ఓ పక్కన రిక్షా అతనూ, స్కూటరు తోలుతున్న మనిషీ తప్పు నీదంటే నీదని హోరాహోరీగా వాదించుకుంటున్నారు. ప్రపంచంలోని ఏ వ్యక్తీ తన తప్పు ఒప్పుకోడనటానికి ఈ సన్నివేశమే సాక్ష్యం. న్యాయం చెప్పటానికే అవతరించిణ కొంతమంది ప్రబుద్దులు- అటు కొందరూ ఇటు కొందరూ చేరి వత్తాసు పలుకుతున్నారు. 'నా రిక్షా చక్రం ఒంగిపోయింది. రిమ్ములు విరిగిపోయినాయి. డబ్బు కట్టి మరీ కదులు' అంటున్నాడు రిక్షా అతను. 'నువ్వు నాకు డాషిచ్చి నన్ను డబ్బు కట్టమంటావేమిటి? నా స్కూటరు పెయింటు పోయింది. నువ్వే డబ్బు కట్టు' అంటున్నాడు రెండో అతను. ఈ పోరాటం ఎంతకూ సమసిపోయేటట్లు కనబడడంలేదు. లోకంలోని నీతి, న్యాయం ఆ ఇద్దరిలోనూ మూర్తీభవించినట్లు కనిపించింది.
రాజాచంద్ర అటుకేసి తిరిగి జేబులోంచి ఓ యాభై రూపాయలు తీసి రిక్షా అతనివైపు నడవబోయాడు. కాలు బెణికినట్లయి తూలి కిందపడబోతే ఆ అమ్మాయి భుజంమీద చెయ్యి వేసి పట్టుకుంది. "ఇదిగో అబ్బాయ్ ఇటు రా" అని పిలిచాడు రాజచంద్ర. రిక్షా అతను దెబ్బలాట మాని తన దగ్గరకు వచ్చాక ఆ డబ్బతనికి అందించి పక్కకి తిరిగాడు.
"ఎటువైపు పోవాలి చెప్పండి? నేను సాయంగా వస్తాను" అన్నదా అమ్మాయి.
"అక్కర్లేదండీ నేను వెళ్ళిపోగలను" అన్నాడు రాజాచంద్ర.
అతను తనకన్నా చిన్న వాళ్ళని కూడా అండీ అనే సంబోధిస్తాడు. తన పిల్లల స్నేహితుల్ని కూడా అండీ అనే పిలుస్తాడు.
"కాదు మీ కాలు కూడా బెణికినట్లుంది. పోనీ మా ఇల్లు దగ్గర్లోనే ఉంది. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వెళుదురుగాని రండి" అంటూ ఆ అమ్మాయి అక్కడికి కొంచెందూరంలో ఆగివున్న ఆటోకేసి చేయెత్తి పిలుస్తూ "ఆటో అంది."
ఓ నిమిషం గడిచాక ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు. ఆమె ఇస్తున్న సూచనల ప్రకారం ఆటో ముందుకు సాగిపోతుంది.
"మీరనవసరంగా నాకోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు" అన్నాడు రాజాచంద్ర మొహమాటంగా.
"ఒక మనిషి ఇబ్బందిలో ఉన్న ఇంకో మనిషికి సాయపడటం శ్రమా?"
"మీ పేరేమిటి?" అనడిగాడు.
"విజ్ఞత."
ఆమె ముఖంలోకి చూశాడు. అమాయకంగా మెరిసే కళ్ళు.
ఎందుకో ఆమె అంటే చాలా ఆపేక్ష, ఆప్యాయత కలిగాయి. ఆమె వంక చూస్తుంటే, ప్రతిక్షణం విశారదే గుర్తొస్తుంది.
ఆమె ఇదేమీ పట్టించుకోకుండా రోడ్డువంక చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. అయిదు నిమిషాల తరువాత ఆటో ఓ బిల్డింగ్ ముందాగింది.
"రండి" అన్నది ఆమె ముందు కిందకు దిగి, అతను దిగుతుంటే చేతిని సాయమందించింది. చేయి పట్టుకునే నడిపిస్తూ లోపలకు తీసుకెళ్ళింది.
కొంచం చిన్నదే అయినా నీట్ గా, ప్రత్యేకమైన అభిరుచి ద్యోతకమవుతూ ఓ జీవకళ ఉట్టిపడుతుంది ఆ ఇంట్లో కొన్ని ఇళ్ళు ఎంత నిరాడంబరంగా కట్టినా జీవకళతో అలరారుతూ ఉంటాయి. కొన్ని ఎంత ఖర్చుపెట్టి భేషజాలు చేసినా నిర్జీవంగా, నిస్సత్తువగా కనబడతాయి.
"కూచోండి" అంది విజ్ఞత చాలా సభ్యతగా.
చాలా సింపుల్ గా ఉన్న అందమైన సోఫాసెట్లు రాజాచంద్రని చెయ్యి పట్టుకునే ఓ సోఫాలో కూచోబెట్టింది.
"ఒక్క నిమిషం అమ్మని పిలుచుకొస్తాను" అని విజ్ఞత లోపలకు వెళ్ళింది.
రాజాచంద్ర డ్రాయింగ్ రూమ్ లోని అలంకరణా, అందులోని నిరాడంబరత్వాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. విశారదలో కూడా ఇలాంటి సింప్లిసిటీనే ఉంది. అందుకనే ఆమెను చాలా చాలా అభిమానిస్తాడు.
లోపలనుంచి విజ్ఞత ఓ నలభై అయిదేళ్ళ స్త్రీతో తిరిగి వచ్చింది.
ఆమెది కూడా చాలా కళ గల ముఖం. వయసుకన్న చిన్నగా, చాలా హుందాగా కనబడుతుంది. రాజాచంద్రని చూసి రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది.
"మా అమ్మ" అంది విజ్ఞత.
రాజాచంద్ర కూడా నమస్కారం చేశాడు.
"అమ్మాయి చెప్పింది మీకు చాలా పెద్ద ఏక్సిడెంట్ కొద్దిలో తప్పిపోయిందని" అన్నదామె మాట నెతో పొందికగా ఉన్నట్లనిపించింది.
"పెద్ద ఏక్సిడెంటేమీ కాదులెండి. అలాంటివి ఈరోజుల్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి" అన్నాడు రాజాచంద్ర. అప్రయత్నంగా ఆమె ముఖాన్ని గమనిస్తున్నాడు. విజ్ఞత రూపానికీ ఆమె రూపానికీ చాలా తేడా ఉంది. అసలిద్దరికీ పోలికలే కనిపించటంలేదు.
"కూచోండి కాఫీ తీసుకొస్తాను" అని ఆమె లోపలకెళ్ళింది.
"మీ అమ్మగారి పేరేమిటి?" అనడిగాడు రాజాచంద్ర ఏమనాలో తోచక. అతనికి ఆ పరిస్థితిలో అక్కడికి వచ్చి కూర్చోవటం చాలా మొహమాటంగా ఉంది.
"భ్రమరాంబ"
"మీరేం చదువుతున్నారు?"
"నేను బి.ఎ. పాసయ్యి ఎమ్.ఎ. ప్రైవేట్ గా చదువుతున్నాను."
"మీ హాబీస్ ఏమిటి?"
"వీణ నేర్చుకున్నాను. నటన అంటే చాలా ఇష్టం.
"నటన అంటే ఇష్టమా? నాటకాల్లో ఎప్పుడయినా ఏక్ట్ చేశారా?"
"కాలేజీలో చదువుతున్నప్పుడు ఏక్ట్ చేశాను. అప్పుడు యూనివర్శిటీ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ మధ్య... అవకాశమేది? అన్నట్లు వరద బాధితుల సంక్షేమనిధికోసం ఈ ఊళ్ళోని మహిళామండలి వాళ్ళు ఓ నాటకాన్ని ప్రదర్శిస్తూ అందులో నన్ను నటించమని అడుగుతున్నారు. మా నాన్నగారు ఒప్పుకుంటే నటిస్తాను."
"మీ నాన్నగారేం చేస్తూ ఉంటారు?"
"కాంట్రాక్ట్స్ చేస్తారు. మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము. నాన్నగారికిక్కడ కాంట్రాక్ట్స్ వచ్చాయి.
"ఈ ఊరు కొత్తగా వచ్చారా?"