Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 16

"నేను రాగమాల. డాడీ కోసం వెళ్తున్నాను. వెళ్ళిపోయారు డాడీ "ఏడుపు గొంతుతో అంది పాపని గట్టిగా అదుముకుంది యమ్మాయమ్మ వెదకబోయిన తీగ కాలికి తగిలింది.
"నేను తీసుకెళ్ళనా? మీ డాడీ దగ్గరికి" అడిగింది.
"నీకు తెలుసా, మా డాడీ"
"ఆ! జీవన్ గారు హైదరాబాద్ లో వుంటారు. నీకోసమే యిక్కడి కొచ్చారు."
"కరెక్టు తీసుకెళ్తవా  డాడీ దగ్గరికి!"
"తీసుకెళ్తాను కానీ దార్లో అరవకూడదు మరి"
"ఎందుకరుస్తాను. నాకు మేనర్సు తెలియవనుకుంటున్నావా?" కోపంగా అంది రాగ.
"గుడ్ గాళ్" రాగ చెక్కిలి నిమిరి ఆటోని పిలిచి రాగతో సహా ఎక్కి కూర్చుంది.
వందన సుందరేశర రావు రోడ్డు మీద చెరో వైపుకి పరిగెత్తారు. నిలబడలేక వోణుకుతోన్న అణువేదని సుందరేశరరావు భార్య మీనాక్షి చేత్తో పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది.
"కృంగిపోకూడదు. మనసు చెదిరి పోనియకూడదు. ఇప్పుడు రాగకి తన అవసరమెంతో వుంది. తను బెదిరిపోతే ఆ పసిపిల్లకి ఏమి చెయ్యలేదు. "సోఫా చేతులు తన చేతులతో గట్టిగా పట్టుకుని రామనామం అనుకోసాగింది. చెదిరిపోతున్న మనసుని కూడగట్టుకుని అణువేద అవలంభించిన మార్గమది. ఏ ఆలోచనలు మనసులోనికి రానీయకుండా ఏకాగ్రతగా ఒక అంశం మీద మనసు నిలపడం వాళ్ళ తాత్కాలికంగా మనసుకి కొంత నిబ్బరం వచ్చినట్లు అవుతోంది. మనసు నిబ్బరంగా వుంచుకోవాలని ఎంత ప్రయత్నించినా వొంటినిండా దెబ్బలు తగిలి రక్తం వోడుతున్న రాగ ఏ కిరాతకుడి చేతుల్లో చిక్కుకుపోయి విలవిల కొట్టుకుంటున్న రాగ యిలా రకరకాల స్వరూపాలు ఆమె మనసు ముందుకు వస్తూనే వున్నాయి.
అతి ప్రయత్నం మీద వాటిని వెనక్కు నెట్టింది. ఏం లేదు. ఏ బెలున్సు కోసమో, ఏ ఐస్ క్రీమ్ కోసమో, టాఫీ కోసమో పరిగెట్టి వుంటుంది. కాసేపట్లో "మమ్మీ! నేను ఐస్ క్రీమ్ కొనుక్కోనా?" అంటూ డబ్బుల కోసం వచ్చేస్తుంది. ఈసారి వొంటరిగా బయటికి పరిగెత్తోద్దని గట్టిగా చెప్పాలి. వీలైతే మనసు రాయి చేసుకుని కాన్వెంటు హాస్టల్ లో చేర్పించేస్తే హాస్టల్ నుంచి ఎక్కడికి కదలనియకుండా వాళ్ళే కట్టుదిట్టం చేసుకుంటారు.
రామనామం నుంచి మనసు చెదిరిపోతోంది మళ్ళీ రామనామం మీద మనసు నిలుపుతోంది. మేనత్త లాలనగా భుజం తడుతోంది. తనేం బాధపడటంలేదున్నట్లు ఆ చెయ్యి తొలగించింది. అంతలో చెరో వైపు నుంచి సుందరేశ్వరరావు, వందన వచ్చారు. ఆశగా గుమ్మం వైపు చూసింది. ఎవరూ లేరక్కడ ప్రశ్నించే ఓపిక కూడా లేక అందరి ముఖాలు చూసింది. నాలికతో పెదాలు తడుపుకున్నాడు సుందరేశ్వరరావు వందన దగ్గిరగా వచ్చి అణుచుట్టూ చేతులేసి పట్టుకుంది.
"ఒక కారు ఎదురుగా వచ్చింది దూరంగా వున్న మాకు రాగ కారుకి అడ్డంగా వెళ్ళడం కనిపించింది. పిలిచినా పిలుపు అందనంత దూరంలో వుంది. కారు ముందుకు దూసుకుపోయింది. తరువాత రాగ కనపడలేదు.'
 వాళ్ళు చెప్తున్న దేమిటో తన కర్ధం కానట్లు పిచ్చు చూపులు చూసింది. "రాగ.....రాగ" అంది. గొంతు పోడారిపోసాగింది. నాలుక మడతబడి మాటలు రావడం లేదు. సుందరేశ్వరరావు దగ్గిరగా వచ్చి అణు రెండు చేతులు పట్టుకున్నాడు "భయం లేదు ప్రమాదం ఏం జరగలేదు.  చాల విచిత్రంగా ఎలాగో తప్పిపోయింది అంతే" అన్నాడు వందన కూడా ధైర్యం చెప్తున్నట్లు "రాగకి ఇప్పుడు ఏడేళ్ళునిండాయి కదా!
నీపేరు వాళ్ళ నాన్న పేరు, తను వుంటున్న ఎడ్రసు అన్నీ చెప్పగలుగుతోంది. అంచేత తప్పిపోయినా తప్పకుండా ఎవరో ఒకరు యింటి దగ్గర దింపుతారు" అంది.
"కిడ్నాపింగ్ - చైల్డ్ రేపిస్ట్" అణు మనసులో సమ్మెటలు మ్రోగించాయి. ఆ రెండు మాటలు. పెదవి దాటి మాట బైటకి రాలేదు. మొదట్నించి పోలీసు రిపోర్టులకి వ్యతిరెకించిన మేనత్త కల్పించుకుని "ముందు పోలీసు రిపోర్టు యివండి. ఎందుకైనా మంచిది." అంది.
అణు చేతుల్లో మొహం కప్పుకుంది. సుందరేశ్వర రావు వెంటనే పోలీసు స్టేషన్ కి ఫోన్ చేశాడు అణు తన్ని తను కూడదిసుకుని "ఒకవేళ రాగ మా యింటికి వస్తుందేమో? నేనక్కడికి వెళ్తాను" అంది మేనత్త తండ్రి గురించి ప్రశ్నిస్తుంది కాబట్టి ఆ బామ్మ అంటే రాగకి అంత యిష్టం లేదనే మాట బయట పెట్టలేకపోయింది. వందనకి అణు ఆలోచన వచ్చింది. "నేనూనీతో వస్తాను పద, " అని నౌకర్ తో అటో పిలిపించింది ఇద్దరూ అణు ప్లాట్ చేరారు. ఎంతో ఆశగా చుట్టూ చూసింది అణు. ఏ స్థంభం చాటు నుంచైనా చిలిపిగా , "మమ్మీ!" అని తల బైట పెట్టి రాగ పలకరిస్తుందేమోనని.
ఐదారుగురు చుట్టూ పక్కల ప్లాట్స్ లో పిల్లలు బాల్కనిలో రింగా రింగా రోజెస్ అడుకుంటున్నారు. వాళ్ళని చూసి, "జ్యోత్స్నా! రాగ యింటి కొచ్చిందా?" అని అడిగింది జ్యోత్స్న ఆరిందాలా కళ్ళు తిప్పుతూ, "ఇవాళ రాగ స్కులుకే రాలేదుగా అంటి! తన మూలంగా యివాళ మ డాన్సు డ్రామా రిహర్సల్స్ కూడా జరగలేదు మా టిచర్ చాలా విసుకున్నారు. నీకు ఫోన్ చేస్తానన్నారు. చెయ్యలేదా?" అణు మట్లాడలేదు తను మోయలేని, భరించలేని పెద్ద బరువేదో యెవరో తలమీద పెట్టినట్లు తల దిమ్ముగా అయిపోతోంది. బావురుమని ఏడవకూడదు స్పృహ తప్పి పోకూడదు. స్థిమితం కోల్పోకూడదు. ఏ క్షణంలోనైనా రాగకి చేయూత నివడానికి సిద్దంగా వుండాలి. అందుకోసమైనా తనని తన్ను కూడదిసుకోవాలి. తాళం తెరచి లివింగ్ రూమ్ లో కొచ్చి కూర్చుంది. వందనకిచెన్ లోకి వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చింది. ఫోన్ మ్రోగింది. గభాల్న అందుకొంది. పోలీస్ స్టేషన్ నుంచి సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ మనోహర్ మాట్లాడుతున్నాడు అటువైపు నుంచి "నా అసిస్టెంట్ తో ఇప్పుడే అక్కడి కొస్తున్నాను. మిరక్కడే వుండండి" అన్నాడు.
"ఒకే!" అని ఫోను పెట్టేసింది.
కాలింగ్ బజర్ మ్రోగింది ఒక్క ఉదుటున లేచి తలుపు తెరిచింది జోత్స్న తల్లి వనితా లోపలికి వచ్చి అణు పక్కన కూర్చుని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది"ఉదయం రాగని నీతో తీసుకెళ్ళడం చూశాను. స్కూలుకే అనుకున్నాను. ఇందాక జ్యోత్స్న ని ఏదో అడిగావట ఏం జరిగింది?" అణు వెంటనే ఏం సమాధానం చెప్పలేకపోయింది. జ్యోత్స్న ని వాళ్ళ నన్న స్కూటర్ మీద యెక్కించుకొని తీసుకెళ్తుంటే రాగ ఈర్ష్యగా చూడ్డం అణు చాలా సార్లు గమనించింది. తన తప్పు ఏం లేదని యెంతగా నచ్చజెప్పుకున్నా ఏదో గిల్టి ఫీలింగ్ మానుని చిందర వందర చేయలేకమానలేదు.
"స్కూల్లో దింపావా? ఇవాళ" అడిగింది  వనిత మళ్ళీ.
"లేదు నాతో మా డాన్సు స్కూలుకి తీసుకెళ్ళాను."
"ఎలా తప్పిపోయింది మరి?" చెప్పింది అణు. భయంతో కళ్ళు పెద్దవి చేసింది జ్యోత్స్న ఈ రోజుల్లో ఆరేళ్ళ చిన్న పిల్లల దగ్గరనుంచి స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకుంటున్నారు. మనమే వాళ్ళకి నచ్చచెప్పవలసిందే తప్ప నిర్భంధించి ప్రయోజనం లేదు. " పోలీసు రిపోర్టు ఇచ్చావా" తలవూపింది. మళ్ళీ బజార్ మోగింది సి.ఐ.డి ఇన్స్ పెక్టర్ మనోహర్ ఇద్దరు అసిస్టెంట్ లతో వచ్చాడు. అణుని విష్ చేసి పాకెట్ బుక్ పెన్సిల్ చేతికి తీసుకుని, "మేడమ్! మీరే చిన్న విషయం దాచకుండా అన్నీ వివరంగా చెప్పండి అప్పుడే మీకు సాయం చెయ్యగలను"
అణు వనిత వైపు యిబ్బందిగా చూస్తే ఆవిడ "మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోయింది. ఇన్ స్పెక్టర్ ప్రశ్నలు ప్రారంభించాడు. "ఇవాళ అమ్మాయిని మీతో డాన్సు స్కూలుకి యెందుకు తీసుకెళ్ళారు? ఏవైనా విశేషముందా?"

 Previous Page Next Page