రవికి ఇదంతా ఎంతో అపురూపంగా తోచింది. వీడ్కోలు సంగతి సరే. ఆగమనం కూడా అంతే. రాగానే సూట్కేసు విప్పి చూడాలన్న ఆత్రతే ఎక్కువ. ఒక్కోసారి కాంప్ నుంచి తిరిగి రావటం నాల్గాయిదురోజులు ఆలస్యం అవుతూ వుంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే "ఇంకో నాలుగు రోజులు అక్కడే ఉండలేక పోయారా? ఇంటికన్నా గుడి పదిలం అని..." అని మొదలు పెడుతుంది- వచ్చిన సంతోషం అంతా పోతుంది. పోనీ ఈ విసుగంతా, నాల్రోజులు ఎక్కువైన వంటరితనంవల్ల వచ్చినదైతే, అలా నిష్టూరంగా, అసహ్యం కలిగేలా చెప్పటంకన్నా మామూలు భాషలో చెప్పొచ్చుగా! భాషలో చెప్పలేకపోతే స్పర్సతో- లేదా కనుచూపులతో.
"నేనక్కడేం ఆడుకోవటానికి వెళ్ళలేదు మాధవీ. పని వుండే వుండిపోయాను" అనాలనిపిస్తుంది. అనడు అంటే తిరిగి, "పని- పని- ఎవడు పెట్టుకొమ్మన్నాడు అంత పని?" అంటుంది. మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది సంభాషణ. అందుకే మాటలు అనవసరం.
తను గొప్పవాడు మెకెన్రో, పికాసో, బలరాజ్ సాహ్నీ అంత గొప్పవాడు కాకపోయినా తన రంగంలో గొప్పవాడు! తాగి వచ్చి భార్యని చావబాదేవాడు, మామని స్కూటరిమ్మని వేధించేవాడు, పేకాట్లో జీతమంతా పోగొట్టుకునేవాడూ, లంచాలు పట్టి సంపాదించేవాడు. కొడుకుల్ని చావబాదేవాడు, ప్రొద్దస్తమానం పేపరు చదువుతూ పక్కమీద పడుకునేవాడు- వీళ్ళందరి కన్నా తన దృష్టిలో తను గొప్పవాడు.
తన భార్య దృష్టిలో కాదు! నెలకొకటో- లేక కనీసం ఆర్నెల్లకొకటో కొత్తచీర తీసుకొచ్చి భార్యతో ఆనందం పంచుకునేవాడు. సరదాగా నెలకొక సినిమాకైనా తీసుకెళ్ళేవాడు, కొడుకుల చదువు గురించి పట్టించుకునేవాడు, పక్కింటావిడ మొగుడులా ఇంటిపట్టున వుండేవాడు, భార్యకి కాస్త తలనొప్పి వస్తే ఎంతో హడావుడి చేసేవాడు- వీళ్ళందరికన్నా ఆవిడ దృష్టిలో తను అధముడు. చివరికి తేలినదేమంటే ఈ రెండూ ఎక్కడా కలవవు.
ఈ ప్రపంచంలో పది రైళ్ళు ఒకేసారి పరుగెడ్తే బ్రిడ్జినైనా వెల్డింగ్ చేసే పరికరం వుందేమోగానీ, అతకని రెండు మనసుల్ని అతికే ఆయుధం లేదు.
* * *
బయటా వర్షం తగ్గింది. అతడొచ్చి పక్కమీద పడుకుని ఆలోచిస్తున్నాడు. నెమ్మదిగా తెల్లవారుతూంది.
సరిగ్గా ఆ సమయానికి, వర్షం వెలుస్తున్న తొలి ఉషన్సులో కూర్చుని ఒకామె పదిహేను సంవత్సారాల క్రితం తను ముద్దుపెట్టుకున్న ఒక కుర్రవాడికి ఒక సుదీర్ఘమైన ఉత్తరం వ్రాస్తూంది.
పది సంవత్సరాల్నుంచీ అతడి అభివృద్ధిని దినదినం చూస్తూ- తన ఉనికి విషయం ఇన్నాళ్ళూ చెప్పకుండా కంట్రోలు చేసుకుంటూ, మరి చేసుకోలేక.... తను ఎవరో, అతడిని మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకుందో, ఇదంతా ఎంత చిత్రంగా జరిగిందో వ్రాస్తూంది. ప్రత్యూషపు వెలుగులో మోకాళ్ళమీద ముగ్ధగా కూర్చుని ఆమె వ్రాస్తూన్న ఆ ఉత్తరం-
-అతడి భవిష్యత్ జీవితపు తెల్లచీరె మీద, విధి నల్లంచు నేతకి ఆయత్తమవుతూందని ఆ క్షణం వారిద్దరికీ తెలీదు.
8
షాపుల్లో కొనే ఒక చీర వెనుక చాలా చరిత్ర వుంటుంది. ఖర్చులన్నీ కలపటం వల్లనే నూట ఇరవై రూపాయల చీర మూడొందలు అమ్ముతుంది. చీర బేరం చేసే వాళ్ళకి తెలీదు- పది చీరలు తీయిస్తే, వాటిని తిరిగి మడతబెట్టి లోపల పెట్టటం వల్ల జరిగే రాపిడికి రెండు శాతం చీరలు డెడ్ స్టాక్ అవుతాయని ఆ ఖరీదు కూడా తాము కొనే చీర ధరలోకే వచ్చి చేరుతుంది నాయి. పట్టుచీర కొనేవారికి తెలీదు తాము ఉచితంగా తాగే కూల్ డ్రింక్ ఖరీదుకి పదిరెట్లు తాము చెల్లించే ధరకి కలపబడిందనీ, కేవలం చీరమీద అంటించిన కాగితం ముక్కమీద వున్న ధర, FIXED PRICES అని వ్రాసి వున్న బోర్డు చూసి తాము మోసపోతున్నామనీ, ఆ ధర ఫ్యాక్టరీ నుంచి వచ్చింది కాదని, ఆ క్రితం రాత్రి సేల్స్ మెన్ అయినా వేసి వుండవచ్చని....
-ఇలా ఆలోచిస్తూ వుండగా రవితేజకి ఒక ఆలోచన స్ఫురించింది. ఈ విషయాలన్నీ తామే ఎందుకు కస్టమర్లకు చెప్పకూడదు. శర్మగారితో పరిచయం కాకముందు అన్నాడు- "....ముంద్యు కస్టమర్ మనమీద నమ్మకం పెంచుకోవాలి" అని.
ఇప్పుడు అదే ఎందుకు ఉపయోగించుకోకూడదు? మంచి ఆలోచన.
ఆ ఆలోచన వచ్చాక అతడు ఆగలేదు. సెక్రటరీని పిలిచాడు. ఆమె పేరు సరస్వతి. ముఫ్ఫై ఏడేళ్ళుంటాయి. మంచిది తెలివైనది. "కూర్చోండి" అన్నాడు.
కూర్చుంది.
"చాలాకాలం క్రితం, ఈ కంపెనీలోకి రాకముందు, శర్మగారితో మొదటి పరిచయంలో నేనేం మాట్లాడానో తెలుసా?"
అతడు కూర్చోపెట్టి అకస్మాత్తుగా ఇలా అడిగేసరికి ఆమెకేమీ అర్ధంకాలేదు. రవితేజ నవ్వేడు.
"షోకేసులో వున్న చీర ఎప్పుడూ కొనకండి. ఫేడ్ అయిపోయి వుంటుంది. అలాటిదే ఇంకొకటి లోపల్నుంచి తీసుకోండి అని!" నవ్వి అన్నాడు-"ఇలాంటి సలహాలే మనం ఎందుకు మనవైపునుంచి కస్టమర్లకు ఇవ్వకూడదు?"
ఆమె దిగ్ర్బాంతితో చూసింది. రవితేజ చెప్పుకుపోతున్నాడు. "ప్రతీచీరకీ మనం ఒక ధర ఫిక్సు చేస్తాం. మన రిటైలర్స్ ఆ ధరకే దాన్ని అమ్ముతూ వుండవచ్చు. కానీ ఇప్పట్నుంచి ఆ పట్టికని కొనేవాళ్ళకి మనమే డైరెక్టుగా అందజేస్తాం. లోకల్ టాక్సేస్ ఎకస్ట్రా అన్నది ఎలాగూ వుంటుంది. చీరల్లో ఎవరూ ఇంతవరకూ యిలా చేయలేదు కాబట్టి, కొనుగోలుదార్లకీ విశ్వాసం ఏర్పడుతుంది. వ్యాపారంలో మొదటి మెట్టు విశ్వాసం...." అతడు చేతిలోని కాగితాలు ఆమెకి అందించాడు. "మొన్న ఉపన్యాసంలో నేను కస్టమర్లకి యిచ్చే ఉచిత బహుమతుల గురించి తయారు చేసిన స్కీమ్స్ ఇవి! అలాగే మేకప్ అందాల గురించి, ఏ యే చీరె ఎవరికీ నప్పుతుంది అన్న విషయాల గురించి చిన్న పుస్తకం కూడా ఉచితంగా ఇద్దామనుకున్నాం గుర్తుంది కదా! ఆ పుస్తకంలో- ఆ సలహాలు కూడా చేరుద్దాం. వాటిని వ్రాసి పట్టుకురండి. మీరు కస్టమర్లయితే ఏ యే జాగ్రత్తలు తీసుకోవాలి అనేది".
ఆమె కిప్పుడు అర్ధమైంది నవ్వి, ఆ కాగితాలు తీసుకువెళ్ళి అరగంట తరువాత తయారుచేయించి తీసుకువచ్చింది. అతడు చదువుతూ వుంటే, తను వ్రాసింది తన యజమానికి నచ్చిందోలేదో అని ఆత్రంగా అతడివైపే చూస్తూవుంది. అతడు చదవటం ప్రారంభించాడు. ఆమె అన్నీ పాయింట్లుగా వ్రాసింది.
1. A Womam Express her self in many ways. ప్రపంచంలో అన్ని రకాల దుస్తుల్లోనూ చీరకి ఒక ప్రత్యేకత వుంది. విదేశీ దుస్తులతో పోలిస్తే ఇన్ని గజాల గుడ్డని శరీరానికి చుట్టబెట్టడం వృధా అనిపించవచ్చు. కానీ ఇప్పుడది విదేశీయుల్ని కూడా బాగా ఆకర్షిస్తోంది. బహుశ ఆ రోజుల్లో పత్తిపంట పుష్కలంగా పండే దేశం కాబట్టి ఈ అలవాటు వచ్చి వుండవచ్చు.
2. కొంగు పొడవుగా తీసి భుజాలచుట్టూ వేసుకోవటం, కొప్పు పెట్టుకోవటం ముసలమ్మ ఫాషన్ గా ఒకప్పుడు భావించబడేది. జయబాధురీ ఈ విధంగా ఒక సినిమాలో తయారవ్వగానే, కాలేజీ అమ్మాయిలందరూ అలా అలంకరించుకుని, ఉన్నట్టుండి నమ్రత, గౌరవప్రదమైన ఒద్దిక తెచ్చేసుకున్నారు. కాబట్టి ఫాషన్ కి హద్దులు లేవు.
3. తమిళనాడు అమ్మాయిలు చీరె కొంగుని నడుముచుట్టు తిప్పి ముందువైపు అంచంతా క్రిందికి పరుచుకునేలా దోపుతారు. ఈ రకమైణ కట్టులో ఒక అందం వుంటుంది. చీరె మొత్తంలో పైట చెరుగుకి ఒక ప్రాధాన్యత వుంటుంది. దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ వుంటారు.
4. బాగా గంజిపెట్టిన చీరెలయితే చూడముచ్చటగా వుండేమాట నిజమేగానీ, రోజువారీ పనికి, ముఖ్యంగా ఆఫీసుల్లో.... ఇస్త్రీ అవసరంలేదని 'వాష్ అండ్ వేర్' చీరలయితే ఎక్కువ శ్రమ వుండదు. అలాగే తెల్లటి చీరెలు తప్ప మిగతావి నీడపట్టున ఆరెయ్యటం మంచిది.
అతడు సంతృప్తి చెందలేదు. మిగతాది చదవకుండానే తలెత్తి "ఇదంతా బాగానే వుంది. కానీ, నేను చెప్పింది మీరు సరిగ్గా అర్ధంచేసుకో లేదనుకుంటాను. మన బుక్-లెట్ లో ఈ వివరాలన్నీ మొదటి చాప్టర్ లో ఎలాగూ వస్తాయి. షాపుల్లో కస్టమర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్రాయమన్నాను. పోన్లెండి నేను చెపుతాను వ్రాసుకోండి" అంటూ డిక్టేషన్ మొదలు పెట్టాడు. ఆమె వ్రాసుకుంటూంది.
> ఏ చీరయినా మీకు నచ్చితే దాన్ని వెంటనే కొనెయ్యాలన్న ఆతృతని దుకాణదారుని ముందు ప్రదర్శించకండి.