తల పంకించింది సాలోచనగా "ప్రతి మనిషీ అమ్ముడుపోతాడు మిస్టర్ శరత్ చంద్ర... కాకపోతే కొనడానికి ఉపయోగించాల్సింది కరెన్సీయా లేక మరొకటా అన్నది మన మేధస్సుకి సంబంధించింది....మీరు వెంటనే అతడి పర్సనల్ ఫైలు నాకు పంపించండి."
ఓ కార్మికుడు ఫ్యాక్టరీలో చేరినప్పటి అపాయింట్ మెంటు ఆర్డరు మొదలుకుని అతడికి సంబంధించిన ప్రమోషన్స్ అతడి నడవడికకి సంబంధించిన మెరిట్ రేటింగ్, అతడిపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలు వివరాలుండేదే పర్సనల్ ఫైల్.
ఇరవై నాలుగు గంటల్లో తేల్చాల్సిన ఓ విషయం గురించి కృషి పోరాటం ప్రారంభించిందని తెలియని శరత్ చంద్ర అరగంట వ్యవధిలో ఫ్యాక్టరీ నుంచి తనే స్వయంగా సుధీర్ కుమార్ కి చెందిన పర్సనల్ ఫైల్ తెచ్చిచ్చాడు....ఆమె ఆదేశంపై అదే రాత్రి సుధీర్ కుమార్ ని తీసుకురావడానికి తనే వెళ్ళాడు కూడా. ఓ మామూలు కార్మికుడి కోసం ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్స్ అలాంటి మర్యాదలు పాటించడం ఆనవాయితీ కాకపోయినా కనీసం వందల సంఖ్యలో కార్మికుల్ని అనుకూలురుగా మార్చుకున్న సుధీర్ కుమార్ లాంటి అస్త్రం కోసం యిది తప్పనిసరి.
ఆ విషయాన్ని చెప్పింది కూడా కృషే.
రాత్రి పదకొండున్నరకల్లా సుధీర్ కుమార్ వచ్చాడు. కృషి కూర్చున్న ఛాంబర్ లో అడుగుపెడుతూనే ఆశ్చర్యపోయాడు సుధీర్ కుమార్. నిజానికి అతడు ఊహించింది తను ఉపాధ్యాయ గార్ని కలుసుకోబోతున్నానని.
అప్పటికే అతడి పర్సనల్ ఫైలంతా స్టడీ చేసిన కృషి సుదీర్ కుమార్ ని ఆపాదమస్తకం పరిశీలిస్తూ "ప్లీజ్ బీ సీటెడ్" అంది సాదరంగా.
ధైర్యంగా ఆమె ముందున్న సీటులో కూర్చున్న సుధీర్ కుమార్ మోచేతిని టేబుల్ పై ఆనించబోయి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అది చాలు అతడి ప్రస్తుత మానసిక స్థితేమిటో గ్రహించేయటానికి.
తను దేనికీ జంకనని చెబుతూనే శరీరం సహకరించక తన ఇన్ ఫీరియారిటీని ప్రదర్శించే బాడీ లాంగ్వేజ్ అది.
కృషి మనస్తత్వ శాస్త్రాన్ని క్రొడీకరించుకుంటూ నిశ్శబ్దంగా వుండిపోయింది చాలా సేపటిదాకా అలాంటి సన్నివేశాలలో మాటలకన్నా మౌనం ఏ మనిషినైనా ఎంతటి ఆందోళనకి గురిచేసేదీ ఆమెకు తెలుసు. "మిస్టర్ సుధీర్ కుమార్...మనం ప్రోస్పరిటీలో వున్నప్పుడు స్నేహితులు మనల్ని గుర్తిస్తే మనం ఎడ్వర్సిటీలో వుండగా స్నేహితులు మనకు గుర్తుకొస్తారంటారు. నిజానికి యిది బాధాకరమైన స్టేట్ మెంట్ అయినా ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పుడు మిమ్మల్ని యింత అర్జెంటుగా రప్పించింది ఓ స్నేహితుడిగా మాకు సహకరించమనే తప్ప మిమ్మల్ని అవకాశవాదంతో కొనేయాలనీ, ప్రలోభపెట్టాలనీ కాదు."
ఆ చివరి వాక్యం సుధీర్ నెంత బలంగా ఆకట్టుకుందీ అంటే కొన్ని క్షణాల క్రితం దాకా అతడిలో వున్న అనుమానం చెదిరిపోయింది.
"దీక్ష గల వ్యక్తులే తెలివైనవాళ్ళమూ లేక సమర్దులమూ అనుకున్న వ్యక్తులకన్నా ఎక్కువ గెలుపు సాధించగలరన్న నిజాన్ని మీరు నమ్మి తీరాలి...." ప్రతి వాక్యాన్నీ కేవలం సుధీర్ కుమార్ కే అన్వయించినట్టుగా చాలా జాగ్రత్తగా సంధిస్తూంది కృషి. "ఎప్పుడో ఒకనాడు తండ్రి మరణించిన ఓ అబ్బాయి తన చిన్న యింటికి సమీపంలో వున్న గోల్ఫ్ కోర్సుని చూస్తూ ఎప్పటికైనా గోల్ఫ్ నేర్చుకోవాలని కలలు కనేవాడు. పేదరికంతో చదువుని సెవెంత్ స్టాండర్ద్ దగ్గరే ఆపేసిన ఆ అబ్బాయికి ఖరీదయిన గోల్ఫ్ కోర్సులో అడుగుపెట్టడమే కష్టమైన పని కావడంతో నిరుత్సాహపడలేదు. పట్టుదల, దీక్ష అతడ్ని వెంటాడుతుంటే తోటమాలిగా ఆ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. ఖరీదయిన వ్యక్తులు ఆడే గోల్ఫ్ ని గమనిస్తూ చిన్న బంతిని సంపాదించి సోడా బాటిల్స్ తో కొడుతూ తన స్కిల్ పెంచుకున్నాడు."
తండ్రి లేకుండా పెరిగిన సుధీర్ కుమార్ సెవెంత్ స్టాండర్డు దగ్గరే చదువు ఆపేశాడు. ఫ్యాక్టరీలో రోజు కూలీకి చేరి సీనియర్ వర్కర్ గా ఎదిగిన ఆ వ్యక్తి చాలా ఏకాగ్రతగా వింటున్నాడు కృషీ చెబుతున్న విషయాన్ని.
"ఒకనాడు" ఇందాకటి చర్చని కొనసాగిస్తూ అంది కృషి "చాలామంది చేత నిరసించబడిన ఆ అబ్బాయి పట్టుదలతో గార్డెనర్ గా గోల్ఫ్ కోర్సులో ప్రవేశం సంపాదించిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ గోల్ఫర్స్ లో ఒకడు. తనే లీట్రెవినో అమెరికాకి చెందిన ప్రముఖుడు నాకు పరిచయమైన వ్యక్తి కాబట్టే అతడి జీవితం గురించి మీకు చెప్పాలనిపించింది...." క్షణంపాటు సుధీర్ కుమార్ కళ్ళల్లోకి చూసింది.
అతడు పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్ళకపోయినా ఆమె మాటలకి బలంగా స్పందించిన విషయం అతడి ముఖకవళికలే తెలియజెపుతున్నాయి.
"ప్రత్యేకించి ఇదంతా మీకు మాత్రమే చెప్పడంలో నా ఉద్దేశ్యం మీరు దీక్ష దక్షతగల కార్మికుడు మాత్రమే గాక కొన్ని వందల మందిని ఇన్ ఫ్లుయెన్స్ చేయగల సమర్ధుడైన నాయకుడిగా కూడా మీకు చరిత్ర వుంది. యాజమాన్యాన్ని బద్దశత్రువులుగా భావించే అందరు కార్మిక నాయకుల్లో మీరు ఒకరు కాదు....మీరు అలాంటి వ్యక్తే అయితే యీపాటికే సూడో లీడర్ అయిన రాజారావుతో చేతులు కలిపేవారు. మీరు కోరేది మీ తోటి కార్మికుల ఎదుగుదల. ...అలాంటి మీరు..." తను చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా అతడి మనసు పొరల్లోకి ఇంజెక్టు చేసింది. "ఇంత జరిగినా నిశ్శబ్దంగా వూరుకోవడం నా ఊహకందనిది ఇక్కడ నష్టపోతున్నది యాజమాన్యమా లేక అమాయకులయిన కార్మికులా అంటే ఖచ్చితంగా కార్మికులే అంటాన్నేను. ఓ ఫ్యాక్టరీ లాకౌట్ అయితే ఉపాధ్యాయ కుటుంబానికి అదో ఆర్దికమై యిబ్బంది కాదు. నిజం మిస్టర్ సుధీర్ కుమార్...ఎన్ని తరాలు గడిచినా తరగని సంపదవున్న మా తాతయ్య ఆలోచిస్తున్నది మీ జీవితాల గురించే...ఓ రాజకీయ నాయకుడు స్వార్ధంతో మొదలుపెట్టిన సమ్మె అతడి ఇమేజ్ ని పెంచుతుంది కాని ఫ్యాక్టరీ నష్టాలకి గురిచేస్తుంది. అంటే కార్మికులు న్యాయబద్దంగా సాధించాల్సిన చాలా డిమాండ్స్ ని అంటే...సొంత ఇళ్ళు, కార్మికుల కుటుంబాలకోసం మేం కట్టించాలనుకుంటున్న హాస్పిటల్స్, మీ పిల్లల చదువులకి మేం కేటాయించాలనుకుంటున్న ఉపకారవేతనాలు అన్నీ మీరు కోల్పోయే అవకాశమిది".
విభ్రమంగా చూస్తున్నాడు సుధీర్ కుమార్... ఇంతకాలం రాజారావులాగే తనూ నాయకుడు కావాలనుకుంటున్నాడు తప్ప కృషి చెప్పిన శాశ్వతమైన లాభాల నాశించే కార్మిక శ్రేయస్సు కోసం తనూ ఆలోచించలేదు.
"బహుశా మిమ్మల్ని డబ్బిచ్చి కొనాలని యిలా పిలిపించి వుంటారేమో అని మీరు పొరపాటు పడి వుండొచ్చు. కాని దురదృష్టవశాత్తూ నేను ఆ సంస్కృతిలో పెరిగిందాన్ని కాదు...అలాంటి తాత్కాలికమైన పరిష్కారాలు నాకిష్టం వుండదు."
"కృతజ్ఞుడ్ని మేడమ్....మీరు నన్నిలా గుర్తించినందుకు అదృష్టవంతుడ్ని....వెళతాను"
ఆమె వారించలేదు. సుదీర్ కుమార్ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళటానికి కారు ఏర్పాటు చేయడమూ ఆమె మరిచిపోలేదు.
అలాంటి చిన్న విషయాలే వ్యక్తుల్ని ఎంత బలంగా ఆకట్టుకునేదీ అన్న విషయంతో బాటు ఆ తర్వాత ఓ ఉద్యమంలా సుధీర్ కుమార్ ఎంత శ్రమపడేదీ ఆమెకు తెలుసు.
"ఎందుకు పిలిచినట్టు. ఏం సాధించినట్టు" రాత్రి పన్నెండు గంటలు దాటుతుండగా అడిగాడు ఉపాధ్యాయ "కేవలం ఉపదేశాలతో అతడు ఇన్ స్పైరై నీకు సహకరిస్తాడనుకున్నావా"
"లేదు గ్రాండ్ పా - అందరిలో నేనూ ఒకదాన్ని కాలేక ఇక్కడే బేరసారాలు మొదలు పెట్టలేదు. కాని అతడ్ని కొనేయబోతున్నాను మోరల్ గా"
అర్ధంకానట్టు చూశాడు ఉపాధ్యాయ - ఇంకా పాతికేళ్ళు సైతం నిండని ఓ అందమైన అమ్మాయి తన అనుభవాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది.
"మీ స్థాయిలో మీరు చూడాల్సింది గెలుపే తప్ప అయిన ఖర్చు కాదు" నిశ్చలంగా అంది కృషి. ఆ ఖర్చుకూడ మీ యిమేజ్ ని శాశ్వతంగా పెంచేదిగా మీ ప్రత్యర్ధిని బలంగా దెబ్బతీసేదిగా మారేటప్పుడు ఖర్చుకి అసలు వెనుకాడకూడదు కదా గ్రాండ్ పా".
ఉపాధ్యాయ భ్రుకుటి ముడిపడింది "నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు"
"ప్రతిష్ట, పరపతి కోసం అహోరాత్రులు శ్రమించే మీరు చౌదరి ముందు ఓడిపోవడం మీ వారసురాలిగా నేను భరించలేనిది గ్రాండ్ పా కాబట్టే కార్మికుల కోసం మీరు కట్టించాలనుకున్న హాస్పిటల్ లేండ్ లో చౌదరి గుడిసెలు వేయించి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయటాన్ని నేను అంగీకరించలేక సుధీర్ కుమార్ ని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు ఇప్పుడు తిరుగులేని గెలుపు సాధించబోతున్నాను."
"ఎలా?"
"చౌదరి పదెకరాల మన లేండ్ లో గుడిసెల్ని వేయించింది తాత్కాలికంగా మీ మీద గెలుపు సాధించాలని, ఆ తర్వాత తను సొంతం చేసుకోవాలని, నిజానికి ఆ గుడిసెల్లో చౌదరిని సపోర్టు చేసే మన ఫ్యాక్టరీ కార్మికులూ వున్నారు."
"అయితే..."
"ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మనం పట్టాలను పంపిణీ చేయబోతున్నాం. ఆ విధంగా చౌదరి ఆట కట్టించి జాగాని మనమే సొంతం చేసుకోబోతున్నాం. ఎలా అనకండి. ఆ విషయం నాకు వదిలేయండి."
అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు ఉపాధ్యాయ.
పసిపిల్లల్ని తక్కువగా అంచనా వేయడం ఎంత పొరపాటో పెద్ద వాళ్ళని ఎక్కువగా అంచనా వేయడం అంతే పొరపాటుగా అర్ధమైందో లేక ఎక్కడో స్టేట్స్ లో పెరిగిన తన మనవరాలిలో తన వూహకందని మేధావే కనిపించిందో కోర్టులో నడుస్తున్న కేసుని ఇలా ముగించి చౌదరిపై విజయాన్ని సాధించే కృషిని అభినందించకుండా వుండలేకపోయాడు-
కృషి ఊహ తప్పుకాలేదు.
మరుసటి రోజు మధ్యాహ్నానికే గుడిసెలకి పట్టా పంపిణీ ఏర్పాటు చేసిన కృషి అప్పటికే కార్మికుల్లో చిన్న కదలికకి కారణమైన సుదీర్ కుమార్ ప్రయత్నానికి చాలా బలాన్ని అందించింది.
* * * *
"డేమిట్"
ఇంచుమించు గుండెలు బాదుకున్నట్టుగా కలవరపడిపోయాడు రమానాథచౌదరి...
కొన్ని రోజులపాటు తన గెలుపుని ఎంజాయ్ చేయాలనుకున్న చౌదరి ఇప్పుడు కార్మికుల్లో వచ్చిన మార్పుని తట్టుకోలేకపోయాడు కేవలం గంటల వ్యవధిలో కార్మికుల్ని విభజించడమే గాక జరిగిన పొరపాటుకి అంతా పశ్చత్తాప పడి ఇక ముందు తొందరపడమని 'అండర్ టేకింగ్స్' రాయించుకుని మరీ ఫ్యాక్టరీలో అడుగుపెట్టేట్టు చేసింది.
ఎదురుగా దేభ్యం మొహాలు వేసుకుని నిలబడ్డ రాజారావుని లాయరు రంగధాంల్ని చూస్తూ అరిచాడు ఆవేశంగా "వెళ్ళండి - ఓ ఆడపిల్ల తెలివిముందు చవటల్లా నిలబడాల్సి వచ్చినందుకు వెళ్ళి హుస్సేన్ సాగర్ లో దూకి చావండి. అసలు నీకైనా సిగ్గు లేదటయ్యా" రాజారావుతో అన్నాడు "పెద్ద మోసగాడ్ని మగాడ్నీ అంటావే, ఫ్యాక్టరీలో అడుగుపెట్టే లేబర్ ని గూండాలతో తరిమేయక ఏం చేసినట్టు."
"పోలీసు బలగాన్ని దింపిందండి - వాళ్ళ రక్షణతోనే యిన్ని ఏర్పాట్లు చేసేసింది."
"ఏం - మనం పోలీసుల్ని అదుపు చేయలేమా"
"అసలు కార్మికుల్లో ఏ వర్గమైనా మన పక్క నిలబడి వుంటే పోలీసులు, గూండాలు ఎందుకండీ వాళ్ళలో వాళ్ళే తలలు బద్దలు కొట్టుకునేట్టు ప్లాన్ చేసేవాడ్ని" ఉద్వేగ్నంగా అన్నాడు రాజారావు. "కాని నిన్న గాక మొన్నటి దాకా మీరిచ్చిన గుడిసెల్లో వుండి మీకు జిందాబాద్ అనే మన గ్రూపు కార్మికులు కూడా పట్టాలు దొరికేసరికి చెట్టాపట్టాలేసుకుని చక్కా ఫ్యాక్టరీలో అడుగుపెట్టారు. పైగా కృషీ జిందాబాద్ అంటూ..."
"స్టాపిట్" ఇక నిభాయించుకోలేకపోయాడు చౌదరి.
ఏదో చేయాలి. కాని ఏం చేయాలో వెంటనే తోచలేదు.
సరిగ్గా ఆ సమయంలో ఫోన్ రింగయింది.
చికాగ్గా ఫోన్ రిసీవర్ అందుకున్న రామనాథచౌదరి మొహంలో రంగులు మారిపోయాయిచాలా వేగంగా.