ఒక్క అంగలో ఆమెని చేరుకుని ఆమె నోరు నొక్కేశాడు చిన్నారావు. అతని చేతులు చెమటతో తడిగా ఉన్నాయి.
అతికష్టంమీద తలఎత్తి అతని మొహంలోకి చూసింది సృజన.
అతని మొహమంతా చెమటలు! చెమటతో షర్టుకూడా తడిసిపోయింది.
ఆమె అర్ధనగ్న శరీరం వైపు చూడడంలేదు అతను. ఆమె మొహంలోకే చూస్తున్నాడు. అతని కళ్ళలో కాంక్ష కనబడటంలేదు. బెదురు కనబడుతోంది.
పట్టుబడిపోయిన దొంగలా ఉన్నాడు అతను.
దొంగ!
ఆమాట వినగానే కొద్దిగా తడబాటు తగ్గింది సృజనకి. అతనివైపు పరీక్షగా చూసింది. అతని చేతిలో ఇనప్పెట్టెతాళం చెవులుఉన్నాయి.
ఇనప్పెట్టెవైపు చూసింది.
బార్లాతెరిచి ఉన్నాయి ఇనప్పెట్టెతలుపులు!!
ఇనప్పెట్టెలో కళ్ళు చెదిరేటట్లు జిగజిగమెరుస్తూ కనబడుతున్నాయి.
బంగారునగలు!
వెండి సామాన్లు!
కట్టలుకట్టలుగా నోట్లు!
సంవత్సరాలతరబడి, అసంఖ్యాకమైన అబాగినుల జీవితాలనుపణంగా పెట్టి వ్యాపారం చేసి వాళ్ళ రక్తమాంసాలను రూకలుగా మార్చుకున్న అహల్యఖజానా అది!
చిలకలచిన్నారావు గొంతుస్వాధీనంలోకి తెచ్చుకుని అన్నాడు.
"అమ్మాయ్! ఇప్పుడు మీరు చూసినదంతా మీలోనే దాచుకోవాలి! బయటపెట్టేరా నాలుకలు పీకేస్తాను, ఒకవేళ నేను దొరికిపోయినా నాతోబాటు మిమ్మల్నికూడా ఇరికించేస్తాను తెలిసిందా? జాగ్రత్త!"
జంకుతూ తల ఊపింది సృజన. కామాక్షి అయితే అసలునోటంబడి మాటరాకుండా కొయ్యబారిపోయి ఇదంతా చూస్తోంది. వాళ్ళు అరిచి గోల చెయ్యరని నమ్మకం కుదిరాక కొద్దిగాకుదుటబడ్డాడు చిన్నారావు. తర్వాత అనునయంగా అన్నాడు.
"ఇప్పుడు మీరు చూసిందంతా చెప్పేసినన్ను బయటపడెయ్యలేదనుకో! అప్పుడు నేను ఈ నగలూ నాణ్యాలూ తీసుకుని వెళ్ళిపోతాను. వెళుతూ వెళుతూ మిమ్మల్ని కూడా వెంట బెట్టుకువెళ్ళి మీ ఇంటి దగ్గరదింపేస్తాను. నాకు కావాల్సింది డబ్బు! మీకు కావాల్సింది మీ అమ్మానాన్నలు! అవునా" అన్నాడు.
అమ్మా, నాన్నా అనగానే ఆ అమ్మాయిల మొహాలు వికసించాయి.
"ఓ! అలాగే!" అంది సృజన సంతోషాన్ని ఆపుకోలేక పెద్దగా.
హెచ్చరికగా పెదిమల మీద చూపుడు వేలు పెట్టుకున్నాడు చిన్నారావు "ఉష్! పెద్దగా అరవకండి! ఒక్క నిమిషం!"
వెంటనే గప్ చిప్ గా అయిపోయారు సృజనా, కామాక్షీ, చిన్నారావు నగలని టవల్ తో వేసి కడుతుంటే అవి చేస్తున్న శబ్దం మాత్రమే వినబడుతోంది.
నగలన్నిటినీ మూటకట్టేశాడు చిన్నారావు.
ఆలోపల బట్టలువేసేసుకున్నారు సృజనా, కామాక్షీ.
నగలమూట చంకలో పెట్టుకున్నాడు చిన్నారావు.
"ఈవెనక తలుపు తెరిస్తే సన్నటి గొందిలా ఉంటుంది. అటునుంచి వెళితే ఎవరూ మనల్ని చూడరు. అక్కడ నుంచీ గోడదూకిరోడ్డుమీద పడొచ్చు మనం, పదండి" అన్నాడు చిన్నారావు.
అడుగులో అడుగు వేసుకుంటూ అతనివెనకే నడిచారు ఇద్దరూ.
తలుపు దగ్గర ఒక్కక్షణం ఆగి, చెవిఒగ్గివిని, ఊపిరి బిగపట్టి, గడియ తీశాడు చిన్నారావు.
తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. వెంటనే అదిరిపడ్డాడు అతను. అహల్య ఉంది అక్కడ! కానీ అదృష్టవశాత్తు ఆమె వాళ్ళని చూడలేదు. వెనక్కి తిరిగి ఉంది ఆమె వంగి, పూలమొక్కల పాదులు సరిచేస్తోంది. అలికిడి వినగానే వెనక్కుతిరగబోయింది అహల్య.
అది గమనించిన చిన్నారావుకి ప్రాణభయం కలిగింది. ఆ భయంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా మూటలోనుంచి ఒక వెండి దీపారాధనకుందిని తీశాడు. పదునైనశూలపు మొనలా నగిషీ చెక్కి ఉంది. దానిపై భాగంలో బరువుగా దిట్టంగా ఉంది ఆ కుంది.
సందేహించకుండా దానితో పొడిచాడు చిన్నారావు అహల్యని.
వెంటనే నోరు తెరిచింది అహల్య.
కానీ ఆ నోటివెంబడి కేకరాలేదు.
బొళుక్కుమని చారెడు రక్తం వచ్చింది.
ఒక్కక్షణం అటూ ఇటూ తూలి తర్వాత విరుచుకుపడిపోయింది అహల్య.
"పరిగెత్తండి" అని హెచ్చరించాడు చిన్నారావు ఆదుర్దాగా. హడావిడిగా పరిగెత్తారు ముగ్గురూ.
ముందుగా కామాక్షి ఉరికింది.
ఆ వెనక సృజన.
వాళ్ళ వెనక చిన్నారావు బరువైన నగలమూట చేతిలో ఉండడం వలన అతనికి వేగంగా పరిగెత్తడం సాధ్యం కావడంలేదు.
ఆ ఇంట్లో నుంచి ముందుగా బయటపడింది కామాక్షి. ఎక్కుపెట్టి వదిలన బాణంలాగా శరవేగంగా, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తిపోయింది స్వేచ్చలోకి!
ఆమె వెనకే గడపదాటింది సృజన.
ఇంక పది అడుగులు వేస్తే తనకి కూడా స్వేచ్చ!
మరో అడుగు వేసింది సృజన.
అప్పుడు వినబడింది ఒక మూలుగు. అహల్య మూలుగుతోంది.
అసంకల్పితంగానే ఆగిపోయింది సృజన. సంకోచంగా వెనుదిరిగి చూసింది.
శ్వాసఅంధక ఉక్కిరిబిక్కిరి అవుతోంది అహల్య. గాయంలో నుంచి ధారగా కారి మడుగు కడుతోంది రక్తం. ఆమె కళ్ళు మూతలుపడిపోయి ఉన్నాయి. స్పృహ ఉందో లేదో అర్ధం కావడంలేదు.
సృజనకు అర్ధం అయిందల్లా.
అతిత్వరలో వైద్య సహాయం అందకపోతే అహల్య నిశ్చయంగా మరణిస్తుందనిమాత్రమే!
కొద్దిగా తటపటాయించి మరో అడుగు ముందుకువేసింది సృజన.
మళ్ళీ అహల్య మూలుగువినబడింది.