Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 17


    
    "శశీ! మైడార్లింగ్!"
    
    నడుస్తూనే అతనికి దగ్గరగా జరిగింది.
    
    ఇంట్లోకి వచ్చాక, తలుపులేస్తూ, "ఉపమానం సరిగ్గా కుదరలేదు గానీ - ఈ గోధుమరంగు సిల్కుచీరలో గోధుమరంగు తాచు అంత అందంగా వున్నావు. నీ నల్లటి పొడుగాటి జడ.. నల్ల తాచులా ఉంది!" అన్నాడు. అలా కౌగిట్లోనే ఇద్దరూ కిటికీ దాకా వచ్చారు.
    
    "ఛీ! వూరుకోండి!" అంటూ శశి చెయ్యి జాపి చేతిలో ఉన్న సిగరెట్ ముక్కా, విరిగినా గాజూ కిటికీలోంచి బయట పడేసింది, అతను చూడకుండా.
    
                                                               * * *
    
    మంచినీళ్ళు తేవడానికి వంటింట్లో కెళ్ళిన శంకర్రావు గ్లాసుకోసం తడుముకున్నాడు. చీకట్లో లైటు వెయ్యకుండానే, అలవాటైన స్థలంలో వెదుకుతున్న అతని చేతికి తగిలి గిన్నెలు, పళ్ళాలూ దొర్లి క్రిందపడ్డాయి.
    
    శారద లేచి కూర్చుంది.
    
    "ఏమయిందండీ?"
    
    "కరెంటు ఆదా చెయ్యబోయి, ఏదో గొడవ చేశాను" అంటూ లైటేశాడు శంకర్రావు. వెంటనే "శారదా!" అన్నాడు కంగారుగా.
    
    "ఏమిటండీ?"
    
    "ఇదేదో మందు బాటిలు పగిలిపోయింది" చటుక్కున లేచి వచ్చి చూసింది శారద.
    
    అతి భద్రంగా వుండాలని, ఆయన కంట పడకుండా వుండాలనీ, తను వంటింటి షెల్ఫులో దాచిపెట్టిన విషం బాటిలు! పగిలిపోయింది!
    
    హతాశురాలైంది.
    
    ఇంకెలా?
    
    ఇంకేదీ చావుకి దగ్గర దారి? ఉరి, కిరసనాయిలు, హుసేన్ సాగర్, టిక్ ట్వెంటీ - చావుకి ఏది సులభమైన పద్దతి?
    
    "అదేమిటి? అలా అయిపోయావు? రేపు డాక్టర్ గారిని అడిగి మళ్ళీ తెస్తాలే మందు! అయినా ఎల్లుండి మనమే వెళతాంగా నర్సింగ్ హోమ్ కి" అన్నాడతను.
    
    ఉక్రోషంతో కూడిన కోపం వచ్చింది శారదకి.
    
    శంకర్రావు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, లైటార్పేసి పావుగంట తర్వాత నిద్రలోకి జారిపోయాడు.    

 

    శారదకి నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చీకట్లో చూస్తూ ఆలోచిస్తూంది. శంకర్రావు చెయ్యి తన చేతిని బలంగా పట్టుకుని వుంది, తను దూరంగా వెళ్ళిపోతుందేమోనని భయపడినట్లు.
    
    తనంటే ఎంత వెర్రి ప్రేమ ఈయనకి!
    
    తను చనిపోయిన తర్వాత ఎలా ఉంటారీయన?
    
    "శారదా! నువ్వే నాకు తల్లీ తండ్రీ! నువ్వే నాకు బంధువ్వి, గురువ్వి, దైవానివి! నువ్వేనాకు అన్నం, నీళ్ళూ, డబ్బూ, దస్కం - అన్నీ!"
    
    "దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు- నిన్ను తప్ప! అది చాలు! ఇంకేం అడగను శారదా! నిజంగానే ఇంక ఎవ్వర్నీ ఏమీ అడగను! నువ్వు చాలు నాకు!"
    
    తను చనిపోతే-
    
    ఆయన బతుకుతారా?
    
    మరి....తను ఏంచెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
    
    ప్రశ్నార్ధకంతోనే తెల్లవారింది.
    
    నిన్న 'ఏం చెయ్యాలి?" అన్న ప్రశ్నలేదు. చనిపోవాలనే నిర్ణయం తప్ప!
    
    ఆ ఒక్కరోజు గడిచేసరికి, నిర్ణయం కొద్దిగా సడలింది. మనసు అటూ, ఇటూ వూగుతోంది.
    
    నిన్న ముందూ, వెనకా ఆలోచించలేదు తను.
    
    ఇవాళ...
    
    తను చావాలా? బతకాలా? తను చచ్చి ఆయన్ని చంపాలా? తను బతికి ఆయన్ని బతికించాలా?
    
    ఏం చెయ్యాలి? ఏది ధర్మం?
    
    ఒకటి మాత్రం నిజం! తను చనిపోయాక అయన మామూలుగా వుండలేరు! అది ఘంటాపధంగా తెలుసు తనకి.
    
    తను చనిపోయి, ఆయన్ని వంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం స్వార్ధమవుతుందా?
    
    "నాకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం - అన్నీ నువ్వే!"
    
    అరిగిపోయి, ఆగిపోయిన రికార్డులాగా పదేపదే అవే మాటలు గుర్తుకొస్తున్నాయి.
    
    ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
    
    ఏం చెయ్యలేదు శారద. తెల్లారేదాకా మెలకువ తోనే వుంది. తెల్లారేక పనిమనిషి వచ్చి, "బాసన్లు ఎయ్యమ్మా!" అంటూ కేకెయ్యగానే ఉలిక్కిపడి లేచి, జుట్టు సవరించుకుని, చీర కుచ్చెళ్ళు సరిచేసుకుని పనుల్లో జొరబడి పోయింది.
    
                                                                  * * *

 Previous Page Next Page