్ ఇచ్చాడు. ప్రొద్దున్నవరకూ మీరిద్దరూ రూమ్ లోనే వున్నారు.
   
    "అబద్దం, లక్ష్మి అలాటిది కాదు."
   
    "ఎలాటిది కాదు?" తాపీగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "సాంప్రదాయాలకు విలువ ఇచ్చేది. ఇంకొంత కాలమయితే ఎలా వుండేదో గాని ఇప్పుడు మాత్రం అలా చెయ్యదు."
   
    "ఆ అమ్మాయి తల్లిదండ్రులతో వుండేటప్పుడు బయట ప్రపంచం అసలు తెలీదు. పోతే హాస్టల్కొచ్చాక మీరు తప్ప మరెవరూ బోయ్ ఫ్రెండ్స్ లేరు. కాబట్టి ఆ అమ్మాయికి మరెవరితోనూ శారీరక సంబంధం ఉండటానికి..... మీ లెక్కన.....అసలు వీల్లేదు. మరిదేమిటి?" అంటూ ఫైల్లోంచి ఒక కాగితం తీసి అతని ముందుంచాడు. రాయన్న ఆ కాగితాన్ని చదువుతూండగా ఇన్ స్పెక్టర్ కంఠం కంచులా మ్రోగింది. "-పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం అపురూపలక్ష్మి కన్యకాదు. ఆమె హైమన్ మీద వున్న రప్చర్స్ ప్రకారం ఆమెకి ఈ కలయిక ఈ మధ్యే ఏర్పడింది. అదికూడా ఒకసారి కాదు. దీనికి మీరేం జవాబు చెపుతారు?"
   
    రాయన్న మొహం రక్తంలేనట్టుగా పాలిపోయింది.
   
    ఇన్ స్పెక్టర్ అతని భుజం పట్టుకుని విసురుగా దగ్గరికి లాగాడు. క్రౌర్యం నిండిన మొహంతో, "నన్ను రాక్షసుణ్ణి చేయద్దు మిస్టర్ రాయన్నా! నా దగ్గర అన్ని సాక్ష్యాలూ వున్నాయని ముందే చెప్పాను. ఒక్కొక్కటీ నీ ముందు పెడతాను. ఏదో ఒక క్షణం నువ్వు నీ నేరాన్ని వప్పుకోక తప్పదు- చెప్పు లక్ష్మిని హత్యచేసింది నువ్వేనా కాదా?"
   
    రాయన్న కొంచెంసేపు మాట్లాడలేదు. తనలో తను తర్కించుకుంటున్నట్టు మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయాడు. అతడు ఒక నిర్ణయానికొచ్చినట్లు ఏదో చెప్పటానికి తలెత్తుతూ వుండగా బయట అడుగుల చప్పుడయింది. యస్సై సత్యనారాయణ లోపలికి వచ్చాడు. గుబురు మీసాలు, ఎర్రకళ్ళు, తాగుడువల్ల  ఉబ్బిన బుగ్గలు - నిజమైన పోలీసులా వున్నాడు. ఇన్ స్పెక్టర్ ని చూసి సెల్యూట్ చేశాడు. అతడి చూపులో, "నిజం చెప్పాడా? నేను చెప్పించనా?" అన్న ప్రశ్న వుంది. దాన్ని అర్ధం చేసుకున్నట్టు ఇన్ స్పెక్టరు - "ఇప్పుడిప్పుడే మొదలుపెట్టబోతున్నాడు. అలా కుర్చీ లాక్కో" అన్నాడు.
   
    సత్యనారాయణ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఇద్దరు పోలీసు అధికారులూ రాయన్నవైపు "ఇక చెప్పు" అన్నట్టుగా చూశారు.
   
                            *    *    *
   

    సరిగ్గా పదింటికి ఫ్రెండ్ వచ్చాడు. ఆ రెండు గంటల్లో కిరణ్మయి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంట్లోవాళ్ళు ఉచిత సలహాలు ఇస్తారేగానీ పనికొచ్చేది ఏదీ చెయ్యరు. తనకి తెలిసిన ఇన్ స్పెక్టరు ఎవరో ఉన్నారని వెళ్ళిన అన్న ఇంకా రాలేదు. సాయంత్రం వరకూ రాడని తెలుసు.
   
    రాయన్న స్నేహితుడు వచ్చి, "ఒక తెలిసిన లాయర్ దొరికాడండీ వెళ్దామా" అన్నాడు.
   
    "మీ కోసమే చూస్తున్నాను" అందామె క్లుప్తంగా అతడి సహాయం మానసికంగా ధైర్యం ఇస్తూంది.
   
    వాళ్ళు బయల్దేరబోతూవుంటే రాయన్న తండ్రి "నేనూ వస్తానమ్మా" అన్నాడు.
   
    "మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం లేదండీ లాయర్ దగ్గిరకి వెళ్తున్నాం" అంది కిరణ్మయి వియ్యంకుడు కూతురితో మాట్లాడుతూ వుండటం చూసి ఆమె తండ్రి అక్కడికి వచ్చాడు. "ఈ లాయర్ల దగ్గిరకీ, పోలీస్ స్టేషన్ లకీ నువ్వెందుకు? అన్నయ్యలు వెళ్తార్లే...." అన్నాడు.
   
    "ఎప్పుడు? ఆయనకి శిక్షా పడ్డాకా" అనుకుంది మనసులో పైకి అన్లేదు. ఆమె మాట్లాడకపోవటం చూసి "ఇప్పటికే పెళ్ళికూతురు అర్ధరాత్రిళ్ళు బయట తిరగమేమిటి అనుకుంటున్నారు అందరూ-" అని పూర్తిచేశాడు.
   
    కిరణ్మయి ఆవేశాన్ని అతికష్టంమీద అణుచుకుని, మరేమీ సమాధానం చెప్పకుండా బయటికి నడిచింది. అతడు రెండు రిక్షాలు పిలవబోతూంటే "అక్కర్లేదు ఒకటి చాలు" అంది.
   
    అతడు రిక్షావాడికి అడ్రసు చెప్పాడు. రిక్షా వెళ్తూవుంటే ఆమె తనలో తనే శుష్కంగా నవ్వుకుంది - నిన్నరాత్రి సిగ్గుల పెళ్ళికూతురు.....ఈరోజు జైళ్ళచుట్టు.....లాయర్లచుట్టు..... విధి అంటే ఇదేనేమో!
   
    అంతలో రిక్షా ఆగింది. ఆమె తలెత్తి చూసింది.
   
    ఓ చిన్న ఇల్లు అది. దాంట్లోనే ఆఫీసు. బయట వెంకటరత్నం, ఎడ్వకేట్. అని బోర్డు వుంది. ఇద్దరూ లోపలి ప్రవేశించారు.
   
    లాయర్ వెంకటరత్నం ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వయసు ముఫ్ఫైదాటి ఉండొచ్చు.

 Previous Page Next Page