Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 15

       
                    50 ఏళ్లకింద గూడా కోర్టులలోకి


                                  వచ్చాయి

    ఇనపకచ్చడాల సంగతి ఒక్క మ్యూజియంలోనే (వస్తుప్రదర్శనశాలలోనే) కాదు. గ్రంధాలలో ఉంది. ఎన్నో పుస్తకాలలో వీటిని తడివారు. కొందరు విపులంగా వర్ణించారు. కొందరు కథలు వ్రాశారు.
    అంతటితో తీరిపోలేదు: కోర్టులలో దావాలకుగూడా ఈ కచ్చడాలు కారణం అయాయి. వీటివల్ల కొందరు శిక్షలు పొందారు. పాశ్చాత్య దేశాలలో సర్వత్రా యీ కచ్చడాలుండేవని రుజువు చెయ్యడానికి వేరే నిదర్శనం అక్కరలేదు.
    మానవుడు అసూయ, క్రోధము, ఇలాంటి గుణాలకు లోకువ అయినప్పుడు, స్త్రీ అన్నది పురుషుడి సొత్తుకింద లెక్కకు వచ్చినప్పుడు, మగవాడు తన విధిని మరిచిపోయి, తన శక్తిని కోలుపోయినప్పుడు, ఇలాంటి అగచాట్లు తప్పవు. దీనికి కాలంతో పనిలేదు; దేశంతో పనిలేదు. స్వభావంతోనే పని.
    కాబట్టి, ఈ కచ్చడాల అనాచారం ఎప్పుడో పూర్వం ఇక్ష్వాకుల రోజులలో వుండేదని అనుకోనక్కరలేదు. ఎవరో అనాగరికులు వాడేవారనీ భావించవలసిన అవసరం లేదు. మొన్న మొన్నటిదాకా ఇవి వాడుకలో వున్నాయి.
    ఇప్పుడు నోరువిడిచి చెప్పలేకుండా వున్నాం; కలంవదలి వ్రాయలేకుండా వున్నాం. అందుచేత ఈనాటి సంగతి బయటపడలేదు. కాని, నిజం ఆలోచిస్తే ఈ కచ్చడం పద్ధతి- ఒక రూపంగానో, ఇంకొక రూపంగానో-ఈ రోజులలో గూడా వుంది.
    స్త్రీని సంతృప్తిపరచలేక, నిర్వీర్యులు, నిస్సారులు అయిన మగవారున్నంతకాలము ఈ కచ్చడాలూ, ఇలాంటి కట్టుళ్ళూ వుండక తప్పవు. ఈ పతివ్రతా నిర్వచనాలూ, ఈ నిరోధకశాస్త్రాలూ కలగక తీరవు.
    ఏమో పెద్ద బలసంపద వున్నట్టు, విలాసం అంతా తనదే అయినట్టు, మగవాడు పదిమందితో వినోదించటం; పనికిమాలిన పేడముద్దలాగా స్త్రీ పడివుండడం కావాలన్నవారు వున్నంతకాలం ఇలాంటి నీతిశాస్త్రాలు వుండకమానవు. శేషం వెంకటపతి మాటలకు ఆధారం కేవలం లేకపోలేదు:
        లోకములోన కొంద రబలుల్
            సతులన్ తనియించలేక, అ
        స్తోకమనీష నన్యపురుషుల్
            తమకాంతల నంటకుండ, తా
        టాకులలోన వ్రాసిరి
            పరాంగన కూడిన పాపమంచు....
    మొదటి చరణంలో చెప్పిన కారణం చాల బలీయమైనది. అలాంటి కారణమే ఈ ఇనపకచ్చడాలకూ దారితీసింది. సంతృప్తి పొందిన స్త్రీకి సంకెళ్ళు ఎందుకు అవసరం వస్తాయి? అసంతృప్త స్త్రీకి ఎన్ని సంకెళ్ళు వేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి?
    ఈ దురవస్థ అప్పుడే కాదు. ఇప్పుడుగూడా వుంది. రేపూ వుంటుంది. కాబట్టి కచ్చడాల ప్రయోగం-నేను మనవి చేసినట్టూ ఏ రూపంగానయినా-ఎప్పుడూ వుంటుంది.
    ఫ్రాన్సులో ఒక వృద్ధుడు పడుచుపెళ్ళాన్ని చేసుకున్నాడు. గొప్పవాడు. కాబట్టి తాను పెళ్ళాము డాన్సులకు బార్ లకు పోతూ వుండేవారు. అందమయిన పిల్ల అని-అతను వృద్ధుడనికూడా, అనేమో చాలామంది ఈమెను చుట్టుకొనేవారు. కాని, ఆ యమ్మ మాత్రం అలాంటి స్వభావం కలదికాదు. చాలా 'పతివ్రత'.
    అయినా భర్తకు అనుమానం-తన అశక్తియే దీనికి కారణంగాని, ఆమె ప్రవర్తన కాదు - దానితో బయలుదేరాడు. ఒక ఇనుపకచ్చడం తెచ్చాడు. ఆ నిరపరాధకు ఆ కచ్చడం తొడిగించాడు. బీగంవేసి బీగం తనదగ్గర వుంచుకున్నాడు. ఇది జరిగి ఒక నూరు సంవత్సరాలయినా కాలేదు.
    పాపం! ఆ ఇల్లాలు హృదయవేదన అపరిమితం. ఎంత విశ్వాసం వున్నా ఆ విపరీతం జరిగింది కదా అని విచారం. విచారం కోపం అయింది. కోపం పగగా పరిణమించింది. కానీ, వీనికి తగినపని చేయిస్తానని నిశ్చయించుకుంది.
    తనకోసం ఇన్నాళ్ళూ ఆశపడుతూ వున్నవాళ్ళలో ఒక అందగాడిని పిలిపించింది. సంగతి చెప్పింది. అతడు మారు తాళం చేయించాడు. బంధవిముక్తి కలిగింది. ఆ ఆగ్రహావేశంవల్లా, వాగ్ధానంవల్లా, ఆ కార్యం గూడా అంగీకరించింది. కాని తరువాత పశ్చాత్తాపంతో ప్రాణాలు వదలివేసింది.
    50 ఏళ్ళకింద బోర్డో అనే పట్టణంలో ఒక కంపెనీలో పనిచేస్తూ వుండే ఒకడు, ఆ కంపెనీలో పనిచేస్తూ వుండే ఒక 13 ఏళ్ళ అమ్మాయిని బలవంతంగా చెరచి, బయటికి చెప్పావంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని భయపెట్టి ఒక నాలుగేళ్ళ పాటు తన ఆటలు సాగించాడు. ఇంతలో ఈ అమ్మాయికివున్న ఒక బంధువూ - అవ్వ - చనిపోయింది. ఈ పనివాడే మరొక ఇంటికి మార్చి పోషిస్తూవచ్చాడు.
    ఇంకా ఎవరైనా దీనిని లాక్కుంటారేమో అని అనుమానం కలిగింది. అక్కడనుంచి కచ్చడం బిగించడం మొదలుపెట్టాడు. అప్పటికీ ఓర్చింది ఈ అమ్మాయి. కాని ఆ పనివాడి బుద్ధిమారలేదు. ఈమెకు విసుగు పుట్టింది. కంపెనీనుంచి ఒకనాడు తిరిగి ఇంటికి రాకుండా మరొక స్నేహితురాలి ఇంటికివెళ్ళి, ఆమెకు ఈ సంగతంతా తెలిపింది.
    తన కచ్చడం ఆ స్నేహితురాలికి చూపించినది. ఆ ఇంటివారంతా ఆశ్చర్యం పొందారు. ఇలాంటి అక్రమాన్ని తుదముట్టించాలని ఆలోచించారు. అందరూ కలసి తీసుకోవలసిన చర్య తీసుకున్నారు.
    కోర్టులో కేసూ, విచారణా, సాక్ష్యాలూ అన్నీ రహస్యంగానే జరిగాయి. ఆఖరికి ఈ మహానుభావుడికి రెండు సంవత్సరాలు శిక్షవేశారు.

 Previous Page Next Page