Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 16

   
    
    ఇదేదో తనకూ, గంగారత్నానికీ మొదలయిన యుద్ధంలా భావించింది ఆమె.


    అందుకు మరింత పట్టుదలతో పని చేయాలని నిర్ణయించుకుంది.


                                                             *    *    *    *


    సాయంకాలం ఆరైంది. చలికాలంలో ఉదయం, వేసవిలో సాయంకాలం చాలా బావుంటాయి. పగటిపూట ఎండ ఉధృతంగా తగ్గి, ప్రపంచం మబ్బుల పోగేసుకోవడం, చల్లటిగాలి ఆత్మీయనేస్తంలా చుట్టుకుపోవడం, అలసిపోయిన చెట్లు తేరుకోవడం-ఇదంతా ఏదో ఇంద్రజాలంగా వుంటుంది.


    మానస అప్పుడే స్నానం చేసింది. చీర కుచ్చిళ్ళను పూల రేకులంత అందంగా కనపడేటట్లు చేసింది. కొత్తగా కొన్న చీరమీద మ్యాచింగ్ జాకెట్టు వేసుకుంది.


    ఆకుల్తో వుండే అనాసపండులా వున్న వెంట్రుకలను దువ్వి మొదట్లో క్లిప్ వేసింది. చేమంతులంత సైజులో వున్న కళ్ళకు కాటుక పెట్టింది. కొనదేలిన ముక్కుపైన పడ్డ పౌడర్ ను తుడుచుకుంది. నుదుటున పెద్దగా కనపడేటట్టు తిలకంబొట్టు పెట్టుకుంది.


    అలంకరణ పూర్తయ్యాక ఇంటిముందున్న మెట్లమీద కూర్చుంది. అందంగా వున్న ఆమె ఆ సాయంకాలంపూట చీకటి మధ్యన పుట్టిన వెలుతురు ముద్దలా వుంది. ఇంటిముంగిట వేసిన రంగుల రంగవల్లిలా వుంది.


    ఒంటరిగా కూర్చుని అటూ ఇటూ వీధిన వచ్చేవాళ్ళను చూస్తోంది. ఇంటిలోపల ఎక్కడో ఆమె తల్లి నరసమ్మ వంటపనిలో వుంది. తండ్రి శ్రీనివాసరావు ఇంకా పొలంలోంచి రాలేదు. వదిన కాంచనమాల ఆమె వచ్చాక స్నానాల గదిలోకి దూరడంవల్ల ఇంకా తయీరవుతూ వుంది. అన్న గోపాలరావు టౌన్ కి వెళ్ళాడు.


    కాంచనమాల అందంగా తయారై బయట కూర్చోవడానికి మెట్ల దగ్గరికి వచ్చింది. ఆమె మేకప్ మరింత గాడీగా వుంది. సాయంకాలమయ్యే సరికి ఆమె ముచ్చటగా తయారైపోతుంది. కానీ భర్త గోపాలరావు మాత్రం టౌన్ నుంచి ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తాడు.


    "ఏమిటొదినా, ఆలస్యమైందే" అడిగింది మానస తన పక్కనే వచ్చి కూర్చున్న కాంచనమాలతో.


    "ఆఁ! ఏమొచ్చింది తొందరనే నేను నిదానంగా తయారయ్యాను" అంది ఆమె.


    ఇద్దరూ అవీ ఇవీ మాట్లాడుకుంటున్నా, మానస కళ్ళు మాత్రం బాబు కోసం వెతుకుతున్నాయి. ఈపాటికి రావాల్సింది. ఏమయ్యాడో తెలియడం లేదు.


    "ఏమైందిట గిరిపెళ్ళి?" కాంచన అడిగింది, గిరి అప్పుడే గేదెలు తోలుకుంటూ వీధిలో నడుస్తున్నాడు. అతన్ని చూస్తూనే ఆమెకి పెళ్ళి విషయం గుర్తొచ్చింది.


    "చెడిపోయింది" అంది మానస.


    "చెడిపోయిందా!" ఆశ్చర్యంగా అంది కాంచన.


    "ఆఁ! ఒప్పకపోవడం- ఆ ఛాన్స్ తనకొస్తుందేమోనన్న ఆశతో కొందరు చెడగొట్టారు" ఊళ్ళో జరిగే పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు-ఇలాంటి విషయాలు చాలా బాగా తెలుస్తాయి మానసకు.


    "అయితే చాలా జరిగినట్టుందే-ఇంతకీ ఏమిటి కథ?" కాంచన అడిగింది.


    "వేంపల్లికి వెళ్ళి గిరి పిల్లను చూసొచ్చాడు. అమ్మాయి బావుందట. అయితే ఆ అమ్మాయికి ముందే పెళ్ళి జరిగింది. భర్త ఓ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు.


    ఇండియాలో కాదు కువైట్ లో. ఆమెతో పెళ్ళయ్యేనాటికి అతనక్కడ ఎలక్ట్రీషియన్. పనిచేస్తున్నప్పుడు షాక్ కొట్టి పోయాడు. భార్యకు బాగానే డబ్బులొచ్చాయి.


    ఆమెకి ఇద్దరు అన్నదమ్ములు.


    వాళ్ళు తిన్నా బాగానే మిగులుతుంది. ఆ మిగిలింది కూడా తామే తినెయ్యాలని అన్నదమ్ముల ప్లాన్. అందుకే రెండో పెళ్ళికి ఎవరు సిద్ధపడతారంటూ కాలయాపన చేశారు.


    కన్నవాళ్ళకు మనసొప్పలేదు. నిండా పాతికేళ్ళు కూడా లేని అమ్మాయిని జీవితాంతం విధవగా బతకమని ఎలా అనగలరు? అందుకే తమకు తెలిసినవాళ్ళకు సంబంధం చూడమని చెబుతుండేవాళ్ళు.


    అలా చివరికి మన గిరికి చేరింది విషయం. వాడేమో చేసుకోవడానికి సరేనన్నాడు. మరి డబ్బుకోసమో, లేక మంచితనంతోనో-ఆ భగవంతుడికే తెలియాలి. అయితే ఇంతలో గురుమూర్తి వాళ్ళు వెళ్ళి గిరి మీద ఏవేవో అభాండాలు చెప్పారట...."


    "ఏ గురుమూర్తి?" కాంచనమాలకు డౌట్ వచ్చింది.


    "అదే రామనాధం కొడుకు."


    "ఆ ఆ....గుర్తొచ్చింది-చెప్ప చెప్పు."


    "ఇంకేం వుంది చెప్పడానికి. సంబంధం కాస్తా చెడిపోయింది. ఆ తరువాత తనకే ఆ అమ్మాయిని ఇవ్వమని గుర్నాధం రాయబారాలు పంపాడు. అయితే ముందు ఒకరిని అనుకుని, ఆ తర్వాత అదేవూర్లో మరొకరికి ఇవ్వడం బావుండదని వాళ్ళు తేల్చి చెప్పారట."


    "అంటే వ్రతం చెరిచినా ఫలితం దక్కలేదన్నమాట" సామెతను కొద్దిగా మార్చి చెప్పింది.


    "అంతే-అంతే" అన్నది మానస.


    "ఈ పల్లెటూళ్ళలో ఇలాంటివి ఎప్పుడు పోతాయో ఏమో" కాంచనమాల తన కోపాన్ని వెళ్ళగక్కింది.


    మానస ఏదో అనబోయింది గానీ బాబూ అప్పుడే తన ఇంట్లోకి రావడానికి ముందున్న గేటును తెరుస్తూ వుండడంతో ఆగిపోయింది.


    అతన్ని చూసీచూడగానే అంతకు ముందున్న నిరుత్సాహం, బోర్ అన్నీ చటుక్కున ఎగిరిపోయాయి. ఏదో తెలియని కొత్త ఉత్సాహం రక్తంలో కలిసిపోయినట్లుగా అనిపిస్తోంది.


    "ఎంత సేపట్నుంచీ చూస్తున్నానో తెలుసా?" బాబు రాగానే మానస రాగాలు తీసింది.


    "ఏం చేయనండీ-కూలోడిబతుకు కదా-మీలా మేమేమన్నా రైతులమా? సాయంకాలమయ్యే సరికి ఫ్రీ అయిపోవటానికి" అంటూ కిందిమెట్టు మీద కూర్చున్నాడు బాబు.


    వాళ్ళిద్దరివైపు మార్చిమార్చి చూశాడు. అతను. ముఖ్యంగా మానసను చూడగానే ఆ వేసవి సాయంకాలం పన్నీటి వర్షంలో తడుస్తున్నట్లుంది. మల్లెమొగ్గల్ని చెట్టులోంచి కోసి తెల్లటి బుట్టలో చుట్టిపెడితే సాయంకాలానికి అవి విచ్చుకుని ఘుమఘమలాడిపోతుంటాయి.


    మానసను చూస్తూనే అతనికి ఆ మల్లెముగ్గల మూటే గుర్తొస్తొంది. సాయంకాలమయ్యేటప్పటికి శుభ్రంగా స్నానంచేసి ఉతికినబట్టల్ని కట్టుకుని అందంగా తయారయ్యే ఆమెను చూడడమే అతనికి ఎంతో బావుంటుంది. తెలియని ఆనందం మనసుని కుదిపేస్తుంది.


    అలా సాయంకాలమయ్యే సరికి శుభ్రంగా తయారుకమ్మని అతను సమయం వచ్చినప్పుడంతా భార్య జయలక్ష్మికి చెబుతుంటాడుగానీ ఆమె అతని మాట వినిపించుకోదు.

 Previous Page Next Page