"ఎంతాశ?" ఒక విధమైన పెదవి విరుపుతో అన్నాడు. ఆ విరుపులో కలవారి అబ్బాయిని కన్నెత్తి చూసే అర్హతయినా నీకుందా అన్న భావం ఉంది!
"నాది వట్టి ఆశనే! నీది మాత్రం పచ్చిదురాశ! ముందు మనసివ్వాలి! తరువాత తనువివ్వాలి! ఆ తరువా కడుపొచ్చి కాళ్ళమీదపడాలి. మీరు కాదు పొమ్మంటే ఏ నూతిలోనో చెర్లోనో పడాలి. అబ్బ! ఏం మనిషండీ?ఏం చదువండీ.? ఏం సంస్కారమండీ...? స్నేహితురాలి అన్నవై బ్రతికిపోయావుగాని మరొకరెవరైనా అయితే ముఖంమీద ఈడ్చి కొట్టేదాన్ని మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. అది గుర్తుంచుకొంటే నా జోలికి రావు!" అంటూనే తన పుస్తకాలు, నోట్సులు ఆదరాబాదరాగా చంకలో పెట్టుకొని విసవిసా బయటికి నడిచింది.
ట్రేలో కాఫీ కప్పుతో వస్తున్న శ్వేత, "అపూ ఆగవే! కాఫీ త్రాగేసి వెళ్ళు" అని అరిచింది.
కాని ఆగలేదు ఆ పిల్ల.
"అలా వెళ్ళిపోయిందేం?" అన్నని అడిగింది ఆశ్చర్యంగా.
చేతికి అందినట్టే అంది జారిపోయిన ఆశాభంగం అపురూప మీద ఆగ్రహంగా మారిపోగా "నీకు ఎలాంటివాళ్ళతో స్నేహం చెయ్యాల్సిందీ, ఎలాంటి వాళ్ళని ఇంటికి తీసుకురావాల్సిందీ తెలీదు! మన అంతస్తు, హోదా చూసుకోకుండా స్నేహం చేస్తే ఇలాగే అనుభవించాల్సి ఉంటుంది. పాల పాకెట్లు వేసి, జాకెట్లు కుట్టి కూలీ నాలి చేసుకొనే మనుషులు. ఆ అమ్మాయి మంచిదికాదని నాకెప్పటినుండో తెలుసు. ఎప్పుడో కంట పడినా కొరుక్కుతినేలా చూసేది. ఈ రోజు ఒంటరిగా చిక్కేసరికి అమాంతం మీదపడిపోయింది!" రుసరుసలాడుతూ చెప్పాడు.
"ఛ! అపూ అలాంటిది కాదు!"
"మరి నేనేనా అబద్దాలకోరుని?" కోపంగా అడిగాడు. "ఇంకో సారి ఆ పిల్లను ఈ ఇంటికి తీసుకొచ్చావా, ముందు నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను! జాగ్రత్త!" ఇంత జరిగాక ఆ పిల్ల ఇక ఈ ఇంటికి రాదన్న నిర్దారణతో అన్నాడు.
"అడిగితే అడిగిందేమో! నువ్వింత మండడం దేనికన్నయ్యా?"
"నువ్వెక్కడా, నేనెక్కడా అన్నందుకు అవమానంతో పగసాధిస్తుందని నా భయం! ఇదంతా ఉల్టాచేసి చెబితే? నేనే ఆ పిల్లను ఏదో చేశానని ప్రచారం చేస్తే?"
మరు రోజు కాలేజీలో అపురూప కనిపించగానే, "నిన్న కాఫీ కూడా తీసుకోకుండా పారిపోయినట్లుగా అలా వచ్చేశావేం?" అనడిగింది శ్వేత.
"నేనేం దొంగతనం చేయలేదు, మీ ఇంటినుండి పారిపోవడానికి!" ముఖం ఎలాగో పెట్టుకొని అంది అపురూప.
"మరి ఎందుకలా వచ్చేశావు, పిలిచినా ఆగకుండా?"
"మీ అన్నయ్యని అడగలేదా?"
"అడిగాను!"
"ఏం చెప్పాడు?"
"నువ్వు తనని పెళ్ళి చేసుకొమ్మని అడిగావని!"
"అతడేమంటే నేనామాట అడిగానో చెప్పలేదా?"
"ఏమన్నాడు?"
"ఎన్నాళ్ళనుండో నా మీద ఇష్టం పెంచుకొన్నానన్నాడు. చెయ్యి పట్టుకొన్నాడు. ఇష్టమైతే పెళ్ళి చోసుకొమ్మని అడిగాను తప్పా?"
"సరిగ్గా అన్నయ్య ఏం ఊహించాడో అదే జరుగుతోంది. ప్రపంచ జ్ఞానం తనకంటే అన్నయ్యకే ఎక్కువని ఒప్పుకు తీరాలి!"
ఆ రోజు నుండి ఇద్దరి మధ్యా మాటలు లేకుండాపోయాయి.
ఇద్దరూ ఎడ మొహం, పెడమొగంగా ఉండడం చూసి క్లాసు పిల్లలు అడగనే అడిగారు. అంత స్నేహంగా ఉండేవాళ్ళు ఏమైంది మీకని!
"ఆమె ఇలాంటిదని నాకు తెలీదు! మా ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో మా అన్నయ్య మీద కన్నేసింది" కూటికే గతిలేనివాళ్ళు దారిన పోయే బిచ్చగాడు కూడా చేసుకోడు. అలాగే ఉంటే ఈ జన్మకి పెళ్ళికాదని తెలుసు తనకు. తెలివిగా మా అన్నయ్యకు ప్రేమ అన్న వల విసిరి పెళ్ళాడాలని చూసింది. ఆ సంగతి తెలిసి ఇంటికి రానివ్వడం లేదు! మా అన్నయ్య చేసుకోనన్నాడన్న కసితో, మా అన్నయ్యే తన చేయి పట్టుకొన్నాడని ఉల్టా ప్రచారం చేస్తోంది!" శ్వేత చెప్పసాగింది అడిగినవాళ్ళకి, అడగనివాళ్ళకీ, ఆమెకు ఉన్నవీ లేనివీ వాళ్ళన్నయ్య చెప్పడంవల్ల వచ్చిన మార్పు అది!
శ్వేత చేస్తున్న దుష్ప్రచారం సంగతి తెలిసి ఖిన్నురాలైంది అపురూప.ఈ జనాలు డబ్బున్నవాళ్ళ మాటలు నమ్మినట్టుగా డబ్బు లేనివాళ్ళ మాటలు నమ్మరు. కయ్యానికయినా వియ్యానికయినా సమాన స్థాయి చూసుకోవాలంటారు. ఇప్పుడ ుస్నేహానికయినా సమాన స్థాయి కావాలని తెలిసింది. అసలు, తను డబ్బున్నవాళ్ళ పిల్లలతో కలిసేది కాదు! వాళ్ళకి తనంటే చిన్నచూపు. తను వాళ్లలాగా ఖరీదయిన బట్టలు కట్టుకోదు. మారుబట్ట తప్ప మూడో బట్ట ఎరగదు! మూడోబట్ట వచ్చేసరికి ఈ బట్టలు బాగా వెలిసిపోయి చిరుగులు పడతాయి! వాళ్ళలా ఖరీదయిన క్రీములు, పౌడర్లు పూసుకోదు. ఒక్కోసారి సబ్బు ముక్కకే డబ్బులుండవు! తన బీదరికం తన బట్టల్లో, అలంకరణ లేని తన దేహంలో స్పష్టంగా కనిపిస్తూంటుంది.