"ఇహ అత్తర్లు, పౌడర్లు మానేద్దామనుకొంటున్నాను! నా వయసు ఏభై దాటుతూంది! ఇంత వయసు వచ్చీ ఈ అలంకరణ చేసుకొంటే చూసేవాళ్ళకు ఎబ్బెట్టుగా ఉంటుంది!"
"చూసేవాళ్ళ కోసం మీరేమీ మీ ఇష్టాన్ని చంపుకోనక్కరలేదు!"
"అందంగా కనిపించాలన్న తాపత్రయం తగ్గిపోతూంది, పాపా!"
"చెబితేగాని మీ వయసు తెలియదు, ఆంటీ! నలభైకీ, ముప్పయ్ కీ మధ్య అనుకొంటారు! వయసు అయిపోతూందని మీరేమీ బెంగపడక్కరలేదు! మీరు వయసును గుప్పిటలో పెట్టుకొన్నారనిపిస్తూంది!" ఆమె కట్టుకొన్న చీర అంచులు సవరిస్తూ అంది ప్రేమీ.
సభ ముగిసేసరికి రాత్రి ఎనిమిది అయింది. సభికులంతా వెళ్ళి పోయారు. మహిళామండలి సెక్రటరీ, మిగతా కార్యవర్గ సభ్యులూ కూర్చొని మహిళామండలికి సెక్రటరీ, మిగతా కార్యవర్గ సభ్యులూ కూర్చొని మహిళామండలికి సంబంధించిన విషయాలమీద చర్చించుకొంటున్నారు.
సువర్చల ముడిమీదున్న మల్లెదండ ఓ వైపు వ్రేలాడుతుండడం చూసి సరిచేయడానికి సువర్చల వెనకాల వెళ్ళి నిలబడింది ప్రేమీ.
మహిళామండలి సెక్రటరీ భ్రమర హఠాత్తుగా గుర్తువచ్చినట్టుగా, తాను మాట్లాడుతున్న విషయం వదిలేసి, అడిగింది. "ఇవాళ పేపరు చూశారా? ప్రియదర్శిని హాస్టల్లో ఇరవై సంవత్సరాలక్రితం జరిగిన సంఘటన ఇచ్చి ఆ పాపకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే రావాలని సుందరయ్య ఇచ్చిన ప్రకటన చూశాను. అలా పేపరు కివ్వడంవల్ల నాకేమీ లాభం కనిపించలేదు. పైగా ప్రేమిక జననం గురించి మర్చిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఆ విషయం గుర్తుచేసినట్టు అవుతుందే తప్ప! ఆ ముసలాడికి అనారోగ్యంతో మతిపోయి ఇలా చేశాడేమో అనుకొంటున్నాను!"
"నిజమే. అతడు చేసిన ఈ పని నాకూ మంచిగా కనిపించలేదు. ఈ పేపరు ప్రకటన తల్లిగాని, మేనమామగాని చూచే అవకాశం తక్కువ. చూసినా, ఆ రోజు ఈ పాపాన్ని విరగడ చేసుకు వెడుతున్నాం అన్నట్టు సంతోషంగా వెళ్ళిపోయినవాళ్ళు ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల బాధ్యత స్వీకరించడానికి వస్తారా? గతంలో కలిసిపోయిన తప్పును తిరిగి వెలికి తీసి గుట్టు రట్టు చేసుకొనే తెలివిహీనులెవరూ ఉండరు!" సువర్చల తన అభిప్రాయం చెప్పింది.
మానసఅనే మరొకామె అంది. "నిజంగా కన్నతల్లి బ్రతికేవుండి ఆ ప్రకటన చూసిందే అనుకోండి! అనాధ అయిపోతున్న కూతురికోసం రాకుండా ఉండగలదా? ఎంతయినా తల్లికదా?"
"అబ్బా! ఏం తల్లి! ఆరోజు పుడుతూనే పసిగందును కంపలోకి విసిరిన మనిషి ఈ రోజు కూతురు వంటరిదై పోతుందని పరిగెత్తుకు వస్తుందా? ఆమెకి పెళ్ళయ్యి తాళికట్టిన మగడికి పిల్లల్ని కని పతివ్రతలా ఎక్కడో కాపురం చేసుకొంటూ ఉంటుంది. తన జీవితానికున్న మచ్చను తనే చాటుకుంటుందా?"
"ఆంటీ! ఇక వెడదామా?" ప్రేమీ గొంతులో అసహనం స్పష్టంగా వినిపించింది.
"ఆఁ. వెడదాము" అందేకాని, లేచే ప్రయత్నమేదీ లేకుండా కూర్చుండి పోయింది సువర్చల.
"ప్రేమిక అంటే మీకు చాలా ఇష్టంగా? అజయ్ కి చేసుకో కూడదూ? ఆదర్శాలు మాటల్లోనేకాక చేతల్లోనూ చూపినట్టు అవుతుంది. ఒక వృద్దుడి చింత తీర్చినట్టూ అవుతుంది!" భ్రమర కొంచెం తమాషాగా, కొంచెం సీరియస్ అంది.
ఆమె ఊహించినట్టుగా సువర్చల ఇరకాటంలో పడలేదు. ప్రేమీ చేతిని ఆప్యాయంగా తన చేతిలో ఇముడ్చుకొంది, ఆ పిల్ల అంటే తనకెంత ఇష్టమో చెప్పడాని కన్నట్టు! తడుముకోకుండా చెప్పింది. "ప్రేమికను నేను చిన్నప్పటినుండి ఓకే దృష్టితో చూస్తున్నాను. ఆ పిల్లను చూస్తే నాకు చనిపోయిన మా పాప దేవికను చూసినట్టుగా ఉంటుంది. మాత్రువాత్సల్యం గుండెలో పొంగుతుంది. కూతురులాంటిదాన్ని కోడల్ని చేసుకోవడం ఆదర్శమని ఎవరూ అనరు కదా?"
"మీరు చాలా నేర్పుగా తప్పించుకొంటున్నారు. ఎంతయినా మీ కారు డ్రైవర్ కూతురు కదా? ఆ పిల్లను కోడల్ని చేసుకొనే హృదయ వైశాల్యం లేదని చెప్పండి!" ఏ మాటైనా ముఖంమీద మాట్లాడి, అలా మాట్లాడగలగటం గొప్ప విషయం అన్నట్టుగా గర్వపడే మానస అంది.
"సమయం వచ్చినప్పుడు నా హృదయ వైశాల్య మెంతో కొలచి చూపిస్తానుగాని, ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టండి!" నవ్వుతూనే చేతులు జోడించి లేచింది సువర్చల.
"ఎక్కడైనా అత్తా అను కాని, వంగతోటకాడ అనొద్దు అన్నారట వెనుకటి కెవరో!" ఎగతాళిగా అంది మానస.
"ఆ అత్తని నేనని మీ అనుమానమేమో! నేను కాదని ఖచ్చితంగా చెప్పగలను!" మందహాసమూ, గంభీరమూ జోడించి చెప్పి కదిలింది సువర్చల, ప్రేమీ చెయ్యందుకొని, తన మాటకు గొల్లున నవ్వుతున్న వాళ్ళ మధ్యనుండి.
5
రోజూ మధ్యాహ్నం వేళల్లో తీరుబాటుగా ఉంటుంది ప్రేమీ పెరటివైపు గదిలో కూర్చొని పెరట్లో కనిపించే చెట్లవైపూ, మధ్యాహ్నం ఎండతాపానికి చెట్ల నీడల్లోకి చేరి కిచ కిచ లాడే పిచ్చుకలని చూస్తూ, మూడ్ వస్తే కథో, వ్యాసమో వ్రాస్తుంది. ఈ మధ్యే ఒక వారపత్రికలో ప్రేమీ కథ పడింది. సువర్చలతో తప్ప ఎవరితోటీ తన కథ పత్రికలో పడిందని చెప్పుకోలేదు. ఏమాటైనా హృదయంలో దాచుకోకుండా చెప్పుకొనే మిత్రుడు రామచంద్ర ఇప్పుడిక్కడ లేడు. వ్యాసాలు రెండు సంవత్సరాల నుండి వస్తున్నాయి. వ్యాసరచయిత్రిగా రెండు మూడు పత్రికలు తన ఫోటో అడిగి ప్రచురించాయి. ఒక పత్రిక నిర్వహించిన పోటీలో ప్రేమీ వ్రాసిన వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది.
ఈరోజు ఏదైనా కథ వ్రాద్దామని కూర్చొంది ప్రేమీ. ప్లాట్ అంతా మనసులో పరచుకొని ఉంది. కాగితం మీదికి ఏ వాక్యంతో ఎక్కడినుండి దింపాలా అని సతమతమౌతున్నది.