విమల కూచోకుండా, సోఫాని ఆనుకొని నిలబడి, "ఎందుకొచ్చావు" అంది.
రమేష్ అదొక రకంగా నవ్వి, "భయపడకు నీ భర్తా, అత్తగారూ వచ్చే లోగానే వెళ్ళిపోతాలే" అన్నాడు.
'అంతా తెలుసుకొనే వచ్చాడన్నమాట?' ఒకప్పుడు ఇతనిలో ఠీవి ఉందనుకొని పొరపడింది. తను ఠీవి అనుకొన్నది బందిపోతుతనం.
"ఇక్కడ నీకేంపని?"
"ఏముంటుందీ? నిన్నూ నా కూతుర్నీ తీసుకుపోవటానికి వచ్చాను అతి మామూలుగా అన్నాడు.
అదిరిపడింది. కోపమూ, భయమూ ఆమె సర్వాంగాలనూ వణికిస్తున్నాయి.
"నువ్వెవడివి నన్నూ, నా కూతుర్నీ తీసికెళ్ళటానికి!"
"వాట్ డియర్! నువ్వు నన్ను అంత తేలిగ్గా మరిచిపోయావని అనుకోకు. ఒకవేళ మరిచిపోతే గుర్తు చేసే ఆధారాలు నా దగ్గిర ఉన్నాయి"
విమలలో భయం పోయింది. అసహ్యం వేసింది. ధైర్యంవచ్చింది నిటారుగా నిలబడింది.
"ఓహ్! ఇన్నాళ్ళ తరువాత బ్లాకుమెయిల్ చెయ్యటానికి వచ్చావన్నమాట? కానీ నువ్వు చెయ్యగలిగినదేమీ లేదు. నేను ఆయన దగ్గిర ఏదీ దాచలేదు. నువ్వు నన్ను ఏమీ....ఏమీ చెయ్యలేవు."
రమేష్ నవ్వాడు. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నయినా నవ్వటం ఒక గొప్ప ఆకర్షణ అనుకొంది. కానీ ఇప్పుడానవ్వులో క్రౌర్యం స్పష్టంగా వినిపిస్తోంది. భయంకరంగా వుంది ఆ నవ్వు.
"ఆల్ రైట్! నువ్వూ, మీ ఆయనా అంత గాఢంగా ప్రేమించుకొంటే, మీ ప్రేమికులను నేను విడదియ్యను. కానీ, నా కూతుర్ని నా కిచ్చెయ్యి; మీరు మరింత హాయిగా వుండవచ్చును."
"గెటౌట్!"
ఈలోగా హాల్లో మాటల సందడికి శకుంతల తన గదిలోనుండి వచ్చింది.
"ఎవరూ? శకుంతలా! ఇటు రామ్మా!" అన్నాడు రమేష్.
శకుంతల అమాయకంగా అతని దగ్గిరకు వెళ్ళబోయింది. విమల భయంగా-"వద్దు అతని దగ్గిరకు వెళ్ళకు. ఇటురా!" అంది.
తల్లి కంఠంలో ఏం విన్పించిందో శకుంతల అతని దగ్గిరనుండి వచ్చేయబోయింది. రమేష్ శకుంతల చెయ్యి పట్టుకొన్నాడు. శకుంతల అతని చెయ్యి గట్టిగా కొరికి తల్లి దగ్గిరకు వచ్చేసింది.
"అబ్బా!" అని తన గాయాన్ని చూసుకున్న రమేష్ నవ్వుతూ, "నా కూతురు గట్టిదే!" అని లేచి, "బాగా ఆలోచించుకో! నా కూతురు నాకు కావాలి. మర్యాదగా ఇవ్వకపోతే...." ఆగి నవ్వేసి వెళ్ళిపోయాడు.
శకుంతల వింతగా - "నా కూతురు - అంటాడేమిటమ్మా?" అని అడిగింది.
విమల సమాధానం చెప్పలేక పోయింది. శకుంతలను గభాలున దగ్గరకు తీసుకుంది. శకుంతల తన చేత్తో కన్నీళ్లు తుడిచేవరకు ఏడుస్తున్నానని ఆమెకు తెలియలేదు. శకుంతల తల్లిని చుట్టేసి, "అమ్మా! నేను నీ దగ్గర్నుంచి ఎక్కడికీ పోను" అంది ముద్దుగా.
విమల కూతురి తలను ముద్దు పెట్టుకొని, "వెళ్ళి చదువుకో!" అని కొంచెం ఆగి సంకోచిస్తూ, "ఇతడు వచ్చినట్లు ఎవరికీ చెప్పకు" అంది.
శకుంతల కిది నచ్చలేదు. "ఎందుకమ్మా! డాడీకి చెప్తే ఈ రాస్కెల్ కి బాగా బుద్ది చెపుతారు" అంది.
విమలకి భయం వేసింది. "నేను చెపుతాను - నువ్వేమీ చెప్పకు. నామీద ఒట్టు." అంది శకుంతల తల వూపింది.
ఆ రోజంతా విమల శర్మకు చెప్పటమా, మానటమా అని, సంకోచిస్తూనే గడిపింది. కాలేజీ పనితో పాటు స్వచ్చంద సేవాసంస్థలలో పాల్గొని, రాత్రిబడిలో కూడా పనిచేసి, అలసటతో వచ్చిన అతనికి ఈ చికాకులు చెప్పలేక పోయింది. ఈ సమస్య అతనిదాకా రాకుండా, తను పరిష్కరించు కోలేనా-అనుకొంది. తను ఏమీ తప్పు చెయ్యనప్పుడు- తనవల్ల అతనికే విధమయిన అన్యాయమూ జరగనప్పుడు, చెప్పకపోయినా ఫరవాలేదు- అనుకొంది. అన్నిటికంటే అతడు తనను బ్లాక్ మెయిల్ చెయ్యలేడు- అనే విషయం ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చింది.
మొత్తంమీద రమేష్ రాక విషయం శర్మకి చెప్పలేదు. ఆ తర్వాత రమేష్ చాలాసార్లు వచ్చాడు. అతడు రాగానే విమల భయంతో శకుంతలను ఆ పరిసరాల నుంచి పంపేసేది.
రమేష్ శకుంతలను తన కిమ్మని అనేక విధాల బ్రతిమాలాడు, బెదిరించాడు.
విమల మోడిగా ధైర్యంగా, "శకుంతల పైన నీ అధికారం ఏం లేదు" అని చెప్పింది.
రమేష్ కోపంగా- "ఇంతవరకూ మర్యాదగా అడిగాను. నువ్వు దారికి రాలేదు. ఫలితం అనుభవిద్దువుగాని" అని వెళ్ళిపోయాడు. అప్పుడు 'పీడ వదిలింది' అనుకొంది. కానీ లాయర్ ద్వారా రమేష్ పంపిన రిజిష్టర్ నోటీస్ అందుకున్నాక కానీ, అతని మాటలకు అర్ధం తెలియలేదు. ఈ విషయం కోర్టుల కెక్కుతుందని అనుకోగానే విమల క్రుంగిపోయింది. శర్మ లోలోపల ఏమనుకున్నా, పైకి ధైర్యంగా పరిస్థితి నెదుర్కోటానికి సిద్దపడ్డాడు.
12
ఈ వింతకేసు లోకాన్ని విశేషంగా ఆకర్షించింది. ప్రజలు ఎక్కడ గుమిగూడినా ఈ విషయం చెప్పుకోసాగారు. పత్రికలు ఈ కేసుకు సంబంధించిన వార్తలు ప్రచారంచేసి సొమ్ము చేసుకోసాగాయి. లజ్జాభారంతో, మానసికాందోళనతో విమల మంచం ఎక్కింది. గుడ్డిలో మెల్లగా ఈశ్వరి, సేతుపతులు తీర్ధయాత్రలకు వెళ్ళారు. అంచేత ఈ విషయం వింటే ఆ వృద్దదంపతులు ఏమయిపోతారో అనే ఆందోళన విమలను మరింతగా క్రుంగదీస్తోంది.
శర్మ తరపు లాయరు మొదట, శకుంతల శర్మ కూతురే అని వాదించాడు. అప్పుడు రమేష్ తరపు లాయర్, విమల రమేష్ కి వ్రాసిన ఉత్తరాలు కోర్టులో సబ్ మిట్ చేశాడు.
"రమేష్ డార్లింగ్:
నువ్వు వెళ్ళి అప్పుడే రెండురోజులు అంటే రెండూ x24గంటలు. అంటే రెండూx24x60 నిముషాలు. అంటే రెండూx24x60x60 సెకన్లు గడిచిపోయాయి. నువ్వు దూరమయిన ఒక్కొక్క సెకనూ, నాకెంత సుదీర్ఘంగా, ఎంత బాధామయంగా వుందో ఊహించగలిగితే, నువ్వు వెంటనే రెక్కలు కట్టుకొని నా దగ్గిర వాల్తావు. ఉద్యోగం, ఉద్యోగం అంటూ పారిపోతున్నావు. వెధవ ఉద్యోగం పోతే పోయింది - వచ్చెయ్యరాదూ! మరో ఉద్యోగం చూసుకోలేమా? పోనీ, నేనే వచ్చేస్తానంటే, "వద్దు. తొందర పడొద్దు" అంటావు ఇలా నీకు దూరంగా నేను బ్రతకలేను. నాలో ఉన్న మన పాప, నిన్ను తొందరగా రమ్మని రాయమంటోంది. వీధిలో సన్నజాజుల మీదుగా చల్లగాలి-మనం గడిపిన తియ్యని క్షణాలను నా చెవిలో గుసగుసలు చెప్తూ నాకు ఊపిరి ఆడనియ్యటంలేదు. చందమామ నన్ను చూసి, పకాలున నవ్వి మబ్బుచాటున దాక్కొంటున్నాడు. ఎటు తలతిప్పినా, ఏం ఊహించినా__నువ్వే! నువ్వే! నువ్వే! నువ్వు త్వరగా రాకపోతే నేను నీకోపం బెంగపెట్టుకుని చిక్కిపోతాను. నీ పాపాయికే నష్టం_త్వరగావచ్చెయ్
నీ విమ్మీ"