Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 17

 

      > ఏ చీరె మీదయినా మీ దృష్టి రెండు సెకన్లు ఎక్కువ నిలబడితే వెంటనే దుకాణందారు "ఇది లేటెస్ట్ డిజైనమ్మా, చాలా ఫాస్టు కలరు. మొన్నే వచ్చింది మార్కెట్ లోకి...." అంటాడు. నమ్మకండి. మీ దృష్టి దానిమీద కొద్దిగా ఎక్కువసేపు ఆగటంతో మీరు దానిపట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారనీ, అటూ ఇటూ వూగుతున్నారనీ అతడు గ్రహించాడు. మిమ్మల్ని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం మీకు నచ్చితేనే తీసుకోండి. అతడి మాటలవల్ల కాదు.
   
    > చీరెలు కొనేటప్పుడు పొడవు వెడల్పు కొలవమని అడగటంలో మొహమాటపడకండి. అలాగే ఫాస్ట్ కలర్ అన్న ముద్ర వున్న చీరెలు బెటరు. అయిదు మీటర్లకన్నా పొడవైన చీరెలు వంటికి అందాన్నిస్తాయి.
   
    > కళ్ళు చెదిరే రంగుల్తో పెద్ద ప్రింటులున్న చీరెల్ని భారీకాయం వున్నవాళ్ళు కట్టుకుంటే మంచి ఎత్తైన ముఖద్వారానికి బరువుగా వేలాగే కర్టెన్లలా వుంటారు. అలాగే, పొట్టివాళ్ళు ఎక్కువ నగలేసుకుంటే భూమిలో సగం వరకూ పాతి పెట్టిన మొక్కజొన్న పొత్తులా వుంటారు.
   
    సరస్వతి వ్రాయటం ఆపి, కాస్త తటపటాయించి, "ఈ చివరిసలహా తీసేద్దాం సార్. కొనుగోలుకీ దానికీ సంబంధంలేదు" అంది. ఆమె అలా చెప్పటంతో అతడు కాస్త ఆలోచించి, తలూపుతూ, "అవును తీసెయ్యండి" అన్నాడు ఆమెవైపు మెచ్చుకోలుగా చూస్తూ "నేను చెప్పానని కాదుకదా" మొహమాటపడుతూ అడిగింది. "కాదు కాదు. మీరు చెప్పింది కరెక్టే మిగతావి వ్రాసుకోండి" అని చెప్పటం ప్రారంభించాడు.
   
    > "గొప్ప తగ్గింపు ధరలు-" అన్న బోర్డు చూసి ఎప్పుడూ మోసపోకండి- అసలు ఎవరైనా ధర ఎందుకు తగ్గించాలి? అని ఒక క్షణం ఆలోచించండి. కేవలం చీరె కంటించిన కాగితంమీద, 'తన కలం' తో వ్రాసిన ధరలోనే తగ్గింపు ఇస్తున్నాడన్న విషయం మర్చిపోకండి. లేకపోతే మిగిలిపోయిన సరుకంతా వదుల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించండి. ఏ విధంగానైనా మీకే నష్టం.
   
    > రవితేజ వారి ధరలలిస్టు దుకాణదారు దగ్గిర ఉచితంగా పొందండి. మీరు కొనే చీరె ధర, దానితో పోల్చి సరిచూసుకోండి. చీరె ధరలను కరెక్టుగా కొనుగోలుదార్లకి చెప్పే సంస్థ- రవితేజ టెక్స్ టైల్స్ ఒకటే. "దట్సాల్" అంటూ పూర్తిచేసి, "ఎలా వుంది?" అని అడిగాడు నవ్వుతూ.
   
    "నాకు తెలియని విషయాలే చాలా వున్నాయి సర్" అంది అలా, అంత తొందరగా పాయింట్ మీద పాయింట్ చెప్పటం ఆమెకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే అతడు 'ఆర్టీ' అయ్యాడు అనుకుంది మనసులో.
   
    "ఇలా ఇవ్వండి. సంతకం పెడతాను. డైరెక్ట్ గా కంపోజింగ్ కి ఇచ్చెయ్యండి-" అన్నాడు చెయ్యి చాచుతూ. ఆమె కాగితం అందిస్తూవుంటే అది జారి బల్లక్రిందకు వెళ్ళింది. ఆమె తియ్యబోతూంటే "నేను తీస్తాను" అంటూ అతడూ వంగాడు.
   
    సరీగ్గా అప్పుడు తలుపు చప్పుడయింది. ఇద్దరూ బల్ల వెనుకనుంచి ఒకేసారి తలెత్తారు.
   
    స్ప్రింగ్ డోర్ దగ్గిర మాధవి నిలబడి వుంది. సరస్వతి కాగితం తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్నంతసేపూ నిప్పులు కక్కే కళ్ళతో ఆమెవైపు చూస్తూ ఆమె బయటకు నడిచిన తరువాత, "ఇందుకే నన్నమాట ఇరవై నాలుగ్గంటలూ ఆఫీసూ ఆఫీసూ అని పడి చచ్చేది" అంది. అతడు విస్తుబోయాడు. కొంచెంసేపు పాటు ఆమె ఏం మాట్లాడుతూ వుందో అర్ధంకాలేదు. అర్ధమయ్యాక, ఇంకేమీ అనలేక "మా.....ధ....వీ" అన్నాడు.
   
    "పిల్లి కళ్ళు మూసుకుని పాలు తహగుతూ ఎవరూ చూడటంలేదనుకుంటుందట" వెటకారంగా అంది. అతడికెప్పుడూ రానంత కోపం వచ్చింది.
   
    "నీకేమైనా మతిపోయిందా? ఆవిడ నాకన్నా పదేళ్ళు పెద్దది-" అన్నాడు ఆవేశాన్ని అణుచుకుంటూ.
   
    "ఆ వయసులోనే బుద్ది వెయ్యి వేషాలు వేసేది. దాన్ని లోపలికి పిలవండి తేలుస్తాను".
   
    "ఏమిటి నువ్వు తేల్చేది అసలు నువ్విక్కడికెందుకొచ్చావు?"
   
    "మీ కృష్ణలీలలు చూద్దామని!"
   
    -దాదాపు ఐదు నిముషాలు ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమీ అర్ధంకాలేదు. అతడు చాలా ఇరిటేటింగ్ గా వున్నాడు. చాలా సున్నితమైన చోట దెబ్బకొట్టిందామె. తన భార్యకి తనమీద ఇంత అపనమ్మకం వుందని అప్పుడే తెలిసిందతడికి. అతడు కాపాడుకుంటూ వచ్చిన విలువలన్నిటినీ ఒక్కమాటతో తోసేసింది. అతడికి మనుష్యుల గురించి బాగా తెలుసు. ఒక మనిషిమీద మరొక మనిషికి వుండే అభిప్రాయం ధర్మాస్ ఫ్లాస్క్ లాటిదని ఏ క్షణమైనా చాలా చిన్న చిన్న సంఘటనలద్వారా కూడా దాని ఆకృతి మారిపోతుందని, అంత ఫ్రెగైల్ అనీ అతడికి తెలుసు. కానీ భార్యాభర్తల మధ్యకూడా అలాటి బంధమే వుంటుందనీ, తమ ఎన్నాళ్ళనుంచో పెంచుకుంటూ వచ్చిన 'కారెక్టర్' ఒక అద్దాలమేడ వంటిదని అతడికి అర్ధమైంది. చిన్నమాట అనే రాయి విసిరి అతడి భార్య ఆ అద్దాల మేడని కుప్పకూల్చేసింది.
   
    మాధవితో అతడి సంబంధం, ఒక సగటు మొగవాడికి కావలసిన శారీరక సంతృప్తిని ఇస్తూనే వచ్చింది. కానీ ఇద్దరూ కాలక్రమేణా మానసికంగా దూరమవటంతో అది ఒక చిన్న అఫైర్ గా మాత్రమే మారింది.
   
    తరువాత అతడు తన వ్యాపకాల్లో నిమగ్నమై ఇక పూర్తిగా ఆ అవసరాన్ని దాదాపు మర్చిపోయాడు. ఆ 'మర్చిపోవటాన్ని' భార్య ఇలా ఊహిస్తుందని అతడు కలలోకూడా అనుకోలేదు.
   
    తనని తాను కంట్రోలు చేసుకుంటూ "వెళ్ళు మాధవీ! ఇది ఆఫీసు, అందరూ వింటారు" అన్నాడు.
   
    "మీ గురించి ఎవరో చెపితే ఏమో అనుకున్నాను. ఇప్పుడు కళ్ళారా చూసి నమ్మాల్సి వస్తోంది".
   
    రవితేజ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
   
    "ఎవరు?" అని అడిగాడు.
   
    ఆమె మాట్లాడలేదు. అతడు అది ఆఫీసు అనికూడా మర్చిపోయి, ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని గద్దిస్తున్నట్టు "ఎవరు?" అని అడిగాడు.
   
    "ఎవరో మీకెందుకు చెప్పాలి? నా శ్రేయోభిలాషి".
   
    రవితేజ గట్టిగా ఏదో అనబోయాడు. అంతలో అద్దాల అవతల్నుంచి నీడలా కదలిక కనిపించింది. అందరికీ తమ మాటలు వినిపించే అవకాశం వుందని, అతడు స్వరం తగ్గించి, "సర్లే-ఇంతకీ ఇప్పుడెందు కొచ్చినట్టు" అన్నాడు.
   
    "కేవలం మీ శృంగారం చూద్దామనే" వెటకారంగా అని తలుపు దగ్గిరకు వెళ్ళి వెనుదిరిగి, "ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఇవాల్టినుంచీ మీరేం చేసినా నాకు తెలిసిపోతూ వుంటుంది" అని, మరి అతడు మాట్లాడటానికి వీల్లేకుండా అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
   
    అతడొక్కడే ఆ రూమ్ లో అలా చాలా సేపు కూర్చుండి పోయాడు-బయట చాలామంది తమ గొడవ విన్నారని, లోపలి రావటానికి అందుకే తటపటాయిస్తున్నారనీ అతడికి తెలుసు.
   
    అతడికిప్పుడు మాధవి మీద కోపం కన్నా, ఆమె మనసులో ఆ విషబీజం నాటిందెవరో తెలుసుకోవాలన్న దుగ్ధ ఎక్కువైంది. ముందే ఒక అభిప్రాయంతో ఆమె ప్రవేశించింది. దానికి తగ్గట్టుగా ఈ దృశ్యాన్ని చూసేసరికి బి.పి. పేషెంటైన ఆమె సహజంగానే రెచ్చిపోయింది. బహుశ ఆ స్థితిలో వున్న ఏ ఆడదైనా అలాగే చేస్తుందేమో తను అంత గట్టిగా అరవకుండా వుండవల్సింది.
   
    రవితేజ కుర్చీలోంచి లేవబోతూవుంటే సరస్వతి లోపలికి వచ్చింది. ఆమె మొహం పాలిపోయి వుంది. వాళ్ళ మాటలు ఆమె విన్నదని ఆమె మొహమే చెపుతూంది.
   
    అతడు చెప్పిన మాటలు కంపోజు చేయించి తీసుకొచ్చింది. అతడు దాన్ని చూసి ఆమె కిచ్చేసి, ఆమె వెళ్ళబోతూ వుంటే, "సరస్వతిగారూ" అన్నాడు. ఆమె ఆగింది.
   
    "ఐ యామ్ సారీ!"
   
    ఆమె తల వంచుకుని "నేనూ ఆ మాటే చెపుదామనుకున్నాను సార్" అని అక్కన్నించి వెళ్ళిపోయింది.
   
    అతడు కిటికీ దగ్గిర నిలబడ్డాడు. సాయంత్రం అయిదున్నర అయింది. ఒకరొక్కరే ఆఫీసునుంచి బయటపడటం పై అంతస్థునుంచి స్పష్టంగా కనిపిస్తూంది. బ్యాగ్ తీసుకుని సరస్వతి బస్ స్టాప్ వైపు నడుస్తూంది. ఆమె చెవుల దగ్గిర తెల్లజుట్టు మీద సూర్యరశ్మి మెరుస్తూంది. ఈమెకీ తనకీ మధ్య తన భార్య సంబంధం అంటకట్టిందని అనుకుంటేనే చిత్రంగా వుంది.
   
    సాయంత్రం అవటంతో రోడ్డులు చాలా రద్దీగా వుంటాయి. కానీ అతడి కార్యాలయం పక్కగా వుండటంవల్ల, రష్ లేదు.
   
    సరస్వతి రోడ్డు క్రాస్ చేస్తోంది.
   
    అతడు చూస్తూ వుండగానే, మలుపులోంచి ఒక కారు వేగంగా వచ్చింది. అతడి మనసేదో కీడు శంకించింది. కారు డ్రైవరు బ్రేకు వేయలేకపోయాడు. ఆ శబ్దానికి సరస్వతి వెనుదిరిగి చూసింది. కానీ అప్పటికే ఆలస్యం అవటం ఆమె కెవ్వున అరవటం, కారు ఆమెను గుద్దుకోవటం ఒక్కసారిగా జరిగిపోయాయి.
   
    అతడు చేష్టలుడిగి నిలబడ్డాడు.
   
    కారు ఆగకుండా వెళ్ళిపోయింది. ఆమె చుట్టూ జనం మూగుతున్నారు అతడు అప్పుడే స్పృహలోకి వచ్చినవాడిలా కోలుకుని క్రిందికి పరుగెత్తాడు.
   
                             *    *    *

 Previous Page Next Page