Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 16

    "ఏ పరిస్థితులలోనూ బెర్తుకి పాతికివ్వడానికి వీల్లేదు. ఇది చాలా దారుణం..." అన్నాడు చౌదరి. ఆ మాటలు ఎల్లయ్యక్కూడా వినిపించినట్లున్నాయి. అతను చటుక్కున "ఇంకాస్సేపట్లో ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్ కు అలాచ్ చేస్తారు. ఈలోగా మీరు బోగీదిగి వెళ్లిపోవడం మంచిది__" అన్నాడు.   
    అప్పటికి ఈశ్వరరావుకూడా సహనం నశించినట్లుంది. మాకింకే ఆశాలేదా?" అన్నాడు ఆఖరి ప్రయత్నంగా.   
    "వరంగల్ లో ఓసారి కనిపించండి__" అన్నాడు ఎల్లయ్య అయితే ఆమాటలకర్ధం లేదన్నట్లుగా- అతనుఓ పదిమందికి వరంగల్ లో కనిపించమని చెప్పాడు. "గ్యారంటీ వుందా" అనడిగినవారికథను "అటువంటిదేమీలేదు. అప్పటికి పొజిషన్ ఇంపైర్ అయితే ఒకరిద్దరికి సాయపడగలను__" అన్నాడు.   
    "వాడికేవో గట్టి బేరాలు తగిలాయండీ. మనమింకా బోగీ దిగిపోవడం మంచిది-" అన్నాడు చౌదరి. రాజారావుకీ, ఈశ్వరరావు చెరో బ్యాగూ వున్నాయి. చౌదరికి బ్యాగుకాక ఓ దుప్పటి చుట్టా, బెడ్డింగూ, సూట్ కేసూ, ఓ పెయింటు డబ్బావున్నాయి. కూలి అవసరం లేకుండా ముగ్గురూ అంచెలచెలమీద సామాను చేరవేసేశారు. ఆ కంపార్టుమెంటులో సెటిల్ కావడానికి వారికీ అయిదునిముషాలు పట్టింది. ఈశ్వరరావు మాత్రం అన్నీ చేరవేసేక తను మరో పర్యాయం బొంబాయి బోగీలోకి వెళ్ళి ప్రయత్నాలు చేసి వస్తానన్నాడు.  
    "అనవసరం_" అన్నాడు చౌదరి.   
    "ఏదో ఆశ వుంటుందికదా__" అని వెళ్ళిపోయాడు ఈశ్వరరావు.   
    రాజారావు, చౌదరి నాగరాజు గురించి చర్చించుకున్నారు. తనకు ప్రయాణాలలో ఇంతా అంతా కాని అనుభవమున్నదనీ- ఎన్నడూ తనకు నాగరాజులాంటివ్యక్తి తటస్థపడలేదనీ చౌదరి అన్నాడు.   
    "బెర్తు దొరక్కపోవచ్చు. కానీ అలాంటి మనిషిని చూసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది__" అన్నాడు రాజారావు.   
    "ఇండియాలో ఇలాంటివారున్నందుకు గర్వపడవచ్చు. అన్నాడు చౌదరి.   
    రాజారావు అప్పుడు తను చందమాలో చదివిన "ఆకాశానికి గుంజలు" అనే కధ చౌదరికి చెప్పాడు. ఆ కధలో ఒక మనిషికి ఆకాశం స్థంభాలు లేకుండా ఎలా నిలబడిందా అన్న అనుమానం వచ్చింది. అతని గురువు అతనికి- "నువ్వు ప్రతి ఇంటికీ వెళ్ళి నానా దుర్భాషలూ ఆడి అన్నం పెట్టమని అడుగు. తర్వాత ఏంజరుగుతుందోచూడు..." అని చెప్పాడు. అతనలా చేయగా అందరూ అతనికి అన్నం పెట్టకుండా తరిమివేస్తారు. ఒక ఇల్లాలుమాత్రం-" ఆకలితో వున్నమీదట నీకు కోపం ఎక్కక ఏమవుతుంది నాయనా- " అని ఆదరిచి అన్నం పెడుతుంది. అలాంటివారే ఆకాశానికి గుంజలుగా వుంటున్నారని గురువు ఆ మనిషిని చెబుతాడు.   
    "నాగరాజుగారుకూడా అంతే!" అన్నాడు రాజారావు.   
    "ఇలాంటివాళ్ళవల్లే నిజంగా ఈ ప్రపంచం ఇంకా ఇలా నిలబడి వుందేమో-కధలో మంచి వేదాంతం వుంది-" అని మెచ్చుకున్నాడు చౌదరి.   
    కంపార్టుమెంటులోని ఒకరిద్దరుకూడా నాగరాజు విశేషాలు విని ఆశ్చర్యపడ్డారు. అలాంటి వ్యక్తి వుండడం నమ్మలేని నిజమన్నారు.   
    ఈశ్వరరావు బండి కదిలేటైముకి ఎక్కాడు. అతని ముఖంలో అంతులేని నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.  
    "వీడి ఆశ మండిపోనూ- ఇలాంటి ఆశపోతిని నేనెక్కడా చూడలేదు. వందలకు వందలిచ్చినా చాలేలా లేదు ఈ ఎల్లయ్యకి..." అన్నాడు ఈశ్వరరావు. మిగతా ఇద్దరూ అతన్ని వివరాలడగలేదు, జరిగినది ఊహించడం వారికీ కష్టం కాదు. ఎల్లయ్య ఆశ భరించడం కంటే ప్రయాణంలో ఇబ్బందుల నెదుర్కోవడమే సుఖమనిపించింది వాళ్ళకి.   
    "మంచి కంపెనీ దొరికిందండీ. మనకేం__ ఎలాగో అలా ప్రయాణం జరిగిపోతుంది__" అన్నాడు చౌదరి.   
    "ఇంకా వరంగల్లోనేను ఎల్లయ్యదగ్గరకు వెళ్ళను. హాయిగా నిద్రపోతాను కాసేపు__" అన్నాడు ఈశ్వరరావు.   
    ట్రయిన్ కదిలిన అయిదునిముషాలకి కాళీగా వున్న రెండు బెర్తులు చూసుకుని చౌదరి, ఈస్వరావు వాటి మీదకు పోయి నిద్రకు పడ్డారు. రాజారావుకు నిద్రరావడంలేదు. ఏవో రకరకాల ఆలోచనలతన్ని ముసురుకున్నాయి కిటికీ దగ్గర సీటు కాబట్టి అతను బయటి దృశ్యాలనుచూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.   
    స్టేషన్లు వస్తున్నాయి. వెడుతున్నాయి. ఈస్టుకోస్టుతో పోలిస్తే కృష్ణా ఎక్స్ ప్రెస్ వేగం ఎక్కువేనని అనుకోవాలి. ట్రయిన్ లో కూర్చున్నవాళ్ళా వేగాన్ని ఫీలవుతారు.   
    డోర్నకల్ లో కాబోలునలుగురు ఆడపిల్లలు ఎక్కారు. వాళ్ళందరికీ వయసు పన్నెండుకీ పదిహేనుకీ మధ్య వుంటుంది. హుషారైనవాళ్ళలాగున్నారు. రాజారావుకు ఆపోజిట్ విండో సైడ్ లో వాళ్ళ నలుగురికీ సీట్లు వచ్చాయి. క్షణం తీరుబడి లేకుండా అదేపనిగా వాగుతున్నారు. రాజారావు ఆశ్చర్యమ్గా వాళ్ళనే గమనిస్తూ కూర్చున్నాడు.   
    వాళ్ళలో ఒక పిల్ల నల్లగా వున్నప్పటికీ చాలా కళగా వుంది. పొడుగ్గా ఉన్నప్పటికీ అందుకు తగ్గలావుంది. పదిహేనేళ్లుంటాయేమో పరికిణి, జాకెట్ మాత్రం వేసుకుంది. చూడడానికి పెద్దింటి అమ్మాయిలా వుంది. మాట్లాడే పద్దతిలో హుందా వుంది. ఆమె ఎదురుగా కూర్చున్న ఇంకో అమ్మాయి బక్కపలచగా, తెల్లగా వుంది. పరికిణి, జాకెట్ వేసుకుని నల్లమ్మాయి వయసు దానిలాగే వున్నా చూపులలో మరికాస్త వయసున్నదానిలా వుంది. మిగతా ఇద్దరూ స్కర్టు, బ్లౌజు వేసుకున్నారు. ఒకమ్మాయి వీరివయస్సు దేకావచ్చుగానీ ఇంకో అమ్మాయి మాత్రం పదేళ్ళవయసులో వుండి వుంటుంది.

 Previous Page Next Page