తళతళ మెరిసిపోతున్న మెట్లెక్కి విశాలమైన హాల్లోకి ప్రవేశించాక, ఎంక్వయిరీ దగ్గర ఆఫ్ థాల్ మాలజీ విభాగం ఎక్కడుందో వాకబుచేశాడు ప్రదీప్.
ఆ ప్రకారం నాలుగో అంతస్థులోకి వెళ్ళారు. కొత్తగా ఏర్పాటు చేయబడిన డిపార్ట్ మెంట్ అవటం వల్లనేమో చాలా నీట్ గా, అప్ టు డేట్ గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ప్రదీప్ లోపలకు తన విజిటింగ్ కార్డు పంపించాడు.
అయిదు నిముషాల తర్వాత పిలుపు వచ్చింది.
"మీరు వెళ్ళిరండి మేము యిక్కడ కూర్చుంటాం" అన్నారు హనుమంతరావు గారు.
"యస్ కమిన్" అన్నాడు డాక్టర్ అశోక్ స్ప్రింగ్ డోర్ తెరచుకుని ప్రదీప్ లోపలకు ప్రవేశిస్తుండగా.
ముఫ్ఫయి అయిదేళ్ళకు మించి వుండవు. పొడవుగా, తెల్లగా చాలా చలాకీగా వున్నాడు. అతని కళ్ళలో ఓ తేజస్సు, మేధస్సు వుట్టిపడుతుంది.
"గుడ్! వెరీ గుడ్ లుకింగ్ గర్ల్! ఈ పాపగురించేనా మీరు చెప్పింది."
అవునన్నట్లు తల వూపాడు ప్రదీప్.
"పాపా! యిలా రామ్మా నా దగ్గరకు వచ్చి కూర్చో"
రాధ వెళ్ళి ఆయన దగ్గరగా వున్న మెటల్ స్టూలుమీద కూర్చుంది.
ఆమెముఖంలోకి చూస్తూ ఆయన కొన్ని ప్రశ్నలడిగారు. వచ్చి ఎన్నాళ్ళయింది, మొదలు ఎలా ఆరంభమయిందీ, ఏ కంటికి వచ్చిందీ, నొప్పి వుందా, తలనొప్పి వుందా, జ్వరం వుందా...
ఉన్నట్లుండి ఒక ప్రశ్న అడిగాడు "ఎడమకన్ను కనబడుతుందా?"
రాధ సరిగ్గా తెలీదన్నట్టు తల ఆడించింది.
కుడికంటిని చేత్తో మూసుకుని ఎడమకంటితో చూడమన్నాడు.
"నాకు కనబడటంలేదు" అంది రాధ.
ప్రదీప్ ఉలిక్కిపడ్డాడు. డాక్టర్ గుర్నాథ్ కూడా ఈ ప్రశ్న అడిగి వుంటాడేమో, అతనికి గుర్తులేదు.
"కొంచెంకూడా..."
"కొంచెం.... కానీ... తెలీటంలేదు."
"ఇప్పుడు.... ఎడమకన్ను మూసుకుని కుడికంటితో చూడు."
"కనిపిస్తుంది."
"బాగా?"
"బాగా కనిపిస్తుంది."
"ఇన్నాళ్ళబట్టీ... ఎడమకన్ను కనబడటంలేదని తెలీలేదా?"
రాధ కొంచెం ఆలోచించి "తెలీలేదు" అంది.
"ఎందుకని?"
ఆమె మళ్ళీ ఆలోచించి "నేను విడివిడిగా చూడటానికి....అలా చెయ్యాలని అనిపించలేదు. అలా చేసిచూస్తే.... తెలిసేదేమో" అంది.
"కొంచెం ఆలోచించి చెప్పు. కుడికంటికీ ఎడమకంటికీ యింకేమైనా తేడా తెలుస్తోందా?"
".... తెలుస్తుంది."
"కుడికన్ను నొప్పి మామూలుగా వుంది. ఎడమకన్ను నొప్పి చాలా ఎక్కువగా... ఎక్కడో లోపలికి తొలుచుకుపోతున్నట్లుగా వుంది."
డాక్టర్ అశోక్ ప్రదీప్ వంక తిరిగి "షీ యీజ్ వెరీ యింటలిజెంట్ గర్ల్....ఆఫ్ థల్ మాస్కోప్ చెయ్యాలి" అన్నాడు.
"చెయ్యండి"
"చాలా జాగ్రత్త, యిన్ డైరెక్టు ఆఫ్ థల్ మాస్కోప్ తో పరీక్ష చెయ్యాలి. పేషెంటు చాలా కోపరేట్ చెయ్యాల్సి వుంటుంది. పెద్దవాళ్ళయితే ఫర్వాలేదు. చిన్నపిల్ల కాబట్టి జనరల్ ఎనస్థీషియాలో ఎగ్జామిన్ చేస్తే బాగుంటుంది."
ప్రదీప్ కు అతనిమీద బాగా నమ్మకం, గురీ ఏర్పాడ్డాయి. "మీరు ఏది మంచిదనుకుంటే అలా చెయ్యండి" అన్నాడు.
"కరెక్టుగా డయాగ్నసిస్ చెయ్యాలంటే జనరల్ లో చేస్తే మంచిది. జనరల్ ఇవ్వాలంటే యీవేళ కుదరదు. రేపు ఉదయం ఎంప్టీస్టమక్ మీద తీసుకు రావాలి."
"అలాగే చేస్తాను" అన్నాడు ప్రదీప్.
పాపతో బయటకు వచ్చాక కౌంటర్ దగ్గర ప్రదీప్ కన్సల్టేషన్ ఫీజు యిస్తుంటే ఆ మొత్తం చూసి హనుమంతరావు గుండె గుభేలుమంది.
* * *
మరునాడు ఉదయం ఆపరేషన్ థియేటర్ లో రాధను ఎగ్జామిన్ చెయ్యటం మొదలయింది.
అంతకుముందే ఎట్రోపిన్ డ్రాప్స్ తో ఫ్యూపుల్స్ బాగా డైలేట్ చెయ్యబడ్డాయి.
రాధను ఆపరేషన్ టేబిల్ మీద పడుకోబెట్టాక, ఎనస్థటీస్ బాయిల్స్ ఆపరేటస్ తో జనరల్ ఎనస్థీషియా స్టార్ట్ చేశాడు.
ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సైడ్, ట్యూబ్స్ ద్వారా పాస్ అవుతున్నాయి.
డయాగ్నసిస్ కరెక్టుగా రావాలంటే మామూలు ఆఫ్ థల్మాస్కోప్ పనికిరాదు. స్పేపెన్స్ యిన్ డైరెక్టు ఆఫ్ థల్మాస్కోప్ ఉపయోగించాలి. డాక్టర్ అశోక్ కన్ను ఇంకా స్ఫుటంగా కనిపించేందుకు నికన్స్ యిన్ డైరెక్ట్ ఆఫ్ థల్మాస్కోపిక్ లెన్స్ సహాయం తీసుకున్నాడు.
ఒక్కొక్క కన్నూ.... ఆప్టిక్ డిస్క్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.
కుడికంట్లో విశేషమేమీలేదు. వొట్టి కన్ జక్టివైటిస్ టైరల్ కన్ జక్టివైటిస్.
ఎడమకన్ను.... కార్నియా, కన్ జక్టయివా....
ఆఫ్టిక్ డిస్క్!
చుట్టూవున్న రక్తనాళాలు ఉబ్బివున్నాయి. రంగు మామూలుకంటే భిన్నంగా కొంచెం పసుపుపచ్చగా, జున్నురంగులో-
డాక్టర్ అశోక్ కళ్ళు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వెదుకుతున్నాయి రీజన్కోసం.
రెటీనా!
రెటీనా ముందు భాగంలో కనిపించింది చిన్నకణితి. మూడునుంచి అయిదు మిల్లీమీటర్ల సైజులో వుంది.
మైగాడ్!
రెటినోబ్లాస్టోమా.
* * *
కన్సల్టేషన్ రూంలో ప్రదీప్ డాక్టర్ అశోక్ కు ఎదురుగా కూర్చున్నాడు.
"ఆ పాపకు ఎడమకంట్లో రెటీనోబ్లాస్టోమా వుంది. కుడికంట్లో వొట్టి కన్ జక్టివైటిస్ యింకేం లేదు" అన్నాడు డాక్టర్ అశోక్.
అప్పటికి బ్లడ్ టెస్ట్ లూ మిగతా టెస్టులూ అన్నీ పూర్తయాయి.
"రెటీనోబ్లాస్టోమా అంటే."
"కేన్సర్ కు సంబంధించిన ట్యూమర్ హైలీమేలిగ్పెంట్."
ప్రదీప్ ఉలికిపడ్డాడు. కాని ఆ ఉలికిపాటును కప్పిపుచ్చుకుని "ట్రీట్ మెంట్ ఏం చెయ్యాలి?" అనడిగాడు.
"ఆపరేషన్."
"అంటే? ఆ ట్యూమర్ ని తీసేస్తారా?"
"కాదు మొత్తం కంటినే తీసేయ్యాలి."
ప్రదీప్ త్రుళ్ళిపడ్డాడు.
"అంతకంటే.... అంతకంటే మార్గమేమీ లేదు."
"ఒకవేళ.... అలా చెయ్యకపోతే?"
"ఎలా?"
"కన్ను తీసెయ్యకుండా...."