బేరర్ భయపడుతూ ఆ ట్రేని తీసుకుని సోమువద్దకు వెళ్ళి-"ఇందులో నా తప్పేంలేదు. అతనివ్వమన్నాడు. నేనిస్తున్నాను-" అన్నాడు.
సోము మాట్లాడకుండా రెండుచాకులూ తీసుకుని ఆ చీటీ చదివాడు వాడి ముఖం ఎర్రబడింది. తీవ్రంగా గోపీవంక చూశాడు.
గోపీ ఇప్పుడు సోమువైపు తిరిగిఉన్నాడు అతడి ముఖంలో భయం, కలవరం లాంటి లక్షణాలేమీ లేవు.
సోము మెరుపువేగంతో అతడిమీదకు చాకుని విసిరాడు. అది ఇంచు మించు గోపీ పొట్టలో గుచ్చుకున్నదనే అందహ్రూ భావించారు. హాల్లోని ఓ బలహీన మనుష్యుడు కెవ్వుమని అరిచాడు కూడా. కానీ గోపీ చివరి క్షణంలో దానిని చేత్తో పట్టుకుని అలాగే నేలమీదకు జారవిడిచాడు.
సోము రెండోచాకును విసిరాడు. ఈ పర్యాయం గోపీ దాన్ని చేత్తో అందుకుని అదే ఊపులో సోము మీదకు విసిరాడు. చాకు సోము కుడిభుజంలో బలంగా దిగబడింది.
సోముకు ఇలాంటివ్యక్తి ఎప్పుడూ తటస్థపడలేదు. వాడికి కంగారులో బుర్రపనిచేయలేదు. అప్రయత్నంగానే వాడక్కన్నించి పారిపోయాడు.
అప్పటికాయువతి మేడమెట్లుదిగి క్రిందకు వచ్చింది. గోపీ ఆమెను సమీపించి- "నీ అన్న పారిపోయాడేం?" అన్నాడు.
"నా అన్న ఎవరు?" అన్నదాయువతి ఆశ్చర్యంగా.
"ఇప్పుడు పారిపోయినవాడు...." అన్నాడు గోపీ.
"నీకు-వాడు నా అన్నలా కనపడుతున్నాడా?" అన్నదామె.
"లేదు. నీవు వాడికి చెల్లిలా కూడా అగుపడలేదు. కానీ మీ యిద్దరి వ్యవహారంచూసి అన్నా చెల్లెళ్ళ దాగుడుమూతలనిపించి అలా అడిగాను-"
"నావంటి పేదబాలికను పరిహాసంచేయడం నీవంటి ఉత్తముడికి తగదు-" అన్నదాయువతి దీనంగా.
"నీవు పేదబాలికవే అయుండాలి. నేను చేసిన ఉపకారానికి బదులుగా థాంక్స్ కూడా ఇచ్చుకోలేవనుకుంటాను-" అన్నాడు గోపీ.
"నన్ను మన్నించు. నాజీవితాన్ని, మర్యాదనూ ఈరోజుకు కాపాడావు. నీకు థాంక్స్ చెప్పుకోకపోతే నా మనస్సాక్షి నన్ను వదలదు. నీకు చాలా చాలా థాంక్స్..."
"ఈరోజుకు అంటున్నావు-నాకు అర్ధంకాలేదు-" అన్నాడు గోపీ.
"జీవితం క్షణభంగురమంటారు. కానీ క్షణక్షణమూ అది భయంకరమే - ఈరోజిల్లాగయిపోయింది. రేపేమవుతుందో?" అన్నదామె నిట్టూర్చుతూ.
"చూడు-రాము, సోము, గబ్బర్ సింగూ, రావుగోపాల్రావు ఎవ్వరైనాసరే-ఇకమీదట నీవైపు కన్నెత్తిచూడాలని కూడా అనుకోరు. నీవయసుపిల్ల-జీవితాన్ని క్షణభంగురమనీ, క్షణక్షణం భయంకరమనీ, కాక - అనుక్షణం మధురమని భావిస్తూండాలి-" అన్నాడు గోపీ.
"థాంక్స్!" అన్నదాయువతి. గోపీ ఆమెకు టాటా చెప్పాడు.
ఆ యువతి వెళ్ళిపోగానే గోపీ కూడా హోటల్ బయటకు వచ్చాడు. అతడు పార్కుచేసిన బుల్లెట్ ఇంకా అక్కడే ఉన్నది. కానీ అతడు దాన్ని కదుపలేదు. అతఃది చేతిలో గోళీ ఆడుతున్నది. అతడలాముందుకు నడుస్తూనే ఉన్నాడు.
అలా కొంతదూరం వెళ్ళాక-ఒకవృద్దుడతడి భుజంమీద వెనుక నుంచీ చేయివేశాడు. గోపీ వెనక్కుతిరిగి- "ఎవర్నువ్వు?" అన్నాడు.
ఆ వృద్ధుడిమీసాలు, గెడ్డాలు, జుత్తు-మొత్తమంతా తెల్లబడిఉన్నది. ముఖం ముడతలు పడిపోయింది. మనిషి ఆజానుబాహుడు.
"అబ్బాయ్-నువ్వు సోముతో గొడవపడి ప్రాణంమీదకు తెచ్చుకున్నావు. నీగురించి నాకిప్పుడెంతో బెంగగా ఉన్నది-" అన్నాడావృద్దుడు.
గోపీ నవ్వి-" ఈ మాట చెప్పడం కోసమేనా-నువ్విందాకట్నుంచీ నన్ననుసారించి వస్తున్నావా?" అన్నాడు.
వృద్దుడి ముఖంలో ఆశ్చర్యం కనబడింది- "నేను నిన్ను అనుసరిస్తున్నట్లు నీకెలా తెలుసు?" అన్నాడు.
"ప్రమాదకరమైన వృత్తిని స్వీకరించిన వాళ్ళు - అనుక్షణం అప్రమత్తులై ఉండకపోతే-మృత్యువుచేత కబళించబడతారు-" అన్నాడు గోపీ.
"అబ్బాయ్-నిన్ను చూస్తూంటే నాకు నా యౌవ్వనంగుర్తుకొస్తున్నది. నీతో మాట్లాడాలనివుంది. హోటలుకువస్తావా?" అన్నాడు వృద్ధుడు.
గోపీ అంగీకార సూచకంగా తలవూపి వృద్దుడి ననుసరించాడు. ఇద్దరూ మళ్ళీ హోటల్లోకి వెళ్ళారు. ఒక మూలగా వెళ్ళి కూర్చున్నారు.
"నా మాట కాదనకుండా వచ్చావు. థాంక్స్!" అన్నాడు వృద్దుడు.
"వచ్చాను సరే-నువ్వు చెప్పదల్చుకున్నదేమిటో త్వరగా చెప్పు. అవతల నాకు చాలా పనులున్నాయి-" అన్నాడు గోపీ చిరాకును వ్యక్తపరుస్తూ.
"తొందరపాటు మంచిదికాదు. నేను నీ మేలుకోరే వాణ్ణి. నువ్విప్పుడెలాంటిప్రమాదంలో ఇరుక్కున్నావో నీకు తెలియదు. సోము నాయుడి మనిషి. వాడికి జరిగిన అవమానాన్ని నాయుడు సహించడు. అతడి మనుషులప్పుడే నీ కోసం వేట ప్రారంభించి వుంటారని నా అనుమానం-" అన్నాడు వృద్ధుడు.
"నువ్వు ముసలివాడివైపోయావు. మాటలతో భయపెట్టదల్చుకుంటే-అలాంటి విద్యలు నీ మనవడి ముందు ప్రదర్శించు. నాతో నీకున్న పనేమిటో తొందరగా చెప్పు-"
వృద్దుడేదో చెప్పబోయి ఆగిపోయాడు. బేరర్ వచ్చి వారి పక్కన నిలబడ్డాడు. ఏం చెప్పాలా అని గోపీ ఆలోచిస్తున్నాడు. వృద్దుడతడివంక చిరాగ్గాచూసి- "కాసేపు మా మధ్యకు రాకు-" అన్నాడు.
గోపీ బేరర్ వంక చూసి- "అవునూ - ఇందాకా నేను బిల్లు పే చేశానా?" అన్నాడు.
"నిన్ను బిల్లడిగే దమ్ము లెవరికుంటాయ్ - అలాగని హోటల్ యజమాని ఏమీ నష్టపోలేదులే- "నీ బిల్లు నేనిచ్చాను ...." అన్నాడు వృద్ధుడు.
బేరర్ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
"నా బిల్లు నువ్విచ్చావా?" అన్నాడు గోపీ ఆశ్చర్యంగా- 'ఎందుకు?"
"మెరికలాంటి నాయుడి మనిషిని సునాయాసంగా చిత్తుచేశావు. అందుకు?" అని ఒక్క క్షణం ఆగి- "అసలు సంగతి చెబుతాను విను. ఈ ఫిరంగిపురం మొత్తం రెండు ముఠాల అధీనంలో వుంది. ఆ ముఠాల రక్షణలేనిదే పోలీసోడుకూడా ఇక్కడ బ్రతకలేడు. అందులో ఒక ముఠాకు అధిపతి నాయుడు. రెండో ముఠాకు అధిపతిని నేను అన్నాడు వృద్ధుడు.