Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 16

 

    శంకర్రావు వినిపించుకోలేదు. శారదని కౌగిలిలోకి తీసుకోబోయాడు.
    
    కొద్దిగా బలంగానే అతన్ని తోసేసింది శారద. "నిజంగానే! నాకు వంట్లో బాగాలేదు."
    
    "నేనంటే నీకు ఇష్టంలేదు" అన్నాడు శంకర్రావు కోపం తెచ్చుకుంటూ.
    
    దెబ్బతిన్నట్లు చూసింది శారద. "మీరంటే నాకు ప్రాణం!"
    
    "నేను బాగుండకపోయినా?"
    
    "మీకంటే ఎవరు బాగుంటారు? ఎవరూ బాగుండరు!" అంది శారద నిశ్చయంగా. అందంగా, సినిమా హీరోలా ఉండే సుధీర్ గుర్తొచ్చాడు. వెగటేసింది అతన్ని తలుచుకుంటే.
    
    శంకర్రావు మొహం సంతోషంతో వెలిగిపోయింది.
    
    "అయితే మరి కాదనకు!" అన్నాడు శంకర్రావు. అతని కోరికను ఎంతోసేపు నిరాకరించడం సాధ్యం కాలేదు శారదకి.
    
    తర్వాత-
    
    అతను మంచినీళ్ళు తాగడానికి లేచాడు. "కాసిని మంచినీళ్లివ్వు!" అని శారదకు పురమాయించవచ్చు. కానీ, ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో కూడా శారదకి ఇబ్బంది కలిగించటం అతని కిష్టం ఉండదు. సాధ్యమైనంతవరకూ తన పనులన్నీ తనే చేసేసుకుంటూ ఉంటాడు.
    
    "ఏమండీ!"
    
    "ఏమిటండీ?" అన్నాడు శంకర్రావు సరసంగా.
    
    "అలాగే నాకూ కొద్దిగా మంచినీళ్ళివ్వరా?" అంది, బతిమాలుతున్నట్టు.
    
    "ఇదిగో అమ్మాయ్! మొగుడిచేత సేవలు చేయించుకునేవాళ్ళు నరకానికి పోతారంటారు, తెలుసా?" అన్నాడు నవ్వుతూ.
    
    నరకానికా? నేరుగా నరకానికే వెళ్ళిపోతుందా తను? తెల్లారేటప్పటికి రైలు విజయవాడ స్టేషన్ చేరినట్లు, తను రేపొద్దుటికల్లా యమలోకం చేరిపోతుందా? రైలు స్టేషన్ లో 'కాఫీ! కాఫీ' అన్న అరుపులాగా, "ఆయ్! రక్తం! వేడివేడి రక్తం!" అన్న కేకలు వినబడుతాయా?
    
    నిస్పృహగా నవ్వుకుంది శారద.
    
                                                              * * *
    
    నర్సింగ్ హోమ్ మేడమెట్లు దిగి, తమ ఇంటివైపు నడిచింది శశివదన. ఒక యాభైగజాలమేర చిరు చీకటి వుంది.
    
    కాలికేదో మెత్తగా తగలింది.
    
    "అమ్మో!" అంటూ అడుగు వెనక్కి వేసింది.
    
    అడుగుకంటే ఎక్కువ పొడుగులేని చిన్న పాము సరసర గుబురుగా ఉన్న చెట్లవైపు వెళ్ళిపోతోంది.
    
    "పాము! పాము!" అంది శశి పెద్దగా.
    
    నర్సింగ్ హోమ్ లోంచి యాదమ్మా, ప్రమీలా, గేటు దగ్గర్నుంచి ఘూర్కా, ఇంట్లోంచి సుధీర్ పరిగెత్తి వచ్చారు.
    
    కదలిక గమనించి, ఘూర్కా పాముమీద టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. మంత్రం వేసినట్లు ఆగిపోయింది పాము.
    
    టార్చిలైటు వెలుగుకి దాని కళ్ళు మిరిమిట్లు గొలిపాయి.
    
    చేతిలో ఉన్న లాఠీతో దాన్ని కొట్టబోయాడు ఘూర్కా.
    
    "ఉండు! ఆ కర్ర ఇలా తే!" అంటూ అందుకున్నాడు సుధీర్.
    
    అందరూ చూస్తున్నారు. కర్రతో గట్టిగా పాముని కొట్టాడు సుధీర్.
    
    పాము నడుం విరిగింది. విలవిల్లాడింది అది.
    
    ఇంకో దెబ్బ వేశాడు. అతని పెదిమల మీద అదోరకమైన చిరునవ్వు.
    
    పాముతల చితికింది. తోకమాత్రం బలహీనంగా ఆడిస్తూంది.
    
    సుధీర్ చేతిమీద రోమాలు నిలబడ్డాయి. ఉద్వేగంతో, పైశాచిక ఆనందంతో అతని చేతులు కంపిస్తున్నాయి.
    
    ఇంకో దెబ్బ! పాము రెండుగా తెగింది.
    
    సుధీర్ ఉచ్చ్వాస, నిశ్వాసాలు పెద్దగా వినబడుతున్నాయి. వెర్రివాడిలా చూస్తూ మళ్ళీ మళ్ళీ కొట్టాడు పాముని.
    
    అది ముక్కలై, పచ్చడై, గుజ్జు గుజ్జుగా నేలకంటుకు పోయింది.
    
    "సుధీర్! పాము చచ్చిపోయింది! ఇంక చాలు! కొట్టకండి!" అంది శశి.
    
    ఆపడం ఇష్టంలేనట్లు ఇంకో రెండు దెబ్బలేసి, తర్వాత కర్రని ఘూర్కా కిచ్చేశాడు సుధీర్.
    
    "ఈ చెట్లన్నీ నరికేస్తే మంచిగుంటది, మేంసాబ్" అన్నాడు ఘూర్కా.
    
    'నరికెయ్యడం' అన్నమాట సంగీతంలా వినబడింది సుధీర్ చెవులకి. అతని ఒళ్ళు గగుర్పొడిచింది.
    
    "ఒద్దు! ఎప్పుడో ఒకసారి పామొచ్చిందని, తోట పాడుచేసుకుంటామా?" అంది శశి.
    
    శశి భుజాల చుట్టూ చేతులు వేసి ఇంట్లోకి నడిపించుకుపోతూ- "ఆ పాము నిన్ను కాటేసి ఉండేదేమో అన్న వూహే దుర్భరంగా ఉండి, దాన్ని స్వయంగా చంపేదాకా వూరుకోలేకపోయాను" అన్నాడు సంజాయిషీ చెబుతున్నట్లు. కొద్దిగా మొహమెత్తి అతని వైపు చూసింది శశి. ఆమె విశాల నయనాలలో నీటిపొర.

 Previous Page Next Page