Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 17


    "ఏమిటా భయంకరమైన సమస్య? సీక్రెట్ ఫొటోలేమయినా తీశావా?" అడిగాడు శ్యామ్.
    "నో, నో ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉన్నాం కామ్రేడ్! చిన్నారి బాలలకు ప్రస్తుతం అవసరమైన సినిమా కమ్ పొలిటికల్ జనరల్ నాలెడ్జి ని సరఫరా చేసే స్కీము మాత్రమే అమలు పరుస్తున్నాం. కానీ ఇవాళ మాణింగ్ నుంచీ పరిస్థితులు కొంచెం తమషాగా నటిస్తున్నాయ్. ఆ విషయం డిస్కస్ చేయడానికే వచ్చాను" అనేసి టీ తాగి కప్పు కింద పెట్టడతను.
    "సంగతేమిటంటే ఉదయం నేనూ, స్మితారాణి , కేవలం పది అడుగుల దూరం మెయిన్ టెయిన్ చేస్తూ మీ ఇంటికొస్తున్నప్పుడు ఈ సందులోనే ఒక నల్లకారు స్మితారాణి మీదకు "దూసుకొచ్చింది. సమయానికి నేనామేను పక్కకు నేట్టేశాను. తరువాత మధ్యాహ్నం మీ ఇంటి నుంచి వెళుతుంటే మా బస్ స్టాప్ దగ్గర మళ్ళీ అదేకారు ఆమెను డీ కొట్టబోయి పుట్ ఫాత్ మీద కొచ్చి బాలెన్స్ తప్పి ఎలక్ట్రికల్ పోల్ ని కొట్టుకుని స్మాష్ అయిపొయింది. డ్రైవర్ ని పట్టుకుని మనం కాలేజ్ డేస్ లో నేర్చుకున్న రెండు బాక్సింగ్ పంచేస్ ఇచ్చాననుకో. పూర్తీ డిటైల్స్ సేకరించక ముందే మాములు ప్రకారం పోలీసులు వచ్చి దొంగలను - గుండాలను రక్షించే స్కీమ్ అమలు పరిచి వాడిని తీసుకెళ్ళిపోయారు. కనుక స్మితారాణిని ఎవరో చంపేయటానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానం ప్రారంభమైంది నాకు. ఈ సంగతి చెప్తే ఆ అమ్మాయి నన్ను ఖైదీ నెంబర్ వన్, వన్, వన్ ని చూసినట్లు చూసి బయటకు గెంటేసినంత పని చేసింది."
    ఆర్. కె. శ్యామ్ నవ్వాడు.
    "ఈ కాలేజీ గాళ్స్ అంతా ఇంతే మడ్ హెడ్స్" అన్నాడు జాలిగా.
    అఖిలాభాను రోషంగా చూసిందతని వేపు.
    "మడ్ హెడ్స్ నయం కదా! ఖాళీ బుర్రకంటే " అంది కోపంతో.
    భవానీ శంకర్ పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించేశాడు.
    "మన సబ్జక్ట్ ఇప్పుడు కాలేజీ అమ్మాయిలు మడ్ హేడ్సా లేక ఏం హేడ్సా అనేది కాదు మైడియర్ సిస్టరిల్లా! స్మితారాణి అనే అందమైన అమ్మాయికి పొంచి వున్న ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాము.
    "కారీ అన్, కారీ అన్" అన్నాడు శ్యామ్.
    "ఇవాళ సాయంత్రం యింకో సంఘటన జరిగింది" అంటూ కెమెరా సంగతంతా చెప్పాడతను. ఆ విషయం వినేసరికి శ్యామ్, అఖిలాభాను మొఖాల్లో ఆందోళన చోటు చేసుకుంది.
    "అవును! యూ ఆర్ సెంట్ పర్సెంట్ కరెక్ట్" అన్నాడు శ్యామ్.
    "మనకిప్పుడు స్మితారాణి తాలూకు పూర్తీ డిటైల్స్ కావాలి కామ్రేడ్స్. జే. స్మితారాణి ఎవరు? ఆమె బయోడేటా ఏమిటి? చిన్నప్పటి నుంచి స్టాంపులు సేకరించడమే కాకుండా టెర్రరిజం కూడా హాబీగా స్వీకరించిందా? లేక సి.ఐ.డి. కి ఏజెంట్ గా పార్ట్ టైము జాబ్ చేస్తోందా? ఇవన్నీ సిస్టరిల్లా కు తెలిసే ఉంటాయేమోనని నా అనుమానం."
    అఖిలాభానుకి కోపం ముంచుకొచ్చింది.
    "అది నా బెస్ట్ ఫ్రెండ్! దానిని గురించి అలా మాట్లాడటం నాకిష్టం లేదు. హైస్కూల్ రోజుల్నుంచి మేము ఫ్రెండ్స్ గా వున్నాం. స్కూలు , ఇల్లు, నవలలు చదవటం , క్రికెట్ ఆడటం తప్ప దానికి యింకో వ్యాపకమే లేదు" అంది నిష్టూరంగా.
    భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
    "ఏమీ లేకపోతే ఆమె మీద ఇంత పెద్ద ఎత్తున హత్యప్రయత్నాలు ఎవరు చేస్తున్నట్లు? ఎందుకు చేస్తున్నట్లు?"
    "నాకూ అదే అర్ధం కావడం లేదు."
    "ఏదేమయినా మనం వెంటనే వార్ పుటింగ్ లో ఆమెకు రక్షణ కార్యక్రమాలు చేపట్టటం చాలా అవసరం శ్యామ్. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీ ఇద్దరూ కొద్దిరోజులు ఆమె ఇంట్లో ఉండటం మంచిది."
    శ్యామ్ అఖిలభాను మొఖాలు చూసుకున్నారు.
    "అల్ రైట్ , రేపు మాణింగ్ మేము స్మితారాణి ఇంటికొచ్చి ఆమెతో మాట్లాడి డిసైడ్ చేస్తాము సరేనా?" అడిగాడు శ్యామ్.
    "బ్యుటీఫుల్ సజెషన్ కామ్రేడ్! మరి నేనింక వెళ్ళవచ్చా! " లేచి నిలబడుతూ అడిగాడు భవానీశంకర్.
    "ఎలాగూ మీరా ఇంటికి దగ్గరే ఉంటున్నారు కాబట్టి - కొంచెం కనిపెడుతుండండి స్మితను" అంది అఖిలాభాను.
    "ష్యూర్ మైడియర్ సిస్టరిల్లా! ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ ఇంటి చుట్టూ ఓ రౌండ్ కొడతాను ఘూర్ఖాలాగా."
    "రేపు మాణింగ్ మేము స్మిత ఇంటికెళ్ళేప్పుడు నీ రూంకి కూడా వస్తాం" అన్నాడు శ్యామ్.
    "వట్టిచేతులతో రాకూడదు కామ్రేడ్! సిస్టరిల్లా ఫేమస్ డిష్ "పావ్ భాజీ" ఓ టిఫిన్ కారియర్ లో చేసుకొస్తే - వెల్ కమ్  బోర్డూ, మామిడి తోరణాలు, మంగళవాయిద్యాలు లాంటి వాటితో ఘనంగా స్వాగతం ఏర్పాటు చేయబడుతుంది.
    "సరే చేసుకోస్తానులే" నవ్వుతూ అంది అఖిలభాను.
    "అది! 'స్పోర్ట్స్ వుమన్' స్పిరిట్ అంటే అలా వుండాలి."
    భవానీశంకర్ ట్యూన్ నెంబరు "టూ" ని విజిల్ రూపంలో రిలీజ్ చేస్తూ రోడ్డు మీద కొచ్చి అప్పుడే వస్తున్న బస్ ని చూసి అడ్డం పరుగెత్తి డ్రయివర్ కి కనిపించేట్లు హైదరాబాద్ ఫాషన్ తో "సలామాలేఖం" చేసేసరికి బస్ సడన్ బ్రేకులతో ఆగిపోయిందతని కోసం.
    దర్జాగా బస్ ఎక్కడతను.
    బస్ దిగి తన రూం వేపు నడుస్తుండగా ఆలోచన వచ్చిందతనికి.
    స్మితారాణికి జరిగినదంతా చెప్పి -- హెచ్చరిస్తే ఆమె తగు జాగ్రత్తతో వుంటుంది. లేకపోతే ఏ క్షణంలో నయినా ఆమెకు ప్రాణాపాయం కలుగవచ్చు. ఉదయం శ్యామ్, అఖిలభాను వెళ్ళేసరికే ఆలస్యం కావచ్చు చూసుకున్నాడతను.

 Previous Page Next Page