శ్రీధర్ ముఖం చిన్నబోయింది. కంపెనీ మూతపడిన విషయం ఇంకా తెలీదు సృజన కీ ఇప్పటివరకూ ఎలాగోలా అతనికా విషయం తెలీకుండా జాగ్రత్తపడ్డాడతను. కానీ ఇంకెంతకాలం సాధ్యమవుతుందది! ఏదో ఒకరోజు బయటపడక తప్పదు.
"ఇప్పుడేమీ ఖాళీ లేవు. వున్నప్పుడు చెప్తాన్లే"
సృజన్ నిర్ఘాంతపోయాడు.
తన కోరికను అన్నయ్య అంత తేలిగ్గా త్రోసి పుచ్చుతాడనుకోలేదు. ఒకవేళ నిజంగానే సాధ్యం కాదేమో - వెంటనే ఉద్యోగం ఇవ్వటం !
లేచి తన గదిలోకి నడిచాడతను. సోమవారం నాడు భారతి వస్తే ఏమని చెప్పటం! తను ముందూ వెనుకా ఆలోచించకుండా ఆమెకు ఉద్యోగం వచ్చేసినట్లే మాట్లాడాడు.
మర్నాడు ఉదయమే కారాగింది.
సరోజినీ ఆమె భర్త కృష్ణా రావ్ లోపలికొచ్చారు.
"వదినా! మీ ఫ్రెండ్ గారొచ్చారు." అంటూ సుభద్ర దగ్గరకు పరుగెత్తి చెప్పాడతను. "ఈసారి వాళ్ళాయనను కూడా తీసుకొచ్చింది?" ఏమిటి సంగతి?" అడిగాడతను.
"ఏమో ! నాకేం తెలుసు! మీ అన్నయ్యను కూడా పిల్చుకురా"
సృజన్ శ్రీధర్ తో హల్లో కొచ్చేసరికి అప్పుడే శుభలేఖ ఇస్తోంది సరోజినీ.
"మా దీప పెళ్ళి అన్నయ్యగారూ మీరంతా తప్పకరావాలి."
శ్రీధరం సుభద్రతో పాటు సృజన్ కూడా ఆశ్చర్యపోయాడు.
"ఓ! ష్యూర్! తప్పకుండా!" కార్డ్ తీసుకుని చూస్తూ అన్నాడు శ్రీధర్. అతనికి చాలా షాకింగ్ గా ఉందా వార్తా.
ఎన్నో సార్లు దీపను సృజన్ కిచ్చి చేస్తామని అడిగి తనతో వప్పించారు కూడా సుభద్ర కూడా సరోజినీకి మాట ఇచ్చింది. సృజన్ వేరే సంబంధాలు చుడబోవటం లేదు అని.
"ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎక్కడో చోట ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు క్లబ్ లో - ఉద్యోగమేదయినా దొరికిందా?" అడిగాడు కృష్ణారావు.
శ్రీధర్ ముఖం పాలిపోయింది. సృజన్ కి కృష్ణారావు మాటలు అర్ధంకాక అన్నా వదినల వేపు చూశాడు.
సృజన్ దగ్గర ఇన్ని రోజులుగా దాచిన రహస్యం ఈరోజు ఇలా బయటపడటం సుభద్రకు దుఖం కలిగించింది.
"ఇంకేమీ దొరకలేదు " అన్నాడు శ్రీధర్ ముఖం మరో వేపుకి తిపుకుని.
"అందుకే మిమ్మల్ని మొదటినుంచీ హెచ్చరిస్తూనే వున్నాను. డబ్బు మరీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దనీ " మళ్ళీ అన్నాడతను.
శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు.
"మీ పరిస్థితి మరీ దారుణంగా వున్నట్లు మూర్తి చెప్తే కానీ తెలీలేదు. కారు అతనికే అమ్మేశారుట కదా?"
సృజన్ మతిపోతోంది ఆ మాటలు వింటుంటే?
అన్నయ్య ఊద్యోగం కోసం వెతుక్కోవటం, కారు ఎవరికో అమ్మారనటం - ఏం జరుగుతోంది ఇంట్లో?
కారేదని వదిన నడిగితే ఆఫీస్ వాళ్ళు కార్లో టూర్ వెళ్ళారని అబద్దం చెప్పింది వదిన.
వాళ్ళు వెళ్ళిపోయారు.
సృజన్ సోఫాలో కుర్చుండిపోయాడు. ఆలోచిస్తూ. అన్నా వదినలతో మాట్లాడాలంటే ఏదోగా వుంది. అన్నయ్య అతని గదిలో కెళ్ళిపోయాడు. సుభద్ర వంటింట్లో కెళ్ళిపోయింది. చాలా సేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది.
"సృజన్ " సుభద్ర వచ్చి నిలబడింది అతని దగ్గర.
తలెత్తి వదినవేపు చూశాడతను.
"భోజనానికి రావూ?"
లేచి ఆమె వెనుకే డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడతను.
"అన్నయ్య రాలేదేం భోజనానికి?"
"కాసేపాగి చేస్తానన్నారు......"
"సృజన్ అన్యమనస్కంగానే భోజనం చేయసాగాడు.
"అవేమీ నీకు తెలీనీయవద్దని మీ అన్నయ్యే చెప్పారు ------చెప్తే నువ్వు చదువు మీద మనసు నిలుపవేమోనని ......"
నెమ్మదిగా మాట్లాడుతుందామే.
"అసలేం జరిగింది వదినా?"
"కంపెనీ మూతబడింది. అప్పులు మిగిలాయ్."
"ఎందుకు జరిగిందలా?"
"మన దురదృష్టం! అంతే."
సృజన్ ఇంకేమీ ప్రశ్నించలేదు. ఆలోచనలు కందీరీగల్లా చుట్టూ ముట్టినాయ్. తన చదువు - ఇంటి పరిస్థితి- శంకు, సీత ల భవిష్యత్తు.
భోజనం ముగించి తన గదిలోకి చేరుకొని మంచం మీద పడుకున్నాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా భయంకరమయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందిప్పుడు ఏనాడూ ఊహించనిది ఇది!
కానీ అది హటాత్తుగా ఎలా ముంచు కొచ్చిందో అర్ధం కావటం లేదు. కంపెనీ మూతపడితే పడొచ్చు. కానీ అప్పులు మిగిలెంతటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఒకే ఒక్క కారణం కనబడుతోంది.
అన్నయ్యకు వున్న ఒకే ఒక్క వీక్ నేస్ - పేకాట ! చాలాసార్లు క్లబ్ లో వేలకు వేల రూపాయలు పోగొట్టుకున్న విషయం తనకు తెలుసు - దీప చెప్తుండేది.
ఒకవేళ ఆ విధంగా -
ఏదయితేనేం ఇప్పుడు తమ కుటుంబం బాంక్రప్ట్ అయింది!
సీతా, శంకూ గదిలో కొచ్చారు పరుగుతో.
"బాబాయ్ కధ చెప్పవూ?"
"ఇంక కధలయిపోయాయ్ రా! వెళ్ళి చదువుకోండి."
కొద్దిసేపు మారం చేసి వెళ్ళిపోయారు.