"మీ అందరినీ రేపు ఫోటో తీస్తా కామ్రేడ్స్. ఇందులో ఫిలిం మంచిది కాదు -"
అనేసి స్మితా రాణి ఇంటివేపు నడవసాగాడు. స్మితారాణిని ఎలా అంగీకరింపజేయటమా అనేదే అర్ధం కావటంలేదతనికి.
అదీ తను కోరితే సెంటు పర్సెంటు వ్యతిరేకిస్తుంది. ఏదేమయినా తను ఆమెను ఇవాళ ఫోటోలు తీయాల్సిందే! ఒకవేళ ఆమె ఒప్పుకోకపోయినా రహస్యంగా ఏ కిటికీ లో నుంచో తీయవచ్చు.
అందం అనేది పదిమందీ చూసి ఆనందించాలనేది తన పాలసీ రెండు వేల రూపాయలు సెకండరీ ఇష్యూ!
హటాత్తుగా నిలబడి పోయాడతను.
ఎదురుగ్గా కనిపిస్తున్న దృశ్యం అతనిని ఆనందంతో ముంచెత్తింది. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు రోడ్ పక్కనే వున్న పెద్ద చెట్టు మీద పడుతుంటే కొమ్మ మీద నుంచున్న ఓ పాలపిట్ట వింత రంగులతో మెరిసి పోతోంది. భవానీ శంకర్ ని ఆ దృశ్యం పూర్తిగా మైమరపింపజేసింది. ఇంత చక్కని పకృతి దృశ్యం దొరకడం చాలా అరుదయిన విషయం. అనాలోచితంగా కెమెరా తీసి ఆ అద్భుత దృశ్యాన్ని ఫోటో తీయడానికి సన్నద్దుడయ్యాడతను.
ఆ సమయంలో అతనికి కెమెరా "వ్యూ" లో నుంచి పాలపిట్ట తప్పితే మరేమీ కనిపించడం లేదు.
సూటువాలా చెప్పిన "రెండే రెండు స్నాప్ లున్నాయ్" అనే మాట కూడా గుర్తులేదు.
జాగ్రత్తగా పక్షిని సెంటర్ చేసుకుని తన చేతులు కదలకుండా ఫిక్స్ చేసుకుని బటన్ నొక్కాడు.
అంతే! అతి భయంకరంగా అరిచిందా పిట్ట.
మరుక్షణం చెట్టు కొమ్మ మీద నుంచి విలవిల కొట్టుకుంటూ క్రింద పడింది. రెక్కలు రెపరెప కొట్టుకుంటూ బాధతో అరుస్తూ అక్కడే ఎగిరేరేగిరి పడుతోంటే భవానీశంకర్ నిశ్చేష్టుడయి చూస్తుండిపోయాడు.
అతను ఆ షాక్ నుంచి తేరుకుని పక్షి దగ్గరకు పరుగెత్తే సరికి అప్పటికే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిశ్చలంగా పడి వుంది! వణుకుతున్న చేతులతో దానిని పట్టుకుని పరీక్షగా చూశాడతను.
అది ఎలా పడిచచ్చిపోయిందో ఏ మాత్రం అర్ధం కావటం లేదతనికి. మరోసారి దాని రెక్కలు కింద చూస్తుంటే కనిపించింది పిన్ను లాంటి లోహం.
పచ్చగా రెండంగుళాలు బయటకు కనబడుతోంది. దాని శరీరంలోకి ఎంత భాగం దిగిందో తెలీటం లేదు.
భవానీశంకర్ చూస్తుండగానే పాలపిట్ట రంగు మరిపోసాగింది. బ్లూ రంగులో ఉన్న భాగం తప్ప మిగతా శరీరమంతా క్రమేపీ నల్లబడిపోతోంది.
భవానీశంకర్ దానిని క్రింద వదిలేశాడు.
మరికొద్ది నిమిషాల్లో ఆ పక్షి నల్ల బొగ్గులా మారిపోయింది.
భవానీశంకర్ కి కొంచెం కొంచెంగా జరిగింది అర్ధమవుతోంది. ఆ పక్షి శరీరంలో గుచ్చుకున్న "పిన్" ఏదో పాయిజన్ తో నింపబడి వుంది. అయితే అసలా ముల్లు దాని శరీరంలో ఎలా దిగిందీ ఇంకా స్పష్టంగా తెలీటం లేదు. తన కేమెరా తాలుకూ బటన్ నొక్కగానే అది అరిచి క్రింద పడటం చూస్తుంటే ఆ "పిన్" తన కెమెరా నుంచే వెళ్ళిందేమో అనిపిస్తోంది. తన కెమెరాలో అలాంటి పిన్ లు ఎందుకుంటాయ్? కెమెరా నెమ్మదిగా ఓపెన్ చేసి చూశాడు. లోపల ఇంకో పిన్ అచ్చం అలాంటిదే ఓ చిన్న బారెల్ లో లోడ్ చేసినట్లుంది. హటాత్తుగా ఓ ఆలోచన అతనిని నిలువెల్లా కంపింపజేసింది.
మొత్తం అర్ధమై పోయిందతనికి.
అది నిజంగా కెమెరా కాదు. స్మితారాణిని హత్య చేయడానికి ఆ సూట్ వాలా పన్నిన పననగం! తను ఆ పక్షిని ప[ఫోటో తీయాలని అనుకోక పోయినట్లయితే స్మితారాణి కి ఆ పిన్ గుచ్చుకుని చనిపోయేదే!
అతని గుండెలు ఝల్లుమన్నాయ్.
ఎంత ఘోరం ? తను అంతగా ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోనే చంపించాలనుకున్నారు ఆ దుర్మార్గులేవరో.
అసలెవరు వాళ్ళు? ఆమె నెందుకు చంపాలనుకుంటున్నారు? ఆరోజు ఉదయం, మధ్యాహ్నం - ఆమె మీదకు కారుని పోనిచ్చిన వాళ్ళేనా వీళ్ళు?
ఎవరయినా కానీ - ఖచ్చితంగా ఆమెను హత్య చేయాలనుకొంటున్నారన్న విషయం ఇప్పుడు స్పష్టమై పోయింది.
తను ఇంక ఆలస్యం చేయకూడదు. ఏ క్షణాన్నయినా ఆమెను వాళ్ళు ఎటాక్ చేసి చంపేసే అవకాశం వుంది.
ఆ పక్షి వంక మరోసారి చుశాడతను. నల్లబొగ్గు! అంతే! అంతకు ముందు పకృతికే వింత శోభను తెచ్చిన దాని రూపం ఆనవాలు వీల్లేకుండా మారిపోయింది.
దానిని వెంటనే తీసుకెళ్ళి లాబ్ లో పరిక్షలు జరిపిస్తే ఏ పాము ద్వారా చంపబడిందీ తెలుస్తుంది. చేత్తో దానిని పట్టుకోబోయి ఆగిపోయాడతను - ముట్టుకుంటే తనక్కుడా ప్రమాదం కలిగిస్తుందేమో -
వెంటనే అక్కడి నుంచి ఆటోలో శ్యామ్ ఇంటికి చేరుకున్నాడతను. అప్పటికి చీకటి అలుముకుంటుంది. శ్యామ్ , అఖిలభాను ఇంటి ముందు ఆవరణలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారప్పుడు.
భవానీశంకర్ ని చూస్తూనే ఆశ్చర్యపోయరిద్దరూ.
"వీడినీ మధ్యాహ్నం ఒక్క పూటనే కదా భోజనానికి పిల్చింది మళ్ళీ వచ్చాడేమిటిప్పుడు?" ఆశ్చర్యంగా అభిలభానుని అడిగాడు ఆర్.కె. శ్యామ్.
భవానీ శంకర్ నవ్వుతూ మెట్లమీద అతనికి పక్కనే కూర్చున్నాడు.
"వదినమ్మ దగ్గర మనకలాంటి ఫార్మాలిటీస్ లేవు కామ్రేడ్. ఎప్పుడు వదినమ్మ చేతి వంట తినలనిపిస్తే అప్పుడు వచ్చేయటమే!"
"కాఫీ తేనా - టీ తేనా?" లేచి నిలబడుతూ అడిగింది అఖిలాభాను.
"టీ అయితేనే బెటర్ ఎందుకంటే మనం ముగ్గురం అతి భయంకరమైన సమస్య ఒకటి చర్చించబోతున్నాము."
అఖిలాభాను లోపలికెళ్ళి మూడు కప్పుల్లో టీ తీసుకొచ్చింది క్షణాల్లో.