Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 16

           
                                              చేసినది పాతివ్రత్య సంరక్షణ


                           అయినా వేసినది కఠినశిక్ష

    ఈ ఇనపకచ్చడాల తాతలనాటి పాత కబుర్లు కావు. మొన్న నేనిచ్చిన కేసులనుబట్టే ఈ మాట రుజువయి వుండాలి. అవి యాభయి సంవత్సరాలకు ముందు జరిగినవి. నలభై ఏండ్ల క్రితం మరొకకేసు ఫ్రాన్సులో బయటపడ్డది. దీనిలో ఒక విశేషం ఉంది:
    ఒక శిల్పికి అందమయిన భార్య ఉండేది; బుద్ధిమంతులే. అయినా శిల్పికి "సుందరమయిన భార్య శత్రుసమాన" అన్న అభిప్రాయం కలిగింది. ఒక కచ్చడం తెచ్చి, దాన్ని ఒక ఇజారు (చల్లాడం, షరాయి, లాగు) లో పెట్టి కుట్టించాడు. ఈ ఇజారు గట్టి గుడ్డతో కుట్టించాడు. బనియన్ లాగులాగా శరీరానికి అంటుకొని, కరుచుకొని ఉండేటట్టు చెయ్యించాడు.
    ఏదో సాకు చెప్పాడు; ఇది తొడుగుకుంటే మంచిదన్నాడు; పెద్ద పెద్ద ఇళ్ళ స్త్రీలంతా ఇలాంటివి తొడుగుకుంటారన్నాడు. పాపం! ఆ ఇల్లాలు అవుననుకుంది; తొడుగుకుంది. శిల్పి మెల్లగా నడుముపట్కా బంధించి తాళంవేశాడు. అవసరం ఉన్నప్పుడంతా (మలమూత్ర విసర్జనలకు సైతం) తాళం తీస్తూవేస్తూ ఉండేవాడు. ఆయమ్మ అలవాటులను బట్టి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి తాళం తీస్తే ఆమె అవసరం తీరిపోయేదట.
    ఒకనాడు, ఒక పెద్దయింటి ఇల్లాలు తన స్నేహితురాండ్రను అల్పాహారవిందుకు పిల్చింది. అంతా ఆడవాళ్ళపార్టీ. శిల్పి, భార్యను తీసుకొని వెళ్ళి నవ్వకుంటూ అక్కడ ఆమెను విడిచిపెట్టి, మరొక రెండుగంటలలో వచ్చి ఇంటికి తీసుకుపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
    విందు జరుగుతూ ఉంది. శిల్పి భార్యగూడా కులాసాగానే కొంతసేపుంది. ఇంతలో ఆమెకు పెరటికి వెళ్ళవలసిన అవసరం కలిగింది. ఎట్లా? ఓర్చుకుంది; సైరించింది. అరగంటయింది; ముప్పావుగంటయింది. మరి ఓర్వలేక చాలా అవస్థపడుతూ ఉంది. అందరూ ఏమంటే ఏమని అనుకుంటున్నారు. అడుగుతున్నారు.
    ఇంతలో "భగవదనుగ్రహం" వల్ల, తన భర్త వీధిలో నిలబడి ఈలవేస్తున్నాడు. ఈయమ్మ పరుగునపోయి, తాళము చెవి తెచ్చింది. కాని, వెనుకను వేసి ఉన్న తాళం తెరవడం ఎలాగ?
    విధిలేదని, విందుపెట్టిన ఇల్లాలిని రహస్యంగా పిలిచి,అమ్మా, ఈ తాళం తెరవండీ అన్నది. ఆ ఇల్లాలు దిగ్భ్రాంతి పొంది పోయింది.... పని తొందర తీరిన తరువాత ఏమిటీ విడ్డూరం అని అడిగింది. మెల్లగా సంగతంతా బయటపడింది.
    స్త్రీ జాతి కంతటికీ-అందులో అది ఫ్రాన్సు - ఇది అవమానం. అత్యుత్తమురాలయిన ఆ సుందరికి ఇది అకారణమయిన వేదన అని అక్కడి అమ్మలక్కలంతా నిర్ణయించుకున్నారు. కోర్టు కెక్కించారు శిల్పిగారిని.విచారణా సాక్ష్యాలూ అన్నీ జరిగిన తరువాత ఆ శిల్పికి శిక్ష విధించారు.
    ఇలాంటిదే ఒక కేసు 1910లో (అంటే పాఠకులలో అనేకులకు సమకాలికమే అవుతుంది) పారిసు నగరంలో విచారణకు వచ్చింది. అప్పటికి వార్తా ప్రచారాలు, పత్రికా ప్రచురణలూ విశేషించి ఉన్నాయి కదా. పారిసులోని వార్తలు లండను పత్రికలలో గూడా పడుతూ ఉండేవి. అందుచేత ఈ "పేరట్ కేసు" ప్రపంచ విఖ్యాతిని పొందిందనవచ్చు.
    తక్కిన అన్ని కేసులలో లాగానే ఈ కేసులో గూడా మగవాడి ఒరిజినాలిటీ (స్వకపోల కల్పన) కొంత ఉంది. ఇతడుగూడా వట్టిమూర్ఖుడు గానీ, చదువుసంధ్యలు లేని మొరకుగానీ కాడు. పెద్ద ఆపాతికరీ డాక్టరు: గొప్ప మందులషాపున్నవాడు. మర్యాదస్తుడుగా జీవిస్తున్నాడు.
    భార్య చెడుతిరుగులు తిరుగుతుందేమో అని ఇతని భయము. భార్యను అన్నివిధాల నిరోధిస్తుండేవాడు. ఇదంతా కొంత హింసగా రూపొందింది. అనవసరంగా ఒక నిరపరాధిని ఇలా హింసిస్తున్నాడనే అని ఇరుగుపొరుగు వారు అధికారులకు రిపోర్టు చేశారు. కాని, అధికారులు విననట్టు ఊరుకున్నారు.
    డాక్టరుగారికి ఈ సంగతి తెలిసింది. ఇదికాదని ప్లాను మార్చి వేశాడు. తెలివితేటలన్నీ ఉపయోగించాడు. రట్టూరవ్వా లేకుండా, చచ్చిన కుక్కలాగ పడివుండే ఏర్పాటు చేశాడు. భార్యను బయటకు కనబడనీయకుండా చేశాడు.
    కొన్నాళ్ళకి ఇతని ప్లాను మెల్లగా వీరికి వారికీ తెలిసింది. వారంతా నిర్ఘాంతపోయారు. ఏమిటీ క్రూరకృత్యాలని అనుకున్నారు. ఇలాంటి ఘోరం జరగనీయ రాదని అధికారుల చెవిలో పడవేశారు.
    మరి నాలుగు రోజులు. పోలీసువారు వచ్చి ఇల్లు సోదా చేశారు. ఏముంది? భార్యను గొలుసులతో డాక్టరుగారు మంచానికి కట్టి ఉంచారు. ఒక గొలుసుకాదు రెండు మూడు గొలుసులతో పదిలపరిచాడు డాక్టరు.
    అక్కడితో తీరిపోలేదు. ఆ భార్య తొడుగుకొన్న గుడ్డల క్రింద సరిగా ఒక గొలుసు కవచం ఒకటి వుంది. పూర్వపు యుద్ధాలలో ఉక్కు రేకుల కవచాలే కాక, ఉక్కు తీగల కవచాలుండేవి కదూ. (మ్యూజియములలో ఇప్పటికీ చూడవచ్చును) ఇలాంటి గొలుసుల లాగులాంటిది తొడిగివుంది ఆ భార్య ఆ వుక్కులాగుకు నడుముదగ్గర  రెండు తాళాలున్నాయి. భార్య పాతివ్రత్యం కాపాడడానికి డాక్టరు ఇంతసన్నాహం చేశాడు.
    దీనికి సంతోషించి ఒక పతకం ఇవ్వవలసిన ప్రభుత్వం, ఇతని మీద కేసు పెట్టింది. పత్రికల కెక్కించింది. "అభినవ ఒథెలో" అనీ, "భార్యను గొలుసులతో కట్టుట" అనీ, "గొలుసు కవచం తొడుగుట" అనీ, ఫ్రాన్సు పత్రికలూ, ఇంగ్లాండు పత్రికలూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించాయి.
    డాక్టరుగారు తన తప్పును ఒప్పుకున్నారు. ఇలా చెయ్యడాని కంతటికీ కారణం తన్ను తన భార్య మోసం చేస్తుందేమో అన్న ఒక్క ఉద్దేశమే అని చెప్పారు.
    గొలుసులు ఇన్ని బిగించినా, ఆ భార్య ఆ గదిలో ధారాళంగా నడవడానికీ, బుద్ధిపడితే పియానో దగ్గరకుపోయి పియానో వాయించడానికి వీలుగా వుండేటట్టు వుంచానని గూడా డాక్టరుగారు చెప్పాడు. ఇంత అభిమానం భార్యయందు చూపించినా, కోర్టువారు మాత్రం శిక్ష తగ్గించలేదు.

 Previous Page Next Page