Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 17


    అన్నీ విన్న తరువాత నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే స్వేచ్ఛ నీకుంటుంది. నా అభ్యంతరాలు ఏమీ వుండవు. పిల్లలకి తమ జీవిత కథలని రాసి, బహుమానంగా ఇచ్చే కొత్త సంప్రదాయానికి నేను నాంది పలుకుతాను" ఉద్వేగాన్నంతా మనసులో దాచుకుని ఎంతో నెమ్మదిగా చెప్పింది శతరూప.

    ఇందుమతి ఆలోచనలో పడింది.

    తల్లి గొప్పతనం ఏమిటో తెలిసింది.

    పిల్లల ప్రేమ వ్యవహారం తెలియగానే పెద్దలు అనవసర ఆవేశానికి గురవుతుంటారు. అభ్యంతరాలు చెబుతుంటారు. అలాకాకుండా తన ఇష్టాయిష్టాలను తనకు వదిలేసింది తన తల్లి.

    "పిల్లలకి ఆస్తులను వారసత్వంగా ఇచ్చినట్టు ఆత్మకథని వారసత్వంగా ఇస్తానంటుంది" అమ్మ. అమ్మ గురించి తనకేమీ తెలియదు. తనకు ఊహ తెలిసేనాటికి వున్న ఊరు వదిలేసింది అమ్మ. గోపాలపురానికి వచ్చి మూడేళ్ళో, నాలుగేళ్ళో అయింది. ఊర్లు మారుతుండడంవల్ల అమ్మ జీవితం గురించి చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు. ఇప్పుడు స్వయంగా అమ్మే చెబుతానంటోంది .

    కానీ అమ్మ జీవితకథ వింటూ వుంటే తను ఎలా వెళ్ళటం? అవతల భరణి తనకోసం అంకాళమ్మ గుడిదగ్గర వెయిట్ చేస్తూ వుంటాడు.

    తను తెల్లవారుజాము మూడులోపల వెళ్ళాలి. ఏకబిగిన అన్ని గంటలు అమ్మ మాత్రం ఎలా చెప్పగలదు? ఏ పన్నెండుకో ముగుస్తుంది. అప్పుడు వెళ్ళినా తను భరణిని కలుసుకోగలదు. సో....కంగారు పడవలసింది ఏమీలేదు. నిదానంగా వినవచ్చు.

    కూతురికి తల్లి తన జీవితకథను చెప్పే సాంప్రదాయం తనతోనే మొదలవుతుంది. అమ్మ అమ్మలాగా కథ చెప్పనంటోంది.

    ఓ స్నేహితురాలిగా చెబుతానంటోంది. తను పుట్టింటినుంచి అత్తారింటికి తీసుకెళుతున్నది సారెకాదు. వెండిపాత్రలు అంతకన్నా కావు. పడకటింటి సామాన్లు కావు. కట్నకానుకలు అసలే కావు. అమ్మ జీవిత కథను తను తీసుకెళుతుంది.

    "చెప్పమ్మా"

    శతరూప ఇసుకమీద నడుంవాల్చింది.

    "నీ మంచికోసం చెబుతున్నాను కనుక అబద్ధాలు కానీ అతిశయోక్తులుగానీ చెప్పను.

    ఉన్నది ఉన్నట్లుగా, ఆ సమయంలో నేనెలా ఫీలయ్యానో చెబుతాను. నా జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరిగిందో వివరిస్తాను."

    "అలానే చెప్పమ్మా నీ జీవితకథంతా ఓ ప్రియ సఖిలాగా చెప్పమ్మా"

    కూతురి తలను ఓసారి నిమిరి శతరూప చెప్పడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయానికి అంకాళమ్మ గుడికి చేరుకున్న భరణి ఇందుమతి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.



                      *        *        *

       
    చందమామ దీపంకింగ తన జీవితకథ పుస్తకాన్ని చదువుతున్నట్టు చెప్పుకుపోతోంది శతరూప.

    "నేను పుట్టిందీ పెరిగిందీ దుగ్గిపేరి అనే పల్లెటూర్లో. ఆ ఊరు నుంచి వెంకటగిరి రెండు కిలోమీటర్లు సిగరెట్టు కావాలన్నా ఊర్లో జనం అలా సరదాగా వెంకటగిరికి నడిచివెళ్ళి తెచ్చుకునేవాళ్ళు.

    నాకు కాస్తంత వయసొచ్చి ఏది ఏమిటో తెలిసేటప్పటికి మనూరు చాలా మారిపోయింది. టౌన్ దగ్గరుండడంవల్ల కాబోలు మనూరిని నాగరికత తన చేతుల్లోకి తీసేసుకుంది.

    సాయంకాలమైతే టీ చుక్కకోసం తపించిపోయే వాళ్ళు చాలామందే తయారయ్యారు.

    అది గమనించి వెంకటస్వామి స్వతహాగా మాటకారి. గతంలో నాటకాలు వేయించేవాడు. నాటకాలకు డిమాండ్ తగ్గడంతో ఇలా టీ కొట్టు పెట్టుకున్నాడు.

    స్వతహాగా యాక్టర్ కావడంవల్ల దేన్నైనా సరే అభినయించి చెప్పి చుట్టూ చేరిన జనాన్ని విపరీతంగా నవ్వించేవాడతను.

    వీధి మొగదాలలో టీకొట్టు వుండడంవల్ల ఇటు ఊర్లోవాళ్ళకు, అటు కూలీలపేటకు అనుకూలంగా వుండేది. పనులకు పోతూ వస్తూ కూలీలపేట ఆడవాళ్ళంతా టీ కొట్టుకెళ్ళేవాళ్ళు. ఆకూ వక్కా కొనుక్కునేవాళ్ళు. సాయంకాలమైతే టీ తాగేవాళ్ళు.

 Previous Page Next Page