ఇప్పుడు తగ్గిపోయిందిలెండి. ఏడ్చేశానుగా దాంతో కరిగిపోయి వుంటుంది" అంది చిన్మయి నవ్వటానికి ప్రయత్నిస్తూ.
"నిజంగానా?"
"నిజం."
* * *
రాత్రి రెండుదాటినా చిన్మయికి నిద్రపట్టటంలేదు. ఆమె అటూ యిటూ కదుల్తోంటే రాజీవ్ కు మెలకువ వచ్చింది.
"చిన్మయీ!" అని పిలిచాడు.
"ఊఁ!"
"నిద్ర పట్టటంలేదా?"
"లేదు."
"మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చిందా?"
"నొప్పి కాదు. ఆరనిమంట" అనుకుంది బయటికి మాత్రం "ఉహూ లేదు" అంది.
"మరి?"
"ఏమీ లేదు."
రెండునిముషాలు కలవరంతో కూడిన నిశ్శబ్దంతో గడిచాయి.
"ఏమండీ! ఈ లొకాలిటీనుంచి తొందరగా వెళ్ళిపోదాం. వీళ్ళ ప్రవర్తనా, యీ వాతావరణం నాకు నచ్చలేదు. ప్లీజ్! తొందరగా మరో ఇల్లు చూడండి. ఇక్కడికి చాలా దూరంగా.... ప్రశాంతంగా వున్నచోటుకు..." అంది వేడికోలుగా.
ఆమె ఎందుకో చాలా మనోవ్యధ ననుభవిస్తోందని తెలుసుకున్నాడు.
"అలాగే" అన్నాడు ఆమె తల నిమురుతూ.
9
రాజీవ్ నిజంగానే చాలా పట్టుదలతో యింటికోసం వెతికాడు. వారం రోజుల్లోనే మంచి యిల్లు దొరికింది. ఆళ్వార్, తిరునగర్ లో రిమీ ఫ్యాక్టరీ దగ్గరగా వుంది. ఆ లొకాలిటీ సిటీ లిమిట్స్ కు కొంచెం దూరంలోనే వున్నా యించుమించు సిటీలో వున్నట్లే వుంటుంది. లోపలకు పోతే ప్రశాంతంగా, రోడ్డుమీదకొస్తే సందడిగా వుంటుంది.
ఇల్లు ఖాళీ చేసేరోజున రాజీవ్ తన ఆఫీసులోని ముగ్గురు బాయ్స్ ని సాయం తెచ్చుకున్నాడు. లారీలోకి సామాన్లెక్కిస్తుంటే ఆనంద కిటికీలోంచి తొంగిచూసింది. అప్పటిదాకా వాళ్ళు యిల్లు ఖాళీ చేస్తోన్న సంగతి ఆమెకు తెలీదు. గబగబ బయటికొచ్చి చిన్మయిని కలుసుకొంది.
"ఏమండీ యిక్కడ్నుంచి ఖాళీచేసి వెళ్లిపోతున్నారా?" అనడిగింది.
"అవునండీ" అంది చిన్మయి.
"ఏం?"
"కరణమేమీ లేదండీ. మావారికి అక్కడ తెలిసినవారు వున్నారుట."
"మేమంతా తెలిసినవాళ్ళం కాదా?"
"అలా అనికాదు. ఆ ఇల్లు యింతకంటే సౌకర్యంగా వుంటుందని."
"ఎక్కడ అది?"
"ఆళ్వార్ తిరునగర్"
"అబ్బా! చాలా దూరమయిందే అక్కడ్నుంచి రోజూ సిటీలోకి రావాలంటే కష్టం."
"రోజూ ఎందుకండి రావటం?"
"ఏవో పనులుంటాయి కదా?"
"రోజూ ఏముంటాయండి పనులు?"
"సినిమాలకి అవీ వెళ్ళాలన్నా..."
"ఏ నెలకో ఓసారి సినిమాలకి వెళతాం. అందులో యిబ్బందేం వుందండీ?"
"అవునవును మీకు సినిమాలంటే యిష్టంలేదుగా గుళ్ళూ గోపురాలూ అంటే ప్రాణం పెడతారు. కపాలేశ్వరుడి గుడికి వెళ్లిరావటం చాలాసార్లు చూశాను. అన్నట్లు మీరు వెళ్ళబోయే చోటుకి వడపళని కొంత దగ్గరలోనే వుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం బావుంటుంది. మీలాంటి వాళ్ళు... అదే మీరు రోజూ వెళ్ళినా వెళ్ళవచ్చు."
ఆమె మాటల్లోని వ్యంగ్యం చిన్మయి గమనించింది. అయినా ఏమీ మాట్లాడకుండా వూరుకుంది.
ఆనంద ఆమెని విడిచిపెట్టి మంజుభార్గవి ఇంటికివెళ్ళింది. మంజుభార్గవికి వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసిందిగాని రజనీకాంత్ ఆమె అంటే వాచిపోతున్నాడన్న కోపం మనసులో పెట్టుకుని యీ మధ్య చిన్మయితో సరిగా మాట్లాడం లేదు. ఈ వేళ కూడా బయటకు రాలేదు.
"ఇది విన్నారా మంజుభార్గవిగారూ! ఆ వగలాడి లేదూ? చిన్మయి, ఇక్కడ్నుంచి వెళ్లిపోతున్నదట."
ఈ ప్రపంచంలో ఒకరకం మనుషులుంటారు. మనిషి ఎదురుగా ఆప్యాయత కురిపిస్తూ మాట్లాడి, వాళ్ళు చాటు అయిన మరుక్షణంలో అవహేళన చేస్తూ మాట్లాడతారు.
"ఎక్కడికి?" అంది మంజుభార్గవి ఏమీ తెలీనట్టు.
ఆనంద చెప్పింది.
"ఎందుకట అంత దూరం?"
"ఆవిడగారికి యిక్కడి వాతావరణం నచ్చలేదుట. అవునూ, నా మొగుడి ప్రవర్తన నచ్చకపోతే నేను నిలదీసి అడుగుతాను. మీ మొగుడుగారి కిష్టమైంది కాబట్టి మీరు నలుగురితో సోషల్ గా వుంటారు. తప్పేమిటి?"
"అలా అని అందా?"
"డైరెక్ట్ గా అనక్కర్లేదు. ఆవిడ ప్రవర్తన చెబుతోంది. మీరెన్నయినా చెప్పండి. ఇలా నేలముచ్చుల్లా వున్నవాళ్ళే కొంపలు ముంచేది. తడిగుడ్డలతో గొంతు కోస్తారు. ఒక సరదా వుండదు, చట్టుబండలూ వుండదు. ప్రపంచంలో వాళ్ళకళ్ళే మంచికళ్ళయినట్టు."
మంజుభార్గవి నవ్వి వూరుకొంది. ఒకరకంగా చిన్మయి ఇక్కడ్నుంచి వెళ్లిపోవటం ఆమెకు సంతోషంగానే వుంది.
* * *
చిన్మయికి ఆ కొత్త యిల్లు, వాతావరణం ఎంతో నచ్చింది.
రాజీవ్ ఆఫీసుకు వెళ్ళిపోయాక ఇల్లంతా శుభ్రంగా సర్దేసుకుని, కిచెన్ లో పని చేసుకుంటూ సంతోషంగా పాడేసుకుంటోంది.