Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 16


    ఈ వేదనలన్నిటితో కొన్ని పాత్రలు పూరించుకుని, యితివృత్తాన్ని సమీకరించుకుని అతను నవల రాస్తున్నాడు.
    ఆ నవల్లో ఓ స్త్రీ పాత్రవుంది.  ఆ పాత్రద్వారా స్త్రీ అంతరంగంలోకి జొరబడదామని మూర్తి ఆరాటపడుతున్నాడు. ఈ ఎంగర్ జనరేషన్ లోని స్త్రీలను అతను నిశితంగా పరిశీలిస్తున్నాడు. అసలు వాళ్ళకు కావలసిందేమిటి? ఎందుకంత రెస్టులెస్ అయిపోతూవుంటారు? ఎందుకలా కారాలూ మిరియాలూ నూరుతూ విరుచుకు పడిపోతూ వుంటారు? అసలు వాళ్ళ బాధేమిటి?
    తాసీల్దారుగారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చే కకలంముందుకు స్థానంలేదు. ఆ అధ్యాయం అప్పుడు పూర్తిచేయలేడనిపించింది.
    అప్పటికి సాయంత్రమై ఆఫీసు కట్టేసేవేళయింది.
    మూర్తి మెట్లుదిగి గేటుదగ్గిరకు వస్తుంటే డ్రైవర్ కారు తీసుకు రాబోతున్నాడు.
    ఇంటికి కాదనిచెప్పి కారు అక్కర్లేదని అతను గేటుదాటి రిక్షాకోసం చూస్తున్నాడు. అతనప్పుడు రాఘవ ఇంటికి వెడదామని సంకల్పించాడు. అతడు ఆఫీసుపనులకి తప్ప సొంత పనులకి కారు వాడుకోడు.
    అతని ముందుకు ఓ రిక్షావచ్చి ఆగింది. "వస్తారా బాబూ" అన్నాడు రిక్షావాడు.
    మూర్తి అతని ముఖంలోకి చూశాడు. బలంగానే వున్నాడుగాని వయసుమళ్ళింది.
    "ఏమోయ్! పెద్దవాడిలా కనిపిస్తున్నావు త్రొక్కగలవా?"
    "అదేంటి బాబూ! నాతోటి సమానంగా ఈ కాలం కుర్రోళ్ళని తొక్కమనండి. ఆళ్ళెం సాల్తారు బాబూ?"
    "బేరం చెయ్యాలంటావా?" బేరం చెయ్యకుండా రిక్షాలు ఎక్కితే వాళ్ళతో జరిగే ఘర్షణలు అతనికి తెలుసు.
    "మీలాంటోళ్ళ దగ్గర బేరాలేటి? ఎక్కండి బాబూ?"
    అతను ఎక్కి కూచుని, జగన్నాధపురం పోనివ్వమన్నాడు.
    దారిలో ఓ మైదానంలొ ఎగ్జిబిషన్ జరుగుతోంది. 'ఇండస్ట్రియల్ ఎండ్ ఎగ్రికల్చర్ ఎగ్జిబిషన్' అనివుంది బయటకు. లోపలమాత్రం దానికి సంబంధించింది చాలా తక్కువ వుండి ఎక్కువగా షాపులూ, తినుబండారాలూ, వేడుకలూ వుంటాయి.
    మనుషులు ఎక్కడపడితే అక్కడ యిసుక వేస్తే రాలనట్లుగా వున్నారు. రోడ్లమీదా, రోడ్డుప్రక్క నా వాహనాలు ముందుకెళ్ళటానికికూడా వీల్లేనట్లుగా మనుషులమయం.
    రిక్షావాడు అతికష్టంమీద దారిచేసుకుని ముందుకు పోతున్నాడు. చివరకు ఎలాగో వాళ్ళనుదాటి వొడ్డున పడ్డాడు.
    "అయ్యగారూ! యీ చిత్రం చూశారా?" అన్నాడు ఆ గలాభాలోంచి యివతలకొచ్చాక.
    "ఏమిటి?" అన్నాడు మూర్తి.
    "ఇంతమంది మనుషులని దాటుకొచ్చినాంకదా? మీకేంటి తట్టినాది?"
    అతను గబగబ ఆలోచిస్తున్నాడు.
    "ఏటిబాబూ మాట్టాడరు?"
    "మనలో ఎవరికీ రోడ్డు సెన్స్ లేదు. రోడ్డుమీదకూడా యిళ్ళలో వున్నట్లే వుంటారు."
    "అదికాదు బాబూ. ఈ మనుషులలో ఎంతమంది ఆడాళ్ళున్నారో చూశారాబాబూ! అసలు ఎంతమంది ఆడోళ్ళకి ఒక మొగాడు నలుసులా అవుపిస్తూ మెదుల్తున్నాడో చూశారా! అహ! అసలెంతమంది ఆడాళ్ళకి ఒక మొగాడో చూశారా అంట?"
    అప్పుడు తట్టింది అనంతమూర్తికి. ఆమాట నిజమేనని ఒప్పుకున్నాడు.
    "మీరెప్పుడైనా యీ ఎజ్జిమిషన్ లోనకు యెళ్ళారా బాబూ?"
    "ఓసారి వెళ్ళానోయ్."
    "మీకేటి కనిపించింది?"
    ఈసారి అతను జాగ్రత్తగా ఆలోచించి "నువ్వు యిందాక చెప్పిందే మొగాళ్ళకంటే ఆడవాళ్ళే  ఎక్కువ."
    "అంతేనా? మీకింకేటీ తట్టలేదా బాబూ?"
    మూర్తికి వాడు మేధావిలా చిక్కు ప్రశ్న లేస్తున్నట్లని పించింది.
    "లోపల కొట్లూ అవీ చూశారా? బట్టలకొట్లూ సామాన్లకొట్లూ, గాజులకొట్లూ, యింకేవేవో నగానట్రా లాంటికొట్లూ....యియన్నీ ఆడాళ్ళకి పనికొచ్చేదేగానీ, మొగాళ్ళకోసం వున్నవి ఎన్నుంటాయి బాబూ? ఎన్ని చీరెల కొట్లు, రకరకాల చీరెలు...అసలు గట్టిగా ఆలోచిస్తే యీ ఎజ్జిమిషన్లనేది ఆడాళ్ళకోసమే పెట్టినట్లుగా లేదుబాబూ?"
    మూర్తి ఏమీ మాట్లాడలేదు. అతనిమాటల్లో నిజానిజాలు ఆలోచిస్తూన్నాడు.
    "అస్సలు గట్టిగా ఆలోచిస్తే ప్రపంచంలో తయారయ్యే వస్తువాలన్నీ చాలాభాగం ఆడాళ్ళకోసమే తయారయినట్లు అనిపించదు బాబూ! అస్సలు బాబూ! యిలా అంటున్నానని ఆడదానిమీద నాకు కోపమని అనుకోమాకండి. నాకూ కూతుళ్ళున్నారు, కోడళ్ళున్నారు, నలభయిఏళ్లమట్టీకాపరం చేస్తున్న మా ముసల్దివుంది. కాని యిన్నేళ్ళుగా ప్రపంచ కాన్ని చూసిన అనుభవంతో చెబుతున్నాను బాబూ. యిన్ని సుఖాలున్నాయికదా బాబూ ఆళ్ళకి. ఆళ్ళు-ఏమిటి జీవితమంతా నాశనమై పోయినట్లు తెగ బాధపడిపోతారు? ఏటి బాబూ ఆళ్ళ బాధ?"
    ఈ రిక్షాఅతనెవరో మేధావి వర్గానికి చెందినవాడిలా వున్నాడనుకున్నాడు మూర్తి.
    "అవును బాబూ! ఏటసలు ఆళ్ళబాధ? రెండుపూటలా తింటారు. ఆఁ రోజు కారుసార్లు కాపీలు తాగుతారు. మిట్టమద్దానం మేటినికి నెలల పిల్లల్ని చంకనేసుకుని తయారవుతారు. అది నా శ్రావు బొమ్మో, రామారావు బొమ్మో అయితే చెప్పక్కర్లేదు. మళ్ళీ ఆళ్ళనేదో అన్నేయం చేసేసినట్లు మొగాలు ముడుచుకుంటారు! అస్సలు ఆ అంటే మొహం ముడుచుకోవటం ఊ అంటే ముడుచుకోవటం ఇశత్రమేటంటే బాబూ ఆళ్ళు చేసిన తప్పులకి కూడా అంతా మనమీద మోసేసి, చిటపటలాడిపోయి అసలు తప్పు మనమే చేశామా అన్నట్లు బోల్తా కొట్టించేస్తారు బాబూ."

 Previous Page Next Page