Previous Page Next Page 
హృదయాంజలి పేజి 15

    ఈ ప్రపంచంలో లేమి అంటే అందరికీ చులకన. లేమిని అసహ్యించుకొన్నట్టే లేమిని అనుభవించే వారినీ అసహ్యించుకొంటారు.

    కలవారి పిల్లతో స్నేహం చేసి ఎంత పొరపాటుచేసిందో గ్రిహంచే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది దిద్దుకోలేని నష్టం!

    నిజం చెప్పినా నమ్మని వాతావరణం కల్పించింది శ్వేత.

    ఎవరితోటీ స్నేహం పెంచుకోకుండా అందరికీ దూరంగా ఉండే అపురూపతో శ్వేత కావాలనే స్నేహం పెంచుకొంది. అపురూప తన కంటే చదువులో చురుకయింది కాబట్టి! నోట్సులవీ అడిగితే అపురూప ఇచ్చినట్లుగా మిగతా పిల్లలు ఇవ్వరు! ఏదయినా అడిగితే చెప్పడానికి కూడా ఇష్టపడరు. తామొక్కరే క్లాసులో తెలివైన వాళ్ళుగా ఉండాలనే సంకుచిత ధోరణి వాళ్ళది. ఫస్ట్ మార్క్ తమకే ఉండాలన్న స్వార్ధం. అపురూప అలా కాదు. ఏదడిగినా తనకు తెలిసినంత వరకు చక్కగా అర్దమయ్యేలా చెబుతుంది. మార్కులు ఎవరికి ఎన్నొచ్చాయన్న ధ్యాసే వుండదు ఆ పిల్లకు. తను మాత్రం కష్టపడి చదువుతుంది. ఒక్కోసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.

    అవసరం కోసమే అపురూపతో స్నేహం చేసిన శ్వేత తెంచేసుకోడానికి ఏమాత్రం సంకోచించలేదు.

    ఈ కథ ఇంతటితో తెగితే ఆమె బాధపడక పోవునేమో! రోజు రోజుకూ చిలువలు పలువలుగా ప్రచారమైపోతుంది.

    ఆడపిల్లలంతా అదోలా చూడ్డం! తమలో తాము జోక్ వేసుకొని కిసుక్కున నవ్వడం! అది కో- ఎడ్యుకేషన్ కాలేజీ. ఎలా తెలిసిందో మగ పిల్లలకి కూడా ఈ సంగతి తెలిసింది.

    "పాపం! తోడు నీడ కోసం అంత ప్లాన్ వేసి బోర్లాపడ్డావా? అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు బేబీ? ఒకమాట నాకు కనుసైగతో చెప్పినా నీకు తోడు నీడగా నేనుండేవాడిని కదా?"

    "ఏమిటో ఈ ఆడపిల్లలిక పెళ్ళీపిల్లలంటే ఒకటే తొందర! లక్క పిడతలతో సంసారం బాల్యంలోనే మొదలుపెడతారు కదా?"

    అని నోటికి ఏం వస్తే అది విసరడం మొదలుపెట్టారు.

    కాలేజీకి వెళ్లాలంటేనే భయం పట్టుకొంది అపురూపకు. ఎవరేం అవమానం చేస్తారోనని! కాకుల గుంపు మధ్య పిచ్చికపిల్ల చిక్కు పడ్డట్టుగా ఉంది ఆమె పరిస్థితి. అన్నీ ఇనుప ముక్కులతో పొడిచి పొడిచి రాక్షసానందాన్ని పొందేవే!

    ఒకరోజు ఇంట్లోనే ఉండిపోయింది ఏడుస్తూ.

    అది ఎన్నో గదులున్న ఇల్లు కాదు. ఉన్నది ఒకే  ఒక గది. ఆ గదిలోనే ఒక మూలన వంట. మరో మూలన ఆచారి మంచం. ఆ మంచం ప్రక్కనే పిల్లలు ముగ్గురు పడుకొనే ఈతచాప


    అపురూప ఏడుపు తండ్రినుంచి దాగలేదు.


    "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈరోజు కాలేజీకి కూడా వెళ్ళలేదు!" ఆదుర్దాగా అడిగాడు ఆచారి.

    "నాలాంటి దరిద్రులకు కాలేజీలోనే కాదు, ఈ ప్రపంచంలోనే చోటుండదు నాన్నగారూ!" ఏడుపు ఉధృతమైంది.

    ఎన్న కష్టాలొచ్చినా చెక్కు చెదరని పిల్ల!

    ఎన్నోసార్లు ఈ పిల్లది ఉక్కు గుండెమో అనిపింపజేసిన తన పెద్దకూతురు అపురూప తుఫాన్ లో చిగురుటాకులా తల్లడిల్లుతూంది! బేలగా ఏడుస్తూంది ! తనకి కాళ్ళు లేవేమోగాని ఒళ్ళోకి తీసుకొని ఊరడించడానికి చేతులున్నాయి!

    "ఇలారా. తల్లీ! నా దగ్గరికి రా!" ఆర్ద్రంగా దగ్గరికి పిలుచుకొని, ఆ పిల్ల తలను గుండెలమీదకి చేర్చుకున్నాడు ఆచారి.

    "ఏం జరిగిందో ఇప్పుడు చెప్పరా! రెండు మూడు రోజులుగా చూస్తున్నా, నీ ముఖంలో జీవమే లేదసలు!"

    వెక్కి వెక్కి ఏడిచింది అపురూప. కొంచెం హృదయ భారం తీరాక చెప్పింది.

    "ఇదేం ప్రపంచం, నాన్నగారూ? ఇదేం న్యాయం, నాన్నగారూ? అసలు తప్పుచేసింది అతడైతే శిక్ష నాకా?" ఆక్రోశంగా అడిగింది.

    "అసలు శిక్ష విధించే కోర్టు పైనుందమ్మా! అక్కడ న్యాయమూర్తికి పక్షపాతం లేదు! అబద్దాలు చెప్పే సాక్షులుండరు! దోషికి దండన తప్పక విధిస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికయినా ఆ శిక్ష తప్పక అమలు అవుతుంది! నిష్కారణంగా బాధ నువ్వనుభవించావు కాబట్టి నీకు పరిహారం కూడా తప్పక దొరుకుతుంది" ఆ పిల్ల తలను మృదువుగా స్పర్శిస్తూ అన్నాడు ఆచారి.

    "కాలేజీ మానేద్దామనుకొంటున్నాను, నాన్నగారూ!"

    "ఇన్ని కష్టాలుపడింది ఈ చదువుకోసమే కదమ్మా? తప్పుచేయని దానికి నీకెందుకమ్మా భయం సిగ్గు? తలెత్తుకొని మరీ వెళ్ళు కాలేజీకి. చక్కటి మార్కులతో నువ్వు పాస్ కావడమే నువ్వు వాళ్ళకిచ్చే జవాబు! పిచ్చితల్లీ! ఎవరో ఏదో అన్నారని నీ జీవితలక్ష్యాన్ని వదులుకొంటావా?"

    ఆరిపోతున్న దీపానికి చమురు అందించినట్టుగా అయింది తండ్రి ఊరడింపు.

                                          *    *    *
   

 

   అర్పితకూడా యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టి వయసును మించి ఎదిగిపోసాగింది. అక్కకంటే ఓ బెత్తెడు పొడుగు ఎక్కువే అయింది. యవ్వనపు మిసమిసతో అంతకుముందు కనిపించని అందాలు ఆమెలో కనిపించసాగాయి. వస్తూ పోతూ వుంటే బాడీగార్డులు తయారయ్యారు. కాలేజీలో, బయట ప్రేమభిక్షువులకీ, ప్రేమ పూజారులకీ లెక్క లేకుండాపోయింది. వాళ్ల ఆరాధన ఆమెకు గర్వంగా ఉండేదిగాని ఆమెకు ఎవరిమీద ఆసక్తి కలుగలేదు. కారణం, ఆ పిల్లకు చదువుపట్ల మక్కువ ఎక్కువ! ఆ మక్కువను జయింగలిగే మగవాడింత వరకూ తారసపడలేదు!
   
    ప్రేమ పూజారులు ఆ  వీధిలోనే ఇద్దరున్నారు.

    ఒకడు ఎదురింటి మేడమీద అబ్బాయి కిరణ్. రెండిళ్ళవతల శేఖర్. కిరణ్ ఎప్పుడూ కిటికీలో కూర్చుని ప్రేమ తపస్సుచేస్తే, శేఖర్ వాళ్ళింటి డాబా మీద పిట్టగోడ ఎక్కి కూర్చుని తపస్సు చేస్తుంటాడు.

    ఒకరోజు కిరణ్ ప్రేమలేఖ వ్రాసి తమ్ముడికిచ్చి పంపుతుంటే వాళ్ళమ్మ పట్టుకొంది.

    గంధర్వ కన్యవనీ, మరునిశారానివనీ వర్ణన! ఆమె ప్రేమలో తను పిచ్చివాడినైపోతున్నానని, కరుణించి పెళ్ళాడకపోతే గుప్పెడు నిద్ర మాత్రలతో ఈ బ్రతుకునే చాలిస్తాననీ!
 
    వాళ్ళమ్మ జుట్టుపట్టుకు ఈడ్చి మరీ తన్నింది కిరణ్ని. పరీక్షల్లో డుమ్మాకొడుతూ నీకు పెళ్ళి కావలసి వచ్చిందాని!

    కాని, తల్లితంతే మాసిపోయే ప్రేమకాదు అతడిది, చాలా గాఢమైన ప్రేమ! అదెంత అరివీర భయంకరమైన ప్రేమనో వారంతిరక్కుండానే జరిగిన ఒక సంఘటన వల్ల బట్టబయలైంది!

    ఆరోజు సాయంక్రం ప్లే గ్రౌండులో శేఖర్ కి కిరణ్ కీ ఆటలో పేచీ వచ్చింది.

    "నిన్ను చాన్నాళ్ళుగా చూస్తున్నారా! ఆటలోనేకాదు. అన్నిటిలోనూ నాకు పోటీగానే తయారయ్యావు! నా అర్పితకు నువ్వు డాబా పిట్టగోడమీద కూర్చొని సైట్ కొడుతున్నప్పుడే నీ కాలువిరిచేయాల్సింది. వాళ్ళింటి ముందునుండి పూటకు పదిసార్లు చక్కర్లు కొడుతూ వాళ్ళ గుమ్మానికి అయస్కాంతమున్నట్టుగా నీ ముఖం గిర్రున అటు తిరిగి అతుక్కుపోయినప్పుడే నీ మెడ విరిచేయాల్సినమాట!" శేఖర్ మీదపడి కుమ్ముతూ అన్నాడు కిరణ్.
 
    "నీ అర్పుత ఏమిటిరా? నువ్వేమైనా తాళిగట్టిన పెళ్ళామా అది?"

    "అది ఇది అన్నావంటే నీ నాలిక చీరేస్తాను. తాళిగట్టక పోతేనేం? నేను ప్రేమించిన పిల్లరా ఆమె! నువ్వే కాదు, ఇంకెవరు ఆ పిల్లకేసి కన్నెత్తి చూసినా వాళ్ల కళ్ళు పీకేస్తాను! కాళ్ళు విరిచేస్తాను!"

    "ఆ పిల్లను ప్రేమించడానికి నీకొక్కడికే లైసెన్సుందా? వెర్రి వెధవా!"

    బరిలోకి దిగిన పోట్లగిత్తల్లా ఒకరినొకరు కుమ్ముకొని కొట్టుకోసాగారు.
 
    పది నిమిషాలపాటు సాగిన ముష్టియుద్దంలో ఇద్దరూ క్షతగాత్రులై పోగా జతపిల్లలు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళవాళ్ళ ఇళ్ళలో సమాచారాన్ని అందించారు.
 
    లబోదిబోమంటూ పెద్దవాళ్ళ పరుగు!

    చెరో ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.

    శేఖర్ కి తగిలిన దెబ్బలు సీరియస్ గానే ఉండడంతో అతడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొన్నారు.

    కిరణ్ కి అవసరమైనచోట్ల ప్లాస్టర్లు వేసి, చేతికీ మెడకీ బేండేజ్ వేసి, ఓ ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపేశారు.
ఓ ఆడదానికోసం కొట్టుకు చచ్చిన కొడుకును చూస్తూంటే తల్లికి కొడుకు మీద మండుకురావడానికి బదులు దీనికంతా కారణమైన ఎదురింటి ఆడపిల్లమీద రాసాగింది.

    కొడుకును బరబరాలాక్కొచ్చి, వాకిట్లో నిలబెట్టి మరీ అరవసాగింది.

    "తల్లిలేదు! తండ్రి ఉన్నా లేనట్టే. కుంటి సన్నాసి! ప్రొద్దునలేస్తే పదిసార్లు అటుఇటు వగలొలుకబోస్తూ హొయలొలుకబోస్తూ తిరుగుతారు. ఈ వీధిలో కుర్రాళ్ళు పిచ్చాళ్ళయిపోతున్నారు. మీధ్యాసలో వాళ్ళకి చదువు సంధయ్ల్లేకుండా పోతున్నాయ్!"

    "ఏం జరిగింది, పిన్నిగారూ?" అపురూప శాంతంగా అడిగింది.
 
    "ఇదిగో చూడు వీడి అవతారం! వీడూ ఆ శేఖర్ గాడు నీ చెల్లెలి కోసం కొట్టుకు చచ్చారు. దేవుడు మీకింత అందం ఎందుకిచ్చాడో, మా కొంపలకు చిచ్చుగా తయారయ్యారు!"
 
    అపురూపకు ఆమెకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు! దరిద్రులు అందంగా ఉండడం కూడా నేరమేనా?
 
    అర్పిత మాత్రం ఊరుకోలేదు. కిరోసిన్ సీసా, అగ్గిపెట్టె తెచ్చి ఆవిడ చేతికిచ్చింది. "ఇది నా మీద పోసి అగ్గిపుల్ల గీచెయ్యి! నాకూ ఈ అందంతో ఇబ్బందిగానే ఉంది! మీ ఆడాళ్ళంతా కుక్కల్లా కనిపారేసిన మగపిల్లలంతా చిత్తకార్తె కుక్కల్లా నావెంట పడుతుంటే వేగలేక చస్తున్నాను!"
 
    ఎదిరింటామె కంపరంగా కిరోసిన్ సీసా, అగ్గిపెట్టె క్రిందపెట్టేసి, అంది. "ఆ తగలబెట్టుకొనేది ఏదో నువ్వే తగలబెట్టుకోరాదా? పీడా విరగడవుతుంది!"

 Previous Page Next Page