"సెకండరీస్ డెవలప్ అవుతాయి. అంటే కేన్సర్ శరీరంలోని మిగతా భాగాల్లోకి ఎగబ్రాకుతుందన్నమాట. అదే బ్రెయిన్ లోకి పోవచ్చు ఊపిరి తిత్తుల్లోకి పోవచ్చు. ఇంకా ఏ ఇతర భాగంలోకైనా పోవచ్చు అలా జరిగాక.... కొన్నాళ్ళకు మరణం సంభవిస్తుంది."
"మరి ఎలా?"
"ఆ కన్ను తీసివేయక తప్పదు."
"రెండోకన్ను ఆరోగ్యంగానే వుంటుందా?"
"రెటినో బ్లాస్టోమా బైలేటరల్ యూనీలేటరల్ గానూ వుంటుంది. ఈ పాప విషయంలో యూనీలేటరల్ గా వుంది. అంటే ఒక్కకంటికే పరిమితమై వుంది. రెండోకన్ను ఎఫెక్ట్ రాలేదు కాబట్టి-అది ఆరోగ్యంగానే వుండటానికి అవకాశం ముంది."
"ఆపరేషన్ ఎప్పుడు చెయ్యాలి?"
"సాధ్యమైనంత తొందరలో చెయ్యాలి."
ప్రదీప్ లేచి నిలబడ్డాడు. "థాంక్యూ" మళ్ళీ రెండు మూడురోజుల్లోనే మిమ్మల్ని కలుస్తాను."
బయటకు వచ్చేశాడు.
8
విషయం తెలిసి హనుమంతరావుగారు గగ్గోలు పడిపోయాడు.
"నో! అలా జరగడానికి వీల్లేదు" అన్నాడు ఆక్రోసిస్తున్నట్టుగా.
అరుణ, సునీత కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా నిలబడ్డారు.
రాధ లోపలగదిలో పడుకుని వుంది. ఆమెకీ విషయమేమీ తెలియదు.
"తప్పదు" అన్నాడు ప్రదీప్.
కాసేపటికి హనుమంతరావుగారు సమాధానపడ్డారు.
కాని....కొంచెం ఆలోచించి "ఎంతవుతుంది?" అన్నాడు.
"షుమారు -పదివేలవుతుంది."
ఆయనముఖం నెత్తురుచుక్కలేనట్టుగా పాలిపోయింది. "నాకంత శక్తిలేదు నేను భరించలేను" అన్నాడు గొణుగుతున్నట్లుగా.
ఒక్కనిముషం నిశ్శబ్దంగా దొర్లింది.
సూపర్ స్పెషలిస్టులు సామాన్య మానవులకు అందుబాటులో వుండరు.
అధునాతన సౌకర్యాలుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కొన్ని వేలు ఖర్చుపెట్టగల స్థోమతు వున్నవారికే. వాటిలోకి అడుగుపెట్టటానికి కూడా యితరులకి చోటులేదు.
గవర్నమెంట్ హాస్పిటల్స్?
ఎన్నో పొరల్ని ఛేదించుకుపోవాలి.
"నేనిస్తాను" అన్నాడు ప్రదీప్.
"మీరా?" అన్నాడు హనుమంతరావు ఆశ్చర్యంగా.
"ఎందుకు? ఎందుకు మీరింత శ్రమ తీసుకుంటున్నారు మావంటి సామాన్యులకోసం? ఎందుకూ పనికిరాని దౌర్భాగ్యుడ్ని. కన్నకూతురికి జబ్బుచేస్తే స్పెషలిస్టుకు కూడా చూపించలేని అసమర్ధుడ్ని..... మీకేమీ ప్రతిఫలం ఇవ్వలేని అప్రయోజకుడ్ని....మీ ఔదార్యానికి చేతులు జోడించడంకన్నా..." గొంతు గాద్గదికమై తడబడిపోయింది.
కళ్ళవెంట బొటబొట నీళ్ళు కారుతూండగా...చేతులెత్తి నమస్కరించాడు.
ఆ చేతుల్ని పట్టుకుని మృదువుగా క్రిందకు దించుతూ "నో.....పెద్దవారు మీరలా అనకూడదు" అన్నాడు.
అతన్లో మానవత్వపు విలువలు పురులు విప్పి, శిఖరాగ్రాలకు ఎగసి పోతున్నాయి.
* * *
"అంకుల్! నాకు ఆపరేషన్ చేస్తారా?" అనడిగింది రాధ దీనంగా.
"చాలా చిన్న ఆపరేషనమ్మా! అసలు భయమేమీ వుండదు" అన్నాడు ప్రదీప్ ధైర్యం చెబుతూ.
"ఆపరేషన్ చేసుకుంటే, తిరిగి నాకు చూపు వొచ్చేస్తుందా?"
"తప్పకుండా వస్తుంది. నువ్వు త్వరగా పరీక్షలకు చదవగలుగుతావు. పరీక్షలకు వెడతావు. ఫస్ట్ క్లాసులో పాసవుతావు."
రాధ కృశించిపోయివున్న ముఖంలో ఆశారేఖలు.
"నిజంగానా అంకుల్?"
"నిజంగానమ్మా"
"అయితే వెంటనే చేయించండి అంకుల్! ఆపరేషనంటే నాకేం భయం లేదు."
"నువ్వు చాలా దైర్యవంతురాలివమ్మా నీకు ఆపరేషన్ రెండు మూడు రోజుల్లోనే చేయించేస్తాను."
ఆమె బుగ్గమీద చిటికవేసి ప్రదీప్ యింటికి బయల్దేరాడు.
* * *
"అంకుల్ ఒక్కమాట" అతను కారులోకి ఎక్కబోతుండగా ప్రక్కనుండి అరుణ పిల్చింది.
"ఏమిటి అరుణా?"
"రాధకి..."
"ఏమిటి చెప్పు..."
"ఆపరేషన్ చేస్తే ప్రాణాపాయం వుండదా?"
"తొందర్లో చేయించేస్తే వుండదు."
"కాని ఆ కన్ను..." ఆమె రుద్దకంఠంతో అని తలవంచుకుంది.
"ఇహ వుండదు."
"దాని అందమంతా నశించి... అక్కడ అసహ్యంగా...."
తల్చుకుంటే అతనికి కూడా భయంగావుండి మనసు వికలమైపోయింది.
"కొన్నాళ్ళకు అక్కడ ఆర్టిఫిషియల్ ఐ అమరుస్తారు. ఆ కంటితో చూడటానికి ఏమీ వుండకపోయినా యితరులు చూడటానికి అక్కడ కన్ను ఆకారం వుంటుంది."
"అయ్యో! ఎలా భరించేదండీ. హృదయాన్ని తొలిచేసే యీ దృశ్యాన్ని ఎలా భరించేది."
అరుణ యిహ నిగ్రహించుకోలేక- వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది.
ఏమీ చెయ్యలేనిస్థితిలో ప్రదీప్ నిస్సహాయంగా నిలబడి వుండిపోయాడు.
* * *
ఆపరేషన్ థియేటర్.
మధ్యాహ్నం రెండయింది. డాక్టర్ అశోక్ ఆ హాస్పిటల్ కు వచ్చాక నేత్ర విభాగం నగరంలోనూ, రాష్ట్రమంతటా కూడా గొప్ప ప్రశంసలందుకుంది. ఆర్ధికంగా స్థోమతు గలవాళ్ళు ఎక్కడి ఎక్కడ్నుంచో శ్రీలక్ష్మి హాస్పిటల్ కి తరలివస్తున్నారు. అతని హస్తవాసి మంచిదనీ, అతనిచేయి పడితే చాలు ఎలాంటి కంటిజబ్బులైనా తగ్గిపోతాయనీ ప్రశంసల వర్షం కురుస్తుంది. నేత్రవిభాగం రూములు అసలు ఖాళీ వుండటంలేదు. కొందరు పేషెంట్లయితే రూం దొరకటంకోసం ఎన్నోరోజులు వెయిట్ చెయ్యాల్సి వస్తుంది.
ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆపరేషన్లు చెయ్యటం మొదలైంది. అలుపూ సొలుపూ లేకుండా డాక్టర్ అశోక్ ఒకదాని వెంట ఒకటి చేస్తూనే వున్నాడు. అతని అసిస్టెంట్ డాక్టర్ శ్యాంప్రసాద్ అనుకోని పరిస్థితులలో ఊరువిడిచి వెళ్ళాల్సివచ్చింది. ఆ మరునాడు చెయ్యబోయే ఆపరేషన్ల కేసులన్నీ వివరంగా తయారు చెయ్యాల్సిన బాధ్యత అసిస్టెంటుది. అతను అనుకోకుండా ఊరువిడిచి వెళ్ళాల్సి రావటంతో జూనియర్ అసిస్టెంట్ అయిన డాక్టర్ మనోహర్ కి ఆ బాధ్యత అప్పగించి, రెండు మూడుసార్లు వివరాలన్నీ చెప్పి మరీ వెళ్ళాడు.