భట్ లోపలికి వెళ్ళాడు.
"ఏమిటిదంతా?" అడిగేడు రమణ.
"చంద్రుడు శిల నుండి తెచ్చిన శిలల్లో ఒక కొత్త రకం పదార్ధం వుంది. ఆ పదార్ధం భూమ్మీద లేదు. మన సైంటిస్టులు డానికి 'ఆర్మాల్ కొలైట్' అని పేరు పెట్టారు. అంటే ఏమిటో తెలుసా?"
"ఉహూఁ....."
"చంద్రుడి నుంచి శిలల్ని తెచ్చిన వాళ్ళెవరు?"
"నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్ డ్రిన్, కొలెన్స్ అనే ముగ్గురు."
"వాళ్ళ పేర్లు కలిసొచ్చేలా ఆ కొత్త పదార్ధానికి ఆ పేరు పెట్టారు. ఈ రాయిలో గానీ ఆ కొత్త పదార్ధం వుంటే......"
"ఉంటే....." అర్ధంకాక అడిగేడు.
ప్రొఫెసర్ మొహం వాడిపోయింది. "రేపు రాత్రే చంద్రుడికి ఆఖరి రోజు. ఎల్లుండి రాత్రి పన్నెండు గంటలకి ఆ నక్షత్రం వైపు వెళ్ళి దాన్ని గుద్దుకుని 'స్కాష్' అయిపోతాడు."
"ఎలా?" రమణ అడిగేడు. భట్ ఇంకా రాలేదు.
"ఎంతో దూరంనుంచే ఆ నక్షత్రం భూమ్మీద వున్న ఈ రాయిని ఆకర్షించింది. అయితే ఆర్మాల్ కొలైట్ ఆ రాతిలో తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి ఎల్లుండి ఫర్వాలేదు. కానీ ఆ పదార్ధం - ఐ మీన్ - ఆర్మాల్ కొలైట్ చంద్రుడిలో వుంది కాబట్టి....." ప్రొఫెసర్ ఆగేడు." .....ఎల్లుండి చంద్రుడికి ఆఖరిరోజు. మనం తెల్సుకోవల్సిందల్లా ఆ రాతిలోను, చంద్రుడిలోనూ వున్నది ఒకే పదార్ధమా? అని అలా గానీ అయితే అదే ప్రళయానికి నాంది."
అంతలో లోపల చప్పుడయింది. భట్ బయటకొచ్చేడు. అతడి మొహం ఆనందంతో వెలిగిపోతోంది.
"రెండు శిలల్లోని లోహం ఒకటే ప్రొఫెసర్" అన్నాడు ఉత్సాహంగా.
* * *
ఇండియన్ టైమ్స్ పత్రికలో పడిన ఆ చిన్న వార్త చాలా సంచలనాన్ని కలిగించింది. భూమి ఆఖరవుతుందా? అన్న ఉత్తరాలూ, "చివరి రోజు" మీద వ్యాసాలు, మరుసటి రోజుకే పత్రికా కార్యాలయానికి వచ్చి చేరుకున్నాయి.
ప్రాణం మీదే మనిషి కెంత తీపో తెలిపేటందుకు నిదర్శనంగా ఆ వార్త నిజానిజాలడుగుతూ ఫోన్ కాల్స్.
ఈ వార్తని వెల్లడించిన ప్రొఫెసర్ క్వాలిఫికేషన్లు సామాన్యమైనవి కావు. ఈ విషయం ఎంక్వయిరీ చేసిన ఎడిటరు, శైలజని వెంటనే ఢిల్లీ పంపేడు.
ఇలాంటి వార్తలే పత్రిక సర్క్యులేషన్ పెంచేవి. అందులోనూ ఏ పత్రికా వెయ్యని వార్త అది.
తను కనుక్కొన్న దానిమీద ఎడిటర్ ఉత్సాహం చూపించటంతో శైలజ సంతోషం పట్టశక్యం కాలేదు. ఆ రోజు ఆమె ఢిల్లీ వచ్చేసింది.
ఆమె ప్రొఫెసర్ ని కలుసుకొనే సమయానికి భూమి యొక్క ఆఖరి క్షణం ఎప్పుడూ అన్నది ఆయన కరెక్టుగా లెక్కకట్టేడు. అలాగే చంద్రుడు తన పరిధి నుంచి తప్పుకొని ఎప్పుడు స్మాష్ అయిపోతాడూ అన్న విషయం కూడా.
మొదటిది ఆగష్టు పదిహేడు, రాత్రి పదకొండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్లకి.
రెండోది ఆగస్టు ఆరో తారీఖు, రాత్రి పన్నెండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్లకి.
ప్రధానమంత్రికి అందించటం కోసం రిపోర్టు తయారు చేస్తూండగా శైలజ ఆ గదిలోకి అడుగుపెట్టింది.
రమణ సంభ్రమాశ్చర్యాల్తో "ఇదేమిటి, మీరిక్కడికి వచ్చేరు?" అన్నాడు.
ఆమె నవ్వి వూరుకుంది.
ప్రొఫెసర్ కళ్ళు ఎర్రగా వున్నాయి. రాత్రంతా నిద్రలేదతనికి. ఆ రాతిలో వున్న లోహమూ, చంద్రశిలలో వున్న లోహమూ ఒకటేనని తెలిసిన దగ్గర్నుంచీ అతడి మొహంలో నవ్వు మాయమైంది. అయితే అది ప్రాణభయంకాదు. అతడికి తెలుసు, భూమి నాశనం కాబోతోందనీ, దేవుడనేవాడే వుంటే, వాడు కూడా దాన్ని రక్షించలేడనీ.
కొత్త విషయాన్ని కనుక్కొనే ఉత్సాహంతో యింతవరకూ ముందుకు సాగేడు. కానీ చివరికి, అంతా కనుక్కొని వెనుదిరిగి చూసుకొంటే..... తను సాధించిందేమిటి?
డిస్ట్రక్షన్- సర్వనాశనం!!
అతడికి నవ్వూ, ఏడుపూ ఒకేసారి వచ్చినయ్. అన్ని ఫీలింగులకూ అతీతుడైన ఆ వృద్దుడి మనసులో కలవరం మొదలయింది.
"ఏం కనుక్కొన్నారు?" శైలజ అడిగింది.
"చాలా గొప్ప విషయాన్ని కనుక్కొన్నాం!" అన్నాడు రమణ ఉరకలేస్తున్న ఉత్సాహంతో, "రేపు రాత్రితో...."
"ఆగు.....! అరిచేడు ప్రొఫెసర్.
రమణ చెబుతున్నది ఆపి, చిత్రంగా అతడివైపు చూసేడు "ఈ విషయం వెల్లడి కావటానికి వీల్లేదు" అన్నాడు అతడి ముడతలుపడ్డ చెక్కిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. కళ్ళు తీక్షణంగా వెలుగుతున్నాయి. మనిషి ఆవేశంతో వూగిపోతున్నాడు. పిడికిళ్ళు బిగించి "ఈ విషయం వెల్లడించటానికి వీలులేదు. ముఖ్యంగా పత్రికల వాళ్ళకి-"అ అన్నాడు ఇన్నాళ్ళూ మిగతా అబ్జర్వేటరీస్ అన్నీ యీ విషయాన్ని యెందుకు వెల్లడి చేయలేదు? అమెరికా, రష్యాలు ఎందుకు చెప్పలేదు? ప్రొఫెసర్ కి యిప్పుడు అర్ధమయింది..... ఈ విషయం వెల్లడి చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటి? కేవలం ప్రజల్లో భయోత్సాహం తప్ప. చావు ఎలానూ తప్పనప్పుడు అది తెలియకుండా చావటమే మంచిది. అంతా నిశ్శబ్దంగా జరిగిపోవాలి. తను పరిశోధన తమతోనే అంతం అయిపోవాలి..... ఈ ఆలోచనలతోనే అతడు చెప్పొద్దన్నాడు.
రమణ అతనివైపు నిదానంగా చూసేడు.
రమణ ఆలోచన్లు వేరు. ఇంకోలా అర్ధం చేసుకొన్నాడు.
ప్రపంచం ఇక పన్నెండు రోజుల్లో ఆఖరవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిస్తే.....దీన్ని యీ విపత్కర పరిస్థితినుంచి రక్షించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ప్రతి సైంటిస్టూ ప్రాణాలు ధారపోసి దాన్ని ఆపటానికి పరిశోధనలు మొదలు పెడ్తాడు. ఈ వృద్దుడు ఎందుకు తనని చెప్పొద్దంటున్నాడు-?
అతడికి చప్పున ఓ విషయం అర్దమయింది.
నోబుల్ ప్రైజ్!
అవును నోబుల్ ప్రైజ్!
ఈ పదిరోజులు ఏదయినా కృషి చేసి, దీన్ని తనే సాధించాలని ఈ ప్రొఫెసర్ ప్రయత్నం. ఒకవేళ తను సాధించలేకపోతే ఈ ప్రపంచం నాశనమైనా దానికి సిద్దపడ్తాడు కానీ, యీ అవకాశం మరొకరికి దక్కనివ్వడు.
'మనిషెంత స్వార్ధపరుడు?' అనుకున్నాడు రమణ.
ఒకవైపు కొంపలంటుకుపోతూ వుంటే, ఇంకోవైపు అందులో తనకేం దొరుకుతుందా అని వెతుక్కున్నాడు ప్రొఫెసర్.
అతడో నిర్ణయానికి వచ్చేడు. ప్రొఫెసరువైపు సూటిగా చూసి "నేను చెప్పాలి చెప్పకుండా నన్నెవరూ ఆపుచెయ్యలేరు" అన్నాడు అని, ఆమెవైపు తిరిగి "రేపు రాత్రి పన్నెండు గంటలకి...." అంటూ ఏదో అనబోయాడు.
ప్రొఫెసర్ కదిలేడు. నరనరాల్లో వున్న బలం అంతా చేతుల్లోకి తెచ్చుకొని, రామన నోరు ముయ్యటానికి ప్రయత్నించేడు. కానీ అతడి బలం చాల్లేదు. ఒక్క విసురుతో పడిపోయాడు.
రమణ ఆమెవైపు తిరిగి, "మన పత్రికకి ఒక న్యూస్! ఎవరూ నమ్మలేనిది. కానీ పచ్చినిజం. ఎవరూ నమ్మకపోయినా అది నిజం! ఈ ప్రొఫెసర్ ఎంత గొప్పవాడో నాకు తెలుసు. కేవలం స్వార్ధం వల్ల ఇలా అయ్యేడు కానీ నిజంగా గొప్పవాడు. అతడి లెక్కతప్పటానికి వీల్లేదు. శైలజగారూ వినండి! రేపు చంద్రుడికి ఆఖరు రాత్రి, స్మాష్.... చంద్రుడు స్మాష్ అవబోతున్నాడు. ప్రకటించండి. మన పత్రికలో పెద్ద అక్షరాలతో ప్రకటించండి. ప్రపంచపు భవితవ్యం రేపు రాత్రి పన్నెండు గంటలకి తేలిపోతుంది. అందర్నీ చూడమనండి. ప్రపంచాన్ని రక్షించటానికి అందర్నీ నడుం కట్టమనండి....."
శైలజ వడివడిగా బయటకు వెళ్ళిపోయింది. సంభాషణ వింటున్న ఒక స్వీపరు అక్కడ్నుంచి తప్పుకొన్నాడు.
గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
ఒక మూలగా పడిపోయిన వృద్దుడు మోచేతులమీద బలంగా లేవటానికి ప్రయత్నం చేస్తూ, "ఎంత పని చేశావురా మూర్ఖుడా !" అన్నాడు. "ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత కల్లోలం! ఇది మిగతా సైంటిస్టులకి తెలియకనా వాళ్ళు ఊరుకొన్నది! ఈ పదకొండు రోజులూ ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. భగవంతుడా ఎలా ఇప్పుడు?"