Previous Page Next Page 
యుగాంతం పేజి 17

   

     పదిహేను రోజులు వెనక్కి,
    శాన్ ఫ్రాన్సిస్కో :

   
    "ఈ విషయం అందరికీ తెలిస్తే...." అన్నాడు విలియమ్ రోగర్స్. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్.
       
    ఎవరూ మాట్లాడలేదు.
   
    మెక్ లోపలి వచ్చి కూర్చున్నాడు. జాన్ కళ్ళతోనే విష్ చేశాడు. అతడే అందర్లోకి యువకుడు.
   
    తెల తెల వారుతోంది.
   
    "ఏమిటి సంగతి......?" కంఠం తగ్గించి అడిగేడు మెక్.
   
    అందరి మొహాలూ సీరియస్ గా ఉన్నాయి. జాన్ మౌనంగా ఓ కాగితాల కట్ట అందించేడు. దాదాపు పది పేజీలున్న రిపోర్ట్ అది. ఒక మూలగా 'మౌంట్ పలామోర్ అబ్జర్వేటరీ, కాలిఫోర్నియా' అని వుంది. తొందర తొందరగా కళ్ళతో చదవసాగేడు.
   
    పూర్తి చెయ్యటానికి అయిదు నిముషాలు పట్టింది.
   
    ప్రాక్సిమా సెంక్చువారీ అనే నక్షత్రం భూమివైపు వస్తున్నది అన్న విషయాన్ని ముందు కనుక్కొన్నది రాయల్ అబ్జర్వేటరీ. వెంటనే గ్రీన్ విచ్ ని కాంటాక్ట్ చేసేరు వాళ్ళు. రేడియో అస్ట్రలాజికల్ పరికరాల ద్వారా అది ఎంత వేగంతో వస్తున్నదీ, ఏ దిశగా వస్తున్నదీ కనుక్కోబడింది.
   
    ఈ విధంగా ప్రొఫెసర్ ఆనందమార్గం కనుక్కొన్న విషయం అంతకు పదిహేను రోజులముందే ప్రళయపు సరి అయిన తేదీ, సమయంతో సహా గ్రహించబడింది.
   
    ఆగష్టు పదిహేడు, పదకొండు గంటలా పది సెకన్లకి ఆ గ్రహం భూమి ఆకర్షణ పరిధిగుండా మూడు సెకన్లకాలం పయనిస్తుంది. భూమి అడుగుపొరల్లో వుండే ఇనుము, లావా దాని ఆకర్షణ శక్తికి లోనై పెల్లుబుకుతాయి!
   
    మిలియను సంవత్సరాల వయసున్న యీ భూమ్మీద చరాలన్నీ గుర్తుకూడా మిగలకుండా నాశనమైపోతాయి. విశ్వంలో వున్న కోట్ల కోట్ల గ్రహాల మాదిరిగానే భూమికూడా నిస్తేజమైపోతుంది.
   
    సముద్రాలు ఇంకిపోయి వాటిమీద లావా గట్టిపడుతుంది.
   
    రెండు పరమాణువులున్న ఆక్సిజన్ మూడో దాన్ని చేర్చుకొని ఓజోనుగా మారుతుంది.
   
    భూమ్యాకర్షణ పరిధిలోకి ఆ నక్షత్రం రాగానే ఆ కుదుపుకి భూకంపం కలుగుతుంది. అగ్నిపర్వతాలు బ్రద్దలవుతాయి.....

   
    ఇక చదవలేదు అతడికి పరిస్థితి అర్ధమయింది.
   
    అయితే అది నిజమని నమ్మతానికే కొద్దిగా సమయం పట్టింది. ఎక్కడో లాస్ ఏంజిల్స్ లో వెచ్చటి రగ్గుకింద పడుకున్న వాణ్ణి లేపి ఇంకో రెండు నెలల్లో ప్రపంచం నాశనమైపోబోతూంది అని చెప్తే-అంత తొందరగా నమ్మబుద్ది కాదు. కల అయితే బావున్ను అన్న భావన.
   
    "ఇదంతా నిజమా-నిజంగా ఇలాగే జరుగుతుందా? ఆ నక్షత్రం తనదారి మార్చుకొనే వీలే లేదా-? ఈ ప్రశ్నలన్నీ రిపోర్టు చదవగానే నా కొచ్చినయ్" అన్నాడు రోగర్స్.
   
    "దీనికి సమాధానం ఆగష్టు ఆరో తారీఖున తెలుస్తుంది. ఎలా అని ప్రశ్నించకండి. ఈ ఒక్క విషయమూ రహస్యంగా ఉంచబడింది. అయితే అంతకన్నా ముఖ్య సమస్య ప్రెస్. ఈ విషయం బయటకు పొక్కగానే పత్రికలు దీన్ని తమ సర్క్యులేషన్ పెంచటానికి ఉపయోగించుకుంటాయి."
   
    "అందరికీ తెలిస్తే ఏమవుతుంది?" ఫిన్చ్ అడిగాడు.
   
    అప్పటివరకూ మౌనంగా కాగితాలు పరిశీలిస్తున్న కాస్టనోవా తలెత్తి నెమ్మదిగా అన్నాడు. "ఏమవుతుంది అని అడుగుతున్నావా మిస్టర్ ఫిన్చ్? ఈ నలభై రోజుల్లోనూ ఘాతుకాలు జరుగుతాయి. ప్రాణం ఎలాగూ పోతున్నదని తెలిసినప్పుడు మనిషి పని చెయ్యటం మానేస్తాడు. ఎఫ్. బి. ఐ. వుండదు. ప్రాణమే పోతున్నప్పుడు నైతిక విలువలెందుకని మనిషి వాటినీ వదిలేస్తాడు. పోలీస్ ఉండదు. గత పదకొండు సంవత్సరములుగా వాషింగ్టన్ లో అయిదు వందల శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ నలభై రోజుల్లో అవి పదిహేను వందల శాతం అవుతాయి. రోజుకి ఎనభై రాబరీలవుతున్నాయి. అవి ఎనిమిది వందలవుతాయి. రేప్ లు మనం అంచనాకట్టలేనంతగా పెరిగిపోతాయి. ఏం అవుతుందని అడక్కండి. ఏం అవదని అడగండి. మనుషులు బలహీనతలు మనకు తెలుసు. వచ్చే ప్రళయం ఎలానూ తప్పనప్పుడు దాన్ని ముందుగా వెల్లడించి కల్లోలం సృస్టించటం అవివేకం. ఆపటానికి శాయశక్తుల కృషిచేద్దాం కానీ ఆపగలమని అనుకోకు. ప్రకృతిముందు మనిషెంత......? మనం చెయ్యగలిగిందొక్కటే, మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రపంచానికి ఈ విషయం తెలియకుండా ఆపుచెయ్యటం, అబ్జర్వేటరీస్ అన్నీ మూసెయ్యాలి. ఏదో మిషమీద ఆస్ట్రానమిస్ట్ ల నందర్నీ అరెస్టు...... నా ఉద్దేశ్యం జైలు కాదు.....అరెస్టు చెయ్యాలి. రాబోయే చావుని తల్చుకొని మనిషి చచ్చిపోవచ్చు - లేదా మనిషిలో రాక్షసుడు విజ్రుంభించవచ్చు. ఈ రెంటినీ మనం సాధ్యమైనంత కాలం ఆపుచెయ్యాలి......రాక్షసుడు పుట్టకుండా, మనిషి చావకుండా మనం ఆపుచెయ్యాలి."
   
    అందరూ లేచారు. సమావేశం ముగిసింది.
   
                                   *    *    *
   

    కొన్ని దినపత్రికలు ముఖ్యమైన ప్రదేశాల్లో రోజువారీ కూలీ మీద మనుషుల్ని తమకి సమాచారం అందించే పనిమీద నియమిస్తాయి. వీరందించే సమాచారాన్ని బట్టి పారితోషికం నిర్ణయింపబడుతూ వుంటుంది. ఉదాహరణకి ఉస్మానియా హాస్పిటల్ లో 'టీ' అందించే కుర్రవాడు ఒక ముఖ్య దినపత్రికకి ఇన్ ఫార్మర్. ఎవరెక్కడ కొట్టుకొని చచ్చినా, చావబోతున్నా అక్కడికే రావాలికదా. అప్పటికప్పుడు ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ సేకరించి పత్రిక్కి అందిస్తూ వుంటాడు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మూటలెత్తే ఒక కూలి.
   
    దినపత్రికల్లో పడాల్సిన వార్త గంట ఆలస్యం అయితే చచ్చిపోతుంది. మరుసటిరోజుకి ఏ విధంగానూ పనికిరాదు.
   
    ఇండియన్ టైమ్స్ సబెడిటర్ శైలజ తనకు దొరికిన సమాచారాన్ని తన పత్రికకి పంపుతున్న సమయంలోనే నౌఖరు రూపంలో అదే గెస్ట్ హౌస్ లో వున్న ఇన్ ఫార్మర్ ద్వారా ఏ సమాచారం మిగతా పత్రికలకి తెలిసిపోయింది. ప్రపంచంలో అన్ని అబ్జర్వేటరీలూ మూయబడి వుండటం, ఆస్ట్రానమిస్ట్ లతో ఇంటర్వ్యూలు దొరక్కపోవటంతో సమాచారం నిజం అన్న నిర్ధారణకి వచ్చేయి పత్రికలు.
   
    పత్రికల వాళ్ళకి మోరల్స్ వున్నమాట నిజమే కానీ, మిగతా వాళ్ళందరూ ప్రచురించి తాము ప్రచురించకపోతే ఎలా- అన్న ఉద్దేశ్యంతో అందరూ ఆ వార్తని ప్రకటించేరు!
   
    కొన్ని పత్రికలు తాటికాయంత హెడ్ లైన్సుతో "చంద్రుడు శాశ్వతంగా అస్తమించ బోతున్నాడా?" "చంద్రుడు లేడా?" అని వేస్తే మరికొన్ని పత్రికలు - మరొక పదిరోజుల్లో భూమికి రాబోతున్న విపత్తు గురించి వర్ణించేయి. పగులుతున్న అగ్నిపర్వతాల ఫోటోలూ, హృదయ విదారకంగా ఏడుస్తూన్న పిల్లల ఫోటోలూ వేసేయి.
   
    నిజంగా పదిరోజుల్లో యిదంతా జరగబోతుందని అందరికీ పరిపూర్ణంగా నమ్మకం కలగటంలేదు. ఆ ఆత్మవంచన ఆనందాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని ఎవరూ వదులుకోవటానికి ఇష్టపడటం లేదు.
   
    ఎక్కడ చూసినా ఆ కబుర్లే. దాని గురించి ప్రసక్తే. అవుతుందని కొందరు, కాదని కొందరు వాదనలు. పైకి మాత్రం నవ్వు. నవ్వు వెనుక ఆందోళన. 'అలా కాదులే' అన్న ధైర్యం మళ్ళీ ఏమవుతుందో అన్న దిగులు.
   
    సమయం గడుస్తూనే వుంది.
   
    సాయంత్రం అయింది.
   
    చంద్రుడు ఈ రాత్రి మాయమైపోతాడా?
   
    రాత్రయింది.
   
    ఆఫీసుల్లో ఎవరూ ఆ రోజు పనిచెయ్యలేదు.
   
    అందులో ప్రధాని స్వయంగా చూసిన వింత ముఖ్యాంశం- దానికితోడు కొన్ని కల్పనలు, భూమి బీటవారింది వగైరా.
   
    పదకొండయింది.
   
    ఈ విషయాన్ని నమ్మనివారు హాయిగా నిద్రపోతున్నారు.
   
    లోపల నమ్మి, పైకి నమ్మనట్టు నటించేవారు ఏదో పనున్నట్టు బయటకొచ్చి చంద్రుడికోసం ఆకాశంవైపు చూసి వెళుతున్నారు.

 Previous Page Next Page