Previous Page Next Page 
యుగాంతం పేజి 18

   

    వివిధ దేశాల శాస్త్రజ్ఞులు శ్రీలంక చేరుకున్నారు.
   
    పావుతక్కువ పన్నెండు.....
   
    అందరి మనసుల్లోనూ టెన్షన్.
   
    టెలిస్కోప్ ప్రక్కన ప్రొఫెసర్ మొహంలో ఏ భావమూ లేకుండా నిలబడి వున్నాడు.
   
    మోచేతుల్లో మొహం దాచుకుని మౌనంగా కూర్చొని వున్నాడు రమణ. అతడెంత తప్పుచేశాడో అర్ధమైన తర్వాత..... అప్పటి వరకూ మాట్లాడలేదు అతడు.
   
    ఐదు నిముషాలు తక్కువ పన్నెండు.
   
    పది నుంచి ముప్పై లాంగిట్యూడ్ మీద- పన్నెండు గంటలా మూడు నిమిషాలకి-
   
    పన్నెండు కావస్తుండగా జనం ఎక్కడ చూసినా జనమే. తలలు ఆకాశానికెత్తి..... నిశ్శబ్దంగా ఆత్రంగా..... నమ్మకానికీ, అపనమ్మకానికీ మధ్య ఘర్షణతో.
   
    పన్నెండు.
   
    రాజయ్య కూడా తలెత్తి చూసేడు.
   
    మరోవైపు ముసలాయన కిటికీలోంచి చూస్తున్నాడు.
   
    ప్రకాశరావు ఇంకో వైపు పాలిపోయిన మొహంతో నిలబడి వున్నాడు.
   
    పన్నెండు గంటలా రెండు నిమిషాలు, నాలుగు నిమిషాలు, ఐదు నిమిషాలు....
   
    రమణ ఆనందంతో అరిచేడు. "చంద్రుడు కదల్లేదు" అని. "ది మూన్ హాజ్ నాట్ మూవ్ద్....." అతడి గొంతు గాలిలో ప్రతి ధ్వనించింది.
   
    ప్రొఫెసర్ మాట్లాడలేదు. దూరం నుంచి జనం నవ్వులు! ఆనందం. రిలాక్సేషన్ కలిసిన నవ్వులు. రమణకే అనుమానం వేసింది. మళ్ళీ ఆకాశం కేసి చూశాడు. చంద్రుడు అలాగే వున్నాడు.
   
    కానీ......కానీ.....పెద్ద ఫుట్ బాల్ బంతిలా నిండుగా వుండవలసిన వాదు చిన్న టెన్నీస్ బంతిలా అయిపోతున్నాడు. ఇంకా ఇంకా కుదించుకుపోయి.....క్షీణమవుతున్నాడు.
   
    రమణకి విషయం అర్ధమైంది.
   
    పక్కకి కాకుండా వెనక్కి, వెనక్కి వెళ్ళిపోతున్నాడు.....నక్షత్రం వైపు.....చంద్రుడు వెళ్ళిపోతున్నాడు.
   
    దాదాపు ఇరవై అయిదు మిలియను సంవత్సరాల నుంచీ భూమిని అంటిపెట్టుకుని తిరిగి చంద్రుడు..... ఎంతోమంది ప్రపంచకవులకీ, గాయకుల భావాలకి వూపిరిపోసిన చంద్రుడు.... ఎంతోమంది పాపలకి తల్లులు ఆటబొమ్మగా చూపెట్టిన చంద్రుడు.... నెమ్మది నెమ్మదిగా అనంత విశ్వంలోకి అదృశ్యమైపోతున్నాడు.
   
    హాహాకారాలు-
   
    ఎవరో భయంతో అరుస్తున్నారు.
   
    పోలీస్ వ్యాన్ సైరన్ మోగిస్తూ తిరుగుతోంది.
   
    పత్రికా విలేఖరులు భూమికి అటువైపువున్న విదేశాలకి వార్తల్ని పంపుతున్నారు.
   
    జనం మొహాల్లో భయం, వేదన. ఒక స్త్రీ మూర్చపడిపోయింది. ఒక కుర్రవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. చూసిన దృశ్యాన్ని నమ్మలేక చాలామంది స్తంభించిపోయేరు.
   
    ఆకాశం చీకటిని పులుముకుంది. బొట్టులేని స్త్రీ మొహంలా కళా విహీనమైంది. కళకళలాడే చంద్రుడిక లేడు.
   
    పదిరోజుల్లో భూమి కూడా వుండదు.
   
    ఎవరో బిగ్గరగా రోదిస్తున్నాడు. ప్రళయం ప్రారంభమైంది.
   
    ఆగష్టు ఆరు
   
    ఆగష్టు ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి చంద్రుడిని ప్రాక్సిమా సెంక్చువరీ ఆకర్షిస్తున్న సమయాన, భూమ్మీద ఒక ప్రదేశంలో బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. మిండనోవా డీప్ లో అయితే అది మరుసటిరోజు కానీ వెలుగులోకి రాలేదు.
   
    ఒక థియరీ ప్రకారం చంద్రుడు ఒకప్పుడు భూమిలో ఒక భాగమే. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం వున్న ప్రాంతం నించి విడిపోయేడు. ఆ ప్రదేశాన్నే మిండనోవా డీప్ అంటారు. చంద్రుడిలో వున్న ఆర్మాల్ కొలైట్ అన్న పదార్ధం పసిఫిక్ సముద్రాంతర్భాగంలో ఇంకా కొద్దిగా వుంది కాబోలు. అదే సమయానికి చంద్రుడితోపాటూ అధీ ఆకర్షితమై పైకి లేచింది. ఫలితంగా ఆ సముద్రగర్భంలో కనీ వినీ ఎరుగనంత పెద్ద ప్రేలుడు సంభవించింది.
   
    'మౌంట్ విసాలిన్' అన్న అగ్నిపర్వతం ప్రేలినప్పటి ప్రమాదంకన్నా ఇది రెండురెట్లు పెద్దది. ఎర్రమంటలు సముద్రం మధ్య లేచినయ్. ఆ ధ్వని కొన్ని వందల మైళ్ళ దూరం వరకూ వినిపించింది. పొంగే లావాకీ, సముద్ర జలాలకి మధ్య ఆ రాత్రంతా ఘర్షణ జరుగుతూనే వుంది.
   
    ప్రేలుడు సంభవిన్చాగానే నీరు ఆవిరై మేఘంగా పైకి లేచింది. జలచరాలు చచ్చి తెప్పలా తేలాయి. ఆవిరైన నీరు మేఘంళా మైళ్ళదూరం వ్యాపించింది. ఆ ఆవిరి వేడి ఆస్ట్రేలియా వరకూ సోకింది. చచ్చిన జలచరాలు న్యూజిలాండ్ తీరంవరకూ కొట్టుకొచ్చేయి.
   
    అన్నిటికంటే హృదయవిదారకమైన దృశ్యం ఏమిటంటే.....ఆ అగ్నిపర్వతం విస్ఫోటనానికి టహుటీ, హనలులూ, హవాయి, సాలమన్ ద్వీపాల్లో వున్న ప్రజలు కనీసం కెవ్వున కేక వేయడానికి కూడా సమయం చిక్కనంతటి వ్యవధిలో శలభాల్లా మాడిపోయారు.
   
    ఈ వార్త మరుసటిరోజు కార్చిచ్చులా ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రజలు నిర్వీర్యులయ్యేరు. ప్రళయం అనివార్యం.
   
    ప్రాక్సిమా సెంక్చువరీ భూమివైపు దూసుకొస్తూనే వుంది.
   
    ఇంకా పదిరోజులు..... పదిరోజులే.....!
   
    మరణం తప్పదని తెలిసిన మనిషి ఏం చేస్తాడు.......?
   
    ఆగస్టు ఏడు
   
    ఇల్లు :
   

    రేడియోలో వార్తలు రావటం పూర్తయింది. ముఖ్యంగా చంద్రుడి గురించీ, పసిఫిక్ లో జరిగిన ప్రళయం గురించీ విని..... "ఇంతకీ దాన్ని ఆపటానికి మనవాళ్ళేం చేస్తున్నారో చెప్పరేం" అన్నాడు ముసలాయన విసుగూ, ఆత్రం నిండిన కంఠంతో.
   
    "మనవాళ్ళేం చేస్తారు? అదేమన్నా రోగం అయితే మందు కనుక్కుంటారు. యుద్ధం అయితే శాంతి సంప్రదింపులు పెడ్తారు. కానీ వస్తూన్న బ్రహ్మాండమైన నక్షత్రాన్ని ఎలా ఆపగలరు? అసలా నక్షత్రం భూమికంటే కొన్ని వందల రెట్లు పెద్దదట....." అన్నాడు ప్రకాశరావు. అతడి మొహం భయంతో పాలిపోయింది. నిద్రలేక కళ్ళు పీక్కుపోయాయి.
   
    ఇంతలో లోపల్నుంచి జానకి వచ్చింది.
   
    కట్టెలు మందక ఆమె కళ్ళు పొగకి ఎర్రగా వున్నాయి. మాసిన చీరె, అలసిన మొహం.
   
    "పని మనిషి రాలేదా?" ముసలాయన అడిగేడు. లేదని చెబుతూ బయటికి వెళ్ళింది. "అసలే చస్తుంటే ఇదొకటి" ముసలాయన గొణుగుతున్నాడు. ఏదో ఒకటి మాట్లాడకపోతే నిశ్శబ్దం మరింత భయంకరంగా వుంది.
   
    ఎప్పుడూ సైకిళ్ళతోనూ మోటారు శబ్దాలతోనూ నిండి వుండే రోడ్డు నిర్మానుష్యంగా వుంది.
   
    "ఒకసారి అష్టగ్రహ కూటమి అని, నీ చిన్నప్పుడు వచ్చింది" అన్నాడు ముసలాయన. ఇంతలో రమణ వచ్చేడు. చేతిలో సంచినిండా సామానులు - బియ్యం.
   
    "ఎందు కివన్నీ....."
   
    "ముందు ముందు దొరుకుతాయో లేదో" అన్నాడు రమణ.
   
    ఎవరూ మాట్లాడలేదు.
   
    పక్కిళ్ళు ఖాళీ చేస్తున్నారు పుట్టింటికి వెళ్ళడం కోసం. వీధి చివర ఎవరో వస్తున్నట్టు కనబడి, కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకొని చూసింది జానకి, పనిమనిషి మంగి.
   
    దాటుకొని వెళుతుంటే ఆపింది.
   
    "ఏమే! పనికి రాలేదు?"
   
    "ఇంకా పనేటి అమ్మగారూ. పదిరోజుల్లో పెళయం వత్తూంటే....." అందది.
   
    "అందుకని రావా?"
   
    "అప్పుడు చూసుకుందాం లెండి, బతికుంటే....."

 Previous Page Next Page