ఆ దెబ్బ ప్రభావతి ఎడమ భుజాన్ని బలంగా తాకింది. చర్మం చిట్లినట్లు శబ్దం.
ఆంజనేయులు చిన్న జర్క్ ఇచ్చాడు.
భూతలింగం మరో దెబ్బకొట్టాడు. ఆంజనేయులు మిడిగుడ్లు వేసుకుని అటే చూస్తున్నాడు. అతనికి తెలియకుండానే దుఃఖం పొంగుకొస్తోంది.
'నన్ను క్షమించమ్మా. నిస్సహాయుడ్ని. నిన్ను భూతవైద్యుడికి అప్పగించి తమాషా చూస్తున్నాను. నీకు దెయ్యం పట్టలేదని, ఇది మానసిక జబ్బని చెప్పాలనుందమ్మా. కానీ చెప్పలేను తల్లీ. చెబితే ఆ జబ్బు తగ్గడానికి నీకు పెళ్ళి చేయమని పిన్ని పోరుపెడుతుంది. నాన్న నాకు చెప్పలేక తనలో తానే గొణుక్కుంటాడు. తనూ ఇలా కన్యగానే మిగిలిపోతానేమోనని చిన్నచెల్లెలు దిగులు పెట్టుకుంటుంది. అందుకే నమ్మా చెప్పలేకపోతున్నాను.'
అతను ఎక్కిళ్ళు పెడుతున్నాడు. తనను ఎవరైనా గమనిస్తారేమోనని ఆడుకోమారు కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నాడు.
భూతలింగం చేయిచాచి మరీ కొడుతున్నాడు.
ఇప్పుడు ప్రభావతి మూలగడం లేదు. అంతంత దెబ్బలు పడుతుంటే ఇంకెక్కడ మూలుగుతుంది!
వేపమండలు విసురుగా తాకడంవల్ల ఆమె పైట ఒళ్ళో పడి పోయింది. ఎండిపోయిన గుండెలు తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించడంతో ఆంజనేయులు ఠక్కున తలదించుకున్నాడు.
"ఏయ్ శాకినీ..... డాకినీ..... మోహినీ..... వెళ్ళవే నీ యింటికి వెళ్ళు" వెళ్ళకపోతే నీకు తగిన శాస్తి చేస్తాను. జుట్టు పోలుగాడ్ని పిలిచి నీ రక్తం తాగించేస్తాను. జాగ్రత్త.....ఖబడ్దార్..... వెళ్ళు..... నేను తలుచుకుంటే నిన్నిక్కడే బంధిస్తాను."
భూతలింగం శారా మైకంలో ఇష్టంవచ్చినట్లు కొడుతున్నాడు.
మరో అయిదు నిముషాలకి ప్రభావతి ఠక్కున అక్కడ వాలిపోయింది కాంతం పట్టుకోవడానికన్నట్టు ఒకడుగు ముందుకేసింది.
"వద్దు.... మీరు ముట్టుకోవద్దు.... అదంతా ఆ మోహినీ పిశాచీ నటన. దానికి చాలా దొంగ వేషాలు తెలుసు. అది కుక్కపిల్లలాగా నా ముందు తోకాడిస్తుంది. కుందేలు పిల్లలాగా గంతులేస్తుంది. కాబట్టి మీకేం భయంలేదు. ఇంకెప్పుడు అది ఇటు రాకుండా మంత్రం వేస్తాను తంత్రం ఉపయోగిస్తాను" అని భూతలింగం వేప మండలను పక్కన పెట్టాడు.
ఆంజనేయులు గుండెల్నిండా గాలిని పీల్చుకుని వదిలాడు.
"అమ్మా మీరంతా నా దగ్గరకు రండి" అని వైద్యుడు అనడంతో అందరూ సర్దుకున్నారు.
"ఒక్కొక్కరే వచ్చినా నా దగ్గరున్న బియ్యం తీసుకోండి. ఇవి మామూలు బియ్యం కాదు. మంత్రించిన బియ్యం."
ముందు కాంతం వెళ్ళింది. ఎప్పుడెప్పుడు కూతురుకు బాగావుతుందా అనే ఆతృత ఆమెలో.
భూతలింగం ఆమె చేతిలో కొంచెం బియ్యం వుంచాడు.
"ఇప్పుడు నువ్వు వాటిని మోహిని మీద చల్లి 'ఇంకెప్పుడూ ఇటు రావద్దే సిగ్గుమాలినదానా' అని వుమ్మెయ్. ఎంగిలి ముఖం మీద పడాలి.
దానికి సిగ్గూ, లజ్జా, మానం హీనం వుంటే మళ్ళిటు తొంగిచూడదు అని ఆయన చెప్పాడు.
కాంతం ప్రభావతికి ముందుకు నడిచి బియ్యం చల్లింది. అతను చెప్పినట్లే చెప్పి బాగా కాకరించి ఉమ్మేసింది.
ఆ దృశ్యాన్ని చూసి ఆంజనేయులు కదిలిపోయాడు. ఇంత అసహ్యంగా ఇంత జుగుప్సాకరంగా ఇంత హేయంగా ప్రవర్తించకండి. వద్దు వాడి మాటలు నమ్మకండి. సారా తాగి వాడు అన్నీ మరిచిపోయాడు. వాడు మనలాంటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని,. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని మోసం చేస్తున్నాడు. కడుపు నింపుకుంటున్నాడు. కావాలంటే వాడి పేదరికానికి మనమూ కన్నీళ్ళు కార్చుదాం. శక్తి వుంటే ఓ రూపాయి దానమిద్దాం. అంతేగానీ ఇలా ఘోరంగా, దారుణంగా ఓ అమ్మాయిని అవమానించవద్దు. తనకు ఓ మగతోడు లేదని దిగులుపడ్డ చిట్టితల్లి మీద వుమ్మేయటం మొత్తం ఆడజాతినే అవమానించినట్టు లెక్క వద్దు పిన్నీ వద్దు...... శారదా.....వద్దమ్మా..... నువ్వు అయినా అలా ఎంగిలి వూయకు తల్లీ నెక్స్ట్ బాధితురాలివి నువ్వే తల్లీ.... తమ్ముడూ వద్దురా.... ఒరేయ్ నాగరాజు! హీరో ఎప్పుడైనా ఇంత నీచానికి ఒడిగట్టాడు రా..... నాన్నా నీకేమైంది నాన్నా జీవితసారాన్ని పేదవాడి బతుకులోని కారాన్ని అంత బాగా చెప్పగలిగావే... నువ్వు కూడా ఆ పని చేస్తున్నావా నాన్నా! కన్నకూతురిమీద కేకరించి ఉమ్మేస్తున్నావా నాన్నా!"
ఆంజనేయులు తనలో తానే గొణుక్కుంటున్నాడు. మౌనంగా అతను పడుతున్న క్షోభను అక్కడున్న వాళ్ళెవరూ గమనించలేదు. వాళ్ళ తాపత్రయమంతా ఆమెకు వెంటనే బాగైపోవాలనే.
"నువ్వూ రావయ్యా ఆంజనేయులూ. మీరంతా ఉమ్మేస్తే ఇక ఛస్తే మోహినీ పిశాచీ ఇటురాదు"
నేనా పని చేయలేనని అరిచి చెప్పాలనిపించింది ఆంజనేయులుకు తను ఆమాటంటే 'ఎందుకు చేయలేవు' అని పిన్ని నిలేస్తుంది. నాన్న ప్రశ్నార్ధకం ముఖం పెట్టుకుని చూస్తాడు చిన్న చెల్లెలు అర్ధంగాక గింజుకులాడుతుంది తమ్ముళ్ళిద్దరూ తనను ఓ ఫజిల్ గా చూస్తారు అప్పుడు తను నిజం చెప్పాలి. అది పెళ్ళిచేస్తే పోయే జబ్బని అప్పుడు. తను బలైపోతాడు. అందుకే పేదవాడి కోపం.....
అవన్నీ కళ్ళముందు మెదిలి గొంతు పూడుకుపోయింది. ఇదంతా తనకేకాక ఇంటిల్లిపాదికీ తెలుసేమో? మచ్చల పులిలాంటి పేదరికానికి జడిసి వీళ్ళంతా కూడా తనలాగే నటిస్తున్నారేమో? ఏమో?
"రావయ్యా రా"
భూతలింగం అరవడంతో ఆంజనేయులు మెల్లగా దగ్గరకు నడిచాడు. చేతిలోని బియ్యాన్ని చెల్లెలు మీద చల్లాడు. తడారిపోయిన నోటిని అటూ ఇటూ కదిలించాడు. నాలుకను పైకికిందకు ఆడించాడు. కడుపు లోని చెమ్మనోట్లోకి వచ్చినట్టు అనిపించింది. తలవంచి చెల్లెలు ముఖం మీద వుమ్మాడు.
ఆ తుంపరలు అలానే పైకి లేచి తన ముఖాన్ని తడివేసినట్టు అనిపించడంతో అప్రయత్నంగా రెండు చేతులతోనూ తుడుచుకున్నాడు.
మరుక్షణం లో ప్రభావతి మెల్లగా కదిలింది.
* * *
"హలో ఆంజనేయులుగారూ! గుడ్ మార్నింగ్."
తల పైకెత్తాడు అతను. ఎదురుగ్గా ప్రియంవద. స్టెనోగా పని చేస్తుంది.
వర్కింగ్ అవర్స్ కావడం వల్ల ఆఫీసంతా బిజీగా వుంది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.
"రండి అలా క్యాంటీన్ లోకి వెళ్ళి కాఫీ తాగుదాం. ఎప్పుడూ వుండే ఫైళ్ళే కదా"
అతను ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇష్టంలేకపోయినా పైకి లేచాడు. అటూ ఇటూ చూశాడు తమను ఎవరైనా ఈర్ష్యగా చూస్తున్నారేమోనని. వూహూ ఎవరూ గమనించలేదు. చాలా క్యాజువల్ గా ఓసారి చూచి తిరిగి పనిలో మునిగిపోతున్నారు.
తనను ఓ ఆడపిల్ల క్యాంటీన్ కి పిలిచినా వీళ్ళలో ఎందుకు రియాక్షన్ వుండదు? అదే వినయ్ ఎవరైనా ఆడపిల్ల కాఫీ తాగడానికి ఇన్ వైట్ చేస్తే ఎన్ని గుసగుసలు ఎంత హంగామా?