Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 17


    
    అలా ఎంతసేపు పడుకుందో తెలీదు. పెదవులమీద చల్లగా తగిలేసరికి వులిక్కిపది కళ్ళు విప్పింది.
    
    ఓ మొహం-ఆమెకు భర్తతప్ప మరెవరూ వుండకూడనంత దగ్గర్లో వుంది.
    
    వెంటనే మెరుపులా లేచి నిలబడుతూ రెండుచేతులతో అవతలకు తోసేసింది.
    
    రజనీకాంత్ తొణకలేదు. అతనికీ రోజు ఎప్పటికంటే డోసెక్కువయింది. పార్టీ అయాక బయటికొచ్చి కారెక్కబోతూంటే చిన్మయి గుర్తుకొచ్చింది. మత్తులో ఒళ్ళు తెలీనిస్థితిలో అతనేం చేస్తున్నదీ తెలీలేదు. పార్టీ జరుగుతున్నప్పుడు మధ్యలో గాలికోసమని కిటికీ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు, తలుపుదగ్గర నిల్చుని వున్న చిన్మయి కనిపించింది. భర్త ఇంట్లో లేడు గావును బహుశా ఒక్కతే వుంది, అనుకున్నాడు. అప్పట్నుంచే ఆమె మనసులో మెదుల్తోంది. ఆ యావలో మరోరెండు పెగ్గులు అదనంగా త్రాగేశాడు.
    
    "నువ్వు... నాకు... కావాలి..." అన్నాడు ముద్దముద్దగా మాట్లాడుతూ.
    
    "ఏడిశావు. బయటకు వెళ్ళు ఇక్కడ్నుంఛి."
    
    "వెళ్ళను... నిన్ను... తృప్తిగా... అను...భ...వించి..."
    
    "రాస్కెల్! నీకేమి హక్కుందిరా ఇష్టమొచ్చినట్లు పేలుతున్నావు వెళతావా? లేకపోతే..."
    
    "లేకపోతే... ఏం చేస్తా...వు?"
    
    "అల్లరి చేస్తాను. నలుగుర్నీ.... పిలిచి నీకు శాస్తి చేయిస్తాను."
    
    "నలుగుర్నీ.... పిలిస్తే... నీకే నష్టం.... నువ్వే.... నన్ను.... పిలిచావని.... చెబుతాను.... నీకే నష్టం..."
    
    "ఏడిశావ్. పోతావా? కేకలెయ్యమన్నావా?"
    
    "వెయ్యి... చూద్దాం."
    
    ఆమె నిర్ఘాంతపోయినట్లు మెదలకుండా నిలబడిపోయింది.
    
    "చూశావా... మరి... మర్యాదగా....రా...." అంటూ ఆమెవైపు ఓ అడుగువేశాడు.
    
    "ఆగు" అన్నది గర్జిస్తున్నట్టుగా అతను ఉలిక్కిపడి సర్దుకునే లోపల ప్రక్కకి కనురెప్పపాటులో టీపాయ్ మీద పెట్టి వున్న చాకు తీసుకుంది. రాజీవ్ కు మార్కెట్ కు వెళ్ళినప్పుడు అటువంటి వెరైటీ వస్తువులు కొనటమంటే సరదా. ఒకరోజు మోజుపడి ఆ చాకు కొంటూంటే "ఎందుకండీ! యింత పదునుగా, మనుషుల ప్రాణం తియ్యటానికి పనికివచ్చేదిలా వుంది" అంటే "చాకులూ, పెద్ద కత్తెరలూ, స్క్రూడ్రైవర్లూ, పట్టకారులూ, రెంచీలూ యింట్లో వుండాలి. వాటివల్ల ఎప్పుడో ఒకప్పుడు అవసరం కలుగుతూ వుంటుంది" అని కొనేవాడు.
    
    రజనీకాంత్ ఆమెచేతిలోని చాకువంక చూశాడు. "ఏంటి? ఆత్మహత్య చేసుకుంటావా?" అన్నాడు.
    
    "నీలాంటి నేచుడికి భయపడి ఆత్మహత్య చేసుకొనేటంత పిరికిదాన్ని కాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే పొడిచిపారేస్తాను" అన్నది.
    
    ఆమె మొహంలోకి చూశాడు. "ఆ కళ్ళు.... వాటిలోని ఉగ్రత... చేతిలో ముందుకు వురకటానికి సిద్దపడుతూన్నట్లు మిలమిల మెరిసే చాకూ..... అతనికి నిజంగానే బెదురు కలిగింది.
    
    "సరే... వెడుతున్నాను... ఎప్పటికైనా..." అంటూ చల్లగా బయటకు జారుకున్నాడు.
    
    చిన్మయి గభాల్న వెళ్లి తలుపు గడియపెట్టింది. చాకు ఓ ప్రక్కకు పడేసి గుండెలమీద చెయ్యివేసి నొక్కుకుంది. కొంతసేపటిదాకా అదురు తగ్గలేదు. అసలేం జరిగింది? ఆమెకు క్రమక్రమంగా అంతా గుర్తురాసాగింది. తను సోఫాలో పడుకుని వున్నప్పుడు అతను.... భరించలేక వాష్ బేసిన్ దగ్గరకెళ్ళింది. పైన అమర్చివున్న మిర్రర్ లో మొహం కనిపించింది. నిద్రలో వున్నప్పుడు తన పెదవులమీద అతని స్పర్శ... తనని చూస్తే తనకే అసహ్యమేసింది. టాప్ త్రిప్పి నీళ్ళతో మొహం కడిగేసుకుంది. ఇంకా ఏదో అక్కడ అంటుకుని వున్నట్లు,స శరీరమంతా మలినమైపోయినట్లు భావన. ఆ భావన పోవటంలేదు. అణువణువుణ ఏదో మంటలు వ్యాపించినట్లు నరాలు తోడేస్తున్నాయి. "ఛీ ఛీ ఛీ" అనుకుంటూ సోఫాలో వ్రాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది.
    
    తమదార్న తాము ఒకరి జోలికి పోకుండా ప్రశాంతంగా, సంతోషంగా గడుపుతూంటే కారణం లేకుండా ఏదో హక్కున్నట్లు అధికారమున్నట్లు యీ వాతావరణాన్ని కలుషితం చెయ్యటానికి తమ జీవితాల్లోకి జొరబడటానికి...
    
    బయట స్కూటర్ చప్పుడయింది. చిన్మయి గబగబ లేచి కళ్ళు పమిట చెంగుతో తుడుచుకుంది.
        
    బయట్నుంచి బజర్ నొక్కారెవరో.
    
    రాజీవ్ అయివుంటాడు. చిన్మయి గుమ్మందగ్గరకు వెడుతూ నేలమీద పడివున్న చాకును తీసి టీ.వి. ప్రక్కన పెట్టింది.
    
    "ఎవరూ?" అంది తలుపుదగ్గర నిలబడి.
    
    "నేను చిన్మయీ!" రాజీవ్ గొంతు.
    
    చిన్మయి తలుపు తీసింది. రాజీవ్ లోపలికి వచ్చి "సారీ! ఆలస్యమయింది. అక్కడ డిన్నర్ అదీ పూర్తయేసరికి" అంటూ ఆమెముఖంలోకి చూసి "చిన్మయీ! అలా వున్నావేం?" అనడిగాడు.
    
    ఏం చెప్పాలి? జరిగింది జరిగినట్లు చెప్పాలా?
    
    స్త్రీ బయటకు వెళ్లినప్పుడు, ఏ చుట్టాలింటికో, స్నేహితులింటికో, పెళ్ళిళ్ళకో, పొరుగూళ్ళకో వెళ్లినప్పుడు ఎవరెవరో తారసపడుతూ వుంటారు. అవాంఛనీయమైన సంఘటలెన్నో జరుగుతూ వుంటాయి. తన యిష్టంతో ప్రమేయం లేకుండా దుర్ఘటనలు జరుగుతాయి. అవన్నీ భర్తతో చెప్పటంవల్ల ప్రయోజనమేమిటి? వీధినపది, రచ్చకెక్కి, అతన్ని రెచ్చగొట్టి, గలాభాలూ పరిణామాలకు దారి తియ్యటం తప్ప సాధించేదేముంది? అతని మనసులో శాశ్వతమైన కల్లోలం రేపటం.
    
    చిన్మయి ఇవన్నీ గబగబ ఆలోచించి "ఏమీ లేదండి గుండెల్లో బాగా నొప్పి వస్తే ఆ బాధకు తట్టుకోలేక ఏడ్చేశాను" అంది.
    
    అతనికి గుండెలో ముల్లు దిగబడినట్లు అయింది. "అయ్యో" అన్నాడు బాధగా, "డాక్టర్ గారి దగ్గరకు తీసుకెడతాను రా, పోదాం" అన్నాడు.

 Previous Page Next Page