Previous Page Next Page 
మోహిత పేజి 17


    

       "రాత్రి బేరాల్లేవు గురూగారూ! అందుకే పొద్దున్నే బండి తియ్యాల్సి వచ్చింది. అదికాదు గురూగారూ..... ఈ మధ్య మన టౌనులో మార్డర్లేమైనా జరిగాయేంటి?" సిగరెట్ వెలిగించాడు గణేష్.

 

    "ఎక్కడా మర్డర్లు జరక్కపొతే నువ్వు చేస్తావేట్రా?"

 

    "అది కాదండీ చిన్న ఇన్పర్మేషన్ కావాలి..... మనకు తెలిసిన కుర్రోడొకడు చిన్న మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. మైత్రేయ అని."

 

    "ఆ మధ్య ఎమ్మెల్యే మర్డర్ తర్వాత, ఇంకే మర్డరూ జరగలేదు. ఆ మర్డర్ వివరాలు కావాలంటే, అలా వెళుతున్నప్పుడు స్టేషన్ కి రా. ఎస్.ఐ.ని అడిగి చెప్తాను వస్తా" అంటూ సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోవడం-

 

    సరిగ్గా అదే సమయానికి-

 

    గణేష్ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి-

 

     "ఆటో వస్తావా?" అని అడగడం..... ఎక్కడికెళ్ళాలో తెల్సుకున్నాక ఎక్కండి అని గణేష్ చెప్పి, ఆటో ఎక్కడం, ఆ వ్యక్తి బ్యాక్ సీట్లో కూర్చోవడం జరిగిపోయింది.

 

    ఆటో ముందుకు దూసుకుపోయింది.

 

    పదిహేను నిముషాల తర్వాత ఆటో సిద్ధార్థ లేఅవుట్ జంక్షనులో ఆగింది. ఆ వ్యక్తి ఆటో దిగి గణేష్ కి డబ్బులిచ్చేసి ముందుకెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఇందు తండ్రి వెంకటయ్య.

 

                                           *    *    *

 

    హెడ్ కానిస్టేబుల్ పరిచయం చెయ్యగా సర్కిల్ ఇన్స్ పెక్టర్ గణేష్ వైపు ఎగాదిగా చూశాడు.

 

    "ఆ మైత్రేయ ప్రేయసి, అతని వివరాల  కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసిందా? మీ ఇంట్లో వుందా.... ఆ మైత్రేయ ఎక్కడున్నాడో నీకు నేను చెప్పాలి. ఇంతకీ ఆ అమ్మాయి నీ రిలెటివా?" లాఠీని టకటకలాడిస్తూ అడిగాడు చంద్రప్ప.

 

    "ఛామరాజ్ మొహల్లా జంక్షనులో కిళ్ళీషాపు శ్రీమహాలక్ష్మి లేదండీ దాని తాలూకా వాడేనండీ మనోడు. మనోడు చాలా మంచోడండీ" చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "అయితే మనోడు పిట్టల దొరన్నమాట.... చెప్పావు కావేం" అంటూ గణేష్ వైపు ఎగాదిగా చూసి-

 

    "చూడొరే గణేషూ.... మనం ఒకటి. కొత్తపిట్టను ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చావన్న మాట. అద్సరేగానీ..... సాయంత్రం గెస్ట్ హౌస్ కు దానిని తీసుకురా. దానిక్కావల్సిన ఇన్ఫర్మేషన్ దానికిద్దాం. మనక్కావలసిన ఇన్ఫర్మేషన్ మనం

తీసుకుందాం" హెడ్ కానిస్టేబుల్ కి కన్నుగొడుతూ అన్నాడు సి.ఐ.

 

    "అదికాదు బాబూ....." ఇంకేదో చెప్పబోయాడు గణేష్.

 

    వెంటనే సి.ఐ. పాకెట్లోంచి రెండు వందరూపాయల నోట్లు తీసి హెడ్ కానిస్టేబుల్ కిచ్చి -

 

    "మనోడికి ముందుపార్టీ ఇచ్చి మాట్లాడు.... వెళ్ళిపోండి" అంటూ రెండో రూమ్ లో కెళ్ళిపోయాడు సి.ఐ.

 

                                            *    *    *

 

    గణేష్ ఆటో సోనార్ స్ట్రీట్ దగ్గరున్న వైన్ షాపు ముందాగింది. ఆటోలోంచి దిగిన హెడ్ కానిస్టేబుల్ని చూడగానే వైన్ షాపులోని వ్యక్తి పళ్ళికిలించి-

 

    "రండి గురూగారూ..... చాల్రోజులకొచ్చారు! ఏంటి కత?" అని స్వాగతం పలికాడు.

 

    "కాస్త కడుపుని వెచ్చ చేసుకుందామని వచ్చాం. మందు బిల్లు ఇచ్చేసాంలే..... చికెన్ బిర్యానీ నువ్వు తెప్పించు" షాపు వెనక్కి నడిచాడు హెడ్ కానిస్టేబుల్. అతన్ని అనుసరించాడు గణేష్.

 

    ఇద్దరూ ఎదురెదురుగా వున్న కర్ర బెంచీలమీద కూర్చున్నారు.

 

    మరో అయిదు నిముషాల్లో రెండు గ్లాసులు, సోడాలు, డి.ఎస్.పి. పుల బాటిల్, పకోడీ.... తిదితర సామాగ్రి వచ్చేసింది.

 

    రెండు గ్లాసుల్లో రెండు పెగ్గులు పోసి, సోడా కలిపి, ఒక గ్లాసుని గణేష్ చేతికిచ్చాడు హెడ్ కానిస్టేబుల్. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేవరకూ మౌనంగా వున్నాడు  హెడ్ కానిస్టేబుల్.

 

    రెండో రౌండ్ మొదలైంది.

 

    "చూడు గణేష్! నీ కూతురైతే జాలిపడు.... నా కూతురైతే జాలిపడు. నీ చెల్లెలో, అప్పో అయితే జాలిపడు.... నా చెల్లెలో, అయితే జాలిపడు..... నీ పెళ్ళాము అయితే జాలిపడు..... నా పెళ్ళామైతే జాలిపడు.... అదే రిలేషనని నాతో చెప్పావ్..... మనం ప్రొఫెషన్ లో వున్నవాళ్ళం. అలాంటి రిలేషన్స్ ని, సెంటిమెంట్ తో ముడిపెట్టగూడదు.... ప్రపంచంలో యింత హెల్పింగ్ నేచరుంటే పాడైపోతావురా శిష్యా..... పిల్లకు పద్ధెనిమిదేళ్ళంటున్నావ్.... హాయిగా అనుభవిద్దాం.... ముందు ఇన్ స్పెక్టర్ కి మాంసం ముద్దలా పడేద్దాం.... తర్వాత మనం ఏటంటావ్?" అని తలకెక్కుతున్న మత్తుతో చిన్న హితోపదేశం చేశాడు హెడ్ కానిస్టేబుల్.

 

    రెండో పెగ్ పూర్తయిపోయింది. సోడా కలుపుకోకుండా మూడో పెగ్ వేసుకున్నాడు గణేష్.

 

    "నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవు గురూగారూ! కానీ మా ఆవిడ అదే శ్రీమహాలక్ష్మి...." నసుగుతూ అన్నాడు గణేష్.

 

    "ఒరే పిచ్చిసన్నాసీ! ప్రపంచంలో ఏ ఆడదైన నిజం చెపితే నమ్మదు. నిజం చెపితే మన్ని లవ్వాడదు. మన్దగ్గర పడుకోదు.  ఆడదానికి, అబద్ధం అవకాయలా రుచిస్తుందిరా.... ఒరే పిచ్చిసన్నాసీ కొత్తపిట్టంటే మా గురువుగారికి మోజున్నర మోజు..... నాకు మహా మోజు. గురువు ద్వారా వెయ్యి రూపాయి లిప్పిస్తా..... నేనో అయిదు వందలిస్తా.... కాదనకురా. మీ యావిడతో నువ్వేం చెప్పాలో..... నేను చెపుతానుగా.... నేనూ దగ్గరే వుంటాను కదా... డోన్ట్ వర్రీ...." పద్ధెనిమిదేళ్ళ అమ్మాయిని నగ్నంగా వూహించుకుంటూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

 

    మరో గంటకి పుల బాటిల్తో పాటు, ఇంకో ఆఫ్ బాటిల్ పూర్తయి  పోయాయి. చికెన్  బిర్యానీలు అయ్యాయి.

 

    ఇరవై  నిముషాల తర్వాత-

 

    శ్రీమహాలక్ష్మి ఇంటిమెట్లమీద హెడ్ కానిస్టేబుల్ అగురుమీద స్తంభాని కానుకుని గణేష్ కూర్చున్నాడు.

 

    ద్వారబంధమ్మీద కూర్చుంది శ్రీమహాలక్ష్మి.

 

    "చూడు లక్ష్మిప్పా! బావ గణేష్ వివరాలు సెప్పిన మీదట మా సి.ఐ. దొరతో అన్నీ మాట్లాడినాను. నీకు తెలుసో తెలీదో..... ఆ ఎమ్మెల్యే మర్డర్  కేసుని డీల్ చేస్తున్నది మా సి.ఐ. దొరగానే..... ఈ కేసులో ఆ మైత్రేయ అనే కుర్రాడు ఖూనీకోరో కాదో మా  దొరగారికే బాగా తెలుసు" అని చెప్తుండగా-

 

    అంతవరకూ ఆ మాటలు లోపల గదిలోంచి వింటున్న ఇందు గబుక్కున ద్వారబంధం దగ్గరకొచ్చి-

 

    "మా బావ ఈ మార్దర్ చేయలేదు కదూ..... పోలీసుగారూ...." అని అడిగింది.

 

    గబుక్కున తలెత్తి చూశాడు హెడ్ కానిస్టేబుల్ ఇందువేపు.

 

    అతని నిషా కళ్ళు ఆమె ఎత్తయిన గుండెల మీదున్నాయి.

 

    పల్చటి పూలవనంలో కొచ్చిన పదహారేళ్ళ సీతాకోకచిలుకలా అనిపించింది హెడ్ కానిస్టేబుల్ కళ్ళకు ఇందు.

 

    'ఈ పల్లెటూరి రంభ సి.ఐ. దొరగారికి సింగిల్ బెడ్ మీద, తనకు డబుల్ బెడ్ మీద స్వర్గసుఖాల్ని ఈజీగా అందివ్వగలదు' అని మనసారా అనుకున్నవాడై, ఆమె నడుమును చూసి తనివితీరా ఆనందించాడు.

 

    "మనల్ని నమ్ముకోని వచ్చిన ఆడకూతురు, బావను మనువాడాలని ఇంట్లోంచి సెప్పా సెయ్యకుండా వచ్చేసిన పసిగుడ్డు.... మనం మంచి చేస్తే పదికాలాలు మనం బాగుండాలని దీవిస్తాం. చెడు చేశాననుకో శాపనార్థాలు ఎడతాది.... ఏటంటావ్? ఆ పిల్ల తరుపున నేను చెపుతున్నాను. ఇనుకో. పదో పాతికో ఖర్చయినా ఫర్వాలేదు. ఆ మైత్రేయ బాబు  ఎక్కడున్నాడో మీ పోలీసులకు ఈజీగా తెలుస్తాది. ఆళ్ళిద్దర్ని కలిపి, పుణ్యం కట్టుకో..... అవసరమయితే మీ సి.ఐ. దొరగారి దగ్గరకు నేనూ వస్తాను."

 

    "నువ్వెందుకే శ్రీమహాలక్ష్మప్పా..... చక్రం తిప్పడానికి నేను లేనా. ఆళ్ళిద్దర్నీ ఒకటి సేస్తే నువ్వానందిస్తావ్.... నేనూ ఆనందిస్తాను. మరి మనమో పని సెయ్యాల్సి వుంటుంది" అని ఆగి, సిగరెట్ వెలిగించాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "సెప్పు.... ఏం చెయ్యాలో ....." అంది శ్రీమహాలక్ష్మి.

 

    "ఈ పిల్లని సి.ఐ.గారి దగ్గరకు తీసుకెళ్ళాల! కథంతా ఈ పిల్ల నోటంటే సెప్పిస్తే, మా దొరగారికి కనికరం కలుగుద్ది. మా దొరగారిది మా కనికరం మనసు. టీనేజ్ ఆడపిల్లలకు ఏ కష్టం వచ్చినా, ఆయన భరించలేడు. విస్కీ తాగి మరీ విలవిలా ఏడుస్తాడు" చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.

 

    హెడ్ కానిస్టేబుల్ మాటల్ని  విశ్వసించిన శ్రీమహాలక్ష్మి కొంచెం తోడుంటాను. నీకెందుకు భయ్యం?" అన్నాడు గణేష్.

 

    "నేనెళ్లి సి.ఐ. గారితో అన్ని విషయాలూ మాట్లాడతాను" ముందుకొచ్చి అంది ఇందు.

 

    "అయితే మరెందుకాలస్యం? త్వరగా తయారవు తల్లీ!" అన్నాడు గణేష్.

 

    పదినిముషాల్లో నీటుగా తయారై, మల్లెపువ్వులా బయటికొచ్చింది ఇందు.

 

    గణేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పక్కనే, బ్యాక్ సీట్లో కూర్చుంది ఇందు.

 

    "పిల్ల జాగ్రత్త! పనైపోగానే తీసికొచ్చీ..... అంది గణేష్ తో శ్రీమహాలక్ష్మి.

 

    ఆటో సర్రునముందుకు దూసుకెళ్ళింది. వెళుతున్న ఆటోవేపే చూస్తూ నిల్చుంది శ్రీమహాలక్ష్మి.

 

    అప్పుడు సాయంత్రం అయిదూ నలభై అయిదు నిమిషాలైంది.

 

                                            *    *    *

 

    సిద్ధార్థ లే అవుట్ లో సుథాకర్ భండారీ అడ్రస్ దొరకకపోవడంతో తీవ్రమయిన నిరాశకు గురయ్యాడు ఇందు  తండ్రి వెంకటయ్య. అక్కడివాళ్ళు చెప్పిన మీద సెంటర్ కి వచ్చాడు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్  దిగి వూళ్ళోకి వస్తున్న భండారీకి నడుచుకుంటూ వస్తున్నా వెంకటయ్య కన్పించాడు. ఆకస్మాత్తుగా కనిపించిన వెంకటయ్యను చూసిన భండారీ మొదట ఆశ్చర్యపోయాడు. హోటల్లో వెళ్ళి టీ తాగుతూ వెంకటయ్య చెప్పినదంతా విన్నాడు భండారీ.

 

    "ఇందూ మా ఇంటికి రాలేదు" ఆ మాటకు వెంకటయ్య ముఖం నెత్తురుచుక్క లేనట్లుగా పాలిపోయింది.

 

    "నా పాత అడ్రస్ తెలుసుకొని వచ్చిందంటున్నావు కదా! అక్కడికి వెళదాం పద" అన్నాడు భండారీ.

 

    "అక్కడకో అమ్మాయి వచ్చిందని, నువ్వు వేరే చోట వుంటున్నావని చెప్తే, వెంటనే వెళ్ళిపోయిందని ఆ ఇంటాయన చెప్పాడు" అన్నాడు వెంకటయ్య.

 

    "ఇందూనే వచ్చి, నా ఇంటి అడ్రస్ దొరక్కపొతే, మళ్ళీ వెనక్కి నందిగామ వెళ్ళిపోయిందేమో."

 

    "అది వెంటనే వెనక్కి వచ్చేసే బాపతు కాదు. చాలా పట్టుదల గల మనిషి, మొండిది.... ఎక్కడ తిరుగుతుందో! ఏ బాధలు పడుతుందో!" కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు వెంకటయ్య.

 

    "ఎందుకైనా మంచిది పోలీసుస్టేషన్ లో కంప్లయింట్ ఇద్దాం" అన్నాడు భండారీ ఏవీ తోచని నిస్సహాయస్థితిలో. భండారీ స్కూటర్ ఎక్కాడు వెంకటయ్య.

 

    మరో పావుగంట తర్వాత స్కూటర్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అరగంట తర్వాత స్టేషన్ లోంచి బయటికొచ్చారు ఇద్దరూ.

 

    "కంగారుపడకు. ఇందునందిగామ వెళ్ళిపోయిందని నా అనుమానం. దేవుడి దయవల్ల, నువ్వక్కడకు వెళ్ళేసరికి అడక్కడుంటుందని నా నమ్మకం. ఇక్కడ ఇన్ స్పెక్టర్  అన్నిచోట్లా వెతికించి, రెండు మూడు రోజుల్లో ఏదో విషయం చెప్తానన్నాడు కదా" అని తన స్టూడియో ఆఫీస్ నెంబర్ ఇచ్చాడు భండారీ.

 Previous Page Next Page