"కావచ్చు."
"కారణం?"
"నాకిష్టం లేదు గనుక."
"ఎందుకిష్టంలేదు?"
"అవతల నాకు భార్య, సంసారబంధం, నైతిక బాధ్యత అన్నీ వున్నాయి. ఆ వాతావరణం కలుషితం కాకూడదు కనుక."
తనూజ ఓ నిముషం మెదలకుండా నిలబడింది. ఆమెచేతులు టేబుల్ మీద ఆనించి ఆమె కొంచెం ముందుకు ఒంగివుంది. ఎందుకో ఆమె మనసు వణికినట్టయింది.
"ఒకవేళ ఆ ఆకర్షణ నాలోనుంచి కూడా బయల్దేరితే?"
"అది నాకు సంబంధించైనా విషయంకాదు."
"కాని అది మీ వైపుకు దూసుకువస్తే?"
"పదునైన బాణాలతో గ్రుచ్చుకొని కొంతసేపు బాధపెడుతుంది. కాస్త బాధ... అంతే అంతకన్నా హాని ఏమీచేయదు."
"మీరు చలించరా?"
"చలించకుండా ఎలా వుంటాను? కాని చెప్పానుగా నిర్దాక్షిణ్యంగా అదిమేస్తానని."
"మీకు... సారీ... ఇలా అడుగుతున్నందుకు వ్యామోహం, కోరిక కలగవా?"
"కలుగుతాయి. అవి ఎక్కడ తీర్చుకోవాలో అక్కడ తీర్చుకుంటాను. మనసును అటూ ఇటూ బెసగనివ్వను."
"ఎందుకంత నిగ్రహం?"
"అవతలి వ్యక్తికి అన్యాయం చెయ్యకూడదన్న బాధ్యత. నాభార్య నామీద ప్రసరింపజేసినా అద్భుతమైన ప్రభావం."
ఆమె మౌనంగా నిలబడి టేబుల్ మీద వేళ్ళు కదుపుతూ అతనివంక ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ నిర్మలమైన వలయం ముందు ఏ అగ్నికణమైనా ఆరిపోయి నిస్తేజమై పోతుందనిపించే నిశ్చలత్వం.
* * *
రాత్రి తొమ్మిదయింది. చిన్మయికి రాజీవ్ ఎలాగూ భోజనానికి రాడని తెలుసుకాబట్టి తాను ఒక్కతే అన్నం తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. సహించలేదు. ఎంతోకొంత తిందామని ప్రయత్నించింది గాని ఆమెవల్ల కాలేదు. లేచి కంచంతీసి సింక్ లో పడేసి డ్రాయింగ్ రూంలోకి వచ్చి టి.వి. ఆన్ చేసి సోఫాలో కూర్చుంది.
టి.వి.లో ఏదో నేషనల్ ప్రోగ్రామ్ వస్తోంది. అంత ఆసక్తికరంగా లేదు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో వచ్చే తమిళ నాటకాలే ఎంతో సహజంగా రక్తికట్టేటట్లుగా వుంటాయనిపించింది.
ఒక మనిషిమీద ఇంకో మనిషి ప్రభావం ఎంత విస్తరించి వుంటుంది! అతను ఇంటికి రాకపోతే జీవితమంతా పోగొట్టుకున్నట్లు భరించలేని వంటరితనం, గుండెల్లో ఏదో వేదన, దుఃఖం.
తల్లిదగ్గర్నుంఛి ఆరోజు ఉదయమే ఉత్తరమొచ్చింది.
"చిన్మయి!
అంతా క్షేమం.
........
జీవితంలో నిరంతరం రక్షణ ఇచ్చేది దాంపత్యం అన్యోన్య దాంపత్యాన్ని మించిన వరం ప్రప౦చంలో లేదు.
ఈ అన్యోన్యతను భగ్నం చేయడానికి సమాజంలోని అనేక వక్రశక్తులు ప్రయత్నిస్తూ వుంటాయి. ఒక వ్యక్తి సంతోషంగా వుంటే ఎవరూ ఓర్చలేరనీ, ఒకరు నైతికంగాగాని, ఆర్ధికంగాగాని, ఇంకేవిధంగా గానీ చెడిపోతే బాధ పడుతూ వుంటే ఇతఃరులు జాలిపడకపోగా సంతోషిస్తూ వుంటారనీ తెలుసుకో.
నీకు స్నేహితులు, శ్రేయోభిలాషుల కన్నా శత్రువులెక్కువ వుంటారని తెలుసుకో ఎవరన్నా నీ దగ్గరకొచ్చి పదే పదే నీ శ్రేమోభిలాషిని అని చెప్పుకొంటే ఆ మనిషి నీకు ముఖ్యమైన శత్రువని తెలుసుకో.
అందరికన్నా నీ బద్దశత్రువు నీ మనసు. అది గారాలు చేస్తుంది. అపస్వరాలతో ఆలోచిస్తుంది. నిన్ను చిత్రహింసలు చేస్తుంది. చివరకు నిన్ను సైకిక్ ను చేసి వదిలేస్తుంది.
నీ భర్తలో ఏమైనా చిన్న చిన్నలోపాలుంటే అవన్నీ సహజమైన విషయాలుగా స్వీకరించటం నేర్చుకో లోపాలు లేనిమనిషి ఎవరూ వుండరు. ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దంలో చూసే ఆడది తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ వుంటుంది.
భర్తకు దూరమై పుట్టింట్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న స్త్రీ అన్నదమ్ములచేత, ఆడపడుచులచేత కొంతకలం పోయాక చివరకు తల్లిదండ్రులచేత హీనంగా చూడబడుతుందని తెలుసుకో.
ఏ స్త్రీ అయినా భర్తను ప్రేమతో, ఆరాధనతో వశం చేసుకోవాలి కాని నిబంధనలతో, అధికారంతో, హక్కులతో కాదు.
అహంతో రెచ్చిపోయిన కొద్దీ మనుషుల్ని దూరం చేసుకొంటూ వుంటారు.
సహనం కోల్పోయినకొద్దీ మనని మనమే పోగొట్టుకుంటూ వుంటాం.
......
వుంటాను.
నీ తల్లి
ఆ ఉత్తరం గురించి చిన్మయి తనలో తానూ నవ్వుకుంది. తల్లి తనకా ఉత్తరం ఎందుకు రాసినట్లు? తామిద్దరూ అందరికీ దూరంగా వుంటున్నారు కాబట్టి. కొత్త కాపురం కాబట్టి ముందు జాగ్రత్తకోసం!
బయట ఏదో స్కూటరు చప్పుడయినట్టయితే రాజీవ్ అనుకుని లేచి తలుపు తీసి చూసింది. అతను కాదు ఓ స్కూటర్ అటుమీదుగా సాగిపోతూ, మలుపు తిరిగి వెళ్లిపోయింది. ఒక నిముషం గుమ్మందగ్గరే నిలబడింది.
ఎదురుగా మంజుభార్గవి వాళ్ళ యింటిముందు మూడు నాల్గు స్కూటర్లు, ఓ మారుతి కారు ఆగి వున్నాయి. ఏదో పార్టీ జరుగుతోంది గావును వాళ్ళందరి మధ్య తిరుగాడుతూ మంజుభార్గవి... ఆమె వళ్ళు జలదరించినట్లయింది.
తర్వాత తలుపులు దగ్గరగా వేసి సోఫాలోకి వచ్చి కూర్చుంది.
మరో అరగంట గడిచింది. చిన్మయికి నిద్ర వచ్చినట్లుగా అనిపించింది. రాజీవ్ వచ్చేవరకూ వెళ్లి పడుకుందామా అనుకుంది. కాని మనస్కరించలేదు. తలుపు గడియవేసి వద్దామా అనుకుంటూనే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. తెలియకుండానే నిద్రపట్టేసింది.