"మీ అబ్బాయి పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోతే తప్ప అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు పట్టించుకోడని మీరనుకోవడం పొరపాటండి. అతన ఇంటివాడై జీవితంలో స్థిరపడితేనే కదా, తనవాళ్ళకి ఏదైనా చేయగలిగేది? భాను నా అల్లుడైతే అతడి కుటుంబం నాది కాదా? అతడి కష్టాలు నావికావా? ఈ పరిస్థితిలో మీకు మరో కుటుంబం ఆసరా ఎంతో అవసరం. మీ అబ్బాయి ఎందుకునాకు నచ్చాడంటే అతడు జీవితంలో స్ట్రగుల్ పడ్డాడు! కొంచెం చెయ్యి ఆసరా దొరికితే పైకివెళ్ళే సమర్ధుడయ్యాడు. ముఖ్యంగా అతడి సిన్సియారిటీ నాకెంతో నచ్చింది. తొందరేం లేదు. ఆలోచించుకొనే ఒక నిర్ణయానికి రండి!" అని సెలవు తీసుకొన్నాడాయన.
ఆ రాత్రి రోజూకంటే ఓ గంట లేటుగా వచ్చాడు భాను. అతడి ముఖంలో స్పష్టంగా చిరాకు, అశాంతి కనిపిస్తున్నాయి.
"మీ బుక్ షాపు ప్రొప్రైటరు శాస్త్రి వచ్చాడురా!" అతడికి అన్నం వడ్డిస్తూ వెళ్ళదీసింది అపురూప.
తెలుసునన్నట్టుగా అతడు మౌనం వహించాడు.
"నీకంతా తెలిసే జరుగుతోందన్నమాట!" తండ్రి రుసరుస లాడుతూ అడిగాడు.
భాను ముఖంలో అణుచుకొంటున్న అసహనం!
"నీకిప్పుడు పెళ్ళి కావలసివచ్చిందిరా? ఉద్యోగం లేదు. సద్యోగంలేదు. ఇంటిలో కానీ టికాణా లేదు. నీకు పెళ్ళాం ఒకటి తక్కువయిందా?"
"బాగుంది నాన్నగారూ! నేనడిగానా పెళ్ళిచెయ్యమని?"
"మరి ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను అడగకుండానే వచ్చాడా?"
"అడిగాడు! నాకు తెలీదు. మా నాన్నగారినీ, అక్కనీ అడగమని చెప్పాను"
"ఇంట్లో అడగమంటే నీ మటుకు నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేకదా? ఇంట్లో పెళ్ళి కావలసిన అక్కయ్యుంది. ఇహ బజారు భత్యం బావిలో నీళ్ళు అన్న చందంగా రోజు గడుస్తూంది! ఇప్పుడు పెళ్ళి చేసుకొనే పరిస్థితిలేదు అని నువ్వు చెబితే ఆయన ఎందుకు వస్తాడు?"
"ఏంటక్కా? నాన్న మరీను! నేనేం అంతకాని పనిచేశాను? మీకు తెలీకుండా ఆయనకి నేనేం మాటివ్వలేదు కదా?" అక్కతో ఫిర్యాదుగా అన్నాడు.
"నాక్కూడా ఇష్టంలేదురా, ఇప్పుడే నీకు పెళ్ళంటే! మనమే ఎన్నో కష్టాల్లోఉన్నాం. కోటి కోరికలతో అత్తారింటిలో అడుగుపెట్టే పిల్లకు మనం పంచాల్సింది ఈ కష్టాలేకదా? నీకంటే పెద్దదాన్ని ఉన్నానని కాదు! నా పెళ్ళి నువ్వు బ్రహ్మచారిగా మిగిలిపోయి చేయాలనీ కాదు! నీకు ఉద్యోగం రానీ! అప్పుడు నీ పెళ్ళికి నేను అభ్యంతరం చెప్పను! నాన్ననీ చెప్పనివ్వను!"
భానుది ఎదురు తిరిగే మనస్తత్వం కాకపోయినా అక్కమాట రుచించనట్టుగా అప్రసన్నంగా ఉన్న అతడి ముఖమే చెబుతూంది.
మరునాడు -
కాన్వెంటు నుండి వస్తున్న అపురూపను బస్సు దిగగానే కలుసుకొని దగ్గరలోనేవున్న పార్క్ కి తీసుకెళ్ళాడు భాను. "నీతో మాట్లాడాలక్కా! ఇంట్లో అయితే నాన్న గారు అరుస్తారు. ఈ వయసులో ఆయన్ని నేనుబాధపెట్టలేను కూడా" అంటూ.
"పెళ్ళి సంగతేనా? నిన్నే చెప్పాను కదా నా అభిప్రాయం"
"నువ్వు నీ అభిప్రాయం చెప్పావు! నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా?"
"చెప్పు!" అంది ఓ మూలన బెంచీమీద కూర్చొంటూ.
"ఉద్యోగం వచ్చాక పెళ్ళి చేసుకొమ్మని నువ్వు చెప్పడం సబబే! కాని, ఉద్యోగం వస్తుందన్న ఆశ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడంలేదు. ఉత్తర దక్షిణాలు రెండూ లేనివాళ్ళం. సామర్ధ్యంతో తెచ్చుకొనే ఉద్యోగాలు కూడా ఉన్నాయనుకో, కాని, సామర్ధ్యం చూపుకొనే అవకాశం మనకెవరైనా ఇస్తేకదా?"
"............"
"జ్యోతిని నాకిస్తే కట్నం కింద నా చేత బుక్ స్టాల్ పెట్టిస్తానన్నాడు శాస్త్రిగారు. ఈ చిల్లర మల్లర పనులు మానేసి ఇండిపెండెంటుగా బ్రతికే అవకాశం దానివల్ల నాకేర్పడుతుంది. చేతిలో ఒకపని వుంటే సైడ్ బిజినెస్ గా ఎన్నో చెయ్యొచ్చు! ఉద్యోగంలో ఏముందక్కా? జానెడు బెత్తెడు జీతం! కలిసి రావాలిగాని బిజినెస్ లో ఎంతయినా ఎదిగే అవకాశముంది! ఏమంటావక్కా?"
వ్యాపారమన్నది ఓ అద్భుత ప్రపంచం! అందులో అడుగుపెడితే లక్షాధికారి బిక్షాధికారి కావచ్చు! బిక్షాధికారి లక్షాధికారి కావచ్చు! పది పైసల పెట్టుబడితో పది లక్షలు సంపాదించిన వాళ్ళున్నారు. కాదని ఎలా చెప్పగలదు?
బాగుపడే అవకాశం ఒకటి తనకు వచ్చిందనీ, ఆ అవకాశాన్ని అందుకొనేందుకు పర్మిషను ఇమ్మని అడుగుతున్నాడు.