"నాకు చేతులు రావడంలేదు! భయం! కాని, ఇంత జరిగాక భయమంటే బాగుండదు! కిరోసిన్ నేనే పోసుకుని అంటించుకుంటాను. కాని, నా చావుకు కారణం మీరని చీటీ వ్రాసి పెట్టి అంటించుకొంటాను! ఇంటి ముందు వచ్చి నువ్వు చేస్తున్న ఆగడం ఈ విధివీధంతా చూస్తున్నారు! వీళ్ళంతా నా చావుకు సాక్ష్యముంటారు"
ఆవిడకి తల తిరిగిపోయింది. "బాగుంది! నిన్ను నేను చావమన్నానా?" అంటూ నెమ్మదిగా జారుకొంది.
ఈ సంఘటన ఆచారిని చాలా గాయపర్చింది!
వయసొచ్చిన ఆడపిల్లలకి పెళ్ళి చేయలేని కుంటి తండ్రి తను! కుంటి సన్యాసి!
* * *
అపురూప బి.ఎ. ఉదయభాను బికాం. ఒకేసారి పాసయ్యారు.
ఇద్దరిలో ఎవరికి మంచి ఉద్యోగం దొరికినా ఈ చిల్లర పనుల నుండి విముక్తి కలిగి ఈ సంసార నావ ఒక ఒడ్డున పడుతుందనుకొంటుండగానే ఒక సంఘటన జరిగింది. అది ఉదయభాను పెళ్ళి.
ఒకరోజు సాయంత్రం.
"ఎవరున్నారమ్మా ఇంట్లో?" అంటూ మర్యాదస్తుడిలా కనిపిస్తున్న ఒక నడివయసు ఆయన గుమ్మంలోకివచ్చి అడిగాడు.
అపురూప తనపని చేస్తున్న కాన్వెంటు పిల్లలవి పేపర్లు కరెక్షన్ చేస్తోంది. తలెత్తి చూసి "ఎవరు కావాలండీ?" అనడిగింది.
"మీ నాన్నగారున్నారా అమ్మా?"
ముక్కు మొహం తెలియని ఈయనకు నాన్నగారు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతూ, "ఉన్నారు! ఆనయ ఆరోగ్యం అంత బాగుండలేదు! చాలా రోజులుగా ఆయనకు జ్వరం వస్తూంది. లేవలేకుండా వున్నారు. మీరెవరు?" అనడిగింది.
"లోపలికి పిలిస్తే నా పరిచయం చేసుకొంటానమ్మా!" ఆయన మందహాసంతో అన్నాడు.
నాన్నగారు బాగున్న రోజుల్లో తెలిసినవాడేమో అనుకొంటూ, "లోపలికి రండి!" అని ఆహ్వానించింది. అక్కడున్న చెక్క పెట్టెమీద ఆయన్ని ఆశీనుణ్ని చేసి. "నాన్నగారూ! మీ కోసం ఎవరో వచ్చారు!" అంది. అంటూనే ఆయన్ని లేపి కూర్చోబెట్టింది.
"నమస్కారమండీ! నా పేరు అయ్యప్పశాస్త్రి అంటారండీ! మీతో ఒక విషయం మాట్లాడిపోదామని వచ్చాను"
"పూర్వాశ్రమంలో మీరు నాకు పరిచయమా? నాకు గుర్తురావడం లేదు!" నొచ్చుకుంటూ అన్నాడు ఆచారి.
"పరిచయం ఏం లేదు! ఇప్పుడు మాత్రం మీతో బంధుత్వం కలుపుకొందామని వచ్చినవాడిని!" గొప్ప సస్పెన్స్ ని అందరి ముఖాల్లో క్రియేట్ చేస్తూ అడిగాడు.
అందరూ ఆయన ముఖంలోకి ఆశ్చర్యంగా చూడసాగారు.
"మీ అబ్బాయి ఉదయభానుకు మా అమ్మాయి జ్యోతినిద్దామని వచ్చాను!"
"మీ అబ్బాయి నా దగ్గరే పనిచేస్తాడు. జ్యోతి రెంటెడ్ బుక్ షాప్ ప్రొప్రయిటర్ని."
"అలాగా? సంతోషం! కాని, అబ్బాయికి ఇప్పుడే పెళ్ళిచేసే ఆలోచన లేదే! వాడికంటే పెద్దది ఆడపిల్ల వుంది. మా పరిస్థితి ఏమిటో మీకు తెలియకుండా వుండదు. అక్కా తమ్ముడు చెరో తెడ్డు వేస్తుంటేనే ఈ సంసార నావ ముందుకు జరగడం కష్టంగా ఉండేది. ఇప్పుడు వాడికి పెళ్ళయితే వాడిది వాడికవుతుంది! అందుకని, ఇప్పట్లో వాడికి పెళ్ళి చేసే ఆలోచన నాకు లేదండి. అక్క పెళ్ళి చేయాల్సిన బాధ్యత వాడికుండగా దాన్నలా ఉంచి తను పెళ్ళి చేసుకోవడం లోకం ఒప్పని సంగతండీ!"
"పెళ్ళి చేసినంత మాత్రాన మీకు అబ్బాయి పరాయివాడు కాదు. మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. మా అమ్మాయి కూడా చదువుకొన్నదే! తనూ వేన్నీళ్ళకి చన్నీళ్ళన్నట్టుగా ఏదో ఒక పనిచేస్తుందే గాని ఇంటిలో ఊరికే ఏం కూర్చోదు. నేనూ మీలాగా ఒకనాడు కష్టాలు పడ్డవాణ్నే. ఇప్పటికి మాది మదయ్తరగతి కుటుంబమే! అందుకే మీ కుటుంబ పరిస్థితి తెలిసే పిల్లనివ్వడానికి సిద్దపడివచ్చాను. ముఖ్యంగా మా జ్యోతి మీ అబ్బాయిని ఇష్టపడింది."
"మీరెన్నయినా చెప్పండి! పెద్దది పెళ్ళి కావలసిన పిల్ల ఉండగా వాడికిప్పుడు పెళ్ళి చేయలేనండీ!" ఖచ్చితంగా చెప్పాడు ఆచారి.