Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 18


    పదవుతోంది - బహుశా ఈపాటికి ఆమె నిద్రపోయి ఉంటుంది. వెనక్కు తిరిగి ఆమె ఇంటివేపు నడవసాగాడతను.
    అతనూహించినట్లే జరిగింది. తెరిచిన కిటికీల్లోంచి డిం లైట్ బడుతోంది. అంటే నిద్రపోతోందన్న మాట. గేటు తీసుకుని లోపలకు నడిచాడతను.
    తలుపు ముందు నిలబడి కొద్ది క్షణాలు తటపటాయించాడు. ఆమెను ఇప్పుడు నిద్ర లేపి అసంగతి వివరిస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు.
    తను కావాలనే ఆ కధంతా కల్పిస్తున్నాడనీ కేవలం ఆమె చనువుగా ప్రవర్తించెందుకే ఈ నాటకం ఆడుతున్నాడనీ నిందిస్తుంది . అయినా గానీ తనమెను హెచ్చరించక తప్పదు. ఆమె తనమీద ఎలాంటి నిందలు వేసినా తను సాహించగలడు. గానీ ఆమె ప్రాణానికీ అపాయం కలిగితే తను భరించలేడు. అందుక్కారణం తనామేని - తనామెని - యస్ ప్రేమిస్తున్నాడు.
    తలుపు తట్టాడతను. జవాబు రాలేదు ----ఈసారి గడపను తడిమితే డోర్ బెల్ మీట కనిపించింది. అది నొక్కేసరికి లోపల్నుంచి పిట్ట అరచిన అరుపు వినిపించింది. గుండె జల్లుమందతనికి.
    "ఎవరూ?" స్మితారాణి గొంతు వినిపించింది లోపల్నుంచి. అప్పుడు ధైర్యం వచ్చిందతనికి.
    "నేనే ఫ్రెండ్! భవానీశంకర్ ని!"
    "ఎందుకొచ్చారిప్పుడు?" ఆమె గొంతులో ఇరిటేషన్ స్పష్టంగా తెలుస్తోంది.
    "మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి డియర్! రెండే రెండు నిమిషాలు అంతే."
    ఆమె ఓ క్షణం సంశయించి తలుపు తెరచింది.
    "ఏమిటి?" గడపలోనే నిలబడి అడిగింది.
    "అతిధులను ఇలా నడిరోడ్డు మీద నిలబెట్టి మాట్లాడటం అందమైన అమ్మాయిలు కలలో కూడా చేయరాని నేరం ఫ్రెండ్! లోపలకు రానిస్తే కధంతా సినిమా న్యూస్ రీల్ లాగా క్లుప్తంగా చెప్పేసి వెళ్ళిపోతాను."
    ఆమె సంశయిస్తూనే పక్కకు జరిగింది.
    భవానీ శంకర్ లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు.
    "వెరీగుడ్! 'నేర్వంగ రాని విద్యకలదే ముదితలకు ముద్దారనేర్పంగన్' అన్న మాట అక్షరాల నిజం అయిపొయింది. లోపలకు రానిచ్చినందుకు థాంక్స్ డియర్! ఇప్పుడు డైరెక్టుగా సబ్జెక్టు లో కొచ్చేద్దామంటారా -ముందు "టీ" "కాఫీ" లాంటి వాటితో అతిధి సత్కారం లాంటి దేమయినా చేస్తారా?"    
    "నా నిద్ర పాడు చేయకుండా త్వరగా చెప్పండి" విసుక్కుంటూ అందామె.
    "అల్ రైట్ -- శ్రోతల కోరిక మీద సబ్జెక్టు వినిపించేస్తున్నాను. మధ్యాహ్నం ఆ కారు మీ మీదకు రావటం యాక్సిడెంట్ కాదని రుజువయింది మిమ్మల్ని ఎవరో చంపటానికి ప్రయత్నిస్తున్నారన్న నిజం నేను స్వయంగా తెలుసుకున్నాను."
    "నేను నమ్మను."


                                                           5

    ",మీరు నమ్ముతారా, నమ్మరా అనేది మన సబ్జెక్టు కాదు డియర్ - అసలు......."
    "ఇంకోసారి "డియర్ " అన్నారంటే మర్యాదగా వుండదు" కోపంగా అతని మాటలకు అడ్డుపడుతూ అందామె.
    "ఓ.కే. డియర్ - డియర్ అనే పదం మీకిష్టం లేకపోతే ఇంకో పదమేమయినా వాడదాం! ఉదాహరణకు "స్వీట్" ఎలా వుంటుంది? హౌ డూ యూ లై కిట్?"
    "నన్నేమీ అనక్కర్లేదు. నాతొ మాట్లాడమే అనవసరం అసలు......."
    "వెరీ బాడ్! మన మధ్య ఇంత అనుబంధం ఉండి కూడా కొత్తవారిలా పొడిగా మాట్లాడుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది."
    "మన మధ్య అనుబంధం లేదు- ఏమీ లేదు. ప్లీజ్ డోంటాక్ నాన్సెన్స్."
    భవానీశంకర్ ఆమె వేపు ఆశ్చర్యంగా చూశాడు.
    "కొంచెం కూడా లేదా?"
    "కొంచెం కూడా లేదు"
    "మీరింక వెళ్ళిపోతే నేను నిద్రపోతాను" మరింత కోపంతో అంది.
    "అల్ రైట్. మీకు కోపం కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉంది. తెలుగు సినిమాలు చూడకపోవడం వల్ల వచ్చిన ట్రబుల్ ఇది! వాటిల్లో చూడండి - ఈ సీనులో హీరోయిన్ హీరో మీద మండిపడుతుంది. నెక్ట్స్ సీనులో మళ్ళీ కోపాన్ని ప్రేమగా మార్చేసుకుని డ్యుయేట్ పాడుతుంది."
    స్మితారాణికి నవ్వొచ్చింది. కానీ దాన్ని టెంపరరీగా కట్టకట్టేసి మళ్ళీ కోపాన్నీ ఫోకస్ చేసింది.

 Previous Page Next Page