Previous Page Next Page 
యుగాంతం పేజి 19

   

    దాని మాటలకి నవ్వొచ్చింది జానకికి. "ఇదిగో యిది చూసేరా" అంటూ లోపలి వెళ్ళింది ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి.
   
    అది అంత నవ్వుకోవలసిన విషయం కాదనీ......
   
    పనిచేయడానికి పనిమనిషి తిరస్కరించటం మనిషి తన చుట్టూవున్న వ్యవస్థ కట్టుబాట్లని చేదించే మొదటి ప్రయత్నం అని జానకీకి ఆ క్షణం తెలీదు.
   
    పల్లె :
   
    స్వామి ఋద్భుదానంద బాబా నవ్వేరు.
   
    "ఈ ప్రపంచాన్ని నేను రక్షిస్తాను" అన్నారు. ".....మొన్న భగవాన్ నా కలలో కనబడి, ప్రపంచం అంతం అవటం గురించి చెప్పేరు. 'అప్పుడే ఎందుకు స్వామీ' అన్నాను. 'పాపాలు ఎక్కువైపోయాయి. కల్కిపుట్టే సమయం ఆసన్నమయింది' అన్నారు. ఆ కల్కి ఆకాశంలోంచి దిగుతాడట. నీళ్ళని శంఖంగా- చంద్రుడిని చక్రంగా ధరిస్తాడట. అందుకే ఆ రోజు సముద్రం పేలిపోయింది. స్వామివారి చక్రంగా మారడానికి చంద్రుడు వెళ్ళిపోయేడు. ఇక కల్కి రావడమే ఆలస్యం....."
   
    భక్తులు భయంతో వణికిపోయేరు.
   
    "ఎలా స్వామీ?" అన్నది హైమావతి.
   
    "నాకీ సంగతి అంతా సంవత్సరం క్రితమే తెల్సు అయినా భయపడతారని చెప్పలేదు" స్వామివారు నవ్వేరు. "నేను మిమ్మల్ని రక్షిస్తాను."
   
    "శ్రీ ఋద్బుదానందస్వామి బాబాకి....." అరిచింది హైమావతి భక్తి పారవశ్యంతో.
   
    "జై....." అన్నారు భక్తులు ముక్తకంఠంతో.
   
    పల్లె పల్లె అంతా అక్కడుంది. కారణం, మున్సబు, రాజయ్య రంగారావు, కరణంగారి కోడలు హైమావతి, తల్లి భాగీరథి - అందరూ.
   
    బాబాగారు బూడిదని అందరికీ పంచుతూ అన్నారు. "నేనే భగవంతుడ్ని భగవత్ స్వరూపాన్ని నేను మిమ్మల్ని రక్షించటానికే పుట్టేను. నిజంగా నన్ను నమ్మిన వాళ్ళని నేను రక్షిస్తాను. మీ చేతులకి తాయెత్తు కడతాను. ఇంకొ నాలుగురోజుల్లో నా నిజమైన భక్తుల చేతులకి తాయెత్తు కట్టబడుతుంది."
   
    "ఇదంతా మోసం" అని బిగ్గరగా అరవాలన్న కోర్కె బలవంతంమీద ఆపుకున్నాడు డాక్టర్, ఆ వూరికి కొత్తగా వచ్చినవాదు. అరిస్తే పల్లె మొత్తం ఏకమై తనని హాస్పిటల్ కి పంపిస్తుంది. అజ్ఞానం రాజ్యమేలుతున్న దేశంలో జ్ఞానం గురించి మాట్లాడటం కన్నా మౌనంగా వుండటమే మంచిది.
   
    లేచి బయటికి వచ్చేడు.
   
    ".....స్వామి అయ్యప్ప సన్నిధి.....అదే మాకు పెన్నిధి....." అని సినిమా స్టయిల్లో పాడుతున్నారు భక్తులు.
   
    డాక్టర్ మౌనంగా సాగిపోతున్నాడు.
   
    "ఎల్లిపోతున్నారే స్వామీ?" వెనుకనుంచి రాజయ్య అరిచేడు.
   
    "ఉండి చేసేది ఏముంది?" కోనేటి ప్రక్క చీకట్లో కలిసి పోయేడు. వర్షం పడి పదిరోజులైనట్టుంది.
   
    నాలుగు నీటిచుక్కలు పడగానే లేచిన కుక్క గొడుగులు.
   
    దేశం :
   
    ఆగష్టు ఆరవ తారీఖు రాత్రి హాయిగా నిద్రపోయింది అవినాష్ ఒక్కడే హాయిగా నిశ్చింతగా నిద్రపోయేడు.
   
    చాలు.....
   
    ఈ చంద్రుడి గొడవతో ప్రజలదృష్టి అటు మళ్ళుతుంది. ప్రళయం పేరిట భయంతో...... రాజకీయాలపట్ల ఆసక్తి తగ్గుతుంది. ప్రళయం వస్తుందా రాధా అన్నది వేరే సంగతి. వచ్చినా రాకపోయినా అంత పెద్ద ప్రమాదమేమీ లేదు. రాజకీయాల్లో ప్రతిక్షణమూ ప్రళయమే. ఎవడు ఏ క్షణం పార్టీ మార్చేస్తాడో తెలియదు. దక్షిణాదివాడు ప్రధాని కావాలని ఒకవైపు గొడవ. పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం మరోవైపు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం.....
   
    తమ పార్టీ పదవిలోకి వచ్చేక దేశపు కరెన్సీ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రోజు రోజుకి పడిపోతోంది. ఏదో అద్బుతం జరిగితేనే తప్ప దేశాన్ని ఎవరూ రక్షించలేరు. ఇప్పటివరకూ దేశం నాశనమైపోతుందని బాధ-ఇప్పుడు మనతోపాటూ అందరూ పోతున్నారన్న తృప్తి.
   
    ఇంతలో ఫోను.
   
    సెక్రటరీ, ప్రధాని వస్తున్నారని వార్త.
   
    మరుసటి నిముషంలో జగదీష్ హడావుడిగా ప్రవేశించాడు. "రండి! మనం అర్జంటుగా ప్రెసిడెంటు దగ్గరికి వెళ్ళాలి"
   
    "ఎందుకు?"
   
    "దారిలో మాట్లాడుకుందాం"
   
    అతడి మొహం చూసి ఏదో ఉపద్రవం జరిగి వుంటుందనుకున్నాడు అవినాష్.
   
    ఇద్దరూ కారులో కూర్చున్నాక కారు కదిలింది. లోపల ట్రాన్సిష్టర్ వినిపిస్తూంది.
   
    -ఒక ముఖ్య ప్రకటన. ఆగష్టు పదిహేడున జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకొని ఇప్పటినుంచి భీతి చెందవద్దని ప్రజల్ని ప్రధానమంత్రి కోరేరు. తమ తమ పన్లని విడిచిపెట్టి, ఈ ఆలోచనలతో మరింత కల్లోలాన్ని సృస్టించవద్దని హెచ్చరిస్తున్నారు. బి.బి.సి. రేడియో కేంద్రం- ఇప్పట్నుంచీ ప్రతి మూడు గంటల కొకసారి-
   
    టప్ మన్న చప్పుడుతో ఆగిపోయింది రేడియో.
   
    ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
   
    "ఏమైంది?"
   
    "ఏమవుతుంది?"
   
    చాలా చిన్న విషయం.
   
    రేడియో స్టేషన్ లో డ్యూటీ ఆఫీసర్ కి ఆరుగురు పిల్లలు. అతడు గోవాకి చెందినవాడు. రేడియోలో ఈ వార్త వస్తుండగా అతడికి ఆకస్మాత్తుగా తన పిల్లల్ని చూడాలని బుద్ది పుట్టింది. క్షణాల్లో ఆ కోర్కె బలీయమైంది. దేనికోసం విధి నిర్వహణని నమ్ముకొని వుండాలి? వెళ్ళిపోతే.....!
   
    .....ఉద్యోగం పోతుంది. అంతేగా?
   
    ప్రాణమే పోయేటప్పుడు ఈ ఉద్యోగం పోతే మాత్రమేం? అతడి కళ్ళముందు ఆరేళ్ళ చిన్నకూతురు జాలిగా మొహం పెట్టి 'రావా నాన్నా' అంటున్నట్టు అనిపించింది.
   
    వెంటనే అతడో నిర్ణయానికి వచ్చినట్టు రిసీవర్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బయటికొచ్చేశాడు.
   
    ఆ క్షణం నుంచీ రేడియో ప్రసారాలు ఆగిపోయాయి.
   
    జగదీష్ ఆందోళనగా అవినాష్ వైపు చూసేడు. అతడు తల పంకించాడు. ఇద్దరిమధ్యా మౌనం రాజ్యమేలింది.
   
    జరుగుతున్నది చూస్తూ, జరగబోయేది ఊహించుకోగలరు వాళ్ళు నిజానికి జగదీష్ భార్యకూడా ఈ చివరిరోజుల్లో తమ వాళ్ళతో పల్లెల్లో గడపాలని కోరింది. కానీ 'ఏమీ జరక్కపోతే' ఆ తర్వాత ప్రతిపక్షాల హేళనకు గురికావాల్సి వస్తుందని భయపడ్డాడు.
   
    "ప్రాణమే పోతున్నప్పుడు ఎందుకీ పదవి?" అని అడిగిందామె. నిజమే పేరుకి ప్రధానమంత్రి కానీ బ్యాంకులో ఐదువేలకన్నా ఎక్కువలేదు. నెలరోజుల క్రితం తన భార్య దక్షిణ భారత దేశపు కంచిపట్టు చీర అడిగితే, తను పొదుపు గురించి ఉపన్యాసం ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది. ప్రధానమంత్రిగా రిటైరియ్యాక వచ్చే నెలసరి ఆదాయం కూడా పెద్ద ఎక్కువేమీ కాదు.
   
    ఏ బ్యాంక్ అయినా ప్రధానమంత్రికి పెర్సనల్ లోన్ యివ్వటానికి వెనుదీయదు. ఉవ్విళ్ళూరుతుంది కూడా. కానీ తీర్చటం? (కావాలనుకుంటే తీర్చనక్కరలేదు కూడా. అది వేరే సంగతి). చచ్చినా తను అలా చేయలేడు.
   
    ఆలోచన మళ్ళీ చావు దగ్గిరకు వచ్చేసరికి అతడు కొద్దిగా కదిలేడు.
   
    చేతికి ప్రక్కనే వున్న పేపర్లు తగిలినయ్.
   
    కారు వెళ్తూనే వుంది.
   
    అతను చదవసాగేడు.
   
    పేపర్లు రకరకాలుగా వార్తల్ని ప్రచురించినయ్. రేపటి నుంచి ఆ పేపర్లు కూడా రావేమో. ప్రపంచం స్థంభించిపోవటం అంటే అదే.
   
    "ఆయుర్దాయం ఇక ఐదురోజులే" అన్న హెడ్డింగ్ తో వార్త పెద్ద పెద్ద అక్షరాల్లో పడింది. దానిక్రింద "ఢిల్లీ అధికారుల సమావేశం" అని వుంది.
   
    అతడికి నవ్వొచ్చింది.
   
    ప్రపంచ ప్రళయాన్ని ఆపటానికి ఢిల్లీ అధికారులు ఏం చెయ్యగలరు?

 Previous Page Next Page