Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 16

 

    "వీళ్ళ మాటలు...."
    "చాలా బాగుంటాయి కదూ, నిజానికి ఆనందమంటే వీళ్ళదే! చూడండి ఎంత స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారో! మనం కూడా చిన్నపిల్లలమయినా బాగుండును."
    నుదురు రాసుకున్నాడు బాధగా అతడు.
    "అదేం! తలనొప్పా? నా దగ్గర మాత్ర ఉంది. ఇవ్వనా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడతాయని ఎప్పుడూ నా బాగ్ లో రెండు మూడు ఉంచుకుంటాను"
    థాంక్స్ ! వద్దులెండి.
    "మొహమాటపడకండి! మీరు కొత్తవారైనా టీకి పిలవగానే నేను రాలేదూ" తీసుకోండి"
    మాత్ర అందించింది.
    విసురుగా అందుకుని నోట్లో పడేసుకుని కాఫీ తాగాడు. బిల్లు పదిహేను రూపాయలయింది. కళ్ళు తిరిగాయి అతనికి. దుఖాన్ని అణచుకుంటూ దేవుడా అని ఆ బిల్లు చెల్లించి ఇవతల పడ్డాడు. పిల్లలంతా ఏక కంఠంతో "వస్తాం మావయ్యగారూ! చాలా "థాంక్స్" అని చేతులూపి "పద పిన్ని " అని కుసుమని తొందరచెయ్యసాగారు.
    "ఆవిడ పిన్ని.....నేను మామయ్యని....." కసిగా పళ్ళు నూరుకున్నాడు అతడు.
    "వస్తామండీ!" మధురంగా నవ్వి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది కుసుమ.
    మరునాడు మళ్ళీ కుసుమ ఆఫీసులోకి రాబోతుంటే లోపలినుండి మాటలు వినిపించటంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది.
    "ఎలా జరిగిందిరా నిన్న పార్టీ'!" ఎవరో అడుగుతున్నారు.
    "బ్రహ్మాండంగా జరిగిందిరా! టిఫిన్ తిని కాఫీ తాగి ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం కూడా" ఉత్సాహంగా చెపుతున్నాడు అతడు.
    నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది.
    "చూస్తాను వీళ్ళు నన్నేం చెయ్యగలరో. వీళ్ళకే తెలిసోస్తుంది కుసుమ అంటే ఎవరో" తనలో దృడంగా అనుకుని నిర్లక్ష్యంగా ఆఫీస్ లోకి అడుగు పెట్టింది.

        
                                                    *    *    *

    మెడ్రాస్ ఉద్యోగంలో చేరిన కొత్తలో మాధవ చాలాసార్లు కాత్యాయనిని కూడా తనతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. ఎన్ని విధాల బ్రతిమాలిన కాత్యాయని ఒప్పుకోలేదు. "ఇక్కడి ఆస్తిపాస్తుల వ్యవహారం నేను స్వయంగా చూసుకోకపొతే కుదరదు. ఈ పాలేళ్ళను నమ్మటానికి లేదు" అనేసింది.
    "పొతే పోయిందిలే ఆస్తి! నువ్వు నా దగ్గర కొచ్చేయ్యి" విసుగ్గా అన్నాడు మాధవ. కాత్యాయని వాత్సల్య పూరితంగా నవ్వింది.
    "నువ్వు ఉద్యోగస్తుడివి. నీకు ఆస్తి అక్కర్లేదు. కాని పెద్దలు ఎంతో శ్రమపడి సంపాదించింది నేను పాడుచేయ్యనా?"
    ఎంత ప్రయత్నించి కాత్యాయనిని మెడ్రాస్ తీసుకు వెళ్ళలేకపోయాడు మాధవ.
    కాని నిజానికి వచ్చిన తరువాత కాత్యాయని తనే ఉత్తరాల్లో ఒకటి రెండు సార్లు "నేనూ జానకీ కూడా మెడ్రాస్ వచ్చేస్తాం. ఏదైనా మంచి ఇల్లు చూసి రాయి" అని రాసింది.
    అయితే మాధవ ఆ విషయమే ఎత్తకుండా సమాధానాలు రాశాడు" కాత్యాయని కలవరపడింది. మాధవతో స్వయంగా మాట్లాడితేనే మంచిదని రమ్మని రాసింది. కాని మాధవ తనకిప్పుడు సెలవు దొరకదనీ, ఇంకొక రెండు నెలల్లో వేసవి సెలవులిస్తారనీ అప్పుడు రాగలననీ సమాధానం రాశాడు.
    జానకీ మాధవలు వివాహమయిన కొత్తలోనే ఇలా విడివిడిగా ఉండవలసి రావటం కాత్యాయనీకి నచ్చలేదు. పైగా ఆ యిద్దరూ చనువుగా ఇంట్లో కలిసి తిరగకపోవడం , ఒకరి నొకరు చిలిపి వేళాకోళాలు చేసుకోక పోవడం ఇదంతా కూడా కాత్యాయనికి ఎలాగో ఉంది. మాధవ జానకిని ప్రేమించటం లేదా అని కాత్యాయని అంతరంతరాల్లో చిన్న సందేహం. కాని దాన్ని గట్టిగా అనుకోవటం కూడా ఇష్టం లేదు కాత్యాయనికి. ఏమైనా వయసులో వున్నా దంపతులు. అందులోనూ పెళ్ళయిన కొత్తలో విడిగా ఉంచటం మంచిది కాదు.
    జానకిని తన దగ్గరకు పిలిచి చిరునవ్వుతో అంది.
    "చూడు ! నేను రమ్మని ఉత్తారాలేన్ని రాసినా వాడు రావటం లేదు. నువ్వు రాయి రమ్మని...." జానకి తెల్లబోయి చూసింది.
    "నేను రమ్మని రాయనా?" అప్రయత్నంగా నిరాశ ధ్వనించింది జానకి కంఠంలో. కాత్యాయని హృదయంలో మారుమూల అణిగిన సందేహం ఒక్కరవ్వ పైకి లేచి ఆవిడ మనసు కలత పెట్టింది.
    "రమ్మని రాసే అధికారం నీకు కాక ఎవరికుంది? ఇవాళే రాయి. నువ్వు రాస్తావా? నన్ను దగ్గరుండి నీచేత రాయించమంటవా?"
    జానకి తడబడుతూ "రాస్తాను" అని, కనీ కనిపించని చిరునవ్వు పెదవుల మధ్య దాచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చిరునవ్వు గమనించి కాత్యాయని సంతృప్తిగా నిట్టూర్చింది.
    నా స్వామికి,
    పిన్ని ఇవాళ నాకొక చిత్రమైన సంగతి చెప్పారు. ఆవిడకు మిమ్మల్ని చూడాలని ఉందట. ఆవిడ రమ్మని రాస్తే మీరు రావటం లేదట. నేను రమ్మని రాస్తే వస్తారుట! నమ్మదగ్గ సంగతేనా ఇది?
    మీకు రమ్మని వ్రాయవలసిందిగా ఒకరకంగా ఆజ్ఞాపించారు నన్ను. సాహసించి లేని అధికారాన్ని పిన్నిగారి కోసం తీసుకొని నేను రాస్తున్నాను.... మీ దయ.
                                                                                                           మీ జానకి.
    ఉత్తరం తిరిగి చదువుకుంటుంటే జానకి గుండెలు దడదడలడాయి. తనంత తానుగా ఆయనకు ఉత్తరం వ్రాయవలసి వచ్చిందని లజ్జ. ఈ ఉత్తరాన్ని నిర్లక్ష్యం చేసి అయన రాకపోతే ఆ అవమానం ఎలా ఎడుర్కోవాలన్న ఆవేదన .
    తన మాట మన్నించి అయన వస్తే తరువాత....?
    ఆ ఉత్తరాన్ని పోస్టుకు పంపించి మూడో నాటి నుండి సమాధానం కోసం ఆతురతతో నీరిక్షించసాగింది. వారంరోజులు గడిచినా ఏ సమాధానమూ రాలేదు. క్రుంగిపోయింది జానకి. రాత్రి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు.
    మాధవ మనసులో తనకున్న స్థానమేమిటి?
    ఆయనకు తానేమీ కాదనుకొని దూరంగా నిర్లిప్తంగా ఉండిపోదామనుకుంటే ఆయనే దగ్గరకు పిలుస్తున్నారు. తన అదృష్టానికి పొంగిపోబోయే లోపల ఇలా తాటస్త్యం వహిస్తున్నారు. తను స్వయంగా రమ్మని రాసినా రాలేని పనులున్నాయా ఆయనకక్కడ? ఇంత చిన్న మురిపెం చెల్లించలేకపోయిన తర్వాత ఆ ఉత్తరాలన్నీంటికీ అర్ధం ఏమిటీ?
    మనసులో భారాన్నంతా అణచుకుని నిర్లిప్తంగా వంటగదిలో వంటమనిషికి సాయపడుతున్న జానకికి హాల్లోంచి చిరపరిచితమైన నవ్వు వినిపించింది. గుండెలు ఝల్లుమన్నాయి. క్షణం తనను తను మరిచిపోయింది. కూర కలియ బెడుతున్న గరిట అలానే చేత్తో పుచ్చుకొని ఇంచుమించు పరుగులా హాల్లోకి వచ్చేసింది.
    "ఆ! ఆ! కాస్త నిదానంగా నడు. పడగలవు!"
    మనసారా నవ్వుతూ అంది కాత్యాయని. మాధవ చిరునవ్వుతో జానకి ముఖంలోకి చూశాడు. మాధవ వచ్చినందుకు పట్టరాని సంతోషం ప్రతి ఫలిస్తున్న ముఖం. అలా ఆత్రంగా వచ్చినందుకు లజ్జతో కందిపోతుండగా తల దించుకుంది జానకి. సంతోషంతో మెరుస్తున్న కళ్ళు. ఏదో సంభ్రమంతో అదురుతున్న పెదవులు, రాగం ప్రతిఫలించే రక్తిమ నిండిన చెక్కిళ్ళూ అలా జానకి ముఖంలోకి చూస్తూ కూర్చోవాలనిపించింది మాధవకు.
     "చేతిలో ఆ గరిటె కూడా ఎందుకు? మాధవ నీ ఉత్తరం అందుకున్న వెంటనే రాక ఆలస్యంగా వస్తే దండించవలసింది ఆ గరిటతో కాదు....." చిరునవ్వుతో అంది కాత్యాయని.

 Previous Page Next Page