ఆ క్షణంలో 'మీరు ప్రయోగించిన గూండాల మూలంగానే' అనలేదు విస్సు....తను పొందాలనుకున్న ఆనందం గూండాల గురించి మాట్లాడికాదు ఒప్పందాన్ని గుర్తుచేసి...
"రేపురాత్రి పదిగంటలకి వస్తున్నాను కృషి. మన తొలి రాత్రికి సిద్దంగా వుండండి...మరోసారి తెలివి ప్రదర్శిస్తే మర్యాదగా వుండదు."
ఆ చివరి వాక్యం అర్ధమేమిటో బోధపడలేదు.
"ఆశ్చర్యపోతున్నారా కృషీ.....మీ శీలానికి ప్రమాదం జరక్కుండా పోటీ చివరి క్షణంలో మీరు నా మీదకి పంపిన గూండాల గురించి పోలీసులే నాకు స్వయంగా తెలియపరిచారు"
ఆమె మాట్లాడే అవకాశమివ్వకుండా ఫోన్ క్రెడిల్ చేశాడు విస్సు.
మనసదోలా అయిపోయింది.
చౌదరి అవకాశం తీసుకున్నాడు... తమ మధ్య ఒప్పందం ఎలా గ్రహించినా గాని తిరుగులేని అభియోగాన్ని మోపాడు.
అదికాదు ఆమె ఆ క్షణంలో అంతగా కదిలించింది. తన మూలంగా ఓడిన చౌదరి ఇలాంటిదేదో చేస్తాడని ఆమె ఊహించిన విషయమైనా విస్సు ఇంత మూర్కుడిలా అతడి ట్రాప్ లో చిక్కుకుంటాడని అనుకోలేకపోయింది.
ఎవరీ విస్సు-
ముగ్ధగా పేర్చుకున్న ప్రేమరాసుల్ని విధి క్రూరంగా కాలితో తన్ని చెల్లాచెదురు చేస్తే మనస్సు శరపంజరాన్ని ఛేదించుకుని నా మనిషే అనిపించేట్టు నడుచుకు వచ్చాడే - ఇలా ప్రవర్తిస్తున్నాడే.
కలల బ్రతుకు పాటల కోకిల గొంతుకి ఉరిబిగించి జీవితాన్ని హంస చివరిగీతంగా మార్చుకుని సాగిపోతుంటే మానసాకాశాన ప్రత్యక్షమైన విధ్యున్మేఘమాలగా అరుదెంచాడనిపించాడే - ఇప్పుడు యిలా కుంచించుకుపోతున్నాడేం.
ఏ జ్ఞాపకాల పొరలు కదిలి మనసుని కలచివేశాయో ఎప్పుడో ఘనీభవించిన అశ్రువులు ఆర్ధ్రగా ఆమె కనుపాపల్ని తడిపాయి.
మరోసారి -
ఇక కూడదనుకుంటూనే ఇంకోసారి మరో మనిషికి దగ్గర కావాలని ఎందుకు కోరుకుంది.
కౌశిక్ గుర్తుకొచ్చాడు.
పాతికేళ్ళ వయసొచ్చినా ఆడపిల్లలా బిడియంగా తలవంచుకు నిలబడేవాడు. అంత పిరికివాడిలాగే కనుమరుగైపోయాడు.
సూట్ కేసులోంచి ఓ ఉత్తరాన్ని తీసింది కృషి.
కౌశిక్ రాసిన చివరి ఉత్తరం.
"కృషీ-
మీ ప్రేమను పొందగలిగినందుకు అదృష్టవంతుడునుకున్నాను కాని ఉపాధ్యాయగార్ని నొప్పించేటంత దుర్మార్గుడ్నయ్యానని ఊహించలేక పోయాను. ఎవర్ని నేను మీ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మామూలు ఉద్యోగికి కొడుకుని. మీ తాతయ్య దయాదాక్షిణ్యాలతో యింజనీరు అయినవాడ్ని. నా తాహతేమిటో నేను గుర్తించకుండా మీ కెందుకు మానసికంగా దగ్గరయ్యానో ఇప్పటికీ నాకు అర్ధం కాని విషయమే ఇప్పుడు నేను ఉద్యోగాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడడం లేదు. ఉపాధ్యాయ దృష్టిలో కృతఘ్నుడిగా మిగలాల్సి వచ్చినందుకు కుమిలిపోతున్నాను అందుకే బ్రతుకు మీద ఆసక్తిని కోల్పోయి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను కౌశిక్"
ఉపాధ్యాయ ఫ్యాక్టరీలో ఓ మామూలు ఉద్యోగికి కొడుకైన కౌశిక్ యింజనీరింగ్ దాకా చదివింది, ఉపాధ్యాయ ఫ్యాక్టరీలో చేరింది ఉపాధ్యాయ ఆశీస్సులతోనే అయినా కౌశిక్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది అతడి అమెరికా ప్రయాణం.
కంపెనీ కొలాబరేటర్స్ దగ్గర ఏడాది ట్రయినింగ్ కోసం స్టేట్స్ కి పంపబడ్డ కౌశిక్ కృషికి పరిచయమైంది స్టేట్స్ లోనే - చాలా స్వల్ప వ్యవధిలో మానసికంగా ఇద్దరూ దగ్గరయ్యారు.
తను కోరుకున్న మగాడిలో ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలనుకుందో కౌశిక్ లో చూడగలిగిన కృషి తాతయ్యకి వెంటనే ఫోన్ చేసి చెప్పింది.
తన పెళ్ళి విషయంలో తాతయ్య చూపిస్తున్న శ్రద్దని గమనించి తెలియచేసింది కౌశిక్ గురించి.
అంతే-
కౌశిక్ ఇండియాకి రప్పించబడ్డాడు-
ఒక శుభవార్తకోసం ఎదురు చూస్తున్న కృషికి ముందు కౌశిక్ రాసిన ఉత్తరం అందింది.
స్వయంగా తాను నిర్ణయం తీసుకునే అవకాశమున్నా తాతయ్యకి తెలియచేసి ఎంత పొరపాటు చేసిందీ గ్రహించిన కృషి ఇండియాకి వచ్చింది వెంటనే...
కౌశిక్ ఏక్సిడెంట్ లో చనిపోయాడని అప్పటిదాకా ఆమెకి తెలీదు.
ఉద్యోగాన్ని కోల్పోయిన బాధతో ఆత్మహత్యే చేసుకున్నాడో లేక ఉపాధ్యాయగారి దృష్టిలో కృతఘ్నుడైన వేదనలో మనఃస్థిమితం కోల్పోయి ప్రమాదంలో చిక్కుకున్నాడో ఆమెకి తెలీదు.
కాని తొలిసారి ఆమె కంటతడి పెట్టుకుంది.
అది డబ్బు పరపతి ప్రతిష్టలనే పదాలతో కాపరం చేసే తాతయ్య చేసిన హత్యగానే భావించింది. జీవితంలో మొట్టమొదటిసారి ఉపాధ్యాయని నిలదీసింది.
ఆ క్షణంలో సైతం ఉపాధ్యాయ జరిగిన దానికి చింతించలేదు.
ఓ సామాన్యుడ్ని ప్రేమించి తనకు దూరమైన చెల్లి చివరి క్షణాల్లో కేన్సర్ తో బాధపడుతున్నా డబ్బు సాయం చేయకుండా తనెలా తిరస్కరించిందీ గర్వంగా చెప్పిన తాతయ్యని ద్వేషించడం ప్రారంభించింది అప్పుడే.
తమ మధ్య వున్న సున్నితమైన బంధం తెగిపోయిన దుఃఖంతో యిక జీవితంలో పెళ్ళే చేసుకోనంది. అసలు ఇండియాకే తిరిగి రానంది.
మూడేళ్ళపాటు అదే పట్టుదలతో భీష్మించుకు కూచున్న కృషి ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టింది తాతయ్య అనారోగ్యం దృష్ట్యా అయినా యీ రోజు ఉపాధ్యాయ ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ధ్యాసతో చౌదరిపై యుద్ధం ప్రకటించింది.
నిజానికి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని కాదు...
ఉపాధ్యాయ తన తాతయ్య అన్న భావం.... డబ్బుని అధికారాన్ని ఆయన వారసురాలిగా పెంచుకున్న అటాచ్ మెంట్.
ఒకవేళ ఉపాధ్యాయకి గుణగణాల్లోనూ ఆమె వారసురాలై వుంటే ఓ మామూలు స్థాయికి చెందిన విస్సుతో స్నేహాన్ని పెంచుకునేది కాదు. అసలు అది స్నేహమేనా.... పరిచయం ప్రారంభం ఎలా జరిగినా కాని అతడి మీద క్రమంగా ఆసక్తిని పెంచుకుంది?
గతం గాయం ఇంకా మానకనా....
లేక తాతయ్య నుంచి దక్కని అనుబంధం మరో రూపంలో వెతుక్కోవాలనా-
వెనక్కి తిరిగింది అడుగుల చప్పుడుతో.
డాక్టర్ మహంతి నిలబడి వున్నాడు- "కంగ్రాట్స్ కృషీ"
అసలు ఆ సమయంలో ఆయన అక్కడికి రావడం కృషికీ నచ్చలేదు-
"పిల్ల కెరటంలా కనిపించిన కృషి చౌదరిని బలంగా దెబ్బతీసింది అంటూ మీ గ్రాండ్ పా నిన్ను తెగ మెచ్చుకుంటున్నాడమ్మా"
కళ్ళనుంచి జివ్వున నీళ్ళు తిరిగాయి.
అంతకన్నా తాతయ్య తనను అక్కున చేర్చుకుని గతాన్ని మరిచిపొమ్మని ఆప్యాయంగా అంటే చాలా ఆనందించేది.
అది చేతకాదు - ఆయన ఆనందించేది కార్పోరేట్ యుద్దాల్లో గెలిచినప్పుడు తన ప్రతిష్ట దెబ్బతిననప్పుడు.
"మొత్తానికి నా మాటని నిలబెట్టావు కృషీ" క్షణం ఆగి అన్నాడు "తాతయ్యకి అండగా నిలబడ్డ నువ్వు పెళ్ళికూడా చేసుకుని సెటిలయితే మీ తాతయ్య కోరిక తీర్చినట్టవుతుంది. నువ్వు సరేనంటే-"
"అంకుల్" అర్దోక్తిగా ఖండించింది "అది తప్ప మనం మరేదన్నా మాట్లాడుకుందాం. మరోసారి ఇలాంటి చర్చ వస్తే నేను జవాబు చెప్పేది ఇండియా నుంచి కాదు"
దుఃఖోద్విగ్నంగా అంది "నేను మనుమరాల్ని అని కాక ఓ తెలివైన యంత్రాన్ని అని గ్రాండ్ పాకి బోధపడిందిగా నన్ను అలాగే ఉపయోగించుకోమనండి. ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించుకోటానికి వాడుకోమనండి - ఆయనకి కావాల్సింది అదేగా."
ఇక మాట్లాడేదేమీ లేనట్టు ఆవేశంగా లోపలికి నడిచింది.
అవాక్కయి చూశాడు డాక్టర్ మహంతి.
ఆ తర్వాతయినా కృషి మనశ్శాంతిగా వుండలేకపోయింది.
మొన్నటి జ్ఞాపకాలు యిందాక విస్సు మాటలు మనసుని హోమగుండంగా మార్చి అసహనానికి గురిచేస్తుంటే బెడ్ పై నున్న ఓ ఫైలు అందుకుంది.
మరో వ్యాపకాన్ని సృష్టించుకున్నట్టుగా ఫైలు తెరిచి చూస్తుంటే ముందు కనిపించిందో రిపోర్టు.
సరిగ్గా ఏడాది క్రితం ఉపాధ్యాయ మెషిన్ టూల్ ఫ్యాక్టరీ కేంటిన్ లో విషాహారం మూలంగా పాతికమంది దాకా అస్వస్తులు కావడం గురించి తయారు చేయబడిన నివేదిక అది. ఉపాధ్యాయని నేరస్థుడిగా నిలబెట్టిన సంఘటన అది. కేంటిన్ ఫుడ్ పాయిజన్ కలపడానికి తెరవెనుక వున్న చౌదరిగా నోట్ రాయబడి వుంది - అది రాసింది స్వయంగా ఉపాధ్యాయగారే.
చౌదరిని దోషిగా నిరూపించే అవకాశం లేకపోయినా తెలుసుకున్న ఆధారాల్ని కాన్ఫిడెన్షియల్ గా పొందుపరిచారందులో.
ఒంటరితనం, వికలమైన మనస్సు ఎంత యిబ్బందిని కలిగించేదీ అర్ధమౌతున్న క్షణాలవి-
అటు చౌదరి మరో అడుగు ముందుకేశాడు. విస్సుని పావుగా కదిలించడం ద్వారా - దానికి కారణం తన మూలంగా చౌదరి పరపతికి జరిగిన నష్టం "The first Blow is half the battle" అన్న ఆలివర్ గోల్డ్ స్మిత్ వాక్యంతో బాటు వ్రెజన్స్ అంటే సమక్షంలో వుండడం మాత్రమే కాదన్న మాల్కమౌపోబ్స్ సూక్తి కూడా గుర్తుకొచ్చింది. అందుకే గ్రాండ్ పాకి తన ఉనికి మరింత స్పష్టంగా తెలియచెప్పటానికన్నట్టుగా అదేరాత్రి ఫ్యాక్టరీ పర్సనల్ మేనేజర్ కి ఫోన్ చేసింది.
చౌదరిపై మరో పథకానికి అంకురార్పణ జరిగింది. మరో అరగంటలో-
* * * *
అర్ధరాత్రి దాటి అరగంట కావస్తూంది.
దట్టమయిన చీకటిని చీల్చుకుని ఓ లారీ విజయవాడ రోడ్డుపై దూసుకు వెళుతూంది.
రెండు వేల లీటర్ల స్పిరిట్ ని విజయవాడ తీసుకు వెళుతున్న ఆ 'టేంకర్'ని నడుపుతున్న డ్రైవర్ రామనాథచౌదరికి చెందిన సారా డిస్టలరీలోని ఉద్యోగి మాత్రమే గాక చౌదరి నేర ప్రపంచంలో ఎలాంటి దారుణాలనైనా చేయగల నేరస్థుడు కూడా.
గంటన్నర క్రితం సారా డిస్టిలరీ నుంచి బయలుదేరిన టేంకర్ నగర పొలిమేరల్లోని ఓ పంజాబీ డాబా దగ్గర ఆగింది. ఓ అరగంట - దూర ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు పంజాబీ డాబాల దగ్గర ఆగడం అక్కడ లిక్కర్ సేవించి భోజనం చేశాక ఉత్సాహంగా గమ్యానికి బయలుదేరడం తరచూ జరిగేదే అయితే డాబాలో మందుకొడుతున్న డ్రైవర్ యాదయ్యకి తెలీదు- అతడు తన పనిలో నిమగ్నమై వుండగా ఓ వ్యక్తి రహస్యంగా టేంకర్ పైకెక్కడం దాని మీద కవర్ తెరిచి అందులో పొటాషియం సైనేడ్ స్పటికల్ని కలపడం జరిగింది.