Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 17

    "బాగున్నారా చౌదరీ సాబ్..." కృషి మాట్లాడుతోంది "ఇక ఆ లేండ్ గురించి కోర్టులో గొడవలూ శత్రుత్వాలూ లేకుండా సెటిల్ చేసేశానుగా".    
    "నా కెందుకు ఫోన్ చేశావ్"   
    "ఇది నా నుంచి నీకు మూడో ఓటమి అని గుర్తుచేయటానికి"    
    "......."    
    "ఏం నిశ్శబ్దంగా వుండిపోయారు. మూడోది ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా - మొదటిది మీ క్విజ్ కిడ్ ని గెలిపించాలని మీరు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టి విస్సుని గెలిచినట్టుగా నేను స్టేట్ మెంటివ్వడం. రెండోది మీదీ అనుకున్న లేండ్ మీది కాకుండ చేయడం... మూడోది మీరు రగిల్చిన సమ్మెని చల్లబర్చి కార్మికులు సమ్మె ఉపసంహరించుకునేట్టు చేయడం - లెక్క సరిపోయిందా."        
    "ఇంతటితో ఇది గెలుపుగా సంబరపడకు కృషీ..."    
    "అలా నేను పొరపాటు పడడం లేదు చౌదరీ....నాకు తెలుసు మీరు వూరుకోరని. ఇప్పుడు నేను మీకు స్పష్టం చేయాలనుకున్నదేమిటంటే నేనూ అంతే మొండిఘటాన్నని నేనీ దేశంలో వున్నంత కాలం మీ ఆటలు సాగనివ్వనని...ఓ.కే."    
    ఫోన్ క్రెడిల్ చేసింది.    
    నిశ్శబ్దంగా సోఫాలో కూర్చుండిపోయాడు చౌదరి.    
    తను ఎదగడం ప్రారంభించి ఎంతకాలమైనా కాని ఇంతకాలానికి తనకో అసలు సిసలైన ప్రత్యర్ధి ఎదురైంది.    
    పైగా తను ఈ దేశంలో ఉన్నంతకాలం తనను ఓడించటమే ధ్యేయమంటూ సవాల్ విసురుతూంది.    
    నవ్వేశాడు చౌదరి.    
    అలాంటి మూడ్ లో నవ్వడం చౌదరికి అలవాటు లేదు. సామాన్యంగా అతడు నవ్వేది గెలుపులోనే తప్ప ఓటమి తర్వాత కాదు. ఆ విషయం అతడి ముందు నిలబడ్డ రంగధాం రాజారావులకిద్దరికీ తెలుసు. అయినా ఎందుకు నవ్వాడో కారణం అడగలేకపోయారు.    
    "మొత్తానికి కృషి చాలా గట్టిపిండ మయ్యా రంగధాం"   
    మరింత ముచ్చటగా అన్నాడు "ఎక్కడో చదువుకొని వచ్చిన ఆడపిల్ల నా అంతవాడ్ని అల్లరిపెట్టడమే గాక నా పరంగా ప్రమాదాన్ని వూహించి ముందే పోలీసులకి, హోం సెక్రెటరీకి తెలియపరచి అన్ని మార్గాల్ని మూసేసింది. ఇంకా నవరంధ్రాల్నీ మూసేస్తానంటూంది - శభాష్."    
    అది ఓటమిని జీర్ణించుకోలేని ఉన్మాదంతో పేషెంటు డెలీరియం స్టేజ్ లోని మాటల్లా అనిపిస్తున్నాయి.    
    అవకాశం వున్నప్పుడు రాజమార్గాల్లోనూ సాధ్యం కాకపోతే దొడ్డితోవల్లోనూ ప్రయాణం చేస్తూ ఆ స్థాయికి ఎదిగిన చౌదరికి మనస్తత్వ శాస్త్రం గురించి తెలీదు గాని సంఘాన్ని క్షున్నంగా చదివేసాడు...అలా పెంచుకున్న సామ్రాజ్యంలో ఇంతకాలం సజావుగా సుఖంగా బ్రతుకుతున్న ఆయనకి చాలా రోజుల్నుంచి ఓ విషయం అర్ధం కావడం లేదు.    
    అసలు కృషి లాంటి ఆడపిల్లకి మామూలు స్థితిలో బ్రతికే విస్సుకి పరిచయం ఏమిటి - అది విస్సు కోసం రెండు లక్షలు ఖర్చుచేసేదాకా ఎలా పెరిగింది - ఒక మామూలు మనిషికి భిన్నంగా ఆలోచించగల చౌదరికి ఆ క్షణంలో యిదే విషయం మనసులో మెదలడం యాదృచ్చికం కాదు. ఓ చిన్న అవకాశం తీసుకుంటేనేం అనుకుంటూనే రంగధాం చూశాడు.    
    "హాస్పిటల్లో వున్న విస్సు పరిస్థితేమిటి"    
    ఓ రహస్యంలా అన్నాడు రంగధాం "ఈ రోజు ఉదయం స్పృహలోకి వచ్చాడు"    
    "తనపై అటాక్ చేసిందెవరో చెప్పగలుగుతున్నాడా."        
    "ఉదయం యస్సై ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా చెప్పలేకపోయాడట."   
    మృదువుగా నవ్వాడు చౌదరి.    
    అలా నవ్వేది నవ్వగలిగేది తిరుగులేని ఓ పథకం స్ఫురించినప్పుడే అని తెలిసిన రంగధాం - కాబట్టి ఒకనాడు పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమించిన చెల్లెని యింటినుంచి గెంటేశాడు. ఆమె చివరి దశలో కేన్సర్ తో చనిపోతున్నా పట్టించుకోకుండా దిక్కుమాలిన చావుకి కారణమయ్యాడు. కారణం ఓ అలగా మనిషికి భార్య అయ్యిందన్న కోపం."        
    ఉన్నట్టుండీ యిదంతా చౌదరి ఎందుకు చెబుతున్నదీ అర్ధంగాని రంగధాం నిశ్చేష్టుడై చూస్తుండగానే "కాబట్టి ఈ రోజు కృషి ఓ సామాన్య కుటుంబానికి చెందిన విస్సు వెంట పడుతుంటే తట్టుకోలేక అలా గూండాల్ని ప్రయోగించాడు. విస్సుపై హత్యాప్రయత్నం చేశాడు" కంక్లూడ్ చేశాడు చౌదరి.    
    రంగధాంకి మతి పోయింది.    
    సముద్రంలో ఉప్పుకి చెట్టుమీద కాయకి లింకుపెట్టి అద్భుతమైన కథనల్లి ఆలోచిస్తున్నాడు. దటీజ్ చౌదరి.    
    అదేరోజు రాత్రి విస్సు వున్న హాస్పిటల్ కి వెళ్ళాడు. చౌదరికి చాలా చాలా ఆత్మీయుడయిన ఓ పోలీసాఫీసరు. వెళుతూ ఆ రోజు విస్సుపై అటాక్ చేసిన ఓ గూండా ఫోటో పట్టుకు వెళ్ళాడు. అది పోలీసాఫీసరుకి ఇచ్చింది చౌదరీయే.    
    "ఆ రోజు మీ మీద అటాక్ చేసిన వ్యక్తుల్లో ఇతడున్నాడా" ఫోటో చూపిస్తూ అడిగిన పోలీసాఫీసరుకి వున్నాడంటూ జవాబిచ్చాడు నిన్ను "రెండు రోజులుగా తోమి వదిలిపెడితే చెప్పాడు. అతనిని మీ మీద ప్రయోగించిందెవరో అసలు ఉపాధ్యాయ స్థాయి మనిషి ఇలా దిగజారడం నా వూహకందనిది. మీకూ ఆయనకీ మధ్య గొడవలేమన్నా వున్నాయా?"    
    విస్సు అప్రతిభుడయ్యాడు.    
    అలాంటి అవసరం ఉపాధ్యాయకన్నా కృషికే ఎక్కువగా వుందని చెప్పలేదు విస్సు. తొందరపడి తన శీలాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్న కృషీ ఇలాంటి సాహసానికి పూనికొని వుంటుందన్న ఏ ఆలోచనో విస్సు అలాంటి నిర్ణయానికి వచ్చేటట్టు చేస్తే అలా ఆలోచించటం తప్పు కాదు - చౌదరి ప్రదర్శించిన అమోఘమైన తెలివి అది.   
    సగం గెలిచాడు చౌదరి.  
    "క్రిమినల్ ప్రస్తుతం కస్టడీలోనే వున్నాడు కాబట్టి మీరు వీడ్ని గుర్తించినట్టు స్టేట్ మెంటిస్తే మొత్తం డొంక కదిలిస్తాను....ఉపాధ్యాయ గారిపై లీగల్ గా..."    
    పోలీసాఫీసరు వాక్యాల్ని అర్దోక్తిగా ఖండించాడు విస్సు. "అవసరం లేదు ఇన్ స్పెక్టర్ ఇది నాకు నేనుగా తేల్చుకోవాల్సిన సమస్య."    
    చౌదరి విశ్వాసపాత్రుడయిన ఆ పోలీసాఫీసరు విస్సుని ఒప్పించాలని సిన్సియర్ గా ప్రయత్నించాడు. "ఉపాధ్యాయగారి స్థాయి మీకు తెలుసు - మీ అంత మీరుగా ఆయనతో పోరాడలేరు."    
    "ప్లీజ్ ఇన్ స్పెక్టర్" విస్సు కళ్ళలో ఎర్ర జీరలు చోటు చేసుకున్నాయి. "దయుంచి నన్ను వదలిపెట్టండి - ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నించకండి. మీరు తప్పదని అంటే అసలు ఈ ఫోటోలో వున్న వ్యక్తి ఎవరో నాకు తెలీదంటాను."    
    ఇన్ స్పెక్టర్ షాక్ తిన్నట్టుగా చూసాడు.   
    ఓ చిన్న ప్రయత్నంలో అవసరమైతే తన మనిషిని జైలుకి పంపి అయినా ఉపాధ్యాయని అన్ పాప్యులర్ చేద్దామనుకున్న చౌదరి ప్రయత్నానికి విస్సు సహకరించలేదు.    
    జరిగిందంతా పోలీసాఫీసరు ద్వారా తెలుసుకున్న అయన అలాగా అని సరిపెట్టుకోలేదు...సరి పెట్టుకుంటే అతడు చౌదరి కాడు.    
    మరి కాస్త లోతుగా విషయాన్ని శోధించాలనుకున్నాడు.    
    కృషికీ, అతడికీ వున్న పరిచయం ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకుంటూ ఓ పావుని చేజిక్కించుకున్నాడు రాజేషు ద్వారా.    
    ఆ పావు విస్సు స్నేహితుడు సూరి.    
    మామూలుగా అయితే బయటికి కక్కేవాడు కాదేమో కాని ఖరీదయిన మందు తాగాక మొత్తం కక్కేసాడు సూరి.    
    అంతే - చౌదరి లాంటి వాడు సైతం అప్రతిభుడైపోయాడు.        
    ఓ కోటీశ్వరుడి మనవరాలు పైగా స్టేట్స్ లో చదివి వచ్చిన అమ్మాయి గెలుపు క్సోం శరీరాన్ని పెట్టుబడిగా పెడతాననడం అతడి వూహకందనిది.    
                                      *    *    *    *    
    అరురసంధ్య వేళ.....    
    ఫ్రెడరిక్ ఫోర్ సేత్ 'ది నెగోషియేటర్' చదువుతున్న కృషి ఫోను రింగవుతుంటే యధాలాపంగా రిసీవర్ అందుకుంది "కృషి హియర్"    
    "నేనే" విస్సు కంఠం వినిపించింది.    
    మనసున గుచ్చుకున్న తలపుల మొగలి పువ్వులా కదిలిందామె. హాస్పిటలలో వున్న విస్సు గురించి ఏ రోజు కారోజు తెలుసుకుంటూనే వుంది. ఈ రోజు ఉదయమే డిశ్చార్జి అయిన విస్సు తప్పకుండా ఫోను చేస్తాడనీ అనుకుంది.
    "గుర్తుపట్టేరనుకుంటాను" అడిగాడు విస్సు మళ్ళీ.    
    ఎన్ని కోట్ల లిప్తల దూరమో పగిలి శరత్పూర్నిమల చల్లదానాన్ని మనసు లోయల్లో దోసిళ్ళలో పోసినంత వివశత్వంతో పలకరించాలనుకుంటూనే మూగపోయింది."    
    "ఆశ్చర్యపోతున్నారా కృషీ"    
    "దేనికి"    
    "నేను బ్రతికే వున్నందుకు"    
    మనస్సు చివుక్కుమంది. ఇంకా అదే ఆకతాయితనాన్ని ప్రదర్శిస్తాడేం.   
    "నేను క్విజ్ కాంపిటీషన్ లో గెలిచాను కదూ"    
    "తెలుసు"    
    "మీకు తెలియాల్సింది మరొకటుంది కృషీ."        
    "ఏమిటి"    
    "మన ఒప్పందం ప్రకారం మీరు నాతో ఓ రాత్రి గడపాలి"    
    పేర్చుకుంటున్న కలల పుప్పొడిరాలినట్టు ఆమె ఫాలభాగాన్ని ఆక్రమించిన స్వేద బిందువులు చెంపలపైకి జారేయి. తను మరిచిపోయింది ఉన్నట్టుండి గుర్తు చేస్తున్నాడు.
    "మీరు జవాబు చెప్పడం లేదు"    
    "గుర్తుంది" గొణుగుతున్నట్టుగా అంది "కాని..."    
    "అదంత ముఖ్యమా అన్నది మీ ప్రశ్ననుకుంటాను కృషీ. చాలా అవసరం అన్నది నా జవాబు"    
    కృషి మొహంలో రంగులు మారాయి "నేను కాదంటే..."    
    "మన ఒప్పందం పత్రికలదాకా వెళుతుంది. ఎలా అని అనకండి. డబ్బున్న వాళ్ళ అభిజాత్యాల గురించి తెలిసినవాడిగా మన చర్చ చిన్న పాకెట్ రికార్డర్ లో టేప్ చేశాను."    
    ఇంత జుగుప్సగా మాట్లాడుతున్నాడేం.    
    "దాన్ని జర్నలిస్టుల ముందు ప్లే చేయాల్సిన అవసరాన్ని నాకు కలిగించకండి మిస్ కృషీ... వాయిస్ అనలిస్ట్ లకి అది మీ గొంతో కాదో తెలుసుకోవడం కష్టం కాదు...అది మీ గొంతు కాదని నిరూపించుకునే పిచ్చి ప్రయత్నం మీరు చేసినా అప్పటికే మీరు పదిమంది ముందూ అల్లరైపోతారు...ఎంతైనా రాయల్ ఫేమిలీ అమ్మాయిగా మీకు అది అప్రతిష్టేగా..... సో... రమ్మంటారా"
    ఆమె జావాబు చెప్పలేకపోతూంది.    
    "మీ అనుమతి నాకు అవసరం లేదు కృషీ....దేనికైనా సిద్దపడే మనస్తత్వం నాది. కాబట్టే మీ మీద గెలుపు కోసం ప్రాణాలకే తెగించాను..."

 Previous Page Next Page