Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 17

    ఎక్కువగా పరికిణి అమ్మాయిలిద్దరేమాట్లాడుకుంటున్నారు. వీల్లిద్దారి జోకుల్నీ ఎంజాయిచేస్తూ సంభాషణలో సపోర్టింగ్ రోల్ నడుపుతున్నారు మిగతా ఇద్దరూ. వీళ్ళు నలుగురికీ కూడా విండో సీటు దొరకలేదు. ఒకపక్క ఆడమనిషి కూర్చుని వుంది. ఆవిడసీరియస్ గా ఏదో పత్రిక చదువుకుంటోంది. ఆవిడ కెదురు కిటికీచోటులో ఓ పదహారేళ్ళకుర్రవాడు కూర్చున్నాడు. అతన్ని వేరే ఎక్కడైనా సీటు చూసుకోవలసిందిగా ఆడపిల్లలు రిక్వెస్టు చేశారుకానీ అతను పట్టించుకోకుండా అక్కడేకూర్చున్నాడు.   
    చురుకైన ఆడపిల్లలు అకారణంగా ఆకుర్రవాడిమీద చాలా జోకులువేసి గట్టిగా నవ్వేసి అతను తమవైపు చూసేసరికి ఎటో చూస్తూండేవారు. రాజారావు ఆ కుర్రవాడి ముఖం పరిశీలించి అతను వుడుకున్నప్పటికీ అసహాయదశను ఫీలవుతున్నట్లు గమనించాడు. ఆ కుర్రవాడి ముఖంలో భావాలు చాలా తమాషాగా వున్నాయి.   
    పిల్లలు ఆగకుండా అదేపనిగా ఏదో మాట్లాడుతూనే వున్నారు. ఇందిరాగాంధీని పొగుడుతూ రాజకీయాలు మాట్లాదారు. రామారావు, నాగేశ్వర్రావులను రిఫర్ చేస్తూ సినిమాల గురించి మాట్లాడేరు. గవాస్కర్, విశ్వనాథ్ ల ప్రసక్తి కూడా వచ్చింది కాబట్టి క్రికెట్ గురించికూడా మాట్లాడేరను కోవాలి.   
    వాళ్ళు కబుర్లలో వుండగా కండక్టరు వచ్చాడు. అతనికి ముప్పై ఏళ్లుంటాయేమో యూనిఫాంలోవున్నా అది బెల్ బాటమ్. అతనికి లాంగ్ హెయిరుంది. నల్లగావున్నా చూడ్డానికి స్మార్టుగా వున్నాడు. అతనురాగానే ఆడపిల్లలు అతని మీదకూడా ఏవోజోకులువేసి నవ్వుకున్నారు. అవి అతను గమనించినా పట్టించుకోలేదు. అతని రియాక్షన్ ను బట్టి చూసూంటే మనిషి చాలా స్పోర్టివ్ అనిపించింది. అతను రాజారావువంక పలకరింపుగా నవ్వాడు. ఆ నవ్వుచాలా ఈజీగా నవ్వేవాళ్ళంటే రాజారావు చాలా ఇష్టం అతనూ నవ్వాడు.   
    ఆడపిల్లల్లో నల్ల (వంటిరంగు) పరికిణి అమ్మాయి రెండు రూపాయలనోటు కండక్టరు కందించింది- "వద్దు?" అన్నాడు కండక్టరు.   
    "స్టూడెంటు కన్సెక్షన్ అయినా ఎంతో కొంత పుచ్చుకుంటారు. ఇలా వద్దనడం ఎక్కడా చూడలేదే-" అంది నల్లపరికిణి. ఆ పిల్లమాటలు పూర్తికాకుండానే నలుగురాడపిల్లలూ ఒక్కసారిగా నవ్వేశారు. అయినదానికీ కానిదానికి వాళ్ళనవ్వు వచ్చేస్తోంది.   
    "ఏదో చిన్నపిల్లలు, ఆడపిల్లలు కదా అని బోగీలో ఎక్కనిచ్చాను. ఇంకామీకు రసీదుకోయలేదు. వచ్చేస్టేషన్లో దిగిపోండి, నామీద జోకు వేసేవాళ్ళకు నేను సాయంచేయను. అతను చాలా ఈజీగా నవ్వుతూ అన్నాడు.   
    ఆడపిల్లలు నవ్వలేదు- "అలాగంటే ఎలాగండీ-" అంది నల్ల పరికిణి.   
    "అదంతే-" అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడుకండక్టరు. కండక్టరు వెళ్ళిపోయాక స్కర్టుపిల్లలు పరికిణిణి దెబ్బలాడారు. నిజంగా అతను దింపేస్తే ప్రయాణానికి చాలా ఇబ్బంది పడాలన్నారు.   
    ఈశ్వరరావు ఖాజీపేట వస్తూండగాలేచాడు. నిద్రఇంకావస్తోందిట కానీ కాఫీకోసం లేచిపోయాడట." ఖాజీపేటలో మిరపకాయబజ్జీలు దొరుకుతాయి. కాఫీకివెళ్ళినపుడు నాకు తెచ్చిపెట్టండి-" అన్నాడు రాజారావు.   
    ట్రయిన్ ఖాజీపేట చేరింది. ఈశ్వర్రావుముందు బజ్జీలు తెచ్చిఇచ్చి అప్పుడు కాఫీ తాగాడు. రాజారావు శరవేగంతో ఆ బజ్జీలు తినడం గమనించి ఈశ్వరరావు పరుగునవెళ్ళి మరి కొన్ని బజ్జీలు తెచ్చాడు. కాస్త కడుపులో చుర్రుమనడం మొదలుకాగానే రాజారావు బజ్జీలుతినేవేగంతగ్గింది. ట్రయిన్ కదిలి త్వరగా వేగం పుంజుకుంది. ఈశ్వరరావు బెర్తుఎక్కేశాడు.  
    ఆడపిల్లల పక్కన కూర్చున్నావిడ ఇంకా చాలామంది బంధుజనంతో ప్రయాణం చేస్తోంది. కంపార్టుమెంటులో అందరూ తలోచోట వున్నారు. తెల్లగా లావుగా పొట్టిగా తమాషాగా ఉన్న ఓ ముప్పై ఏళ్ళావిడ ఆవిడ దగ్గరకువచ్చి తలడువ్వుకుంది. అక్కడే పౌడరురాసుకుంది అద్దంలో చూసుకుంటూ ఆవిడ ఆకారానికీ, పెర్సనాలిటీకి- ఆవిడ చేష్టలు చాలా తమాషాగా ఉన్నాయి. ఒకనటి హాస్యంకోసం తెరమీద నటిస్తున్నవిధంగా ఉన్నదావిడ భంగిమ. రాజారావుకే నవ్వువచ్చినప్పుడు ఆడపిల్లలసంగతి చెప్పాలా? వాళ్ళు ఒకరి వంక ఒకరు చూసి ముసి ముసినవ్వులు నవ్వుకుంటున్నారు. ఆవిడ తెలుగావిడే కావడంవల్ల పైకి మాటాడుకోవడానికి వీలులేక పోయింది వాళ్ళకి. వాళ్ళ అవస్థ గమనిస్తూ రాజారావు నవ్వుకున్నాడు. ఆ వయసలాంటిది. ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా చలించిపోయేబుద్ది వుంది. తన చిన్నతనంలో తనూ అంతే! నువ్వు పుట్టించే దృశ్యంచూసినపుడు-అది తను గ్రహించినవ్వుకోవడమేకాక వీలైనంత బిగ్గరగా ఆ నవ్వునుతోటి వారితో పంచుకోవాలనుకునేవాడు. అదృశ్యంలోని హాస్యాన్ని తను గుర్తించినట్లు తెలియడానికీ, అందులోని హాస్యాన్ని ఇతరులకు తెలియబర్చడానికీ అతను ప్రయత్నించకుండా ఉండలేక పోయేవాడు. అలాంటప్పుడు ఒకోసారి పెద్దలచేత తిట్లుతిన్న సందర్భాలుకూడా కొన్ని వున్నాయి.

 Previous Page Next Page