"ఏం లేదు. తప్పిపోతుందేమోనని భయపడి నాతోనే వుంచుకుందామనుకున్నాను."
"అదేమిటి? ముందుగానే తప్పిపోతుందని భయపడ్డారా? ఎందుకు కలిగింది ఆ భయం?"
"గిరీశంగారు చెప్పారు. ఆయన నా భర్త జీవన్ కి ఫ్రెండ్ జీవన్ ఒక చైల్డ్ రేపిస్ట్ ని రాగని కిడ్నాప్ చెయ్యడానికి నియమించి నట్లుగా ఫోన్ చేసి చెప్పాడు. "నిర్ఘాంతపోయి చూశాడు మనోహర్ తలవల్చేసుకుంది అణు.
"లోకంలో ఏ తండ్రియైనా తన కన్న కూతుర్ని కిడ్నాప్ చెయ్యమని చైల్డ్ రేపిస్ట్ ని పంపిస్తాడా?"
"కావాలని పంపి వుండకపోవచ్చు కిడ్నాప్ చేసి తన దగ్గరకి తీసుకురమ్మని గుండాని పంపి వుండొచ్చు తరువాత ఆ గూండా చైల్డ్ రేపిస్ట్ అని తెలుసుకొని వుండొచ్చు. బహుశా ఉదయం అందుకే నాకు రెండు సార్లు ఫోన్ చేశాడేమో? అతడేప్పుడు అంతే. దూరాలోచన వుండదు. ఆ క్షణంలో ఏం తోస్తే అది చేసేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు స్థిమితంగా........"
"మీ హజ్బెండ్ మీకు ఫోన్ చేసినప్పుడు మీరాయనతొ మాట్లాడలేదా?" తల అడ్డంగా వూపింది.
"ఆయనతో మాట్లాడక పోవడానికి కారణం తెలుసుకోవచ్చా?" ఇలాంటి క్షణం ఎదుర్కోవలసి వస్తుందని అణు యెంతో భయపడేది. కుటుంబసభ్యులు కాని పరాయి వాళ్ళతో అందులోను పోలిస్ ఇన్ స్పెక్టర్ తో తనకి తన భర్తకి మధ్య వచ్చిన కలతలు చెప్పుకోవలసి రావడం ఎంత బాధాకరమైన విషయం ఉహ వచ్చినప్పటి నుండి ఆదర్శ గృహిణిగా వుండాలని కలలు కంది. భర్తతో పిల్లలతో సుఖంగా కాలం గడుపుతూ నాట్య జీవితానికి కూడా స్వస్తి చెప్పెయాలనుకొంది. తీరా జరిగిందేమిటి? పోనీ యిప్పుడైనా గుట్టుగా కాలం గడుపుదామంటే ఏదో ఒక పరిక్ష ఎదురౌతూనే వుంది తనకి.
"నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. " ఆమె ముఖంలో మారుతున్నా రంగులను పరిశీలనగా చూస్తూ అడిగాడు ఇన్ స్పెక్టర్" చెప్పెందుకేమి లేదు కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం. అతడు ఫోన్ చేసి నాదే ఏదో తప్పైనట్లు నేను క్షమాపణ కోరుకోవాలన్నట్లు మాట్లాడతాడు. అది నేను భరించలేను. అందుకే అతనితో మాటలు పెట్టుకోలేదు"
ఈ మాటలు మనోహర్ పూర్తిగా నమ్మలేదని అతని ముఖం చెప్పింది అణు నిజం చెప్పలేదు. అణు వెళ్ళిన కొత్తలో ఐదారు నెలలు వురుకున్న జీవన్ తరువాత ఫోన్ చేసి రాగని తనతో పంపమని అణుని వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు కోర్టు కెళ్తనని బెదిరించేవాడు కూడా. జరిగిందానికి పశ్చాత్తాపపడి తనని క్షమాపణ కోరకపోగా యీ రకంగా బెదిరించడం అణు భరించలేక అతడితో సంభాషణ కట్ చేసేసింది. ఇలా కట్ చేస్తే విషయాలు ముఖా ముఖి మాట్లాడుకోటానికైనా జీవన్ తన దగ్గరికి వస్తాడని ఆశ. తల్లి అక్కల ప్రభావం నుంచి దూరం చేస్తే అతడిని తన దార్లోకి తెచ్చుకోగలననే నమ్మకం.
"మీరు జీవన్ గారు యెందుకు విడిపోయారో చెప్పగలరా?" మౌనం వహించింది అణు.
"అయన మిమ్మల్ని హింసించేవారా?"
"లేదు"
"పుట్టింటి నుంచి డబ్బు తెమ్మనేవారా?"
"లేదు, లేదు"
"పోనీ మిమ్మల్ని మోసం చేసి మరెవరితోనైనా సంసారం చేసేవారా?"
"లేదు"
"మీరు డాన్సరు కాబట్టి మీకు పబ్లిక్ లైఫ్ చాలా వుంటుంది కాబట్టి మిమ్మల్ని అయన ఏమైనా అనుమానించారా?"
"ఛ....ఛ!"
"మరియెందుకు విడిపోయినట్లు?"
ఆ క్షణంలో యెంతో పెద్ద కారణంలా కనిపించిన ఆ సంఘటన యిప్పుడు స్థిమితంగా ఆలోచించుకుంటే యెంతో క్షుద్రమైనదిగా తోస్తోంది. విషయమంతా విన్న మేనత్త తననే మందలించింది సున్నితంగా "కాపురాలు పాడు చేసుకోవడంలో లేదు గొప్పతనం నిలబెట్టుకోవడంలో వుంది ఆడది, మగవాడు సమానమేనని లెక్చర్లు కొడతారు మీరంతా అతడు తొందరపడి జలజ తో తిరిగినట్లు నువు మరొకడితో తిరగ్గలవా? ఆ తరువాత వచ్చే పరిణామాలని ఎదుర్కోగలవా? జీవితమంటే డబ్బు లెక్కలు, వంటలు, సినిమాలు, షికార్లు మాత్రమే కాదు. వీటన్నిటి వెనకాల అతి సున్నితమైన మనసులు కూడా వున్నాయి. ఆ విషయం మర్చిపోతారు మీరంతా."
"అయితే ఆత్మాభిమానం చంపుకుని అతడాడించినట్లల్లా అడమంటావా?"
"అలా ఎందుకంటాను, కొంచెం సహనంతో నిలదొక్కుకుని అతడి తప్పు అతడు తెలుసుకునేలా చెయ్యడంలో నీ చాకచక్యం చూపించమంటాను"
తలదించుకుని కూర్చున్న అణు నుద్దేశించి మనోహర్ "మేడమ్! మీరు వున్న విషయం వున్నట్లు చెప్పకపోతే మేం మీకు సహకరించడం కష్టమౌతుంది." అన్నాడు.
"ఒక చిన్న విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. మా యింట్లోనే వున్న అతని అమ్మ, అక్క అభిప్రాయభేదాలను ఎక్కువ చేశారు"
చెప్పలేక చెప్పలేక చెప్పింది ఒక్క నిట్టూర్పు విడిచాడు మనోహర్. "ఫారిన్ కల్చర్ నెమ్మదిగా మనదేశంలోకి వచ్చేస్తోంది ఏం సాధించినా, ఏం సాధించలేకపోయినా మన పసివాళ్ళకి సవతితల్లులు, సవతి తండ్ర్లులు బాధ పెరిగి పోయేలాగా వుంది అన్నాడు. వులిక్కిపడింది అణువేద "నేను అలాంటిదాన్ని కాను" అనాలనుకోంది అనలేకపోయింది. మూడేళ్ళగా స్వతంత్ర జీవితం గడుపుతున్నాక అలాంటి మాటలకర్ధం లేదు.
"మీ వారి- సారీ జీవన్ ఫోన్ నంబరు, చిరునామా యివగలరా?" కాగితం మీద రాసి యిచ్చింది అణువేద అక్కనుంచే హైదరాబాద్ కి ఎస్ టి.డి ఫోన్ చేశాడు మనోహర్ అటు వైపు నుంచి రాణి అచ్చయ్యమ్మాదేవి అందుకుంది. "జీవన్ ఉన్నాడా?" అడిగాడు మనోహర్.
"లేడు ఉదయం నుంచి వాడు పచ్చి మంచి నీళ్ళయినా ముట్టుకోలేదు భోజనానికి కూడా రాలేదు. వర్క్ షాప్ కి మనిషిని పంపితే అక్కడ లేదన్నారు. "ఏడుపు గొంతుతో అందావిడ. మనోహర్ విషయం అణుకి చెప్పి, " జీవన్ మనకి ఎవైల్ బుల్ గా వుండే మరో చోటేదైనా వుందా?" అని అడిగాడు.
"అంటే!"
"క్షమించండి. వేరే గాళ్ ఫ్రెండ్ ఇళ్ళు వగైరా........" అణు మనసులోకి మొదట జలజ పేరు వచ్చింది కానీ యిలాంటి సమయంలో అతనిని జలజ యింట్లో వుహించుకోవడం అతని పట్ల అన్యాయమే అవుతుంది.