శ్రీధర్ శర్మకు వరుసకి అక్క అవుతుంది సత్యవతి. ఆకస్మాత్తుగా భర్త పోవటంతో ఆమె సంసారం ఆర్ధికంగా చితికిపోయింది. శర్మఆమెను ఓదార్చి ఆమె కొడుకు రాజారావును తన ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పించసాగాడు. సత్యవతి పొంగిపోయింది. ఎలాగైనా రాజు శకుంతలను చేసుకుంటే బాగుండునని ఆమె అంతరాల్లో ఆశ. అందుకే శకుంతలని మరింత ముద్దుచేస్తుంది.
శకుంతల షికారుకి రమ్మన్నప్పుడు రాజు చదువుకొంటూంటే అతడ్ని మందలించి మరీ షికారుకి పంపేది. ఇది కనిపెట్టిన శకుంతల ఆ గారాబం ఆసరాగా చేసుకుని రాజుని అప్పుడప్పుడు ఏడిపించేది శకుంతలలో అహం వున్నట్లు అర్ధంచేసుకున్న రాజు ఆమెకు దూరంగా వుండటానికే ప్రయత్నించేవాడు.
అతనికి తల్లి దగ్గరకంటే విమల దగ్గరే సుఖంగా ఉండేది. తల్లిలా విమల రాజుని శకుంతలతో షికారుకు వెళ్ళమని బలవంతం చేసేదికాదు. శకుంతలనే మందలించేది. రాజుకి ఎప్పుడెప్పుడు ఏం కావాలో, అన్నీ అభిమానంగా ఆప్యాయంగా చూచేది.
శర్మ సత్యవతిని కూడా తమతో వచ్చి ఉండమన్నాడు. కానీ, ముసలి అత్తగారితో సత్యవతి వేరుగానే ఉంటానంది. రాజుని పోషిస్తూ చదువు చెప్పిస్తున్నారు. అదే చాలను కొంది. ఆమె తమ అందరి బరువూ వేసేస్తే మొదటికే మోసం వస్తుందేమోనని ఆమె భయం. ఎలా అయినా, తనకొడుకు చదువుకొని ప్రయోజకుడు కావాలి. అదీ ఆమె ధ్యేయం.
రాజు కాలేజీలో చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. స్ట్రిక్టుగా మెరిట్ ప్రకారం సీట్లు ఇవ్వాలని అన్ని కాలేజీలలోనూ నియమం వుంచింది.
ఒక విధ్యార్ది జీతం కట్టాలని వెళితే ఒక క్లర్క్ "పది రోజుల వరకూ జీతాలు తీసుకోం పది రోజుల తర్వాత రా!" అన్నాడు.
ఆ విద్యార్ధి నమ్మి వెళ్ళిపోయాడు. సాధారణంగా నోటీస్ బోర్డులో ఎప్పుడు జీతం కట్టాలో నోటీసు పెడతాడు. అతడు చూశాడు కానీ, చిన్న పిల్లవాడు కావటంవల్ల క్లర్క్ మాటలు నమ్మి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అతడు జీతం కట్టలేదని మరొక ఆశ్రితుడికి ఆ సీటు ఇచ్చుకున్నాడు ఆ క్లర్క్.ఆ విద్యార్ధి చాలా బాధపడ్డాడు. అతడు మరే కాలేజీలోనూ ఫీజు కట్టలేదు.
ఈ సంగతి తెలిసి విద్యార్ధులు గొడవ చేశారు. మేనేజిమెంటు వారు పోలీసులను పిలిపించి అల్లరి అణచేశారు. ఆ తర్వాత అదంతా సంఘ విద్రోహకారులు ప్రేరేపణగా వార్త వచ్చింది. అది చదివి ఉడికిపోయాడు రాజు. విమలదగ్గరికి వచ్చి చూడత్తా? ఎంత అన్యాయమో! జరిగింది. ఒకటయితే పేపర్లలో వచ్చేది మరొకటి. ఇలా లోకాన్ని మోసం చేస్తారా? నిజం బయటపెట్టేవాళ్ళే లేరా?" అన్నాడు.
విమల నవ్వి "ఇది ఎప్పుడూ ఇంతేగా రాజూ! పేపర్లలో జరిగినవి జరిగినట్టుగా ఏ వార్తలు వస్తాయి" అంది.
రాజు కొంచెంసేపు ఆలోచిస్తూ వుండిపోయి. "అత్తా; నేను పెద్దయ్యాక నేనే పత్రిక నడుపుతాను. పచ్చి నిజాలు బయటపెడతాను." అన్నాడు.
విమల నవ్వేసింది. కాని, రాజు మనసులో మాత్రం ఈ సంకల్పం వయసుతోపాటు దృఢపడసాగింది. అందికే తల్లి మెడిసిన్ చదవమని ఎంతపోరినా వినకుండా జర్నలిజం తీసుకున్నాడు. సత్యవతి కొంత నిరాశ పడినా కొడుకుతో వాదించలేక ఊరుకోంది.
శకుంతల తేలికగా "ఛా! పత్రిక పెడతావా! అదేం గొప్ప అంది.
రాజు మనసు చివుక్కుమన్నా శాంతంగా, "గొప్ప అంటే?" అన్నాడు. శకుంతల విషయంలో చాలా సహనంగా ఉంటాడు రాజు.
"గొప్ప అంటే - గొప్ప అంటే - ఏముందీ? పెద్దపెద్ద మేడలూ కారులూ, మాంచి మాంచి బట్టలూ, క్రికెట్ మాచ్ లు__"
శకుంతల మాట్లాడుతుండగానే నవ్వేసాడు రాజు. శకుంతల వుడుక్కుని, "ఎందుకు నవ్వుతున్నావు? అంది.
రాజు సమాధానం చెప్పలేదు. శకుంతల తల్లిదగ్గర జరిగిందంతా ఫిర్యాదు చేసింది. విమల భయంగా చూసింది కూతుర్ని. "శకూ! ఇలా డబ్బంటే వ్యామోహం పనికి రాదమ్మా! మనిషి గొప్పతనం డబ్బులో లేదు" అంది.
రాజు ముఖం వికసించింది. శకుంతల టప్ టప్ మని నేలనుకాళ్ళతో తంతూ "పో! నీకు బావ అంటేనే ఇష్టం" అంది ఏడుపు గొంతుకతో.
విమల కోపంగా శకుంతల భుజాలు పట్టుకుని ఆపు చేస్తూ, "శకూ నువ్వు చిన్నపిల్లవి కావు, పిచ్చివేషాలు వెయ్యకు" అంది.
తల్లికి నిజంగా కోపంగానివస్తే శకుంతల భయపడుతుంది. బుద్దిగా ముఖం పెట్టి సారీ మమ్మీ" అంది. అలా అనటంలోనూ పసితనమే ఉంది.
కాలేజీలకు సెలవులిచ్చారు. రాజు తోటి విద్యార్దులతో ఎక్స్ కర్షన్ కి వెళ్లాడు. అలా అన్ని ఊళ్లూ తిరగటం, విశేషాలు తెలుసుకోవటం రాజు కెంతో ఇష్టం. అతడెప్పుడూ ఒక డైరీ వ్రాస్తుంటాడు. ముఖ్యమైన విషయాలన్నీ ఆ డైరీలో ఉంటాయి. అతడికి అప్పటికే రమాకాంత్ అనే పత్రికాధిపతితో స్నేహం ఉంది.
వార్తలను సేకరించటంలో రమాకాంత్ చాకచక్యం చూసి ఆశ్చర్య పోయేవాడు రాజు అత్యంత రహస్యమయిన వార్తలన్నీ అతని పత్రికలో ముందుగా ప్రచురితమయ్యేవి. రాజకీయ నాయకులకూ, బడా వ్యాపారస్తులకూ- ఈ పత్రిక అంటే బెదురుగా ఉండేది.
11
సాయంత్రం ఈశ్వరి గుడికీ, సేతుపతి క్లబ్ కీ వెళ్ళారు శర్మరాత్రి ఉచితంగా వయోజన పాఠశాలలో చదువు చెపుతున్నాడు. శకుంతల తన గదిలో కూచుని సెమీనా తిరగేస్తూంది. కొత్త ఫాషన్ల కోసం.
ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది. గ్యాస్ స్టౌ ఆఫ్ చేసి విమల వచ్చి తలుపు తెరిచి- దయ్యాన్నో, పిశాచాన్నో చూసినట్లునిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
"మే ఐ కమిన్?" అంటూనే నవ్వుతూ వచ్చి సోఫాలో కూచున్నాడు రమేష్. అతడు ఎప్పటిలాగే నవ్వుతున్నాడు. ఈ సుదీర్ఘకాలంలో ఏమీ జరగనట్లే నవ్వుతున్నాడు . తెల్లగా పొడుగ్గా ఆరోగ్యంగా ఇదివరకు ఉన్నట్లే ఉన్నాడు. ఒక్కటే తేడా ఇదివరకు విమలకు అతనిముఖంలో ఆకర్షణ కనిపించింది. ఇప్పుడతని కళ్ళలో భయంకర విషసర్పాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తను అమాయకంగా ఆకర్షణ అనుకొన్నది. ఆ విషం తాలూకూ ప్రమాదకరమైన మెరుపు అని ఇప్పుడు అర్ధమవుతోంది.