Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 16

    విమల-"మీ మనవడుగారిని అడిగి చెపుతాను." అంది.    
    విమల యీ విషయమంతా చెప్పినప్పుడు శర్మ నవ్వి, "అమ్మ! నాన్నకూ నేను ఒక్కడినే కొడుకునని నీకు తెలీదా! యీ వయసులో వాళ్ళని వదలి డబ్బుకోసం నేనిక్కడ ఉండగలనా? నువ్వు ఉండాలనుకొంటే నేను అభ్యంతరం చెప్పను," అన్నాడు.    
    అదిరిపడింది విమల "ఏమిటి! నేను మిమ్మల్ని వదిలి__" ఆగిపోయిన గుండెమీద చేయి వేసుకుని తనను తాను స్థిమిత పరచుకొని "నాకు యీ డబ్బుమీద అసలు వ్యామోహంలేదు. మా నాన్నని ఆ పెట్టిన డబ్బు.....మా అమ్మ ప్రాణాలు తీసిన డబ్బు__యీ డబ్బు నాకెందుకు? మీ మాట కాదనలేక ఇక్కడీ వచ్చాను. మీరేమంటానని మాత్రమే నాయనమ్మ చెప్పిన విషయం మీకు చెప్పాను. నాకీ డబ్బు ఎంతమాత్రం అక్కరలేదు" అంది.    
    "రెండు రోజులుండి వెళ్ళిపోదాం" అన్నాడు శర్మ.    
    అతనికి ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో ఉన్న పల్లెలు చూడటం, పల్లె జనంలో మాట్లాడటం చాలా సరదాగా ఉంది. రోజూ ఉదయం టిఫిన్ చేసి, పని కుర్రాడిని తోడు తీసుకుని పల్లెలకు ప్రయాణమవుతాడు. వాడికి ఇంచుమించు పద్దెనిమిదేళ్ళు ఉంటాయి. వాడి చేతిలో తుపాకీ ఉంది. వాడిది చాలా మంచి గురి.    
    విమలకు కాస్త భయంగానే ఉన్నా శ్రీధర్ ని ఆపలేక పోయింది. ఆ రోజు ఎప్పటిలాగే శ్రీధర్ పని కుర్రాడితో వెళ్ళాడు, ముందు వరండాలో నిలబడి ఊరికే బయటికి చూస్తున్న విమల వెనక అడుగుల చప్పుడు వినపడి అటు తిరిగింది. పామును చూసినట్లు త్రుళ్ళిపడింది.
    అక్కడ నిలబడ్డవాడు రమేష్! ఒక భయంకరమైన పీడకలలా తను మర్చిపోదామనుకుంటున్న రమేష్. అతడి ముఖంలోనూ ఆశ్చర్యం కనబడింది. పాంట్ జేబులలో చేతులు పెట్టుకొని విలాసంగా నవ్వుతూ నువ్వా! ఎవరో అనుకున్నాను?" అన్నాడు.    
    విమల మాట్లాడలేదు, ఆమె గుండెలు వేగంగా కొట్టుకొంటున్నాయి.    
    "ఎలా ఉన్నావ్? మెళ్ళోనల్లపూసలూ, కాళ్ళకు మట్టెలూ-పెళ్ళి చేసుకున్నావా? ఎవరా అదృష్టవంతుడు!"    
    అప్పటికి విమల మాట్లాడలేదు. ఆ సమయంలో శకుంతల "మమ్మీ" అంటూ వచ్చింది.        
    "ఎవరీ బేబీ? నీ కూతురా?"    
    విమల శకుంతలను దగ్గిరకు లాక్కుంది.    
    "చాలా ముద్దుగా వుంది నా పోలికలు కనిపిస్తున్నాయి."    
    "ఛీ" అంది విమల.    
    ఆ చీత్కారానికి కూడా విలాసంగా నవ్వాడు రమేష్. "ఇంతకూ నువ్విక్కడికి ఎలా వచ్చావు! నే నిక్కడున్నట్లు ఎలా తెలిసింది?"    
    "నువ్విక్కడున్నట్లు తెలిస్తే ఈ ఛాయలకైనా వచ్చేదానిని కాదు."    
    "మరెందుకొచ్చావు? రాణీగారి ఇష్ట సఖులలో ఎవరైనా తెలుసా నీకు? ఆశ్చర్యంగా ఉందే?" అంటూ "ప్రస్తుతం వెళ్ళాలి. రాణీగారితో అర్జంటుగా మాట్లాడవలసిన విషయాలున్నాయి. మళ్ళీ కలుస్తాను. సీ.యూ."    
    అతడు ఎంతో స్వతంత్రం ఉన్నవాడిలా రాజవల్లి గదిలోకి వెళ్లాడు.    
    ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విమలకి తెలుసు కోవాలనిపించలేదు. అసలామె మనసు పనిచెయ్యటంలేదు. ఒక్కటే ఆలోచన - అక్కడి నుండి తక్షణం వెళ్ళిపోవాలి. అక్కడ క్షణమయినా నిలవకుండా తనకని ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. గబగబా సామానులన్నీ సర్దేసుకుంది. శకుంతలను దగ్గరకు లాక్కుని, కూచుంది: తలుపు తట్టిన చప్పుడయింది, విమల పలకలేదు,....లేవలేదు. మళ్ళీ చప్పుడు.    
    "ఎవరూ?" అంది వణుకుతున్న గొంతుతో.    
    "నేనే. తలుపుతియ్యి" అన్నాడు శర్మగట్టిగా.    
    ఆ కంఠం విన్నాక కొంచెం ధైర్యం తెచ్చుకొని అప్పుడు తలుపు తీసి, "హమ్మయ్య! వచ్చేశారా!" అంది.    
    "ఇదేమిటి ఎందుకిలా వణికిపోతున్నావు? ఒంటి నిండా చెమటేమిటి? ఏం జరిగింది;"    
    "ఏం లేదు మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం!"    
    "ఎందుకూ? మరోరెండు రోజులు సెలవుందిగా?"    
    "ఉంటే వుంది. అక్కడే ఆ సెలవులు కులాసాగా గడుపుదాం. ఇక్కడ మరొక క్షణం కూడా వుండను."    
    విమల కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి; ఆమె తన తల్లిని తలుచుకొని బాధపడుతోందన్నాడు శర్మ, తల్లిపట్ల ఏ మాత్రం సానుభూతి చూపకుండా తరిమికొట్టిన వాళ్ళింట్లో వుండలేక పోతోందనుకొన్నాడు. అతని మనసు ఆర్ద్రమయింది. ఆమె కన్నీళ్లు తుడిచి, "నీ ఇష్టం" అన్నాడు.    
    విమల ప్రయాణం ఆపటానికీ, కనీసం రెండురోజులుంచటానికీ రాజవల్లి చాలా ప్రయాసపడింది. కానీ విమల మొండిగా తిరస్కరించింది.    
    "ఈ అంతస్తుల కారణంగానే మా అమ్మ పడరానిపాట్లు పడింది, ఇప్పుడీ అంతస్థులు నా కెందుకూ! ఇవేమీ లేకుండా నేను సుఖంగావున్నాను అంది.    
    రాజవల్లి పెట్టబోయిన బట్టలూ, నగలూ కూడా తిరస్కరించింది. ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నా విమల మనసు కరగలేదు.    
    "పోనీ__పసిదాని మెడలో ఈ ముత్యాల గొలుసు వెయ్యనియ్యి" అని ముత్యాల గొలుసు శకుంతల మెడలో వేసింది. గొలుసు డాలర్ లో వజ్రాల మధ్య పొదిగిన విమల తాతగారి ఫోటో వుంది.    
    "ఇంత ఖరీదయిన నగ చిన్నపిల్లకి వద్దు" అని విమల తీసెయ్యబోయింది. కానీ, ఆ వజ్రాల కాంతులచేత ఆకర్షింపబడి శకుంతల గొలుసు తీయనీయకుండా ఏడ్చింది. శకుంతలను ఏడ్పించటం విమలకు సాధ్యంకాని పని.    
    "ఈ గొలుసు మీ తాతగారిది. ఆయన దీనిని ప్రాణంగా చూచుకొనేవారు." అంది రాజవల్లి.    
    విమల విన్పించుకోలేదు. ఆరోజే రాజవల్లిని యధాప్రకారం ఆమె ఒంటరితనంలో వాదిలి విమలా శర్మలు శకుంతలను తీసుకుని ఆ ఇల్లు వదిలేసారు.
    
                                                               10
    
    కాల ప్రవాహంలో పదేళ్ళు దొర్లి పోయాయి, తనకొక గతంఉందనే సంగతి విమల పూర్తిగా మరిచిపోయింది. శకుంతల ఆ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతోంది. ఆమె ఏది అడిగినా; వెంటనే అది ఆమె చేతులలో వుంటుంది. సహజంగా గారాబంగా పెరిగే పిల్లల్లో వుండే మంకు తనమూ, పట్టుదలా మొదలైన లక్షణాలున్నా, శకుంతల మనసు చాలా మంచిది. చదువులో చాలా చురుకైనది.

 Previous Page Next Page