Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 19

   

    "రాయన్న అరెస్టయ్యాడట విన్నావా?" అని అడిగాడు.
   
    "ఆఁ. నిన్నే తెలిసింది."
   
    "నిన్నే తెలిసిందా? ఎలా?"
   
    "సాయంత్రం రమణి ఫోన్ చేసింది. లక్ష్మి మరణం గురించి హాస్టల్లో అంతా నానా కంగాళీ అయిపోయిందట. ఫాన్ కి ఉరి వేసుకుంది కాబట్టి అందరూ ఆత్మహత్య అనుకున్నారట. కానీ అంతలో ఇన్ స్పెక్టర్ వచ్చి 'తలుపు గడియ లోపల వేసుకోకుండా ఎందుకు ఉరేసుకుంటుంది?' అని అడిగేసరికి ఒకమ్మాయి' అవును నిజమే. నేను చూశాను' అందట."
   
    "ఏం చూసిందట ఆ అమ్మాయి?" విజయ్ కుమార్ ఎగ్జయిటింగ్గా అడిగాడు.
   
                              *    *    *

   
    "మీరు ఆ గదిలోంచి బయటకు రావడం తన కళ్ళతో తాను స్వయంగా చూసిన అమ్మాయి ఆ విషయాన్ని రేపు కోర్టులో సాక్ష్యమివ్వబోతూ వుంది. దీనికి మరేం చెపుతారు?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
   
    "నేను హాస్టల్ కి వెళ్ళినమాట నిజమే" రాయన్న అన్నాడు. "కాని అప్పుడు లక్ష్మి బ్రతికేవుంది."
   
    "మరింతకు ముందు ఆ రోజు అసలు కలుసుకోలేదన్నారు?"
   
    "నేను నిజమే చెబుతున్నాను."
   
    "ఏమిటి నువ్వు చెప్పే నిజం? లక్ష్మి చచ్చిపోయిన రోజు అసలు కలుసుకోలేదన్నావు ముందు. ఇప్పుడేమో కలుసుకున్నానంటున్నావు. ఆ అమ్మాయితో రాత్రిళ్ళు గడపలేదన్నావు ముందు. ఇప్పుడేమో హోటల్లో రూమ్ తీసుకున్నానని వప్పుకున్నావు."
   
    "లక్ష్మి చచ్చిపోయిన రోజేదో నాకు తెలీదు. ఇప్పుడే మీరు చెపుతున్న దాన్నిబట్టి ఏ రోజు చనిపోయిందో తెలిసింది."
   
    "అమోఘం! అద్భుతం" అన్నాడు ఇన్ స్పెక్టరు. "ఇంతటి నటన నేనెప్పుడూ చూడలేదు."
   
    వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయానికి యస్సై సత్యనారాయణ బయట వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడెప్పుడు రాయన్నతో నిజం చెప్పిద్దామా అని అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
   
    సరిగ్గా ఆ సమయానికి ఒక స్కూటర్ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ఒక వ్యక్తి దిగి స్టేషన్ మెట్లెక్కి యస్సై ముందు చేయిసాచుతూ, "నా పేరు వెంకటరత్నం, లాయర్ని" అన్నాడు.
   
    అయితే ఏమిటట అన్నట్లు చూశాడు ఇన్ స్పెక్టరు.
   
    "నేను అర్జెంటుగా రాయన్నని చూడాలి."
   
    సత్యనారాయణ అతడివైపు కోపంగా చూశాడు. లాయర్లంటే అతడికి తగని మంట. "వీళ్ళకి నైతిక విలువలు ఉండవు. అడ్డమయిన వెధవలనీ, వెధవ పనులు చేసే కిరాతకులనీ రక్షిస్తూ అబద్దపు బ్రతుకులు బ్రతుకుతుంటారు" అనుకున్నాడు.
   
    సత్యనారాయణ మాట్లాడకపోవడంతో వెంకటరత్నం అనుమానంగా లోపలకు తొంగిచూశాడు. పోలీసు కస్టడీలో జరిగే దురాగతాలు బాగా తెలిసిన వాడతడు.
   
    "అలా కూర్చోండి, సర్కిల్ లోపలున్నారు పిలుస్తాను" అని మరి గత్యంతరం లేదన్నట్లుగా లోపలకు వెళ్ళాడు.
   
    లోపల ఇన్ స్పెక్టర్ అంటున్నాడు - "నువ్వెంత బుకాయించినా లాభంలేదు రాయన్నా. అన్ని విధాలుగా నువ్వే హంతకుడివని నిరూపించే సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. అవన్నీ నిజమైన ఆధారాలనే నీ చేత వప్పిస్తూ వచ్చానుకూడా. ఇప్పటికయినా మించిపోయింది లేదు. నిజం వప్పుకో, జరిగింది చెప్పు. శిక్షయినా తగ్గుతుంది" అంటున్నాడు ఇన్ స్పెక్టర్.
   
    "నేను హత్య చెయ్యలేదు. చెయ్యలేదు. చెయ్యలేదు. మీకు దొరికిన ఆ రుజువులు, సాక్ష్యాలు నాకేమీ అర్ధంకావడంలేదు" అరిచాడు రాయన్న అతడిలో ఓపిక నశిస్తోంది.
   
    ఇన్ స్పెక్టర్ కి కావలసిందదే. రాయన్న అలా డెస్పరేట్ గా అయిపోవడం అప్పుడు కాస్త రెచ్చగొడితే చాలు నిజం బయటపడిపోతుంది. 'అవును హత్యచేశాను తప్పలేదు. ఏం చెయ్యమంటారు?' అనే స్థితిలోకి వచ్చేస్తాడు.
   
    "చూడు రాయన్నా, నీకు పెళ్ళయి మూడురోజులయినా కాలేదు. అభం శుభం తెలియని మరొ అమాయకురాలిని కూడా చిత్రహింస పెడుతున్నావు. ముక్కుపచ్చలారని ఓ పిల్లని నమ్మించి గొంతుకు ఉరివేసి ఒక్కసారిగా చంపావు. పెళ్ళిచేసుకుని మరొ స్త్రీని నమ్మకద్రోహంతో క్షణక్షణం చంపబోతున్నావు. నీకెలాంటి శిక్ష విధిస్తే సరిపోతుందో నాకు అర్ధంకావడంలేదు" ఇన్ స్పెక్టర్ ఆగాడు. సత్యనారాయణని చూడగానే అతడి మొహంలో ఓడిపోయినా భావం కనిపించింది. "రా, సత్యనారాయణా, నేను ఓడిపోయాను. చదువుకున్న సంస్కారిగా ఇతడు నా మాట నిలబెడతాడని నమ్మాను. ఇక లాభంలేదు. నువ్వే చూడు" అని చిరాగ్గా అన్నాడు.
   
    "మీరొకసారి బయటకు రండి సార్" అన్నాడు సత్యనారాయణ.
   
                                     *    *    *
   
    "దాదాపు పెళ్ళిదుస్తుల్లోనే మనవాడు హాస్టల్ కొచ్చాడట. లక్ష్మితో వాడేదో ఆవేశంగా మాట్లాడటం ఓ అమ్మాయి  చూసిందట. అరగంట తర్వాత వాడు హాస్టల్ లోంచి భయంభయంగా వెళ్ళటంకూడా ఆ అమ్మాయే చూసిందట. అప్పుడే అనుమానంతో లక్ష్మి గదిలోకి వెళ్ళిచూస్తే ఆమెను రక్షించగలిగి వుండేది కాని పట్టించుకోలేదు. తర్వాతెప్పుడో రెండు మూడు గంటల తర్వాత ఎందుకో వెళ్ళిచూస్తే అప్పటికే అంతా అయిపోయింది. అందరూ ఆత్మహత్య అనుకునేలా చాలా పకడ్బందీగా చేశాడట. అయినా బయటపడిపోయాడు."
   
    "పాపం లక్ష్మి ఎంత అమాయకప్పిల్లరా. అట్లాంటి పిల్లని హత్య చెయ్యడానికి వీడికి చేతులెలా వచ్చాయసలు?" విజయకుమార్ బాధ నటిస్తూ అన్నాడు.
   
    "వాడసలు మనిషయితేగా, వట్టి పశువు" రాజారావు కోపంగా అన్నాడు. విజయకుమార్ కి కావలసిందదే.
   
    "నమ్మించి వశపరుచుకుని, గట్టిగా అడిగితే హత్య కూడా చేసేశాడు. అలాంటి నీచుడికి ఉరిశిక్షపడాల్సిందే. తల్చుకుంటుంటే నా గుండె మండిపోతోంది. వాడసలు జైల్లోంచి బయటకు రాకుండా చూడాలి" అన్నాడు ఆవేశంగా.
   
    "బెయిల్ కూడా దొరకదు వాడికి. పోలీసుల దగ్గిర అంతా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉందట" అన్నాడు రాజారావు.
   
    "అలా అని వూరుకోకూడదు. మనం మరోవిధంగా వత్తిడితేవాలి. వాడికి బెయిక్ ఇవ్వడం జరిగితే హాస్టల్ అమ్మాయిలంతా సమ్మె చేసేలా ప్రయత్నించాలి. నువ్వు తల్చుకుంటే అది కష్టంకాదు. రమణితో మాట్లాడు అనవసరంగా మనం అల్లరి పడకుండా, ఇన్నాళ్ళూ వాడి స్నేహితులుగా అందరికీ తెలుసు కాబట్టి మనిద్దరి పేర్లూ బయటకు రాకుండా మాత్రం చూడు. డబ్బుకోసం జంకకు."
   
    "మంచి అయిడియా! అన్నట్టు మా అంకుల్ డి. సి. పి. కదా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. కాలేజీ స్టూడెంట్స్ స్ట్రయిక్ అంటే భయపడక తప్పదు" హుషారుగా అన్నాడు రాజారావు.
   
    "సరే ఏం జరిగిందో నాక్కూడా ఫోన్ చెయ్యి" ఫోన్ డిస్కనెక్ట్ చేశాక మళ్ళీ ఆలోచనలో పడ్డాడు విజయకుమార్. ఈ రాజారావు ఎంత దగుల్భాజీయో వాళ్ళ అంకుల్ కి తెలుసు. అలాగే రమణి మాటకు హాస్టల్ పిల్లలు ఎంత విలువ నిస్తారో కూడా అతడికి బాగా తెలుసు. విజయకుమార్ మరి ఆలస్యం చెయ్యకుండా ఫోనెత్తి మరో నెంబర్ డయల్ చేశాడు. ఓ మంత్రిగారికి కుడిభుజం అయిన గూండా నాయకుడిదా నంబర్. అతడితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక విజయకుమార్ మనసు శాంతించింది.
   
                                   *    *    *
   
    అదే సమయానికి లాయర్ వెంకటరత్నం ముద్దాయి రాయన్నతో మాట్లాడుతున్నాడు.
   
    "చూడండి రాయన్నా మీతో మాట్లాడడానికి నాకు కేవలం పదిహేను నిమిషాలే వ్యవధి ఇచ్చాడు ఇన్ స్పెక్టరు. మీ శ్రీమతి వచ్చి ఈ కేసు గురించి చెప్పినప్పుడు మీరు 'నిరపరాధి' అని పూర్తిగా నమ్మితేనే గాని ఈ కేసు టేకప్ చెయ్యనని స్పష్టం చేశాను. నాకు జరిగిన విషయం ఏమిటో నిజం చెప్పండి."
   
    "నిజం నమ్మేటట్లుగా ఉండదు లాయరుగారూ. ఉదయం నించి ఇన్ స్పెక్టర్ నన్ను రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు. సాక్ష్యాలు, రుజువులు చూపిస్తున్నాడు. అవన్నీ వింటుంటే నిజం ఏమిటో నాకే అనుమానం వచ్చి అయోమయ స్థితిలో పడిపోయేన్నేను. నాకు తెలియకుండానే నేను వెళ్ళి ఆ హత్యచేసి వచ్చానేమో అనే అనుమానం కలుగుతోంది. ఇక మీకు ఏం చెప్పను? ఏం చెప్పి నా నిజాయితీని మీ ముందు నిరూపించుకోను?"
   
    వెంకటరత్నం రాయన్న ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆయన ఉద్దేశ్యం గ్రహించినవాడిలా రాయన్న తలెత్తి ఆయన కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో భయంలేదు, బాధ ఉంది. నటనలేదు, నిజాయితీ వుంది. రక్షించమన్న అర్ధింపులేదు, అర్ధం చేసుకొమ్మన్న అభ్యర్ధన వుంది. ఆ ఒక్కచూపు చాలు వెంకటరత్నం అతడిని నిరపరాధిగా నిర్ణయించుకోవడానికి.

 Previous Page Next Page