దాదాపు గంట తరువాత డాక్టర్లు ఆమెకేం ప్రమాదం లేదని, ప్రాక్చరైన కాలి ఎముక అతుక్కోవటానికి మాత్రం రెండు నెలలు పడుతుందని చెప్పాక, అతడు తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. ఆ రెండు నెలల ఖర్చూ కంపెనీకే వ్రాయమని అతడు అకౌంటెంట్ తో చెప్పాడు.
ఈ లోపులో ఆమె భర్తకూడా వచ్చాడు. అతడికి ధైర్యం చెప్పి రవి ఇంటికి బయల్దేరాడు.
ఆ రోజు జరిగిన సంఘటనలతో అతడు చాలా అలసిపోయాడు. ఇంకేమీ ఆలోచించకుండా స్నానంచేసి నిద్రపోయాడు. మాధవి ఇంట్లో లేదు.
సరిగ్గా ఆ సమయానికి ఒక ఎయిర్ కండిషన్డ్ గదిలో-చిన్న రూమ్ లో ఒక వ్యక్తి తన ముందున్న కాగితంమీద "ఒకటి" అని వ్రాసివున్న దానిని కలంతో కొట్టేశాడు- ఒక పని పూర్తయినట్టు.
9
నాలుగు రోజులు గడిచాయి. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం పేరుకుంది. ఇద్దర్లో ఎవరూ మాట్లాడటానికి ప్రయత్నించటం లేదు. ఆమె చేసిన ఈ కొత్త ఆరోపణతో అతడి మనసు ఒక రకంగా విరిగిపోయింది. రవితేజ మార్కెట్ లో విడుదల చేసిన పుస్తకం అనుకున్న ఫలితాన్ని తెచ్చిపెట్టలేదు. కస్టమర్లు షాపులు...రెండువైపుల్నుంచీ రిజల్ట్సు నిరాశాజనకంగానే వున్నాయి. చాలామంది కస్టమర్లు "ఇందులో మాకు తెలియని పాయింట్లేమున్నాయి? అంతా మాకు తెలిసిందే కదా" అన్నారు ఆ పుస్తకాన్ని చూసి.
ఇంకొకవైపు చీరెల ధరలు కంపెనీయే ప్రకటించటం- షాపు వాళ్ళు గాఢంగా వ్యతిరేకించారు. చాలా చీరలు సంవత్సరాల తరబడీ షాపుల్లో చాలా సందర్భాల్లో వుంచాలి. స్టాక్ టేకింగ్ సమయంలో వాటి ధర పెంచాలి.....అంతా మాకు తెలిసిందే కదా అన్న కస్టమర్ల విషయమై రవితేజ అంచనా తప్పయింది. నిజానికి వారిలో చాలామంది స్త్రీలకి చీరల గురించి అసలేమీ తెలీదు.
ఎప్పుడూ విమల్ చీరలుకట్టే వాళ్ళకే విమల్ పాలియెస్టర్ చీరల్లో డివైన్, జోవెల్ సిల్కీ, హాట్రిక్, మోనలిసా, శుభలక్ష్మి, లాపర్షియన్ - ఇన్ని రకాలు కేవలం టిష్యూల్లోనే వున్నాయనీ, ఇక క్రేప్ సంగతి తీసుకుంటే మళ్ళీ అందులో, స్వీట్ మెమొరీస్-రాయల్ పాలెస్, క్రిస్టల్ సిల్క్ లున్నాయనీ ఇవిగాక మళ్ళీ జార్జెట్, షిఫాన్ వున్నాయనీ తెలీదు. షాపుకెళ్ళి "గార్డెన్ చీరలు చూపించండి" అంటారు. చైనా సిల్కో, గార్డెన్ టిష్యూనో చెప్పరు. అలాగే 'ఖటావ్' లో అంబర్- మోరికా- ఇంటిమేట్-చందేరీ-కంచన్ లలో ఏది కావాలో చెప్పలేదు. వాళ్ళ ఇంటిపక్కవాళ్ళో లేక స్నేహితులో చెప్పిన ధరకంటే ఇది కొంచం ఎక్కువ వెల వుంటే షాపువాళ్ళని అనుమానిస్తారు.
సేల్సు మెన్ కూడా ఈ రకాల్లో వున్న సున్నితమైన తేడాని వీళ్ళకి తెలియజెప్పటానికి ప్రయత్నించరు. గార్డెన్ అనగానే ఒక న్యూచైనా, పి.జి.చైనా, ఒక సెల్ఫ్ డిజైన్ చూపిస్తారు. అందులో ముచ్చటపడినదానిలో మిగతావి వరుసగా చూపించటం మొదలు పెడతారు. ఈ విషయం తెలియని ఆడవాళ్ళు ఒకేరకం (గా కనిపించిన) చీరె, తన స్నేహితులు కొన్న చీరెకంటే ఒక 5 రూపాయలు ఎక్కువ ధర వున్నా అది అవమానకరంగా భావిస్తారు. "వాడెవడో నీకు బాగా టోపీ వేశాడు. ఇదే చీరె నేను సన్యాసి వస్త్రాలయంలో తక్కువకి కొన్నాను" అని పక్కవాళ్ళు కూడా ఎక్కిరిస్తారు.
ఇన్ని రకాల చీరెల్లో దేని ధర ఏదో కస్టమర్లు గుర్తించటం అసాధ్యమైన పని అని తెలుసుకోవడంలో రవి తప్పటడుగు వేశాడు.
ఏదో ఒక కొత్తదనాన్ని ఆశించి, లేదా కొత్త మార్పు ప్రవేశపెడదామనుకున్నప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు. వ్యాపారంలో ఇదంతా మామూలే అయితే ఇంతకన్నా పెద్ద ప్రమాదం- అనుకోని కోణంలోంచి వచ్చిపడింది.
ఆ రోజు అతడు ఆఫీసుకు వచ్చి కూర్చున్న రెండు నిముషాలకి ఇంటర్ కమ్ లో పిలుపొచ్చింది. "నీ కోసం అరగంటనుంచీ ప్రయత్నిస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే బయల్దేరావన్నారు. అర్జెంటుగా నా గదికి రా". రవితేజ హడావుడిగా వెళ్ళాడు. శర్మతో పాటు, ఒక మధ్యవయస్కుడు కూర్చుని వున్నాడు.
"ఈయన ఎల్.సి.రావు. సెంట్రల్ ఇంటెలిజెన్సు నుంచి-"రవికి అర్ధంకాలేదు.
సి.ఐ.డి. వాళ్ళకి తమతో ఏం పనుందా అనుకున్నాడు.
ఈ లోపులో రావు-"మిస్టర్ రవితేజా! ఈ చీరెలు మీ ఫ్యాక్టరీ నుంచి తయారైనవేనా" అంటూ ఒక ప్యాకెట్ అతడి ముందుకు తోశాడు. రవి ఆ ప్యాకెట్ లోనుంచి బయటకు కనబడుతున్న చీరల వైపొకసారి చూసి, "మావే-" అన్నాడు.
"ఒకసారి పరిశీలనగా చూడండి".
"అక్కర్లేదు. మా కంపెనీనుంచి తయారైన చీరల్ని ఎక్కడున్నా గుర్తుపట్టగలను" ప్యాకెట్ విప్పకుండానే చీరలవైపు చూస్తూ అన్నాడు. శర్మ చూపుల్లో అందిస్తూన్న సందేశాల్నిగానీ, శర్మమొహంలో అలజడిని గానీ అతడు గమనించలేదు.
"మళ్ళీ ఇంకొక్కసారి చెప్పండి- కావాలంటే విప్పిచూసి".
"అక్కర్లేదు".
"మీ చీరెలు ఏ యే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు?"
"పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా-" రవి తేలిగ్గా అన్నాడు. "అన్నిటికీ మాకు లైసెన్సులున్నాయి".
అతడి మాటలు పూర్తికాకముందే రావు ప్యాకెట్ విప్పి అందులోంచి చీరెను నిలువుగా పట్టుకున్నాడు.
చీర డిజైన్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
గీతాలు- వలయాలు- బోర్డరు.....
రవికి షాక్ తగిలినట్టయింది.
ఆ చీర తమ తయారీయే. డిజైన్ మాత్రం తమది కాదు.
రవితేజా టెక్స్ టైల్స్ వారు వాడే సిల్క్- వారు వాడే పాలియెస్టర్- వారు వాడే బోర్డరు- అంతా అదే.... కానీ లోపల డిజైన్ మాత్రం వేరే....
అందుకే అతడు బైటనుంచి చూసి గుర్తుపట్టలేకపోయాడు.
"ఏ.....ఏమిటవి?" అని అడిగాడు.
"చాలా తెలివిగా దేశ రహస్యాల్ని విదేశాలకు పంపుతున్నారు. చీర మీద డిజైన్ గ వేస్తే మూడోకంటికి అనుమానం రాదు. ఈ తెలివితేటలకు నా జోహార్లు".
"నాన్సెన్స్" అనుకున్నాడు మనసులో కోపాన్నీ, ఉద్వేగాన్నీ అణచుకుంటూ "ఎక్కడ దొరికాయి మీకీ చీరెలు?" అని అడిగాడు.
"షిప్ లో పాకిస్తాన్ వెళ్తూన్న కన్ సైన్ మెంట్ లో" అన్నాడు.
అని, రవితేజ చీరలవైపు పరీక్షగా చూడటం గమనించి అతడు కొనసాగించాడు- "ఇది ఆవడి ఫ్యాక్టరీ డిజైను. ఇది దిండిగల్ ఏరియా. ఇది శ్రీహరికోట వివరాలు చెప్పే డిజైను...."
రవితేజ మనసులోనే శత్రువుని అభినందించాడు. కేవలం తమని ఇరికించటానికే ఈ ప్లాను వేస్తే సరే, లేకపోయినా కూడా ఈ ప్లాను గొప్పది. చీరెలమీద డిజైన్లు వేసి శత్రుదేశాలకి పంపటం...
శర్మ, రవి మొహాలు చూసుకున్నారు.
"ఇప్పుడేం చేస్తారు?"
"మిమ్మల్నీ, ఈ సంస్థ చైర్మన్ నీ, మిగతా డైరెక్టర్లునీ అరెస్టు చేయటానికి వారెంట్లు తెచ్చాను మిస్టర్ రవితేజ!"
"మేమూ మా లాయర్ని సంప్రదించవచ్చా?"
"దేశరక్షణకి సంబంధించిన విషయాల్లో లాయర్లు ఏమైనా చేస్తారని నేను అనుకోను-"
"బెయిల్?"
"ఆ విషయమైతే మీరు నిరభ్యంతరంగా మీ లాయర్లని సంప్రదించవచ్చు-"
"ఈ చీరెలు మావే. కానీ డిజైన్లు మావి కావు. సాదాచీరెలు కొనుక్కుని వాటిమీద ఈ డిజైన్లు ఎవరయినా వేయించి వుండవచ్చు. అక్కడ పాకిస్తాన్ కి ఈ కన్ సైన్ మెంటు చేరుకోగానే వాళ్ళ ఏజెంట్లు వీటిని తీసుకునే ఏర్పాట్లు చేసుకుని వుండవచ్చు. మీరు ఈ చీరెల్ని రసాయనిక పరీక్ష కిచ్చినా, "డిజైన్, ఇంక్" మేము వాడేది కాదని అర్ధమవుతుంది ఇదంతా ఒక విధంగా ఆలోచిస్తే! మరోరకంగా ఆలోచిస్తే అసలీ ఉత్తుత్తి ప్లాన్ లు మమ్మల్ని ఇరికించటానికి అయివుండవచ్చు".
"అలాటి ప్రత్యర్ధులు మీ కెవరైనా వున్నారా?"
"చెంచురామయ్య అండ్ కో".
"మీ రవి అన్నట్టు ఈ డిజైన్లు మీ ఫ్యాక్టరీలో ముద్రించబడి వుండకపోవచ్చు. ఇంకులు కూడా తేడా వుండవచ్చు. కానీ అదంతా ఎంక్వయిరీలో తరువాత తేలుతుంది".
"ఆ తరువాతే మమ్మల్ని అరెస్టు చెయ్యాలి మీరు" శర్మ అన్నాడు. ఆయనకప్పుడే బి.పి. పెరుగుతూంది.
ఎల్.సి. రావు నవ్వాడు. "ఎంక్వయిరీ అయిపోయాక ఇక అరెస్టు లెందుకు? మీరు మా ఎంక్వయిరీలో అడ్డుపడకుండా వుండటం కోసమే కదా అరెస్టు చేసేది". అతడు చెప్పేది నిజమే! ఈ వాదనలన్నీ ఇక అనవసరం. రవితేజ వీళ్ళ మాటలు వినటంలేదు. ఆలోచిస్తున్నాడు. రేప్రొద్దున్నే ఈ వార్త పెద్ద అక్షరాలతో పేపర్లో వస్తుంది. దేశంలో అత్యుత్తమ వస్తోత్పత్తి సంస్థ డైరెక్టర్లు దేశ ద్రోహం క్రింద అరెస్టు అని పడుతుంది. ఎల్లుండి బెయిల్ మీద వదిలిపెట్టబడ్డారని వస్తుంది.