"అదికాదండీ..." ఏదో చెప్పబోయాడు. సింహాద్రి. కాని భావయ్య వినిపించుకోలేదు.
"ఏది కాదయ్యా! నువ్వు సెప్పేదేమీ సరిలేదు. నీకు సూపు సరి లేదా ఏమి? ఈ ఫోటోలోది నా కూతురు ఆడపిల్ల కాదంటావే? ఇది నిండా లక్ష్మీదేవిలాగుండాదని అందరూ సెప్తారు. ఏమయ్యా సిరంజీవీ.... నువ్వు మాట్లాడవేమి?"
"లక్ష్మీదేవిలాగా వున్నమాట నిజమేకానండీ, కొంచెం ఏదో అంటే మరీ అంత ఎక్కువ కాదనుకోండి.... కొంచెం అదేదోగా ఉన్నట్లుందండీ"
"అదేదోగా అంటే ఏమి?"
"అంటే... అంటే మొఖంలో ఏదో క్రూరత్వం"
"ఆ! గుర్తుకొచ్చింది" అరచాడు సింహాద్రి.
భావయ్య ఉలిక్కిపడి సర్దుకున్నాడు.
"ఏమిటి గుర్తుకొస్తాది?"
"పెద్దపులి... నోనో అయామ్ సారీ చిరుతపులి"
భావయ్యకు సింహాద్రి మాటలు ఏమాత్రం అర్ధం కాలేదు.
"ఏమయ్యా! నువ్వేమి సెప్తావు? అమ్మాయి సంగతి మాట్లాడమంటే చిరుతపులి, పెద్దపులి సంగతి సెప్తావేమీ?"
"నేను మీ అమ్మాయి- అయ్ మీన్ అబ్బాయి పోలికల గురుంచి చెప్తున్నానండీ"
"అమ్మాయి పోలికెవరిదని అడుగుతుండావా? అట్టా సెప్పరాదూ మళ్ళా అమ్మాయి అచ్చం మా ఆవిడ పోలికదా తీసుకుంది"
"హా..." ఆనందంగా అరచాడు సింహాద్రి.
"అంటే మీ మిసెస్ కూడా పెద్దపులి లేక చిరుతపులి లేక మరేదయినా క్రూరమృగం అలా వుంటుందన్నమాట! వెరీ బాడ్! అయితే పాపం మీరేపద్దతి అవలంబిస్తూంటారు?"
"వ్వాట్ పద్దతా? పద్దతేమి?"
"అదేసార్! అలాంటి భార్యలున్నవాళ్ళు రెండు రకాల పద్దతులు ఫాలో అవుతారని చిరంజీవి చెప్పాడు. మొదటి దేమో టూరింగ్ లైఫ్ పద్దతి. రెండోది .... రెండోది...రెండోదేమిట్రా?" చిరంజీవి నడిగాడతను.
"శాటిలైట్ మెథడ్" గుర్తుచేశాడు చిరంజీవి.
"అవునవును. కరెక్ట్. శాటిలైట్ మెథడ్. ఈ రెండిట్లో మీరే పద్దతి ఫాలో అవుతారు?"
"ఏమయ్యా! ఏమిటి సెప్తావు? నీ మెదడు ఎట్లా ఉండాది?"
"మెదడా? దాని సంగతి ఎందుకిప్పుడు?"
"మరి నిండా అర్ధంలేని మాటలు మాట్లాడతావేమి? టూరింగ్ లైఫ్ పద్దతి, శాటిలైట్ మెథడ్ ఏమిదంతా?" భావయ్య అయోమయంగా చిరంజీవి వేపు చూశాడు.
"అతనేమి అట్టా మాట్టాడతాడు?"
చిరంజీవి ఆయనకు దగ్గరగా జరిగాడు.
"మీకు ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పమంటారా?"
"అంటే?"
"అంటే అదేసార్! నిజం చెప్పేయమంటారా?"
"అంటే?"
"పాపం మావాడికి అంటే మా సింహాద్రికికొంచెం నట్స్ లూజ్ లెండి! అంటే మీకు తెలుసుకదా! అదన్నమాట సంగతి! అయితే పరిస్థితి చేయిదాటలేదని గారంటీగా చెప్పగలను. అమావాస్యకూ, పౌర్ణమికి మాత్రం కొంచెం ట్రబులిస్తాడు. అంతే! పెద్ద అల్లరేమీ చేయడు. కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు! రోజుకి ఇరవై ఆరుగంటలు! అంతే. ఆ కొద్దిసేపు మాత్రం మనం వాడు చెప్పినట్లల్లావిని తలూపాలి! అవునని వప్పుకోవాలి అంతే! అలా చేస్తే ఏ ట్రబులూ వుండదు" వివరంగా చెప్పాడు చిరంజీవి.
భావయ్య మొఖం పాలిపోయింది.
"ఆ.....! గుర్తుకొచ్చింది" కెవ్వున అరచి లేచి నిలబడ్డాడు సింహాద్రి.
"వ్వాట్?" అదిరిపడ్డాడు భావయ్య.
"లీఫ్ సంవత్సరం ఆరేళ్ళకోసారి వస్తుంది?" ఆనందంగా చెప్పాడు సింహాద్రి.
"ఆరేళ్ళకోసారా?"
"అవును"
"కాదు" అన్నాడు భావయ్య.
"మరి?"
"అయిదేళ్ళకు ఒకసారి వస్తుంది"
"కాదు ఆరేళ్ళు" అరిచాడు సింహాద్రి.
"వప్పుకోండి సార్! లేకపోతే చాలా గొడవయిపోతుంది" రాహస్యంగా చెప్పాడు చిరంజీవి.
"ఏమి గొడవ సేస్తాడు?" అనుమానంగా అడిగాడు భావయ్య.
"మీదపడి జుట్టు పీకేస్తాడు"
"నాకు జుట్టు లేదు కదా?"
"లేపోతే గిల్లుతాడ్సార్! ఊరికే మాత్రం వదలడు"
"సరి సరి" అన్నాడు భావయ్య భయపడుతూ.
"ఇంతకూ మీరే పద్దతి ఫాలో అవుతారండీ? టూరింగ్ లైఫ్ పద్దతా, శాటిలైట్ పద్దతా?"
"నాన్సెన్స్" అన్నాడు భావయ్య చిరాకుగా.
"అలా కోప్పడకండి సార్! చెప్పాను గదా! పౌర్ణమీ, అమావాస్యకే కొంచెం ట్రబుల్ అంతే! మిగతా అన్ని రోజులూ హి విల్ బి ఫర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్!"
"ఇలాంటి మాడ్ ఫెలోని నా కూతురికి అంటగట్టాలనిదా ఆ విశ్వనాథం వాడు ప్రయత్నిస్తాడు. వాడి ముక్కు పగలకొట్టుతాను" కోపంగా అన్నాడు భావయ్య.
"అబ్బే! మీరు చిన్న విషయం పెద్దది చేస్తున్నారు సార్! వీడు మాడ్ ఫెలో కాదు! జస్ట్ బిగినర్! చాలా లేత పిచ్చి! మీరు దీనికంత ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు. అసలు ప్రతిమనిషికీ ఎంతోకంత పిచ్చి ఉంటుందని సైకాలజిస్ట్ లు అంటూంటారు. మీరు "మాన్ అండ్ మాడ్ నెస్" అనే బుక్ చదివారా?"
"ఎందుకు చదవటం?"
"జస్ట్ నాలెడ్జ్ కోసం పిచ్చి గురించి తెలుసుకోడానికి"
భావయ్య మళ్ళీ తన ధోరణిలో పడిపోయాడు.
"విశ్వనాథం వాడు నన్ను నిండా అన్యాయం సేస్తాడే! మా అమ్మాయికి పిచ్చివాడిని తెచ్చి కళ్యాణం సేస్తానంటాడే"
"మీరన్నమాట కూడా కొంతవరకూ నిజమే సార్! ఇలాంటి విషయాల్లో అబద్దాలు చెప్పడం తప్పు!"
"తప్పా! ఇది తప్పుకాదు. నిండా క్రిమినల్ కేసు"
"క్రిమినలా?" ఆశ్చర్యంగా అన్నాడు చిరంజీవి.
"యస్. దిసీజ్ క్రిమినల్"
"నో సార్! దిసీజ్ సివిల్- నాట్ క్రిమినల్"
భావయ్యకు వళ్ళు మండిపోయింది. "నీకు "లా" ఏమి తెలుసని మాట్టాడతావు?" కోపంగా అన్నాడతను.
"నేను లాయర్ ఇంటిపక్కన కొన్నాళ్ళున్నాను"
"పోడా- మడ్ హెడ్"
"నా మాట విని మీరు తొందరపడకండి సార్! సింహాద్రి ఫర్ ఫెక్ట్ బాయ్. ఆ ఒక్క లోపం తప్పిస్తే ఏ లోపమూ లేదు. మీ అమ్మాయికి ఈడూ జోడూ చక్కగా సరిపోతుంది. పౌర్ణమికీ, అమావాస్యకీ మీ అందరికీ ఒకరోజు ట్రబులుంటుంది. అదికూడా పెద్ద ట్రబుల్ కాదు. వాడు చెప్పినవన్నీ వింటే చాలు! అంతా ఓకే. మీకు రామోల్ కర్ సవానీ తెలుసా? వెరీ గుడ్ బాయ్. మా రైల్వేలోనే డ్రైవర్ వాడు అన్ని విధాలా నార్మల్ గానే వుంటాడు. ఎటొచ్చీ అమావాస్యకీ, పౌర్ణమికీ మాత్రం కొంచెం చిరాగ్గా వుంటాడు. ఆ రెండు రోజులు డ్యూటీలో ఉంటే మాత్రం నానా హడావుడి చేస్తాడు. సిగ్నల్ ఇవ్వకపోయినా సరే రైలాపడు. ఆపితే ఇంక మళ్ళీ స్టార్ట్ చేయడు. లేదా ఒక్కోసారి రాత్రిళ్ళు రెండు స్టేషన్ల మధ్య మాంచి అడవిలో రైలాపి ఇంజన్ పక్కనే పక్కేసుకుని నిద్రపోతాడు. పొద్దునే లేచాడంటే మళ్ళీ మాఊలు మనిషయిపోతాడు" అంతవరకూ చెప్పి ఏదో అనుమానం వచ్చి పక్కకు తిరిగి చూశాడు చిరంజీవి. అప్పటికే భావయ్య మాయమయిపోయాడు.